Bharat Rashtra Samithi

Bharat Rashtra Samithi

KCR
telangana talli img

మండుటెండల్లోనూ నీళ్లు

-నా తెలంగాణ కోటి ఎకరాల మాగాణం.. సీఎం కేసీఆర్‌ పట్టుదలతోనే సాధ్యం
-ఎండాకాలంలో చెరువులు మత్తళ్లు దుంకుతాయని అనుకున్నామా?
-కాంగ్రెస్‌ హయాంలో నీళ్లకు గోస
-తాగునీరు, సాగునీరు ఇవ్వకుండా చావగొట్టింది కాంగ్రెస్‌
-వారి మాటలకు మోసపోతే భవిష్యత్తులో గోస పడతాం
-త్వరలో పోడుభూములకు పట్టాలు
-ములుగు లబ్ధిదారుల సభలో ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌
-రామప్పలో సందడిగా సాగునీటి దినోత్సవం

ఉమ్మడి పాలనలో నీళ్లు లేక తండ్లాడిన నేల అది.. ఇప్పుడు వరుసగా ఆరు సీజన్ల పాటు కాళేశ్వరం నీళ్లు అందుకొంటూ సస్యశ్యామలమైంది. ఇదే కదా రైతులకు అసలైన పండుగ. అందుకే.. లక్షలాదిగా తరలివచ్చిన రైతులు, ప్రజలు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కృతజ్ఞతతో ‘లక్ష జన హారతి’ పట్టారు. విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి మార్గనిర్దేశంలో సూర్యాపేట జిల్లా నాగారం మండలం ఈటూరు నుంచి పెన్‌పహాడ్‌ మండలం రావిచెరువు వరకు 126 గ్రామ పంచాయతీలకు చెందిన ప్రజలు 68 కిలోమీటర్ల మేర కాళేశ్వరం నీళ్లకు హారతి పట్టారు. ఈ కార్యక్రమంలో ఏకంగా 1,16,142 మంది రైతులు, ప్రజలు పాల్గొన్నారు. చివ్వెంల మండలం సూర్యానాయక్‌ తండా వద్ద వేలాదిగా తరలివచ్చిన రైతు కుటుంబాలతో కలిసి మంత్రి పూజలు చేశారు. ఈ కార్యక్రమం వండర్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో చోటు సంపాదించింది.

స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి 2014 వరకు పింఛన్ల కోసం 29 లక్షల మందికి రూ.800 కోట్లు ఖర్చు చేస్తే.. సీఎం కేసీఆర్‌ ప్రభుత్వం 46 లక్షల మందికి ఏటా రూ.11 వేల కోట్లు ఖర్చు చేస్తున్నది. పేదలను కడుపులో పెట్టుకుని చూసుకుంటున్నది ఒక్క తెలంగాణ ప్రభుత్వమే. తెలంగాణ ప్రభుత్వం ఒక్క ఉచిత విద్యుత్తు కోసమే రూ.12 వేల కోట్లు ఖర్చు చేస్తున్నది. ఏనాడూ ప్రజలను పట్టించుకోని కాంగ్రెస్‌ నాయకుల మాటలకు మోసపోతే మళ్లీ గోస పడతాం. కాంగ్రెస్‌ హయాంలో ఉన్న పింఛన్లు, సంక్షేమ పథకాలను ప్రస్తుత పథకాలతో పోల్చి చూసుకోవాలి.
-కేటీఆర్‌

