Bharat Rashtra Samithi

Bharat Rashtra Samithi

KCR
telangana talli img

మహిళా కోటా.. మహా గర్జన

-చట్టసభల్లో 33% సీట్ల పెంపు..
-అవి మహిళలకు కేటాయింపు
-అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపే అమలు
-పరివర్తన భారత్‌.. అదే బీఆర్‌ఎస్‌ మిషన్‌
-రైతులను నాయకులుగా తయారు చేస్తాం
-పార్లమెంటులో వారే చట్టాలను చేసుకోవచ్చు
-దేశ జలవిధానాన్ని బంగాళాఖాతంలో పడేయాలి
-కొత్త వాటర్‌, పవర్‌ పాలసీలను రూపొందించాలి
-దేశంలో ధమ్‌దార్‌ సర్కార్‌తోనే అది సాధ్యం
-ఈవీఎంలపై ఎన్నో వివాదాలు.. బ్యాలెట్‌కు వెళ్లాలి
-తెలంగాణలో సాధ్యమైన ప్రగతి.. దేశంలో కాదా?
-మహారాష్ట్ర అంతటా బీఆర్‌ఎస్‌ తుఫాన్‌
-ఇప్పటికే 4 లక్షలు దాటిన పార్టీ సభ్యత్వాలు
-30లక్షల మందితో గులాబీ సైన్యం సిద్ధంచేస్తాం
-అన్ని ఎన్నికల్లో, అన్ని స్థానాల్లో పోటీకి మేం రెడీ
-త్వరలో ఔరంగాబాద్‌లోనూ పార్టీ కార్యాలయం
-పుణె, ముంబై నగరాల్లోనూ బీఆర్‌ఎస్‌ ఆఫీసులు
-బీఆర్‌ఎస్‌ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్పష్టీకరణ
-నాగ్‌పూర్‌లో బీఆర్‌ఎస్‌ మహారాష్ట్ర భవన్‌ ప్రారంభం

తెలంగాణలో రెవెన్యూ వ్యవస్థను ప్రక్షాళన చేశాం. వీఆర్వో వ్యవస్థను రద్దు చేసినం. వారి పొట్టకొట్టలేదు.. ఇతర శాఖలకు వారిని మార్చినం. రాష్ట్రంలో భూరికార్డులన్నీ డిజిటలైజ్‌ చేసినం. 20 నిమిషాల్లో రిజిస్ట్రేషన్‌ పూర్తయ్యి, 5 నిమిషాల్లో పట్టా చేతికొస్తుంది. పాస్‌పోర్ట్‌ అంత భద్రంగా పాస్‌బుక్‌ ఇస్తున్నారు. భూములన్నీ డిజిటలైజ్‌ అయ్యాయి కాబట్టే, పంటసాయం డబ్బులైనా, ధాన్యం డబ్బులైనా నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో పడుతున్నాయి. రైతు మరణిస్తే.. 8 రోజుల్లో ఆయన కుటుంబానికి రూ.5లక్షల చెక్కు అందుతున్నది. ఏ దఫ్తర్‌కు పోవాల్సిన అవసరం లేదు. ఎవరికీ దరఖాస్తు ఇవ్వాల్సిన పనిలేదు.
-సీఎం కేసీఆర్‌

ఏకధాటిగా ప్రసంగించడమే కాదు.. ఎదుటివారి ప్రశ్నలకు జవాబులు ఇవ్వగలిగినప్పుడే ఒక నాయకుడి సత్తా ఏంటో బయటపడుతుంది. అంత్యప్రాసలతో నినాదాలివ్వడం కాదు.. ఆకట్టుకునే పద్ధతిలో విషయాన్ని విడమర్చి, వివరించినప్పుడే ఒక పాలకుడి పటిమ ఏమిటో తెలిసివస్తుంది. తనకు తోచినదేదో చెప్పడం కాదు.. విశాలమైన సమావేశంలో విలేకరులు ప్రశ్నించినప్పుడు తడబడకుండా, తడుముకోకుండా, తటపటాయించకుండా ఏ విషయాన్నైనా సమగ్రంగా, సమర్థంగా విశ్లేషించగలిగినప్పుడే ఒక రాజకీయ నేత దురంధరుడు అనిపించుకుంటాడు. ఇవాళ నాగ్‌పూర్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేసిందదే. సూటిగా, దీటుగా, సుత్తి లేకుండా.. ఉన్నది ఉన్నట్టు, కుండబద్ధలు కొట్టినట్టు ఆయన విలేకరుల ప్రశ్నలకు జవాబిచ్చిన తీరు మేధావులను, మీడియా నిపుణులను అమితంగా ఆకట్టుకున్నది.

