రాజకీయపార్టీల పుట్టుక, గమనం, గమ్యం.. ఎన్నికలు, ఓట్లు, సీట్లు, అధికారం అన్న చట్రంలోనే పరిమితమై పరిభ్రమిస్తుంది. అధికారం ఒక్కటే పరమావధిగా ఉండి, దాన్ని సాధించడం కోసం చేసే రాజకీయాలన్నీ చేస్తాయి. కానీ, టీఆర్‌ఎస్ పార్టీ, తరతరాల వలస సంకెళ్ల నుంచి తెలంగాణ విముక్తి పొందడానికి ఉద్యమ పార్టీగా ఉద్భవించి, ప్రజా ఉద్యమాన్ని నిర్మించి, ప్రజలతో పాలునీళ్లలా కలిసిపోయి ఎన్నో త్యాగాలకోర్చి, తన అంతిమ లక్ష్యమైన తెలంగాణను సాధించింది. వేలాది బలిదానాలతో సాధించుకున్న తెలంగాణ, అవకాశవాద రాజకీయాల చేతుల్లో చిక్కి విధ్వంసం కాకూడదన్న సంకల్పంతో తనను తాను పూర్తిస్థాయి రాజకీయపార్టీగా ప్రకటించుకొని, పొత్తిల్లలోని పసిబిడ్డను పెంచి, పెంపుజేసే కర్తవ్యాన్ని గుర్తెరిగి, ప్రజల ఆశీస్సులతో అధికారంలోకి వచ్చింది.
విధ్వంసంలోంచి విముక్తి వైపు తెలంగాణ సొంత పార్టీగా, ఇంటి పార్టీగా టీఆర్‌ఎస్ పార్టీ ఆవిర్భవించిన ఫలితమే తెలంగాణ అన్ని రంగాలలో అభివృద్ధిని సాధిస్తూ ఆత్మగౌరవ కేతనమై రెపరెపలాడుతుంది. ప్రాంతీయ పార్టీగా తన అస్తిత్వాన్ని బలంగా ప్రకటించుకుంటూ తనపైన ఇంకెవరో సుప్రీం పవర్ లేకుండా, ఒక బలమైన నాయకుడి చేతిలో సుభిక్షంగా, సురక్షితంగా ఉంటూ భవిష్యత్‌కు బాటలు వేసుకుంటుంది.
అధికారం రెండువైపులా పదునున్న కత్తి. అందినకాడికి దోచుకొని అంధకారం సృష్టించగలదు. ఆకాశమే హద్దుగా అభివృద్ధి లక్ష్యాలతో జన జీవితాల్లో వెలుగులు పూయించగలదు. ఇవ్వాళ టీఆర్‌ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండు టర్మ్‌లు పూర్తికాకుండానే సాధించిన విప్లవాత్మకమైన మార్పులు, విధ్వంసంలోంచి విముక్తి వైపు పడిన అడుగులు అద్దంలో ప్రతిబింబంలా తేటతెల్లంగా కనిపిస్తున్నాయి.
తెలంగాణ సాధించుకోవడానికి, తెలంగాణ సమాజాన్ని ఒక్కటి చేసి, బలమైన ఉద్యమాన్ని నిర్మించాల్సిన చారిత్రక అవసరంగా, కేసీఆర్ మేధో మథనంలోంచి, మేధావుల ఉద్యమకారుల అండదండలతో 2001 ఏప్రిల్ 27న టీఆర్‌ఎస్ పార్టీ ఏర్పడింది. అప్పటినుంచి ఇప్పటిదాకా, ప్రజా బలమే తన బలంగా, ప్రజల ఆకాంక్షలే తన విధానాలుగా, ప్రజల అభివృద్ధియే తన అంతిమ లక్ష్యంగా ముందుకుసాగుతుంది. ఈ ప్రగతికి కారకులు కేసీఆర్. ప్రజల కన్నీళ్లకు కారణం తెలిసినవాడు. కాళ్లరిగేలా తిరిగి వాళ్ల కష్టాలను కళ్ల జూసినవాడు. తెలంగాణ వెనుకబాటుతనానికి గల కార్యకారక సంబంధాలను పరిశోధించినవాడు. పరిష్కార మార్గంగా అనేక పథకాలను ప్రకటించినవాడు. ఆ పథకాల ఫలితాలను సాకారం చేసినవాడు, పార్టీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి కేసీఆర్. ప్రజలతో కలిసి నడిచిన నేతకే కష్టాల మూలం తెలుస్తుంది. కన్నీళ్లను తుడిచే మార్గం స్ఫురిస్తుంది. టీఆర్‌ఎస్ పార్టీ అవతరణ తెలంగాణ జన జీవితాల్లో పెనుమార్పులకు కారణమైంది. పార్టీ అంగాంగాలు ప్రజలైతే, ఆత్మ కేసీఆర్. అంకితభావం గల సైన్యంతో అనుకున్నది సాధించేవరకు అవిశ్రాంతంగా పోరాడుతున్న నేత.
