Bharat Rashtra Samithi

Bharat Rashtra Samithi

KCR
telangana talli img

బీఆర్‌ఎస్‌లోకి వ్యాపమ్‌ హీరో

-మధ్యప్రదేశ్‌లో గులాబీ జోష్‌.. వ్యాపమ్‌ స్కాంను బయటపెట్టిన ఆనంద్‌రాయ్‌ చేరిక
-పార్టీలోకి ఆహ్వానించిన సీఎం కేసీఆర్‌
-దేశ ప్రజలను జాగృతం చేయాలని సూచన
-బీఆర్‌ఎస్‌తోనే గుణాత్మక మార్పు: జాయ్స్‌
-కేసీఆర్‌కు ఆదివాసీ సంఘటన్‌ మద్దతు
-బీఆర్‌ఎస్‌లోకి పలువురు ‘మహా’ సర్పంచులు

మహారాష్ట్రతో పాటు మధ్యప్రదేశ్‌లోనూ బీఆర్‌ఎస్‌ ప్రకంపనలు సృష్టిస్తున్నది. ఈ క్రమంలో బుధవారం కీలక పరిణామం చోటు చేసుకున్నది. మధ్యప్రదేశ్‌కు చెందిన ప్రముఖ సామాజిక కార్యకర్త, మధ్యప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన వ్యాపమ్‌ కుంభకోణాన్ని వెలుగులోకి తెచ్చిన ఆనంద్‌రాయ్‌ బీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. ప్రగతిభవన్‌లో బీఆర్‌ఎస్‌ అధినేత, సీఎం కేసీఆర్‌ గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఆర్‌టీఐ, గిరిజన హక్కుల పోరాటయోధుడిగా ఆనంద్‌రాయ్‌కు దేశవ్యాప్తంగా పేరున్నది. మధ్యప్రదేశ్‌ ప్రజల అభిమాన నాయకుడు ఆయన. సామాజిక కార్యకర్తగా మధ్యప్రదేశ్‌ ప్రజలు ఆరాధానాభావంతో చూస్తారు. గిరిజనుల హకుల కోసం పోరాడుతున్న ‘జై ఆదివాసీ యువశక్తి సంఘటన్‌’ (జాయ్స్‌) అనే ప్రముఖ గిరిజన హకుల వేదిక బీఆర్‌ఎస్‌ పార్టీకి మద్దతు ప్రకటించటం ప్రాధాన్యత సంతరించుకున్నది. ఇది మధ్యప్రదేశ్‌ లో ఆదివాసీ, గిరిజనుల హకుల కోసం పోరాడుతున్న ప్రఖ్యాత సంస్థ. ఆనంద్‌రాయ్‌ ఈ సంస్థలో కీలక నేతగా వ్యవహరిస్తున్నారు. వీరితో పాటు జేఏవైఎస్‌ ప్రస్తుత అధ్యక్షుడు లాల్‌సింగ్‌ బర్మన్‌, పంచంభీల్‌, అశ్విన్‌ దూబే, గాజీరామ్‌ బడోలే, కైలాశ్‌ రాణా తదితరులు బీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు.

చాంద్‌ సితారో చోడో.. పానీ బిజిలీ జోడో!
75 ఏండ్ల స్వతంత్య్ర భారతదేశంలో రైతులు, ప్రజలకు తాగునీరు, సాగునీరు విద్యుత్తు నేటికీ సరిగా అందటం లేదు. కేంద్రంలోని పాలకుల నిర్లక్ష్యధోరణులు ఇంకా కొనసాగకుండా దేశ ప్రజలను జాగృతం చేయాలి. తెలంగాణలో అన్ని రంగాల్లో అభివృద్ధి కార్యక్రమాలు అమలవుతున్నప్పుడు దేశంలోని ఇతర రాష్ట్రాల్లో ఎందుకు కావు? కేంద్ర పాలకుల చిత్తశుద్ధిలోపం వల్లే ప్రజలకు నష్టం జరుగుతున్నది. చాంద్‌ సితారో చోడో.. పానీ బిజిలీ జోడో.
– సీఎం కేసీఆర్‌