‘గెలుస్తామా, ఓడుతామా అన్నదాంతో సంబంధం లేదు. అన్ని ఎన్నికల్లోనూ పోటీచేస్తాం.. పదవికాదు మాకు పరివర్తనే ప్రధానం.. మహారాష్ట్రలో రైతు ఆత్మహత్యలు ఎక్కువగా ఉన్నాయి కనుకే దీన్ని మా కార్యశాలగా ఎంచుకున్నాం.. నేటి జలవిధానం నిష్ఫలం. దాన్ని బంగాళాఖాతంలో పడేయాలి.. చిన్నరాష్ర్టాల ఏర్పాటు చాలా సంక్లిష్టంగా ఉన్నది. దీన్ని మార్చాలి.. చట్టసభల్లో సీట్లు పెంచుతం, వాటిని మహిళలకు ఇస్తం’.. ఇంత గంభీరమైన విషయాలపై ఇంత స్పష్టమైన ప్రకటనలు బహుశా ఏ రాజకీయ నాయకుడూ చేసి ఉండడు. ఆ పని నాగ్‌పూర్‌లో కేసీఆర్‌ చేశారు.
నాగ్‌పూర్‌ ప్రెస్‌ కాన్ఫరెన్స్‌.. పబ్లిక్‌కు కాన్ఫిడెన్స్‌!

అన్నిరంగాల్లో మహిళలకు ప్రాధాన్యం పెరిగినప్పుడే దేశం వేగంగా పురోగమిస్తుందని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అన్నారు. చట్టసభలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్‌ అంశం ఎన్నో ఏండ్లుగా పెండింగ్‌లోనే ఉన్నదని, తాము కేంద్రంలో అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపే దానిని అమల్లోకి తెస్తామని చెప్పారు. దేశంలో పరివర్తన కోసమే భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌) పుట్టిందని, తమ జెండా.. ఎజెండా ప్రజల కోసమేనని స్పష్టంచేశారు. మాటలు చెప్తే అభివృద్ధి సాధ్యం కాదని.. కష్టపడి పనిచేస్తేనే సాధ్యమని.. ఇందుకు తెలంగాణ విజయగాథ చక్కని ఉదాహరణ అని పేర్కొన్నారు.

మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో బీఆర్‌ఎస్‌ కార్యాలయాన్ని ప్రారంభించిన అనంతరం మీడియా సమావేశంలో కేసీఆర్‌ మాట్లాడారు. దేశంలో గుణాత్మక మార్పు రావాల్సిన అవసరం ఉన్నదని (ఇండియా నీడ్స్‌ ఏ క్వాలిటేటీవ్‌ ఛేంజ్‌) అని స్పష్టంచేశారు. అందుకోసం బీఆర్‌ఎస్‌ ఒక మధ్యవర్తి పాత్ర పోషిస్తుందని చెప్పారు. దేశంలో మార్పు కోసం బీఆర్‌ఎస్‌ తన ప్రస్థానాన్ని మహారాష్ట్ర నుంచి ప్రారంభించిందని, రాబోయే రోజుల్లో మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌, ఉత్తరప్రదేశ్‌, హర్యానా తదితర రాష్ట్రాలకు కూడా వెళ్తామని ప్రకటించారు. వారం- పది రోజుల్లోనే దీనికి సంబంధించిన కార్యాచరణ మొదలుపెడుతామని పేర్కొన్నారు.

దిగజారిన దేశ ఆర్థికం
దేశంలోని ఏ వర్గ ప్రజలు కూడా సంతోషంగా లేరని సీఎం కేసీఆర్‌ అన్నారు. ‘దేశ ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉన్నది. ద్రవ్యోల్పణం పెరుగుతున్నది. ధరలు పెరుగుతున్నాయి. పరిశ్రమలు మూతపడుతున్నాయి. అత్యంత సారవంతమైన నేలలు మనదేశంలో ఉండగా, ప్రభుత్వాలు పప్పులు కూడా విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తున్నది. కేంద్రం ఏటా రూ.లక్ష కోట్ల విలువైన పామాయిల్‌ను దిగుమతి చేసుకొంటున్నది. ఇది అత్యంత దారుణ పరిస్థితి. దేశంలో వనరులన్నీ ఉండి, రైతులు ఉత్పత్తి చేయగలిగే పరిస్థితి ఉన్నప్పటికీ దిగుమతి చేసుకొంటున్నాం. ఈ పరిస్థితికి దిగజారడానికి కారణం ఎవరు? ఒక పార్టీనో, ఒక వ్యక్తో దీనికి కారణమని నేను అనడంలేదు.

