Bharat Rashtra Samithi

Bharat Rashtra Samithi

KCR
telangana talli img

పథకాలు ఆపితే నిలదీస్తం..

పథకాలు ఆపితే నిలదీస్తం.. ప్రజా సంక్షేమాన్ని సమాధిచేసేలా కాంగ్రెస్‌ సర్కార్‌ కుట్రలు

-దళితబంధు లబ్ధిదారుల అకౌంట్లు ఫ్రీజ్‌
-గృహలక్ష్మి పథకం అన్యాయంగా రద్దు
-పేదలు, దళితులు, వెనుకబడిన వర్గాలు, మైనార్టీలకు అండగా నిలుస్తాం
-మేము ప్రతి గడపకు వెళ్లి సంక్షేమ పథకాలు అందించాం
-కార్యకర్తల మనోభావాలకు అనుగుణంగా పార్టీ ఆచరణ
-నిజామాబాద్‌ పార్లమెంట్‌ సమావేశంలో బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌

పేదప్రజల కోసం కేసీఆర్‌ ప్రభుత్వం ప్రారంభించిన సంక్షేమ కార్యక్రమాలను ప్రభుత్వం రద్దు చేస్తే ప్రధాన ప్రతిపక్షంగా తమ బాధ్యత నిర్వహిస్తామని, కాంగ్రెస్‌ సర్కారును ఎండగడతామని బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కే తారకరామారావు హెచ్చరించారు. యాభై ఏండ్లపాటు అధికారం వెలగబెట్టిన కాంగ్రెస్‌ పార్టీ గతంలో ఎన్నడూ పేద ప్రజల కోసం విప్లవాత్మకమైన, వినూత్న కార్యక్రమాలను అమలుచేసే ఆలోచన చేయలేదని విమర్శించారు. కేసీఆర్‌ ప్రభుత్వం ప్రారంభించిన దళిత బంధు, గృహలక్ష్మి, బీసీబంధు, గొర్రెల పంపిణీ వంటి కార్యక్రమాల అమలును నిలిపివేసేందుకు కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని, సంక్షేమాన్ని సమాధి చేసేలా కుట్ర చేస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ భవన్‌లో సోమవారం బీఆర్‌ఎస్‌ పార్టీ నిజామాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గ సమావేశం జరిగింది.

ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ.. దశాబ్దాల కాంగ్రెస్‌ పాలనలో ఆర్థిక స్వావలంబనకు, అభివృద్ధికి నోచుకోలేని దళిత కుటుంబాల అభివృద్ధి కోసం దేశంలో ఎకడా లేనివిధంగా దళితబంధు కార్యక్రమాన్ని ప్రారంభించామని చెప్పారు. దళితులను కేవలం ఓటు బ్యాంకుగా చూసిన కాంగ్రెస్‌, ఎన్నికల సందర్భంగా దళితబంధును రూ.10 లక్షల నుంచి రూ.12 లక్షలకు పెంచుతామని హామీ ఇచ్చిందని అన్నారు. అధికారంలోకి రాగానే కాంగ్రెస్‌ పార్టీ ఆ హామీని మరచిపోయిందని మండిపడ్డారు. ఇప్పటికే ఎంపికచేసిన దళిత బంధు లబ్ధిదారులను అనేక ఇబ్బందులకు గురిచేస్తున్నదని చెప్పారు. లబ్ధిదారులు ప్రారంభించిన బ్యాంకు అకౌంట్లను ప్రభుత్వం ఫ్రీజ్‌ చేస్తున్నదని ధ్వజమెత్తారు. గొర్రెల పంపిణీ కోసం తమ వాటాలుగా డీడీలు కట్టిన వారిని పట్టించుకోవడం లేదని విమర్శించారు. నియోజకవర్గానికి 3000 మందికి గృహలక్ష్మి పథకాన్ని అమలు చేయడంలో భాగంగా కేసీఆర్‌ ప్రభుత్వం లబ్ధిదారులను గుర్తించి వారికి అవసరమైన ప్రొసీడింగ్స్‌ను అందిస్తే ఇప్పుడు కాంగ్రెస్‌ ప్రభుత్వం దాన్ని రద్దు చేసిందని మండిపడ్డారు. పేదలు, దళితులు, బీసీల ప్రయోజనాలను దెబ్బకొట్టేలా కాంగ్రెస్‌ పార్టీ కుట్ర చేస్తే ప్రధానప్రతిపక్షంగా వారికి అండగా నిలుస్తామని చెప్పారు.

మాట తప్పిన కాంగ్రెస్‌ను ప్రజలు క్షమించరు
ఎన్నికల్లో ప్రయోజనం పొందాలనే ఆలోచనతో, ఎలాగైనా అధికారంలోకి రావాలనే యావతో కాంగ్రెస్‌ పార్టీ అడ్డగోలుగా వాగ్దానాలు చేసిందని, అధికారంలోకి వచ్చాక శ్వేత పత్రాలు, అప్పుల పేరుతో నాటకాలు ఆడుతున్నదని కేటీఆర్‌ మండిపడ్డారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార ఇప్పటికే అసెంబ్లీ సాక్షిగా నిరుద్యోగ భృతికి కాంగ్రెస్‌ హామీ ఇవ్వలేదని అబద్ధాలు చెప్పిన విషయాన్ని గుర్తుచేశారు. ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చింది ఆరు గ్యారెంటీలు కాదని, వాటి కింద ఇచ్చింది 420 హామీలని చెప్పారు. వీటి నుంచి తప్పించుకోవాలని చూస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చేలా ప్రధాన ప్రతిపక్షంగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తామని చెప్పారు.