‘తెలంగాణ అంటే కోటి రతనాల వీణ అని మహాకవి దాశరథి చెప్పారు. సీఎం కేసీఆర్‌ కృషితో తెలంగాణ ఇప్పుడు కోటి ఎకరాల మాగాణం అయ్యింది’ అని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కే తారకరామారావు పేర్కొన్నారు. ఎండాకాలంలోనూ చెరువులు మత్తళ్లు దుంకుతాయని కలలోనైనా అనుకున్నామా? ఇది తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతోనే సాధ్యమైందని చెప్పారు. మన గొంతు తడిపిన సీఎం కేసీఆర్‌తో గళం కలిపి, భుజం తట్టి మీరు ముందు నడవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. బుధవారం ఆయన మంత్రులు సత్యవతి రాథోడ్‌, ఎర్రబెల్లి దయాకర్‌రావు, మహమూద్‌ అలీతో కలిసి ములుగులో సమీకృత కలెక్టరేట్‌, పోలీసు హెడ్‌క్వార్టర్స్‌, సేవాలాల్‌భవన్‌, మినీబస్టాండు, మినీలైబ్రరీ, ఐఅండ్‌పీఆర్‌ మీటింగ్‌హాల్‌ భవన నిర్మాణ పనులతోపాటు మేడారంలో శాశ్వత అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. కొత్తగా నిర్మించిన ఐదు పోలీసుస్టేషన్లు, రూ.20 కోట్లతో పూర్తిచేసిన సీసీ రోడ్లు, కోటి రూపాయలతో నిర్మించిన వైకుంఠధామాన్ని ప్రారంభించారు. మహిళా సంఘాలకు, మత్స్య సహకార సంఘాలకు చెక్కులు పంపిణీ చేశారు. ఇండ్ల పట్టాలు, గొర్రెల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు.

తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ములుగు సమీపంలోని రామప్పలో నిర్వహించిన సాగునీటి దినోత్సవంలో ప్రసంగించారు. ఆయా కార్యక్రమాల్లో మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ.. నీళ్లు, నిధులు, నియామకాలు అనే ఉద్యమ నినాదాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్‌ సాకారం చేశారని వివరించారు. తాను హెలికాప్టర్‌లో వస్తుంటే ఎక్కడ చూసినా చెరువులు నిండు కుండల్లా, పొలాలు పచ్చగా కనిపించాయని చెప్పారు. కాంగ్రెస్‌ పాలనలో ఎండాకాలం వస్తే నీళ్ల కోసం ఇబ్బంది పడేవారమని, ఇప్పుడు చెరువులు మత్తళ్లు దుంకుతున్నాయని అన్నారు. కాంగ్రెస్‌ పాలనలో నీళ్లకు ఎం త గోస ఉండేదో ఒకసారి గుర్తుచేసుకోవాలని కోరారు. ఆ బాధ, ఆ గోస ఇప్పుడు ఉన్నదా? అని ప్రశ్నించారు. తాగునీరు, సాగునీరు ఇవ్వకుండా చావగొట్టింది కాంగ్రెస్‌ ప్రభుత్వం కాదా? అని నిలదీశారు. ఇప్పుడు మళ్లీ ఆ పార్టీ వాళ్లే అడ్డంపొడుగు మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. సంక్రాంతికి గంగిరెద్దులు బయలుదేరినట్టుగా ఎన్నికలు రాగానే కాంగ్రెస్‌, బీజేపీ నాయకులు వస్తారని, నోటికొచ్చినట్టు మాట్లాడుతారని ఎద్దేవా చేశారు.

ఛత్తీస్‌గఢ్‌లో రైతులకు రక్షణ లేదు
ఛత్తీస్‌గఢ్‌లోని కాంగ్రెస్‌ ప్రభుత్వం రైతుల నుంచి ఎకరాకు కేవలం 12 క్వింటాళ్ల ధాన్యమే కొనుగోలు చేస్తున్నదని, మిగిలినదంతా రైతులు మార్కెట్‌ దయాదాక్షిణ్యాల మీద ఆధారపడి అమ్ముకోవాల్సిందేనని విమర్శించారు. అక్కడ రైతుల పంటలకు మద్దతు ధర, ప్రభుత్వ రక్షణ లేదని, ఎకరాకు రూ.10 వేల పెట్టుబడి సాయం లేదని దుయ్యబట్టారు. తమ ఏలుబడిలోని రాష్ట్రంలో ఏమీ చేయని కాంగ్రెస్‌ నేతలు ఇక్కడ డైలాగ్‌లు కొడుతున్నారని ఎద్దేవా చేశారు. ఛత్తీస్‌గఢ్‌లో 24 గంటల కరెంటు ఉన్నదా? అని ప్రశ్నించారు.