ఈ పరిస్థితి మారాలి. మేధావులు ఈ దిశగా ఆలోచన చేయాలి. ప్రపంచంలో మనకన్నా తక్కువ వనరులుండి, ఒకప్పుడు మనకన్నా ఎంతో వెనుకబడిన చైనా, జపాన్‌, సింగపూర్‌ వంటి దేశాలు నేడు మనకంటే ఎంతో ముందున్నాయి. మనం వాటి నుంచి ఇప్పుడు కూడా ఏమీ నేర్చుకోలేకపోతే ఎలా? దేశంలో రాజ్యాంగ, ఆర్థిక, ఎన్నికల, పరిపాలన సంస్కరణలు.. ఇలా అన్ని రంగాల్లో మార్పు రావాలి. మనం ఇప్పుడున్న స్థితి నుంచి బయటకు రావాలి. బీఆర్‌ఎస్‌ ఒకరిని గెలిపించడం, మరొకరిని ఓడించడం లక్ష్యంగా పనిచేయడం లేదు. మార్పు కోసమే పనిచేస్తుంది. పార్టీ ప్రధాన ఎజెండా గుణాత్మక మార్పు తేవడమే’ అని స్పష్టంచేశారు.

దేశంలో నీటి యుద్ధాలు ఎందుకు?
దేశంలో నీటి విధానాలు, నదీ జలాల పంపకం సరిగ్గా లేకపోవడంతోనే రాష్ట్రాల మధ్య నీటి యుద్ధాలు జరుగుతున్నాయని సీఎం కేసీఆర్‌ అన్నారు. ‘కావేరీ నీళ్ల కోసం తమిళనాడు, కర్ణాటక.. కృష్ణా నీళ్ల కోసం కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌, మహారాష్ట్ర, తెలంగాణ.. సట్లెజ్‌ కోసం పంజాబ్‌, హర్యానా, రాజస్థాన్‌.. మహానది కోసం ఒడిశా, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌ కొట్లాడుకుంటున్నాయి. పుష్కలంగా నీళ్లు ఉండి కూడా ఎందుకు కొట్లాడుకుంటున్నట్టు? దేశంలో 41 కోట్ల ఎకరాల సాగుయోగ్యమైన భూములున్నాయి.

ఇది అమెరికా కన్నా ఎక్కువ. ప్రపంచం మొత్తానికి మనం ఆహారాన్ని అందించగలం. కానీ, దురదృష్టవశాత్తు మనం బర్గర్లు, పిజ్జాలు తింటున్నాం. మన ఆహారాన్ని ఇతర దేశాలకు ఎందుకు ఎగుమతులు చేయలేకపోతున్నాం? అది జరగాలంటే విప్లవాత్మక మార్పులు రావాలి. దేశానికి కొత్త పవర్‌ పాలసీ, కొత్త నీటి పాలసీ వస్తేనే సమస్యలు తీరుతాయి. దేశంలో ఆలోచించగలిగే, సమర్థ ప్రభుత్వం ఉంటే ప్రతీ ఎకరానికి నీళ్లు ఇచ్చేది. ప్రతీ ఇంటికి నల్లా నీళ్లు వచ్చేవి. ఔరంగబాద్‌, అకోలా, సోలాపూర్‌, పుణె తదితర ప్రాంతాల్లో వారం పది రోజులకు ఒకసారి నీళ్లు ఇస్తున్నారని అక్కడి నేతలు చెప్పారు. దేశ రాజధానిలో సైతం తీవ్ర మంచినీటి సమస్య ఉన్నది. దీన్ని మనం ఏ విధంగా చూడాలి?’ అని ప్రశ్నించారు.

దేశంలో పరివర్తన కోసం మీరు తెస్తున్న ఎజెండా అమలు చేయడానికి ఎంతకాలం పడుతుంది?
మా ఎజెండాను కచ్చితంగా పూర్తిస్థాయిలో అమలుచేస్తాం. అయితే దీనికి మేము ఎలాంటి గడువు పెట్టుకోవడం లేదు. మాకు ఎలాంటి తొందర లేదు. మా ఎజెండా అమలు కావడానికి కాస్త సమయం పడుతుందని మాకు తెలుసు.