కార్యకర్తల మనోభావాలకు అనుగుణంగా పార్టీ
బీఆర్‌ఎస్‌ పార్టీకి గెలుపోటములు కొత్తకాదని కేటీఆర్‌ అన్నారు. నిజామాబాద్‌ పార్లమెంట్‌ పరిధిలో ఇటీవలి ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ కన్నా బీఆర్‌ఎస్‌కే ఎక్కువ ఓట్లు వచ్చాయని ఆయన అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా వచ్చిన ఓట్లను వివరించారు. రానున్న పార్లమెంట్‌ ఎన్నికల్లో త్రిముఖ పోటీ ఉంటుందని చెప్పారు. ఇది బీఆర్‌ఎస్‌కే ప్రయోజనం అని అన్నారు. అసెంబ్లీ ఫలితాలతో సంబంధం లేకుండా తెలంగాణ ప్రజల ప్రయోజనాల కోసం రానున్న ఎన్నికల్లో గట్టిగా కొట్లాడితే విజయం బీఆర్‌ఎస్‌దేనని అన్నారు. కేసీఆర్‌ పట్ల ప్రజల్లో ఉన్న ఆదరణ, బలమైన పార్టీ సైన్యం, బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అమలుచేసిన పథకాలను ప్రస్తుతం కాంగ్రెస్‌ ప్రభుత్వ వంచించే విధానాలతో ప్రజలు పోల్చుకుంటున్నారని అన్నారు. ఎన్నికల్లో పార్టీ పనితీరుపరంగా కూడా కొన్ని మార్పులు చేర్పులు అవసరమని, కార్యకర్తల ఆకాంక్షలకు అనుగుణంగా పార్టీ మార్చుకుంటుందని చెప్పారు. తెలంగాణ ప్రయోజనాల పరిరక్షణ కోసం ఢిల్లీలో గులాబీ జెండా ప్రాతినిధ్యం ఉండాల్సిందేనని అన్నారు. ఇందుకోసం ప్రతి గులాబీ సైనికుడు కష్టపడి పనిచేయాలని చెప్పారు. పార్టీ కార్యకర్తలు అసెంబ్లీ ఎన్నికల ఓటమిని మరచిపోయి పార్లమెంటు ఎన్నికలపై దృష్టిపెట్టాలని అన్నారు. నిజామాబాద్‌తోపాటు అన్ని స్థానాలను బీఆర్‌ఎస్‌ గెలుచుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు.

ఈ సమావేశంలో పార్టీ సెక్రటరీ జనల్‌ కే కేశవరావు, రాజ్యసభ సభ్యుడు కేఆర్‌ సురేశ్‌రెడ్డి, మాజీ స్పీకర్లు పోచారం శ్రీనివాస్‌రెడ్డి, సిరికొండ మధుసూదనాచారి, మాజీ మంత్రి హరీశ్‌రావు, ఎమ్మెల్సీలు కల్వకుంట్ల కవిత, ఎల్‌ రమణ, ఎమ్మెల్యేలు కల్వకుంట్ల సంజయ్‌, డాక్టర్‌ సంజయ్‌, వేముల ప్రశాంత్‌రెడ్డి, మాజీ ఎంపీ రావుల చంద్రశేఖర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్దన్‌, కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు, గణేశ్‌గుప్తా, జీవన్‌రెడ్డి సహా నిజామాబాద్‌ లోక్‌సభ పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలోని మున్సిపల్‌ చైర్మన్లు, జడ్పీ చైర్మన్లు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, రాష్ట్ర కార్పొరేషన్‌ మాజీ చైర్మన్లు, పార్టీ ప్రతినిధులు పాల్గొన్నారు.

కేసీఆర్‌ సర్కార్‌లో ప్రజలు లైన్లో నిల్చున్నారా?
కేసీఆర్‌ ప్రభుత్వ హయాంలో ప్రజలు ఏనాడైనా లైన్లో నిల్చున్నారా? అని కేటీఆర్‌ ప్రశ్నించారు. ప్రజలు లైన్లలో నిల్చోకుండా ప్రజలకు అన్ని సంక్షేమ పథకాలను అమలుచేసిన చరిత్ర కేసీఆర్‌ సర్కార్‌దని చెప్పారు. తాము సంక్షేమ పథకాలను ప్రజలు ఇంటి ముందుకు వెళ్లి అందించామని, అందుకు తమకు గర్వంగా ఉందని అన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసమే ప్రజలను ఇబ్బంది పెట్టేలా లైన్‌లో నిలబెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ పార్టీ అస్తవ్యస్థ పనితీరు, పరిపాలనను ఎప్పటికప్పుడు ఎండగట్టేలా పార్టీ శ్రేణులు క్షేత్రస్థాయిలో పనిచేస్తాయని తెలిపారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the BRS Party.