Bharat Rashtra Samithi

Bharat Rashtra Samithi

KCR
telangana talli img

తెలంగాణ ప్రజల ఇంటి పార్టీ.. బీఆర్‌ఎస్‌

  • గద్దలపాలు కానీయొద్దు.. దొంగల చేతిలో పెట్టొద్దు
  • తెలంగాణకు కాంగ్రెస్‌ దోఖా.. ఆ పార్టీకి ఓటేస్తే రాష్ట్రాన్ని మళ్లీ ముంచేస్తది
  • బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌

‘మూడు గంటల కరెంట్‌ చాలన్న తెలివైన పీసీసీ అధ్యక్షుడున్న కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణను ఉంచుతదా? ముంచుతదా?’ అని మంత్రి కేటీఆర్‌ అనుమానం వ్యక్తం చేశారు. 11సార్లు మోఖా ఇస్తే బార్‌ బార్‌ తెలంగాణకు దోఖా ఇచ్చిన కాంగ్రెస్‌ మరోసారి అదే చేస్తుందని హెచ్చరించారు. తెలంగాణకు సీఎం కేసీఆరే భరోసా అని స్పష్టం చేశారు. కర్ణాటకలో కరెంట్‌ ఆఫీసుల ముందు మొసళ్లతో నిరసన వ్యక్తం అవుతున్నా ఇక్కడ మొసలి కన్నీరెందుకని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జునఖర్గేను ప్రశ్నించారు. దొంగల చేతిలో రాష్ర్టాన్ని పెట్టొద్దని.. దగుల్బాజీ కాంగ్రెస్‌ వద్దేవద్దని నినదించారు. బుధవారం తెలంగాణ భవన్‌లో మహబూబ్‌నగర్‌ మున్సిపల్‌ మాజీ చైర్మన్‌, ఆ జిల్లాకు పదేండ్లు డీసీసీ ప్రెసిడెంట్‌గా పనిచేసిన ముత్యాల ప్రకాశ్‌, పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్‌ నేతలు సత్యనారాయణరెడ్డి, రామ్మూర్తి తదితరులు మంత్రులు కేటీఆర్‌, శ్రీనివాస్‌గౌడ్‌ సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరారు. కేటీఆర్‌ వారికి గులాబీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజలు బీఆర్‌ఎస్‌ను మాత్రమే తమ ఇంటిపార్టీగా సగర్వంగా చెప్పుకుంటారని పేర్కొన్నారు.

ఒక ఎమ్మెల్యే గేట్లు ఎత్తుడు.. మరొకరు దించుడు
చొప్పదండి-పెద్దపల్లి, జగిత్యాల-పెద్దపల్లి మధ్య అప్పట్లో సాగునీటి పంచాయితీ ఉండేదని కేటీఆర్‌ గుర్తు చేశారు. ఎస్సారెస్పీ కాలువ నీటిపై ఎమ్మెల్యేలు సైతం గొడవపడిన సందర్భాలున్నాయని చెప్పారు. ఒక ఎమ్మెల్యే గేట్లు ఎత్తుడు..మరో ఎమ్మెల్యే గేట్లు దించుడు, కరెంట్‌వాళ్లు మోటార్లు గుంజుకపోవుడు.. కాలువల్లో వేసుడు ఉండేదని, దశాబ్దాలుగా ఈ లొల్లి సాగిందని గుర్తు చేశారు. ఇప్పుడా పంచాయితీలున్నాయా? అని ప్రశ్నించారు.

బాధపడుతున్న కర్ణాటక ప్రజలు
కాంగ్రెస్‌ను గెలిపించి తప్పు చేశామని నాలుగు నెలలకే కర్ణాటక ప్రజలు చెంపలు వేసుకుంటున్నారని చెప్పారు. రోజుకు 5 గంటలు కరెంట్‌ ఇచ్చేందుకు కాంగ్రెస్‌ ప్రభుత్వం కిందామీదా పడుతున్నదని ఎద్దేవా చేశారు. కరెంట్‌ లేక అక్కడి రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారని, కాలువల్లో, చెరువుల్లో నీళ్లలేక మొసళ్లు బయటకు వస్తున్న దుస్థితి ఏర్పడిందన్నారు. ఖర్గే సొంత రాష్ట్రంలో రైతులు మొసళ్లతో నిరసన తెలుపుతున్నారని పేర్కొన్నారు. రేవంత్‌రెడ్డి రాష్ట్రంలో మూడు గంటల కరెంట్‌ చాలని పేర్కొన్న విషయాన్ని కేటీఆర్‌ గుర్తుచేశారు. 24 గంటల కరెంట్‌ కావాలో? 3 గంటల కరెంట్‌ కావాలో రైతులు ఆలోచించాలని సూచించారు.