కాంగ్రెస్‌కు ఎందుకంత కడుపు మంట?
సీఎం కేసీఆర్‌ వచ్చిన తర్వాతనే 3,146 తండాలు, గూడేలు గ్రామ పంచాయతీలుగా మారాయని మంత్రి కేటీఆర్‌ గుర్తుచేశారు. సమైక్య రాష్ట్రంలో అభివృద్ధికి దూరంగా ఉన్న ములుగు ఇప్పుడు జిల్లా కేంద్రంగా మారిందని, జిల్లాకు జాతీయ స్థాయి పంచాయతీ అవార్డుల్లో 2వ ర్యాంక్‌ వచ్చిందని చెప్పారు. కాంగ్రెస్‌ హయాంలో ములుగు 329వ ర్యాంక్‌లో ఉంటే ఇప్పుడు 31వ ర్యాంక్‌కు ఎదిగిందని తెలిపారు. దశాబ్ది ఉత్సవాలు ఎందుకు చేస్తున్నారని ప్రశ్నిస్తున్నవారికి ఇదే తమ సమాధానమని స్పష్టంచేశారు. వానకాలం వచ్చిందంటే ‘మంచం పట్టిన మన్యం’ అని కాంగ్రెస్‌ హయంలో వార్తలు వచ్చేవని, ఇప్పుడు అలాంటి పరిస్థితి ఉన్నదా? అని ప్రశ్నించారు. ‘నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు’ అంటూ కాంగ్రెస్‌ హయాంలో సిని మా పాటలు రాశారని గుర్తుచేస్తూ, ఆనాటి పరిస్థితిని వివరించారు.

కేసీఆర్‌ పాలనలో బ్ర హ్మాండంగా దవాఖానలు, మెడికల్‌ కాలేజీలు ఏర్పాటు చేసుకున్నామని వివరించారు. ఇదివరకు 34 శాతం ప్రసవాలు మాత్రమే సర్కారు దవాఖానల్లో అయ్యేవని, ఈరోజు 88 శాతం అవుతున్నాయని, మాతా శిశు మరణాలూ తగ్గాయని వివరించారు. ఎన్నో ఘనతలు సాధించిన ప్రభుత్వం సాగునీటి దినోత్సవం చేస్తుంటే మీకెందుకు కడుపుమంట? 75 ఏం డ్లు రాష్ర్టాన్ని పాలించిన సన్నాసులు, కరెంటు, తాగునీళ్లు ఇయ్యని దద్దమ్మలు, వడ్లుకొనే తెలివిలేనోళ్లు, ఆఖరికి సాగునీటిని పట్టించుకోనోళ్లు ఈరోజు వచ్చి పెద్దపెద్ద మాటలు మాట్లాడుతుంటే నమ్ముదామా? అని ప్రశ్నించారు.

40 ఏండ్లలో ఇంతటి అభివృద్ధి చూడలేదు : ఎర్రబెల్లి దయాకర్‌రావు
తన 40 ఏండ్ల రాజకీయ జీవితంలో ఇంత టి అభివృద్ధిని ఎన్నడూ చూడలేదని పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఆడబిడ్డల నీటి కష్టాలను తీర్చిన మహనీయుడు సీఎం కేసీఆర్‌ అని కొనియాడారు. మారుమూల గ్రామాల్లో సైతం మిషన్‌ భగిరథ పథకం ద్వారా ఇంటింటికీ నల్లాలను ఏర్పాటు చేశారని చెప్పారు.

స్వరాష్ట్ర సాధనతో 33 జిల్లాల అభివృద్ధి : మహమూద్‌ ఆలీ
ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్‌ మినహా తెలంగాణలోని మిగిలిన 9 జిల్లాలు అభివృద్ధికి దూరంగా ఉండేవని మంత్రి మహమూద్‌అలీ గుర్తుచేశారు. సీఎం కేసీఆర్‌ 33 జిల్లాలు ఏర్పాటుచేసి అన్నింటినీ అభివృద్ధిలో ముందు నిలిపారని కొనియాడారు. ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ నాయకత్వంలో హైదరాబాద్‌కు ఐటీ కంపెనీలు, పరిశ్రమలు వచ్చాయని చెప్పారు. నాడు అభివృద్ధి చేయని పార్టీలు నేడు మహానేత కేసీఆర్‌ చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక కుట్రలు పన్ని అధికార దాహంతో విమర్శలు చేస్తున్నాయని మండిపడ్డారు.

