Bharat Rashtra Samithi

Bharat Rashtra Samithi

KCR
telangana talli img

తెలంగాణ ధమాకా.. 46 కేంద్ర ప్రభుత్వ అవార్డుల్లో 13 మనవే

జాతీయ పంచాయతీ అవార్డుల్లో తెలంగాణ మరోసారి సత్తా చాటింది. ప్రజోపయోగ కార్యక్రమాల అమలులో దేశంలోని ఇతర రాష్ట్రాల కన్నా తెలంగాణ ముందంజలో ఉన్నట్టు మరోసారి వెల్లడైంది. వివిధ విభాగాల్లో కేంద్రం ప్రకటించిన మొత్తం 46 అవార్డుల్లో తెలంగాణ 13 దక్కించుకొని మొదటిస్థానంలో నిలిచింది. ఒడిశాకు ఎనిమిది అవార్డులు లభించగా, మహారాష్ట్ర ఐదు దక్కించుకుంది. ఇక ప్రధాని మోదీ సొంత రాష్ట్రమైన గుజరాత్‌, బీజేపీ అధికారంలో ఉన్న మధ్యప్రదేశ్‌, కర్ణాటక తదితర రాష్ట్రాలు ఊసులోనే లేకుండా పోయాయి. దాదాపు ప్రతి విభాగంలోనూ తెలంగాణ గ్రామాలు అవార్డులను దక్కించుకోవడం విశేషం. ఒక్కో విభాగంలో మూడు ర్యాంకులకు గాను ఒక్కో రాష్ట్రం నుంచి ఒక గ్రామాన్నే ఎంపిక చేసినట్టు అవార్డులు ప్రకటించిన సరళిని బట్టి తెలుస్తున్నది.

జాతీయ స్థాయి ఉత్తమ పంచాయతీగా నిలిచి సోమవారం ఢిల్లీలో రాష్ట్రపతి ముర్ము చేతులమీదుగా పురస్కారాన్ని అందుకుంటున్న జనగామ జిల్లా నెల్లుట్ల సర్పంచ్‌ స్వరూపరాణి, రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు

దీన్‌దయాళ్‌ ఉపాధ్యాయ్‌ పంచాయత్‌ సతత్‌ వికాస్‌ పురస్కారం కింద తొమ్మిది విభాగాల్లో అవార్డులు అందజేశారు. ఇందులో తెలంగాణలోని నాలుగు పంచాయతీలకు మొదటి ర్యాంకు, రెండింటికి రెండో ర్యాంకు, మరో రెండింటికి మూడో ర్యాంకు వచ్చింది. ఎనిమిది విభాగాల్లో తెలంగాణ పంచాయతీలు అవార్డులు దక్కించుకున్నాయి. నానాజీ దేశ్‌ముఖ్‌ సర్వోత్తమ్‌ పంచాయత్‌ సతత్‌ వికాస్‌ పురస్కార్‌ కింద మూడు విభాగాల్లో తొమ్మిది గ్రామాలను ఎంపిక చేశారు. వీటిలో రెండు విభాగాల్లో తెలంగాణ అవార్డులను దక్కించుకుంది. ఈ విభాగంలో కరీంనగర్‌ జిల్లాకు చెందిన తిమ్మాపూర్‌ ఎల్‌ఎండీ ఉత్తమ మండల పంచాయత్‌గా, ములుగు జిల్లా ఉత్తమ జిల్లా పంచాయత్‌గా ఎంపికయ్యాయి. ఇక స్పెషల్‌ క్యాటగిరీలో రెండు విభాగాల కింద ఎంపికైన ఆరు పంచాయతీల్లో రెండు తెలంగాణకు చెందినవి ఉన్నాయి. నగదు పురస్కారం లేని మరో స్పెషల్‌ క్యాటగిరీలో నాలుగు పంచాయతీలు ఎంపిక కాగా వాటిలో రాష్ట్రం నుంచి సిద్దిపేట జిల్లా, మర్కూక్‌ మండలంలోని ఎర్రవల్లి గ్రామ పంచాయతీ ఎంపికైంది.

ఢిల్లీలోని విజ్ఞాన్‌ భవన్‌లో సోమవారం జరిగిన కార్యక్రమంలో జాతీయ పంచాయతీరాజ్‌ ఉత్తమ పురస్కారాలను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అవార్డులను అందజేశారు. రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, పలువురు జడ్పీ చైర్మన్లు, ఎంపీపీలు, సర్పంచులు రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డులు అందుకున్నారు. అత్యధిక అవార్డులు దక్కించుకున్న తెలంగాణ మంత్రి ఎర్రబెల్లితో పాటు అధికారులు, ప్రజాప్రతినిధులను రాష్ట్రపతి ముర్ము అభినందించారు. రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డులు అందుకోవడం పట్ల మంత్రి దయాకర్‌రావు, అధికారులు, ప్రజాప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి గిరిరాజ్‌ సింగ్‌, సహాయ మంత్రి కపిల్‌ మోరేశ్వర్‌ పాటిల్‌, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి సందీప్‌ కుమార్‌ సుల్తానియా, కమిషనర్‌ హనుమంతరావు తదితర ప్రముఖులు పాల్గొన్నారు.