మీరు ఇతర పార్టీలను కలుపుకొని వెళ్తారా?
దేశంలో ఇప్పటికే నేషనల్‌ ఫ్రంట్‌, యునైటెడ్‌ ఫ్రంట్‌.. ఇలా అనేక ఫ్రంట్లను చూశాం. కానీ ఆ ప్రభుత్వాల వల్ల కలిగిన ప్రయోజనం శూన్యం. అందుకే మేం దేశ అభివృద్ధి కోసం ప్రత్యేక ఎజెండా రూపొందించి ప్రజల ముందు పెడుతున్నాం. దాని అమలు కోసం ప్రయాణం కొనసాగిస్తున్నాం. ఈ క్రమంలో ఎవరికైనా ఆసక్తి ఉంటే మాతో కలిసి నడవొచ్చు. అలాంటివారిని ఆహ్వానిస్తాం. కలిసి ముందుకు సాగుతాం.

కొట్లాడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన మీరు.. విదర్భ వంటి ప్రత్యేక రాష్ర్టాల ఉద్యమాలకు మద్ధతు పలుకుతారా?
దేశంలో కేవలం ఆరున్నర లక్షల జనాభా ఉన్న సిక్కిం రాష్ట్రంగా కొనసాగుతున్నది. ఇదే సమయంలో 23 కోట్లకుపైగా జనాభా ఉన్న ఉత్తరప్రదేశ్‌ కూడా ఒకే రాష్ట్రంగా ఉన్నది. దీనిని బట్టి ప్రస్తుతం దేశంలో రాష్ర్టాల ఏర్పాటు ప్రక్రియ సరిగా లేదని అర్థమవుతున్నది. ఈ వ్యవస్థలో మార్పు రావాలని మేం కోరుకొంటున్నాం. ఒక్క విదర్భ గురించే మేం ఆలోచించడం లేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావడానికి 15 సంవత్సరాలు పట్టింది. నేను ఆమరణ నిరాహార దీక్ష చేసి, చావు అంచుల వరకు వెళ్తే చివరికి పార్లమెంట్‌లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై ప్రకటన వచ్చింది. ఒక రాష్ట్రం ఏర్పడాలంటే ఇంత కష్టపడాలా? ఇలాంటి వ్యవస్థ ఇంకా కొనసాగాలా? 10 జిల్లాలతో ఏర్పడిన తెలంగాణను ఇప్పుడు 33 జిల్లాలకు విస్తరించుకొని అద్భుత ప్రగతి సాధిస్తున్నాం. ఇలాగే రాష్ట్రాల ఏర్పాటుకు కూడా స్పష్టమైన ప్రాతిపదిక ఉండాలన్నది మా విధానం.

మీరు ప్రతిపాదిస్తున్న కొత్త ఎజెండాతో రాజకీయంగా బీఆర్‌ఎస్‌కు ఎలాంటి ప్రయోజనం ఉంటుంది? ప్రాంతీయ పార్టీల ఏకీకరణపై మీ అభిప్రాయం ఏమిటి?
మేం ప్రతిపాదించిన ఎజెండా దేశంలో పరివర్తన కోసం మాత్రమే. రాజకీయాల కోసం కాదు. బీఆర్‌ఎస్‌ ప్రాంతీయ పార్టీ కాదు. జాతీయ పార్టీ. దేశంలో ఎవరైనా గళం ఎత్తితే ఆ పార్టీకి ఏ టీమ్‌, ఈ పార్టీకి బీ టీమ్‌ అని ముడిపెట్టడం ప్యాషన్‌ అయిపోయింది. మేం పార్టీ కోసమో, రాజకీయం కోసమే ఈ ఎజెండాను రూపొందించలేదు. మా లక్ష్యం దేశంలో మార్పు.

దక్షిణాదిలోని కర్ణాటక, తమిళనాడు, కేరళ వంటి రాష్ర్టాలను వదిలి మీ తదుపరి లక్ష్యంగా మహారాష్ట్రనే ఎందుకు ఎంచుకున్నారు?
ఎందుకంటే దేశంలో అత్యధిక రైతు ఆత్మహత్యలు మహారాష్ట్రలో నమోదవుతున్నాయి. ఇక్కడ అద్భుతమైన వనరులు ఉన్నా, సరైన పాలకులు, పాలసీలు లేకపోవడం వల్ల దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయి. అందుకే మహారాష్ట్రను మా కార్య క్షేత్రంగా ఎంచుకున్నాం.

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తొమ్మిదేండ్లలో ఎంతో అభివృద్ధి చేశామని చెప్తున్నది కదా?
కేంద్ర ప్రభుత్వం ఎంత అభివృద్ధి చేసిందో, దేశాన్ని ఏ స్థితిలోకి తెచ్చిందో అందరికీ తెలుసు. అంతర్జాతీయ సూచీల్లో మనం ఏ స్థాయిలో ఉన్నామో స్వయంగా కేంద్రం విడుదల చేసిన గణాంకాలే చెప్తాయి.