బీఆర్‌ఎస్‌కు జాయ్స్‌ సంపూర్ణ మద్దతు
తెలంగాణ రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌ అధినేత, సీఎం కేసీఆర్‌ పాలనలో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు మానవీయకోణంతో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల అభివృద్దే ధ్యేయంగా కొనసాగుతున్నాయని జేఏవైఎస్‌ ఫౌండర్‌ విక్రమ్‌ అచ్చాలియా పేర్కొన్నారు. దేశంలో గుణాత్మక మార్పు తీసుకురావటానికి కృషి చేస్తున్న బీఆర్‌ఎస్‌ అధినేత, సీఎం కేసీఆర్‌కు జై ఆదివాసీ యువశక్తి సంఘటన్‌ (జాయ్స్‌) సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నదని తెలిపారు. 75 ఏండ్ల స్వతంత్ర భారతదేశంలో పేదలు, వెనుకబడిన వర్గాలు, దళితులు, ఆదివాసీల ఆకాంక్షలు నెరవేరలేదని, బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ దేశ ప్రజ ల ఆకాంక్షలను నెరవేరుస్తున్నారనే విశ్వాసం దేశవ్యాప్తంగా కలుగుతున్నదని తెలిపారు. ఈ నేపథ్యంలో దేశ ప్రత్యామ్నాయ రాజకీయ వేదికగా బీఆర్‌ఎస్‌ ఎదుగుతున్నదని చెప్పారు. బీఆర్‌ఎస్‌ పార్టీకి తమ సంపూర్ణ మద్దతు ప్రకటించారు. విక్రమ్‌ అచ్చాలియాతోపాటు జాయ్స్‌ జాతీయ అధ్యక్షుడు లోకేష్‌ ముజాల్దా, ఉమన్‌ ఇంచార్జ్‌ సీమా వాసాలే, మధ్యప్రదేశ్‌ అధ్యక్షుడు రాందేవ్‌ కకోడియా మద్దతు తెలిపిన వారిలో ఉన్నారు. అనంతరం, తమ ఆత్మగౌరవం, ఐక్యతకు ప్రతీక అయిన జాయ్స్‌ సంస్థ జెండాను సీఎం కేసీఆర్‌కు కప్పారు.

చాంద్‌ సితారో చోడో.. పానీ బిజిలీ జోడో
అందని చంద్రుడిని, చుక్కలను ఎట్లాగూ అందివ్వలేరు..కనీసం అందుబాటులో వున్న నీరు, విద్యుత్తునైనా దేశ రైతాంగం కోసం 75 ఏండ్లుగా దేశాన్ని ఏలుతున్న కేంద్ర పాలకులు ఎందుకు అందించలేకపోతున్నారని బీఆర్‌ఎస్‌ అధినేత, సీఎం కేసీఆర్‌ ప్రశ్నించారు. కేంద్ర పాలకులను ఈ దిశగా నిలదీసేలా ప్రతీ పౌరుడు జాగృతం కావాల్సిన అవసరమున్నదని పునరుద్ఘాటించారు. బుధవారం మధ్యప్రదేశ్‌, మహారాష్ట్రకు చెందిన వందలాది మంది నేతలు కార్యకర్తలు అధినేత సీఎం కేసీఆర్‌ సమక్షంలో బీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో సీఎం కేసీఆర్‌ మాట్లాడుతూ.. 75 ఏండ్ల స్వతంత్య్ర భారతదేశంలో రైతులు, ప్రజలకు కనీస అవసరాలైన తాగునీరు, సాగునీరు విద్యుత్తు నేటికీ అందట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రంలోని పాలకుల నిర్లక్ష్యధోరణులు ఇంకా కొనసాగకుండా దేశ ప్రజలను జాగృతం చేయాల్సిన అవసరం ఉన్నదని పేర్కొన్నారు. తెలంగాణలో అన్ని రంగాల్లో అభివృద్ధి కార్యక్రమాలు అమలవుతున్నప్పుడు దేశంలోని ఇతర రాష్ట్రాల్లో ఎందుకు కావని ప్రశ్నించారు. కేంద్రాన్ని ఏలుతున్న పాలకులకు చిత్తశుద్ధిలోపం వల్లనే ప్రజలకు నష్టం జరుగుతున్నదన్నారు. “చాంద్‌ సితారో చోడో..పానీ బిజిలీ జోడో” అని కేంద్ర ప్రభుత్వానికి సీఎం కేసీఆర్‌ చురకలంటించారు.

బీఆర్‌ఎస్‌లోకి ‘మహా’ సర్పంచులు
మహారాష్ట్రలోని పలు గ్రామాల సర్పంచులు బుధవారం బీఆర్‌ఎస్‌ అధినేత, సీఎం కేసీఆర్‌ సమక్షంలో పార్టీలో చేరారు. పార్టీలో చేరటానికి ముందు వారంతా తెలంగాణవ్యాప్తంగా పర్యటించారు. వ్యవసాయం, తాగు, సాగునీరు విద్యుత్తు, రోడ్లు సహా పలు రంగాల్లో జరుగుతున్న అభివృద్ధిని పరిశీలించారు. ఆసరా ఫించన్లు, రైతుబంధు, దళితబంధు సహా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు అమలవుతున్న సంక్షేమ కార్యక్రమాల గురించి క్షేత్రస్థాయిలో తెలుసుకున్నారు. తమ గ్రామాల్లో కూడా తెలంగాణ మాడల్‌ పాలన అమలు కావాలనే ధృఢమైన ఆంకాంక్షతో వారు బీఆర్‌ఎస్‌లో చేరుతున్నట్టు తెలిపారు. బీఆర్‌ఎస్‌లో చేరిన వారిలో…వెంకట్‌ రావుజీ ఘోపడే, అల్హత్‌ అశోక్‌, రాంరావ్‌ మహారాజ్‌ భటేగావర్‌, రమేశ్‌ కదమ్‌, గౌతంజైన్‌, పాటిల్‌ రాజ్‌కుమార్‌, ఘోడే విఠల్‌, షేక్‌ మొయినుద్దీన్‌, షిండే మాధవ్‌ సహా మరో 50 మందికి పైగా సర్పంచులున్నారు.