ఢిల్లీలోని విజ్ఞాన్‌భవన్‌లో సోమవారం కేంద్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి గిరిరాజ్‌సింగ్‌ చేతులమీదుగా అవార్డులు స్వీకరిస్తున్న ములుగు జడ్పీ చైర్మన్‌ కుసుమ జగదీశ్వర్‌

నిధులను పెంచి.. ప్రోత్సహించాలి: కేంద్ర మంత్రికి ఎర్రబెల్లి విజ్ఞప్తి
తెలంగాణ అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం నిధులను పెంచి సహకరించాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు విజ్ఞప్తిచేశారు. అవార్డు ప్రదానోత్సవంలో భాగంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ.. రాష్ర్టానికి జరిగే కేటాయింపుల్లో 14వ అర్థిక సంఘంతో పోలిస్తే 15వ ఆర్థిక సంఘంలో దాదాపు రూ.500 కోట్లు తగ్గించరని చెప్పారు. తెలంగాణ ప్రతిష్టాత్మకంగా అమలుచేసిన మిషన్‌ భగరీథ వల్ల నేడు రాష్ట్రంలోని ప్రతిపల్లెకు తాగునీరు అందుతున్నదని తెలిపారు. మిషన్‌ భగీరథకు ప్రోత్సాహకం కింద నగదు మంజూరు చేయాలని నీతిఆయోగ్‌ సూచించిందని, కానీ ఇప్పటివరకు వాటిని విడుదల చేయలేదని గుర్తుచేశారు. మహాత్మాగాంధీ చెప్పినట్టుగా దేశాభివృద్ధికి గ్రామాలే పట్టుగొమ్మలు అని, దేశం పురోగతి సాధించాలంటే.. ప్రతి గ్రామం అభివృద్ధి చెందాలన్న విషయాన్ని గుర్తించిన తెలంగాణ ముఖ్యమంతి కేసీఆర్‌ సాగు, తాగునీటి కోసం మిషన్‌ భగీరథ, మిషన్‌ కాకతీయ వంటి పథకాలను అమలు చేశారని చెప్పారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం కోసం రైతంగానికి రైతుబంధు, బీమా, 24 గంటల ఉచిత కరెంటు అందిస్తున్నారని తెలిపారు. కేంద్ర పంచాయతీరాజ్‌ శాఖ రూపొందించిన 9 థీమ్‌లలో సాధించిన ప్రగతి ఆధారంగానే పంచాయతీలను పురస్కారాల ఎంపిక చేయడం, కేంద్రం ప్రకటించిన అవార్డులో తెలంగాణ 13 అవార్డులు దక్కడం సంతోషకరమైన విషయమన్నారు.

గ్రామాలు నూతన నాయకత్వాన్ని, ప్రణాళికలను, విధాన రూపకర్తలను, ఆవిష్కర్తలను ప్రోత్సహించేవిగా ఎదగాలి. ఒక గ్రామంలో అమలుచేసిన ఉత్తమ విధానాలను ఇతర గ్రామాలు అనుసరించడం ద్వారా వేగంగా పురోగతి సాధించవచ్చు. సమాజం సమగ్రంగా అభివృద్ధి చెందాలంటే మహిళల భాగస్వామ్యం కీలకం. గ్రామీణ స్థాయిలో, కుటుంబ స్థాయిలో వారికి సాధికారత కల్పించడం ద్వారా ఆ అధికారం సాకారం కాగలదు. స్థానిక సంస్థలకు 31.5 లక్షల మంది ప్రజాప్రతినిధులు ఎంపిక కాగా, వారిలో 46%మహిళలే.

– రాష్ట్రపతి ముర్ము

నానాజీ దేశ్‌ ముఖ్‌ సర్వోత్తమ్‌ పంచాయత్‌ సతత్‌ వికాస్‌ పురస్కార్‌ 2023

  1. ఉత్తమ బ్లాక్‌ (మండల) పంచాయతీల విభాగంలో కరీంనగర్‌ జిల్లా తిమ్మాపూర్‌ ఎల్‌ఎండీ నుంచి ఎంపీపీ కేతిరెడ్డి వనిత అవార్డు అందుకున్నారు.
  2. ఉత్తమ జిల్లా పరిషత్‌ విభాగంలో ములుగు జిల్లా జడ్సీ చైర్‌పర్సన్‌ కుస్మ జగదీశ్వర్‌ అవార్డు అందుకున్నారు.
  3. స్పెషల్‌ క్యాటగిరీ అవార్డుల్లో: గ్రామ ఊర్జా స్వరాజ్‌ విశేష్‌ పంచాయత్‌ పురస్కార్‌ విభాగంలో ఆదిలాబాద్‌ జిల్లా ముఖ్రా కే గ్రామం నుంచి గడిగెమీనాక్షి అవార్డు అందుకున్నారు.
  4. కార్బన్‌ న్యూట్రల్‌ విశేష్‌ పంచాయతీ పురస్కార్‌ విభాగంలో రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం కన్హా గ్రామం సర్పంచ్‌ చల్లగుల్ల సరిత అవార్డు అందుకున్నారు.
  5. నాన్‌ ఫైనాన్షియల్‌ ఇన్సెంటివ్‌ – సర్టిఫికెట్‌ విభాగంలో గ్రామ ఊర్జా స్వరాజ్‌ విశేష్‌ పంచాయత్‌ పురస్కార్‌కు సిద్దిపేట జిల్లా మర్కూక్‌ మండలం ఎర్రవెల్లి గ్రామానికి చెందిన మొండి భాగ్యలక్ష్మి అవార్డును అందుకున్నారు.