విదర్భ గురించి మీ ప్రసంగంలో మాట్లాడలేదు. ఇప్పుడు విదర్భను తెలంగాణ మాదిరి చేస్తామంటున్నారు. ప్రత్యేక విదర్భ డిమాండ్‌ మీ ఎజెండాలో లేదా?
దేశంలో అనేక కొత్త రాష్ట్రాల డిమాండ్లు ఉన్నాయి. బీహార్‌లో మిథిలాంచల్‌ రాష్ట్ర డిమాండ్‌ ఉన్నది. నేను పోరాటం మొదలుపెట్టడానికి ముందు పదేండ్ల నుంచి వాళ్లు ఢిల్లీలో పోరాడుతున్నారు. తెలంగాణ ఏర్పడి పదేండ్ల ఉత్సవాలు జరుపుకుంటున్నాం. ఇంకా వాళ్ల ఆందోళన ఆలాగే ఉన్నది. ఇటువంటి పరిస్థితులు ఎందుకు ఉన్నాయి? కేంద్రం దీనిపై ఆలోచించాలి? మేము ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేశాక 33 జిల్లాలు ఏర్పాటు చేశాం. ఇప్పుడు అభివృద్ధి వేగంగా జరుగుతున్నది. పెద్ద జిల్లాల్లో ఇది సాధ్యంకాదు. అమెరికాలో 34 కోట్ల జనాభా ఉంటే వాళ్లు 50 రాష్ట్రాల ఏర్పాటు చేసుకున్నారు. మన దేశంలో కూడా మరో 10-15 రాష్ట్రాలు ఏర్పడితే వచ్చే నష్టమేమీ లేదు.

దేశాభివృద్ధికి మీరు ఎటువంటి వ్యవస్థాపకమైన మార్పులు కావాలని కోరుతున్నారు?
ఒకసారి మీడియా కాంక్లేవ్‌లో నేను పాల్గొన్నప్పుడు ఇలాగే చైనా గురించి చెప్పాను. అయితే చైనాలో పరిస్థితులు వేరని కొందరు అన్నారు. అక్కడ ప్రజాస్వామ్యం లేదన్నారు. ఒకవేళ చైనాకన్నా మన విధానాలు బాగుంటే మనం చైనాకన్నా ముందుండాలి కదా? జ్ఞానానికి ఎవ్వరూ గుత్తేదారు కాదు. మంచి జ్ఞానం ఎవ్వరివద్ద ఉన్నా తీసుకోవాలి. వాటిని మనదేశానికి అనుగుణంగా మార్చుకొని అమలు చేయాలి. ఇందులో తప్పేముంది? జపాన్‌, చైనా, దక్షిణ కొరియా, మలేషియా, సింగపూర్‌లా భారత్‌లో ఎందుకు చేయకూడదు?

తెలంగాణ విధానాలు దేశం అనుసరిస్తున్నదని అంటున్నారు. మీరు మోదీ గారితోతరచూ సమావేశమవుతుంటారా? మీరిద్దరూ అభిప్రాయాలు పంచుకుంటుంటుంటారా?
మోదీగారు నాకు మంచి స్నేహితుడు. కొన్నిసార్లు ఆలోచనలు మారొచ్చు. నీతి ఆయోగ్‌, ఇతర సమావేశాల్లో కలుస్తుంటాం. రాష్ర్టాల్లో బెస్ట్‌ ప్రాక్టీసెస్‌పై కొన్ని సమావేశాలు కూడా అవుతుంటాయి. ఏదైనా రాష్ట్రంలో మంచి విధానాలు అమలుచేస్తే దానిపై ఇతర రాష్ర్టాలు నేర్చుకోవాలి. ఇందులో కొత్తేమీ లేదు.

మీరు నాగ్‌పూర్‌ని లక్ష్యంగా చేసుకున్నారు. వచ్చే మున్సిపల్‌ ఎన్నికల్లో మీ పార్టీ ఇక్కడ పోటీ చేస్తుందా?
మహారాష్ట్రలో ప్రతి ఎన్నికలో మేము పోటీచేస్తాం. గెలుపు ఓటములతో సంబంధంలేదు. మా లక్ష్యం చాలా పెద్దది. దేశ పరివర్తన మేము కోరుకొంటున్నాం. తుది లక్ష్యం చేరేవరకు పోరాడుతూనే ఉంటాం.