బార్‌ బార్‌ కాంగ్రెస్‌ దోఖా
తెలంగాణను గద్దలపాలు కానివ్వకూడదనే లక్ష్యంతో అసలు సిసలు నిఖార్సైన తెలంగాణవాదులు సీఎం కేసీఆర్‌కు అండగా నిలబడాలని బీఆర్‌ఎస్‌లోకి వస్తున్నారని, అందులో భాగంగానే పెద్దపల్లి నుంచి సత్యనారాయణరెడ్డి, రామ్మూర్తి, ముత్యాల ప్రకాశ్‌లాంటి వాళ్లు బీఆర్‌ఎస్‌లోకి వస్తున్నారని చెప్పారు. అభివృద్ధి, సంక్షేమాన్ని అద్భుతంగా చేసుకుంటున్న తరుణంలో తెలంగాణను మళ్లీ దొంగల చేతుల్లో, దగుల్బాజీ కాంగ్రెస్‌ చేతిలో పెడితే రాష్ట్రం నాశనం అయితదని ఆవేదన వ్యక్తం చేశారు.

తెలంగాణకు కేసీఆర్‌ భరోసా
గురువారం నుంచి ‘కేసీఆర్‌ భరోసా‘ పేరుతో మ్యానిఫెస్టోను ఇంటింటికీ తీసుకెళ్లి వివరించబోతున్నట్టు చెప్పారు. ప్రస్తుతం ఆసరా కింద అందిస్తున్న రూ. 2,016ను రూ. 5,016కు పెంచబోతున్నామని, దివ్యాంగులకు రూ. 6016 ఇవ్వబోతున్న విషయాన్ని ప్రజలకు వివరించబోతున్నామని చెప్పారు. కేసీఆర్‌ మూడోసారి అధికారంలోకి వచ్చిన తరువాత రైతుబంధును రూ. 10వేల నుంచి రూ. 16వేలకు పెంచబోతున్నట్టు తెలిపారు. రేషన్‌కార్డున్న ప్రతీ కుటుంబానికి అన్నపూర్ణ పథకం ద్వారా సన్నబియ్యాన్ని పంపిణీ చేస్తామని పేర్కొన్నారు. సౌభాగ్యలక్ష్మి కార్యక్రమం ద్వారా అర్హులైన ప్రతీ మహిళకు నెలకు రూ. 3వేల చొప్పున ఇవ్వబోతున్నామని చెప్పారు. ఎస్సీ, ఎస్టీ సహా అన్ని వర్గాల ప్రజలకు గతంలో పంపిణీ చేసిన అసైన్డ్‌ భూముల మీద హక్కులు లబ్దిదారులకే కల్పించబోతున్నామన్నారు. ఆడబిడ్డలకు కేసీఆర్‌ భరోసా కింద గ్యాస్‌ సిలిండర్‌ను రూ. 400కే ఇవ్వబోతున్నామని వివరించారు. కేసీఆర్‌ మూడోసారి అధికారంలోకి రాగానే 15 రకాల సౌకర్యాలను ‘కేసీఆర్‌ భరోసా’ ద్వారా ఇవ్వబోతున్నారని, ఇదే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రతి బీఆర్‌ఎస్‌ కార్యకర్తపైనా ఉందని సూచించారు.