గిరిజనులకు స్వర్ణయుగం : సత్యవతిరాథోడ్‌
ముఖ్యమంత్రి కేసీఆర్‌ పాలనలో గిరిజనులకు స్వర్ణయుగంగా మారిందని గిరిజన, స్త్రీశి శు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ తెలిపారు. సీఎం కేసీఆర్‌ ఇచ్చిన హామీ మేరకు ములుగు జిల్లా ఏర్పాటు చేశారని చెప్పారు. ప్రతిపక్ష పార్టీలు బీఆర్‌ఎస్‌ చేస్తున్న అభివృద్ధి పనులను విమర్శించే ముందు గతంలో ప్రజలకు ఏమిచేశారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. సీఎం కేసీఆర్‌ గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు కోసం 334 ఎకరాల భూమిని ములుగులో కేటాయించగా కేంద్రం నాన్చుడు ధోరణి అవలంబిస్తున్నదని విమర్శించారు. మేడారం 4 జాతరలకు రాష్ట్ర ప్రభుత్వం రూ.400 కోట్లు ఖర్చు చేసిందని వివరించారు.

కేసీఆర్‌ కావాలా? రాబందులు కావాలా?
ఏ ఒక్క ముఖ్యమంత్రి అయినా, ఏ ఒక్క ప్రధానమంత్రి అయినా రైతుల గురించి ఆలోచించారా? రైతుబంధు, రైతుబీమా లాంటి పథకాలు అమలుచేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ వెంట ఉందామా? రాబందుల్లా ఆరు దశాబ్దాలపాటు పీకుతిన్న కాంగ్రెప్‌ పక్షాన ఉందామా? ఆలోచించాలని విజ్ఞప్తి చేశారు. 67 ఏండ్లలో ఎవ్వరూ చేయని పనిని 8 ఏళ్లలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేసి చూపించారని వివరించారు. తెలంగాణ సాధించిన సీఎం కేసీఆర్‌ను మనస్ఫూర్తిగా ఆశీర్వదించాలని కోరారు.

ములుగు ఎంతో అభివృద్ధి
ములుగు ఎమ్మెల్యే కాంగ్రెస్‌ పార్టీ అయినా వివక్ష చూపించకుండా ముఖ్యమంత్రి కేసీఆర్‌ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారని మంత్రి కేటీఆర్‌ వివరించారు. ఈ ఒక్కరోజే రూ.133 కోట్ల విలువైన పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశామని తెలిపారు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ములుగు నియోజకవర్గంలో 17 వేల ఎకరాలకు పోడుభూముల పట్టాలు అందజేస్తామని చెప్పారు. ఆయా కార్యక్రమాల్లో ఎంపీ మాలోత్‌ కవిత, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్‌రెడ్డి, జడ్పీ చైర్‌పర్సన్లు కుసుమ జగదీశ్‌, గండ్ర జ్యోతి, జడ్పీ వైస్‌చైర్మన్‌ బడే నాగజ్యోతి, కార్పొరేషన్ల చైర్మన్లు నాగుర్ల వెంకటేశ్వర్లు, వీ ప్రకాశ్‌, వై సతీశ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

రామప్పను సందర్శించిన రామన్న శిల్పకళను చూసి అబ్బురపడిన కేటీఆర్‌
ములుగు జిల్లా వెంకటాపూర్‌ మండలం పాలంపేట గ్రామంలోని ప్రపంచ వారసత్వ కట్టడమైన రామప్ప దేవాలయాన్ని ఐటీ, పురపాలకశాఖల మంత్రి కే తారకరామారావు.. మంత్రులు దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్‌, మహమూద్‌అలీతో కలిసి బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రులకు ఆలయ అర్చకులు హరీశ్‌శర్మ, ఉమాశంకర్‌, సంపత్‌కుమార్‌శర్మ పూర్ణకుంభంతో స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆలయ మండపంలో వేదమంత్రాలతో ఆశీర్వచనం చేశారు. మంత్రి సత్యవతిరాథోడ్‌, ఈవో శ్రీనివాస్‌ మంత్రులను శాలువాలతో సన్మానించి, పట్టువస్ర్తాలు సమర్పించారు. అనంతరం దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సాగునీటి దినోత్సవం సందర్భంగా మంత్రి కేటీఆర్‌.. రామప్ప సరస్సు కట్టపైకి చేరుకొని గోదావరి జలాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. రామప్ప సరస్సులోని ఐలాండ్‌లను అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the BRS Party.