మహారాష్ట్రలో ఎన్ని అసెంబ్లీ స్థానాలు గెలవాలని లక్ష్యంగా పెట్టుకున్నారు?
మొత్తం స్థానాలు. ఎందుకు అన్ని స్థానాలు లక్ష్యంగా పెట్టుకోకూడదు? ఎక్కడ రైతులు లేరో మీరు చెప్పండి. రైతులతోపాటు పెట్టుబడిదారులు కూడా రావాలి. వారు కూడా రైతు పండించే పంటనే కదా తినేది.

వ్యవసాయోత్పత్తులకు కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ)పై మీ విధానం ఏమిటి?
మొత్తం ప్రపంచంలో ప్రభుత్వ సహకారం లేకుండా వ్యవసాయం ముందుకు సాగదు. ఇది నా అధ్యయనంలో తేలింది. వ్యవసాయానికి ఎక్కువ రాయితీలు ఇచ్చే దేశం అమెరికా. పలు ఇతర దేశాలు కూడా రాయితీలు ఇస్తున్నాయి. రైతుల నుంచి తీసుకుంటారు కానీ వారికి తిరికి ఇవ్వకపోవటం వల్లనే అనివార్య పరిస్థితుల్లో రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.

అబ్‌ కీ బార్‌ కిసార్‌ సర్కార్‌ అంటున్నారు. దేశంలో వచ్చిన ప్రభుత్వాలన్నీ ఇచ్చిన వాగ్దానాలను మరిచిపోతుంటాయి. మీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే విద్య, ఉపాధి విధానాలు ఎలా ఉంటాయి?
ఎన్నికలప్పుడు ప్రతి పార్టీ ఎన్నికల నియమావళి ప్రకటిస్తుంది. మేము కూడా అలాగే మ్యానిఫెస్టో ఇచ్చాము. మేము రెండు సార్లు గెలిచాము. మా రాష్ట్రంలో 119 సీట్లు ఉండగా, మొదటిసారి 63 సీట్లతో, రెండోసారి 88 సీట్లతో గెలిచాము. మేము మ్యానిఫెస్టోలో చేసిన వాగ్దానాలకన్నా 100 రెట్లు ఎక్కువ పనిచేశాము. రైతుబంధు పథకాన్ని మేము ఎన్నికల మ్యానిఫెస్టోలో పెట్టకున్నా అమలుచేశాం. దళితులపై నేడు కూడా అత్యాచారాలు ఆగడంలేదు. పెండ్లికొడుకు గుర్రంపై వెళ్తుంటే లాగి తంతున్నారు. కొన్నిచోట్ల చంపుతున్నారు. వాళ్ల ఆర్థిక స్థితి పెరిగితే ఇటువంటి పరిస్థితులు మారతాయనే ఉద్దేశంతో దళితబంధు పథకాన్ని ప్రవేశపెట్టాం. దేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడే ఇటువంటి పథకం వచ్చి ఉంటే నేడు దళితుల పరిస్థితి ఇలా ఉండేది కాదు. విద్య తరిగిపోని ఆస్తి. అందుకే మా రాష్ట్రంలో గురుకుల విద్యకు ప్రాధాన్యమిస్తున్నాం. ఇందులో మేం చాంపియన్స్‌. మా రాష్ట్రంలో 1,001 గురుకులాలు ఏర్పాటు చేశాం. వాటిలో 5.69 లక్షలమంది పిల్లలు చదువుతున్నారు. ఏటా ఒక్కో విద్యార్థిపై రూ.1.25 లక్షలు ఖర్చుచేస్తున్నాం. మంచి ఫలితాలు వస్తున్నాయి. ఇటువంటి విద్యా విధానం మొత్తం దేశంలో రావాల్సి ఉన్నది.

మీరు అధికారంలోకి వస్తే ధరలు తగ్గిస్తారా?
తప్పకుండా ఆ దిశగా చర్యలు తీసుకుంటాం. ద్రవ్యోల్బణాన్ని నియంత్రిస్తే ధరలు తగ్గుతాయి.

సెంట్రల్‌ ఏజెన్సీలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా తమిళనాడుతోపాటు మీ రాష్ట్రంలో కూడా ఎమ్మెల్యేలపై ఐటీ దాడులు జరిగాయి. దీన్ని మీరు ఎలా చూస్తారు?
ఇది చాలా బాధాకరం. ప్రజాస్వామ్యంలో ఇటువంటి పద్ధతి మంచిది కాదు. రాజకీయ పార్టీలు ప్రజాస్వామ్యానికి స్తంభాలు. పార్టీలు ఉంటేనే ప్రజాస్వామ్యం ఉంటుంది. మోదీ కూడా ప్రజల ఓట్లతోనే వచ్చారు కదా. ఇతరులను కూడా బతకనివ్వాలి. వాళ్ల వెంటపడకూడదు. దీన్ని ఖండిస్తున్నాం.

ఈవీఎంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.దీనిపై మీ అభిప్రాయం ఏమిటి?
మనకన్నా ఎక్కువ అభివృద్ధి చెందిన అమెరికా, యూరోపియన్‌ దేశాలు కూడా ఈవీఎంలు తెచ్చాయి. విమర్శలు రావడంతో మళ్లీ బ్యాలెట్‌ పద్ధతిని ప్రవేశపెట్టాయి. మన దగ్గర కూడా అనుమానాలు ఉన్నాయి కాబట్టి బ్యాలెట్‌ పద్ధతి ప్రవేశపెట్టాలి.

రైతు ఆత్మహత్యల నివారణకు మహారాష్ట్ర సర్కారుకు మీరిచ్చే సలహాలేమిటి?
నాందేడ్‌ సమావేశంలోనే నేను స్పష్టంగా చెప్పాను. తెలంగాణలో బీఆర్‌ఎస్‌ పార్టీ అమలు చేస్తున్న మాడల్‌ను అమలు చేయండి. రైతు ఆత్మహత్యలను నివారించండి. ఈ విషయాన్ని మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి ఫడ్నవీస్‌కే నాందేడ్‌ బహిరంగ సభ వేదికగా చెప్పా. సలహాలను ఇప్పటికే ఇచ్చాను. వారు ఏం అమలు చేస్తున్నారో మీరే చూస్తున్నారు.

ఎలాంటి చర్చలు లేకుండానే బడ్జెట్‌లు ఆమోదం పొందుతున్నాయి? ఈ పరిస్థితి మారాల్సిన అవసరమున్నదా?
చాలా మంచి ప్రశ్న. లోక్‌సభలో 542 సీట్లు గెలిచిన పార్టీ ఓ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెడుతుంది. దానిని రాజ్యసభలో ప్రతిపక్షం అడ్డుకుంటుంది. లోక్‌సభ నేరుగా ఎన్నికవుతుంది. ప్రజల అభిమతం అందులో ప్రతిఫలితస్తుంది. కానీ రాజ్యసభ అలా కాదు. ఇలాంటి సంఘటనలు అనేకం మన అనుభవంలో ఉన్నాయి. ఒక ఉదాహరణ చెబుతా. యూపీఏ ప్రభుత్వ హయాంలో నాటి మంత్రి చిదంబరం సీఎస్‌టీ, జీఎస్‌టీని సభలో ప్రవేశపెట్టారు. దానికి వ్యతిరేకంగా అప్పుడు బీజీపీ, మోదీ నానా హంగామా చేసి బిల్లును అడ్డుకున్నారు. అధికారంలోకి వచ్చిన తరువాత అదే మోదీ తిరిగి అదే జీఎస్టీని తీసుకొచ్చారు. విచిత్రమేమిటంటే ఈసారి దానిని చిదంబరం అడ్డుకున్నారు. ఇదీ దేశంలోని పార్టీల రాజనీతి. అందుకే దేశంలో మొత్తం గా రాజకీయ పరివర్తన కొనసాగాలని చెప్తున్నాం.

మహిళలకు సంబంధించి బీఆర్‌ఎస్‌ విధానం ఏమిటి?
సూటిగా చెప్తున్నాం. అతిత్వరలో ఢిల్లీలో సమావేశం ఏర్పాటు చేసి మహిళా విధానం ప్రకటిస్తాం. అన్ని రంగాల్లో మహిళలకు భాగస్వామ్యం కల్పించాలి. గతంలో యూపీఏ ప్రభుత్వానికి ఈ విషయమై అనేక సలహాలిచ్చాం. కానీ ఆచరణలో సాధ్యం కాలేదు. కానీ దేశంలోని మహిళలందరికీ ఒక మాట చెబుతున్నా. మేం అధికారంలోకి వచ్చిన సంవత్సరం లోపల పార్లమెంట్‌ ఉభయసభల్లో, అన్ని రాష్ట్రాల విధాన సభల్లో మహిళల ప్రాతినిధ్యాన్ని పెంచుతాం. ఆ అవసరం ఎంతో ఉన్నది. అందుకోసం మహిళల జనాభాకు అనుగుణంగా 33 శాతం రిజర్వేషన్‌ను చట్టసభల్లో అమలు చేస్తాం.

