-బలమైన క్యాడర్.. పటిష్ఠ నాయకత్వమున్న నల్లగొండ -సాధించిన అసాధారణ అభివృద్ధిని ప్రజలకు వివరించాలి -టీఆర్‌ఎస్ శ్రేణులకు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దిశానిర్దేశం -సాగర్ ఉప ఎన్నిక, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికపై కసరత్తు

త్వరలో జరిగే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికపై టీఆర్‌ఎస్ ప్రత్యేక దృష్టి సారించింది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కే తారకరామారావు ఉమ్మడి జిల్లావారీగా సమావేశమవుతూ నాయకులు, క్యాడర్‌కు దిశానిర్దేశం చేస్తున్నారు. ‘ప్రగతి మనది.. బలమైన పార్టీ మనది.. విజయమూ మనదే’ కావాలని కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిస్తున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా నాయకులతో సమావేశం నిర్వహించిన మరుసటి రోజే మంత్రి కేటీఆర్ ఉమ్మడి నల్లగొండ జిల్లా నాయకులతో సమావేశమయ్యారు. పట్టభద్రుల ఎమ్మెల్సీతోపాటు నాగార్జునసాగర్ ఉప ఎన్నికపై పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. ఆరున్నరేండ్లుగా ఉమ్మడి నల్లగొండ జిల్లా, ప్రత్యేకించి నాగార్జునసాగర్‌లో సాధించిన అసాధారణ ప్రగతిని ప్రజలకు వివరించాలని సూచించారు. కొన్నిపార్టీలు ప్రభుత్వం మీద, పార్టీ మీద పనికట్టుకొని బురద జల్లేందుకు యత్నిస్తున్నాయని, వాటిని తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు.
పాదయాత్ర నుంచి ప్రగతిపథం దాకా ఉమ్మడి రాష్ట్రంలో ఫ్లోరైడ్ రక్కసి జిల్లాగా పేరొందిన నల్లగొండలో దానిని పారదోలేందుకు ఉద్యమించిన పార్టీ టీఆర్‌ఎస్. పార్టీ ఆవిర్భవించిన తొలినాళ్ల (2002)లోనే నాటి ఉద్యమనాయకుడు కేసీఆర్ కోదాడ నుంచి హాలియాదాకా ఎర్రటి ఎండలో పాదయాత్ర చేసిన సందర్భం నుంచి రాష్ట్రం ఆవిర్భవించాక ఆరున్నరేండ్లుగా నల్లగొండ జిల్లా సాధించిన అద్వితీయ ప్రగతిని ప్రతిఒక్కరికీ వివరించటంలో పార్టీశ్రేణులు నిమగ్నం కావాలని కేటీఆర్ దిశానిర్దేశం చేశారు. సాగునీటి కష్టాలు తీర్చుకొని, ఫ్లోరైడ్ రక్కసిని పారద్రోలిన అద్భుత సందర్భాన్ని ప్రజల కండ్లముందు ఆవిష్కరించాలని సూచించారు. దామరచర్ల పవర్ ప్రాజెక్టు, మిషన్‌భగీరథ ద్వారా అందుతున్న తాగునీరు, మూడు ఎత్తిపోతల పథకాలు, ఇటీవలే మంజూరుచేసిన డిగ్రీ కాలేజీ తదితర అభివృద్ధి పనులను వివరించాలని పేర్కొన్నారు. కేటీఆర్ దిశానిర్దేశం మేరకు టీఆర్‌ఎస్ ప్రభుత్వం సాధించిన విజయాలను ప్రజల ముంగిటకు తీసుకెళ్లేందుకు గులాబీ శ్రేణులు సమాయత్త మవుతున్నాయి.
బలమైన పార్టీ.. పటిష్ఠ నాయకత్వం సాగర్ ఉప ఎన్నికఎప్పుడొచ్చినా గెలుపు కోసం ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేయాలని నల్లగొండ టీఆర్‌ఎస్ నాయకత్వం నిర్ణయించింది. గ్రామస్థాయి నుంచి నియోజకవర్గస్థాయి దాకా బలమైన పునాదులున్న పార్టీగా విపక్షాల ఎత్తులను చిత్తుచేయాలని క్యాడర్ ప్రతినబూనుతున్నది. అసత్యాలను ప్రచారం చేస్తున్న విపక్షాలకు తగిన గుణపాఠం చెప్పేందుకు సిద్ధమవుతున్నది. నాగార్జునసాగర్ నియోజకవర్గంలో 153 మంది సర్పంచ్‌లు, ఐదుగురు ఎంపీపీలు, నలుగురు జెడ్పీటీసీలు, ఏడుగురు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల చైర్మన్లతోపాటు 60కిపైగా ఎంపీసీటీలతో బలమైన స్థానిక ప్రజాప్రతినిధుల బలంతోపాటు గ్రామస్థాయి పార్టీ క్యాడర్ అందరూ కలిసికట్టుగా ఒక్కటిగా.. పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ ప్రకటించే అభ్యర్థి ఎవరైనా గెలుపుపై దృష్టి కేంద్రీకరించాలని గులాబీ శ్రేణులు నిర్ణయించాయి. అందుకోసం అవసరమైన కార్యాచరణను సిద్ధం చేస్తున్నాయి.
త్వరలో సీఎం బహిరంగ సభ? ఆరున్నరేండ్లుగా టీఆర్‌ఎస్ ప్రభుత్వం సాధించిన ప్రగతిని ప్రజలకు వివరించేందుకు హాలియాలో పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ బహిరంగ సభను నిర్వహించాలని నల్లగొండ జిల్లా నాయకులు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దృష్టికి తీసుకొచ్చారు. ఈ నెల 22 నుంచి 26 మధ్య బహిరంగ సభ నిర్వహించాలని కోరినట్టు సమాచారం. మరోవైపు మంగళవారం నాగార్జునసాగర్‌లో పార్టీ విస్తృతస్థాయి కార్యకర్తల సమావేశం నిర్వహించే అవకాశాలున్నట్టు తెలుస్తున్నది.