దీన్‌దయాళ్‌ ఉపాధ్యాయ్‌ పంచాయత్‌ సతత్‌ వికాస్‌ పురస్కారానికి ఎంపికైన పంచాయతీలు.. అవార్డు అందుకున్న ప్రజాప్రతినిధులు

  1. ఆరోగ్యవంతమైన పంచాయతీ: సర్పంచ్‌ పోడిమ్‌ సుజాత గౌతంపూర్‌ గ్రామం, చెంచుపల్లి మండలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా.
  2. నీటి సమృద్ధి ఉన్న పంచాయతీ: సర్పంచ్‌ చిట్ల స్వరూపరాణి, నెల్లుట్ల గ్రామం, లింగాల ఘనపురం మండలం, జనగామ జిల్లా
  3. సామాజిక భద్రత ఉన్న పంచాయతీ: సర్పంచ్‌ మానస, కొంగట్‌ పల్లి గ్రామం, హన్వాడ మండలం, మహబూబ్‌ నగర్‌ జిల్లా
  4. మహిళల సన్నిహిత పంచాయతీ: సర్పంచ్‌ సానబోయిన రజిత, అయిపూర్‌ గ్రామం, ఆత్మకూరు మండలం, సూర్యాపేట జిల్లా
  5. పేదరిక నిర్మూలన, జీవనోపాధి పెంచిన పంచాయతీ: సర్పంచ్‌ గంటపోగు సవారీ, మందొండి గ్రామం, రాజోలి మండలం, గద్వాల జిల్లా
  6. సుపరిపాలన: సర్పంచ్‌ నర్సన్‌పల్లి నర్సింహారెడ్డి, చీమల్‌దారి గ్రామం, మోమిన్‌పేట్‌ మండలం, వికారాబాద్‌ జిల్లా
  7. క్లీన్‌ అండ్‌ గ్రీన్‌ పంచాయతి: సర్పంచ్‌ అర్శన్‌పల్లి వెంకటేశ్వర్‌రావు, సుల్తాన్‌పూర్‌ గ్రామం, ఎలిగెడ మండలం, పెద్దపల్లి జిల్లా
  8. స్వయం సమృద్ధి మౌలిక సదుపాయాలు గల పంచాయతి: సర్పంచ్‌ కటకం శ్రీధర్‌, గంభీర్‌రావుపేట గ్రామం, మం డలం, రాజన్న సిరిసిల్ల జిల్లా.

పంచాయతీల ఖాతాల్లో నగదు జమ
అవార్డుల ప్రదానోత్సనవానికి ముందు కేంద్ర మంత్రి గిరిరాజ్‌సింగ్‌ పంచాయతీ డిజిటల్‌ బుక్‌ను ఆవిష్కరించారు. ఉత్తమ పురస్కారాలు అందుకున్న పంచాయతీల అభివృద్ధికి సంబంధించిన లఘు చిత్రాన్ని ఈ సందర్భంగా ప్రదర్శించారు. అవార్డు కింద అందజేసే నగదు మొత్తాన్ని ఆయా పంచాయతీల ఖాతాల్లో నేరుగా జమ చేశారు. ఈ మేరకు అవార్డులకు ఎంపికైన అన్ని గ్రామాలకు కలిపి రూ.47.50 కోట్లు ఆయా ఖాతాల్లోకి పంపగా, అందులో తెలంగాణలోని గ్రామపంచాయతీల ఖాతాల్లో రూ.12.5 కోట్లు జమ అయ్యాయి.

మొదటి ర్యాంకు పంచాయతీలకు కోటి రూపాయలు
జాతీయ స్థాయిలో ఉత్తమ పురస్కారం అందుకున్న గ్రామ పంచాయతీలకు అవార్డుతో పాటుగా నగదు బహుమతిని అందించారు. నగదును ముందుగా ప్రకటించిన మొత్తం కంటే కొంతమొత్తం పెంచారు. తెలంగాణకు మొత్తంగా రూ.12.50కోట్ల నగదు బహుమతి వచ్చింది. మొదటి ర్యాంకు ను సాధించిన పంచాయతీలకు కోటి రూపాయలు, రెండో ర్యాంకు సాధించిన వాటికి రూ.75లక్షలు, మూడో బహుమతి పొందిన పంచాయతీలకు రూ.50 లక్షల నగదును అందించారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the BRS Party.