ఎట్లున్న తెలంగాణ ఎట్లయింది?
‘తెలంగాణ ఏర్పడకముందు ఎట్లున్న తెలంగాణ.. తొమ్మిదిన్నరేండ్ల తరువాత కేసీఆర్‌ పాలనలో ఎట్ల అయిందనే విషయాన్ని ప్రతి ఒక్కరూ ఆలోచించాలి’ అని కేటీఆర్‌ కోరారు. విద్య, వైద్యం రంగాల్లో అద్భుత పురోగతి సాధించామని, 10,021 గురుకులాలు, బస్తీ దవాఖానలు మొదలుకొని జిల్లాకో మెడికల్‌ కాలేజీ దాకా అన్ని రంగాల్లో తెలంగాణ మహోజ్వలంగా ముందుకు సాగుతున్నదని వివరించారు. గతంలో ఏ ప్రభుత్వమూ యాదవులను పట్టించుకోలేదని పేర్కొన్నారు. ఈ విషయాన్ని గమనించే కేసీఆర్‌ గొర్రెల పంపిణీ చేపట్టారని తెలిపారు. కేసీఆర్‌ నాయకత్వంలో అన్ని రంగాలు అద్భుతంగా బాగయ్యాయని, ప్రజలు అండగా నిలిచి మూడోసారి ముఖ్యమంత్రిని చేయాలని కోరారు. కార్యక్రమంలో పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి, ఎంపీ బీబీ పాటిల్‌, పౌర సరఫరాల కార్పొరేషన్‌ చైర్మన్‌ సర్దార్‌ రవీందర్‌సింగ్‌, టూరిజం కార్పొరేషన్‌ చైర్మన్‌ గెల్లు శ్రీనివాస్‌యాదవ్‌, మాజీ ఎమ్మెల్సీ శ్రీనివాస్‌రెడ్డి, జడ్పీటీసీ లక్ష్మణ్‌, జడ్పీ కోఆప్షన్‌ సభ్యుడు హజీ, పార్టీ నేతలు గుర్రాల మల్లేశ్‌, న్యాయవాది అవని, నాయకురాలు చంద్రకళ తదితరులు పాల్గొన్నారు.

సత్యనారాయణరెడ్డి భావోద్వేగం
బీఆర్‌ఎస్‌కు పదేండ్లు దూరమై తిరిగి ఆ పార్టీలో చేరుతున్నందుకు గర్వంగా ఉందని సత్యనారాయణరెడ్డి పేర్కొంటూ భావోద్వేగానికి లోనయ్యారు. పార్టీ ఆవిర్భావ సభ్యుడిగా, తొలినాళ్లల్లో కేసీఆర్‌కు సైనికుడిగా పనిచేసిన తాను తిరిగి బీఆర్‌ఎస్‌లో చేరడం సంతోషంగా ఉందన్నారు. తెలంగాణ వ్యతిరేక శక్తులన్నీ ఒక్కటై కేసీఆర్‌ను పడగొట్టాలని కుట్రలు చేస్తున్నాయని, ఇటువంటి సమయంలో తెలంగాణవాదులందరూ పునరేకీకరణ కావాలని పిలుపునిచ్చారు.

వారు వీరు.. వీరు వారు
తెలంగాణ భవన్‌లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. పెద్దపెల్లి కాంగ్రెస్‌ నేత సత్యనారాయణరెడ్డి తెలంగాణభవన్‌ వేదికగా మంత్రి కేటీఆర్‌ సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరారు. ప్రస్తుత పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డిని సీఎం కేసీఆర్‌ సమక్షంలో అప్పట్లో సత్యనారాయణరెడ్డి బీఆర్‌ఎస్‌లో చేర్పించారు. ఇప్పుడు ఆయనే ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్‌ఎస్‌లో చేరడం విశేషం.

టీఆర్‌ఎస్‌ ఆవిర్భావం నుంచి, ఉద్యమంలో 2001 నుంచి 2014 వరకు క్రియాశీలకంగా పనిచేసిన ప్రతీ ఒక్కరికీ సముచిత గౌరవాన్ని కల్పిస్తాం. అన్ని కార్యక్రమాల్లో అందరికీ న్యాయం, గౌరవం దక్కేలా చూస్తాం. కష్టనష్టాలకు ఓర్చి రాష్ట్రం కోసం సీఎం కేసీఆర్‌కు అండగా నిలిచిన ప్రతి ఒక్కరూ గర్వపడేలా చూస్తాం.
-మంత్రి కేటీఆర్‌

తెలంగాణ యువతకు కేసీఆర్‌ భరోసా కింద వినూత్న కార్యక్రమాన్ని చేపట్టబోతున్నాం. రాష్ట్రంలో ఇప్పటికే 2.2 లక్షల ఉద్యోగాల భర్తీ ప్రక్రియ విజయవంతంగా కొనసాగుతున్నది. ఇప్పటికే 1.32 లక్షల ఉద్యోగాలు భర్తీ చేశాం. మరో 80-90వేల ఉద్యోగాల భర్తీ ప్రక్రియ కొనసాగుతున్నది. కేసీఆర్‌ భరోసా కింద ప్రతీసంవత్సరం జాబ్‌ క్యాలెండర్‌ను విడుదల చేసి ఆ ఏడాది రిటైర్‌ అయ్యే సంఖ్యను నిర్దిష్ట కాల వ్యవధితో భర్తీచేసాం.
-మంత్రి కేటీఆర్‌

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the BRS Party.