వ్యాపమ్‌ కుంభకోణం
వ్యాపమ్‌.. మధ్యప్రదేశ్‌లో ప్రొఫెషనల్‌ ఎగ్జామినేషన్‌ బోర్డ్‌ (ఎంపీపీఈబీ). దీనినే హిందీలో వ్యావసాయక్‌ పరీక్ష మండల్‌ అంటారు. దీని సంక్షిప్త రూపమే వ్యాపమ్‌.. ఇది మధ్యప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వంచే విలీనం చేయబడిన స్వయం ప్రతిపత్తిగల సంస్థ. రాష్ట్రంలో వివిధ వృత్తిపరమైన ప్రవేశ పరీక్షలు నిర్వహించటం వ్యాపమ్‌ బాధ్యత. అలాగే వివిధ రాష్ట్రస్థాయి వృత్తిపరమైన ఉద్యోగాలకు ప్రవేశ పరీక్షలు కూడా నిర్వహిస్తుంటుంది. మధ్యప్రదేశ్‌లో వైద్యవిద్య ప్రవేశ పరీక్షల కోసం 1970లో మొదటిసారి వ్యాపం ఏర్పాటైంది. 1981 తర్వాత ఇంజినీరింగ్‌ ప్రవేశ పరీక్షను కూడా ఈ సంస్థే నిర్వహిస్తూ వస్తున్నది. మధ్యప్రదేశ్‌లో వైద్యవిద్య ప్రవేశానికి సంబంధించిన కుంభకోణాన్నే వ్యాపం కుంభకోణంగా పేర్కొంటారు. ఇందులో అనేక మంది రాజకీయ నాయకులతో పాటు ఉన్నతాధికరులు, వ్యాపారవేత్తలు భాగస్వాములు.

రాజకీయనాయకులకు, వ్యాపం ఉద్యోగులకు లంచాలిచ్చి పెద్ద ర్యాంకులు తెచ్చుకోవటంతో ఈ స్కామ్‌ వెలుగులోకి వచ్చింది. 90వ దశకంలోనే ఈ సంస్థ అవకతవకలపై కేసులు న మోదయ్యాయి. 2000 సంవత్సరంలో తొ లిసారి ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది. 2009లో ఒకేసారి పెద్దస్థాయిలో ప్రీమెడికల్‌ టెస్ట్‌కు సంబంధించిన ఫిర్యాదులు అందాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వం కమిటీని వేసి విచారణ జరిపింది. కమిటీ నివేదిక ఆధారంగా 2011లో వందకు పైగా నిందితులను అరెస్ట్‌ చేసింది. 2015 నాటికి అరెస్టుల సంఖ్య 2వేలకు దాటింది. ఇందులో రాష్ట్ర మాజీ విద్యాశాఖ మంత్రి లక్ష్మికాంత్‌ శర్మ్‌తో సహా వందకు పైగా రాజకీయ నాయకులున్నారు. ఈ కుంభకోణంలో ప్రమేయమున్న సుమా రు వంద మందికి పైగా అసహజ మరణాని కి గురయ్యారు. ఇందులో కస్టడీ మరణాలు కొన్నయితే.. మరికొన్ని రోడ్డు ప్రమాదాల ద్వారా సంభవించాయి.

విజిల్‌ బ్లోయర్‌ ఆనంద్‌రాయ్‌
ఆర్‌టీఐ, గిరిజన హక్కుల పోరాటయోధుడిగానేగాక మధ్యప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన వ్యాపమ్‌ స్కామ్‌ విజిల్‌బ్లోయర్‌గా కూడా ఆనంద్‌రాయ్‌కి గుర్తింపు ఉన్నది. అందుకే ఆయన్ని మధ్యప్రదేశ్‌ ప్రజలు విపరీతంగా అభిమానిస్తారు. వ్యాపమ్‌ స్కామ్‌ను బయటపెట్టినందుకు ఆయన, ఆయన కుటుంబసభ్యులు ఎన్నో కేసులు ఎదుర్కొన్నారు. ఆనంద్‌రాయ్‌ అరెస్టు కూడా అయ్యారు. మధ్యప్రదేశ్‌ ఆదివాసీ, గిరిజన హక్కుల కోసం పోరాడుతున్న ప్రముఖ సంస్థ జాయ్స్‌లో ఆనంద్‌రాయ్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the BRS Party.