తెలంగాణలో ఇన్ని పథకాలు కొనసాగిస్తున్నారు కదా. నిధులు ఎక్కడి నుంచి సమీకరిస్తున్నారు?
కష్టపడి పనిచేయడం, లోపాలను అరికట్టడం, సరైన నిర్ణయాలు తీసుకోవటం ద్వారా ఎకానమీ పెరుగుతుంది. ఇదే తెలంగాణలో జరిగింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ నాడు మా తలసరి ఆదాయం రూ.94,000 మాత్రమే. అప్పుడు మహారాష్ట్ర, గుజరాత్‌, తమిళనాడు, కర్ణాటక సహా అనేక పెద్ద రాష్ట్రాల తలసరి ఆదాయం మాకన్నా ఎంతో ఎక్కువ. నేడు మా తలసరి ఆదాయం రూ.3.17 లక్షలు కాగా, మహారాష్ట్ర తలసరి ఆదాయం రూ.2.40 లక్షలు. ఈ పెద్ద రాష్ట్రాలను మేము వెనక్కు నెట్టాం. మాకన్నా ముందు పదేండ్ల్లు కాంగ్రెస్‌ ప్రభుత్వం ఉన్నది. పదేండ్లలో ఇసుకపై ప్రభుత్వానికి రూ.36 కోట్ల ఆదాయం రాగా, మేము అధికారంలోకి వచ్చాక ఐదేండ్లలో ఇసుక ఆదాయం రూ. 5,600 కోట్లకు చేరింది. ఇదీ పనిచేసే విధానం. ఇటువంటి పని అంతటా చేస్తే తప్పకుండా ఎకానమీ పెరుగుతుంది.

అబ్‌ కీ బార్‌ కిసాన్‌ సర్కార్‌ నినాదంతో మహారాష్ట్రలో అడుగుపెట్టారు. ఇక్కడ బీఆర్‌ఎస్‌ పార్టీ అధికారంలోకి వస్తే రైతులకు ఏం చేస్తారు?
తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి మహారాష్ట్ర కన్నా అధికంగా రైతుల ఆత్మహత్యలు నమోదయ్యేవి. కానీ ఇప్పుడు దాదాపుగా తగ్గిపోయాయి. బీఆర్‌ఎస్‌ పాలనలో రైతులు నిలదొక్కుకున్నారు. రైతుబంధు, రైతుబీమా వంటి పథకాలు, ఉచిత విద్యుత్తు వంటివాటి వల్ల వ్యవసాయం బాగుపడ్డది. ఇప్పుడు తెలంగాణలో రైతులు సంతోషంగా ఉన్నారు. 14 రాష్ట్రాలకు చెందిన కూలీలు ఇప్పుడు తెలంగాణలో ఉపాధి పొందుతున్నారు. మహారాష్ట్రలో బీఆర్‌ఎస్‌ సర్కారు ఏర్పాటైతే తెలంగాణ తరహాలో రైతులకు మంచి రోజులు తెస్తాం.

దేశంలో విద్యుత్తు, నీరు ప్రైవేటీకరణ చేస్తున్నారా?
విద్యుత్తు ప్రైవేటీకరణ మంచిదికాదు. మా సొంత అనుభవంతో చెప్తున్నాం. గతంలో ఒక సీఎం మా దగ్గర గ్యాస్‌ ఆధారిత విద్యుత్తును పీపీఏ పద్ధతిలో 25 ఏండ్లపాటు ప్రైవేటుకు అప్పగించారు. వారు విద్యుత్తు ఇవ్వకున్నా డబ్బు చెల్లించేలా ఒప్పందం చేసుకున్నారు. గ్యాస్‌ ప్లాంటు ఇంకా ప్రారంభం కాకున్నా వాళ్లకు డబ్బు చెల్లించాల్సి వచ్చేది. ఇటువంటి ప్రైవేటీకరణనే మేము వ్యతిరేకిస్తున్నాం. తెలంగాణ వచ్చాక 6 వేల మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి చేయాలని మేము లక్ష్యం పెట్టుకున్నాం. సోలార్‌లో 6,000 మెగావాట్ల లక్ష్యం కాగా, 5,700 మెగావాట్లు ఉత్పత్తి అవుతున్నది. 6000 మెగావాట్లు ధర్మల్‌ విద్యుత్తు ఉత్పత్తి చేస్తున్నాం. విద్యుత్తు రంగాన్ని తమకు అప్పగించాలని చాలా కంపెనీలు వచ్చాయి. అయినా మేము ప్రైవేటీకరణ చేయవద్దని గట్టిగా నిర్ణయించుకున్నాం. తెలంగాణ జెన్‌కో ఆధ్వర్యంలోనే పని చేయాలని నిర్ణయించాం. అలాగే చేస్తున్నాం.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the BRS Party.