సీఎం కేసీఆర్‌తో పవర్‌గ్రిడ్ చైర్మన్ ఝా భేటీ
ఉత్తరాది రాష్ట్రాల నుంచి దక్షిణాది రాష్ట్రాలకు విద్యుత్ సరఫరా వ్యవస్థ పూర్తయితే దేశవ్యాప్తంగా విద్యుత్ డిమాండ్, ఉత్పత్తి మధ్య సమన్వయం సాధ్యం అవుతుందని సీఎం కేసీఆర్ చెప్పారు. దీనికోసం నార్త్, ఈస్ట్, వెస్ట్ గ్రిడ్ (న్యూగ్రిడ్)తో అనుసంధానాన్ని వేగవంతం చేయాలని పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (పీజీసీఐఎల్) చైర్మన్ ఐఎస్ ఝాను కోరారు.
నార్త్, ఈస్ట్, వెస్ట్ గ్రిడ్ (న్యూగ్రిడ్)తో దక్షిణాది (సదరన్) రాష్ట్రాలతో విద్యుత్‌ను ఇచ్చిపుచ్చుకునేందుకు అవసరమైన లైన్ల నిర్మాణాన్ని వేగంగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు కోరారు. మంగళవారం ప్రగతిభవన్‌లో పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (పీజీసీఐఎల్) చైర్మన్ ఐఎస్ ఝా, పీజీసీఐఎల్ సదరన్ రీజియన్ ఈడీ శేఖర్, టీఎస్ జెన్‌కో, ట్రాన్స్‌కో సీఎండీ ప్రభాకర్‌రావు సీఎం కేసీఆర్‌ను కలిశారు.
ఉత్తరాది రాష్ట్రాల నుంచి దక్షిణాది రాష్ట్రాలకు విద్యుత్ సరఫరా వ్యవస్థ పూర్తయితే దేశవ్యాప్తంగా విద్యుత్ డిమాండ్, ఉత్పత్తి మధ్య సమన్వయం సాధ్యం అవుతుందని సీఎం చెప్పారు. ఛత్తీస్‌గఢ్ నుంచి విద్యుత్ తెచ్చుకోవడానికి అవసరమైన వార్ధా-డిచ్‌పల్లి లైన్ నిర్మాణం త్వరగా పూర్తి చేయాలని కోరారు. ఈ సందర్భంగా పీజీసీఐఎల్ చైర్మన్ ఝా స్పందిస్తూ, మార్చి నెలాఖరులోగా లైన్ నిర్మాణం పూర్తిచేస్తామని చెప్పారు. 4500మెగావాట్ల సామర్థ్యం కలిగిన 765కేవీ డబుల్ సర్క్యూట్ లైన్ నిర్మాణం పూర్తయితే ఛత్తీస్‌గఢ్ నుంచి విద్యుత్ తెచ్చుకుంటామని, వరంగల్-వరోరా (మహారాష్ట్ర) లైన్ కూడా త్వరగా పూర్తి చేయాలని సీఎం కోరారు. ఈ రెండు లైన్లు పూర్తయితే న్యూగ్రిడ్-సదరన్ గ్రిడ్ మధ్య విద్యుత్ ఇచ్చిపుచ్చుకోవడం సాధ్యం అవుతుందని వివరించారు. దీంతో దేశం మొత్తం ఒకే విద్యుత్ వ్యవస్థతో అనుసంధానం అవుతుందని చెప్పారు. తెలంగాణలో ట్రాన్స్‌మిషన్ ప్రాజెక్టుల్లో పెట్టుబడులు పెట్టడానికి కూడా పీజీసీఐఎల్ సంసిద్ధత వ్యక్తం చేసింది. దీనిపై తెలంగాణ విద్యుత్ శాఖ, పీజీసీఐఎల్ చర్చలు జరుపాలని సీఎం కేసీఆర్ సూచించారు. ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, ప్రభుత్వ ముఖ్య సలహాదారుడు రాజీవ్‌శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్, సీనియర్ అధికారులు నర్సింగ్‌రావు, శాంతికుమారి, రామకృష్ణారావు, స్మితాసబర్వాల్ తదితరులు పాల్గొన్నారు.