నాయకుడి విజన్, వ్యూహాలే పార్టీ మనుగడకు తిరుగులేని బలం. స్వీయ రాజకీయ అస్తిత్వ నినాదంతో అధికారం చేపట్టిన నాటినుంచి, రాజకీయ సుస్థిరతతో ఇటు పార్టీని, అటు రాష్ర్టాన్ని పటిష్ఠ స్థితిలో ఉంచగలుగుతున్నారు. రాష్ర్టాన్ని పాలించే నేతగా, తెలంగాణ బతుకుచిత్రాన్ని విస్తృతంగా అధ్యయనం చేసి, సంపూర్ణంగా అవగాహన చేసుకొని, ఒక్కో రంగానికి ఒక్కో పథకాన్ని అమలుచేస్తూ ఫలితాలను ఆవిష్కరిస్తున్నారు కేసీఆర్. తెలంగాణలోని ఆయా వర్గాలకు అందని పథకం లేదు.ఆనందించని కుటుంబాలూ లేవు.
తెలంగాణ సొంత పార్టీగా, ఇంటి పార్టీగా టీఆర్‌ఎస్ పార్టీ ఆవిర్భవించిన ఫలితమే తెలంగాణ అన్ని రంగాలలో అభివృద్ధిని సాధిస్తూ ఆత్మగౌరవ కేతనమై రెపరెపలాడుతుంది. ప్రాంతీయ పార్టీగా తన అస్తిత్వాన్ని బలంగా ప్రకటించుకుంటూ తనపైన ఇంకెవరో సుప్రీం పవర్ లేకుండా, ఒక బలమైన నాయకుడి చేతిలో సుభిక్షంగా, సురక్షితంగా ఉంటూ భవిష్యత్‌కు బాటలు వేసుకుంటుంది. వలసవాదుల చేతుల్లో భంగపడి, దోపిడి వివక్షకు గురైన ప్రతి సందర్భాన్ని సమీక్షించుకొని స్వయం పాలనలో ఎంత స్వావలంబనతో ప్రగతిని సాధించవచ్చో టీఆర్‌ఎస్ పార్టీ నిరూపిస్తూ వస్తుంది. అమ్ముడుబోయే నాయకులను, ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టిన నాయకులను, ప్రజల ప్రయోజనాల కంటే తమ స్వీయ ప్రయోజనాలకే ప్రాధాన్యం ఇచ్చిన నాయకులను మనం చూశాం. కానీ, టీఆర్‌ఎస్ పార్టీలోని ప్రతీ నాయకుడు, అధినేత ఆలోచనలు, ఆశయాలకు అనుగుణంగా, పార్టీ ఆదేశాలకు విధేయులుగా నడుచుకుంటూ, నిత్యం క్షేత్రస్థాయిలో ఉంటూ ప్రజలతో మమేకమవుతున్నారు. ప్రజల కష్టసుఖాల్లో భాగం పంచుకుంటున్నారు. ఇది పార్టీ ఔన్నత్యానికి, నాయకుడి సామర్థ్యానికి నిదర్శనం.
ప్రజల జీవితాలను శాసించేవి రాజకీయాలే. ఆ రాజకీయాలు ఎంతగా ప్రజాక్షేమానికి అంకితమై ఉంటాయో అంత ఆదరణను పొందుతాయి. అందుకు ఆయా పార్టీల నాయకుల నాయకత్వ పటిమ, పార్టీ సిద్ధాంతాలు, క్రమశిక్షణ గల క్యాడర్, మేధావుల భాగస్వామ్యం, ప్రజల ఆదరాభిమానాలు అన్నీ కారకాలవుతాయి. ఈ అన్ని బలాల మేళవింపుగా నేడు టీఆర్‌ఎస్ పార్టీ ఇతర పార్టీల కంటే ఆకాశమంత ఎత్తులో ఉంది. అనేక పార్టీలు అనేకవిధాలుగా అభూత కల్పనలతో బద్నాం చేయాలని ప్రయత్నించిన ప్రతీసారీ భంగపడుతూనే ఉన్నాయి. సాధించిన ప్రగతి సాదృశ్యంగా కళ్లముందే కనిపిస్తున్న సందర్భంలో, పనిగట్టుకొని చేస్తున్న పసలేని విమర్శలన్నీ నీటిబుడగల్లా పేలిపోతున్నాయి. గాలిమబ్బుల్లా తేలిపోతున్నాయి.
టీఆర్‌ఎస్ ఆవిర్భావమే త్యాగాల చరితగా ఆరంభమైంది. పదవులు, వ్యక్తిగత జీవితాలు, ఆస్తులు త్యాగం చేసి, పార్టీని కాపాడుకున్న ఫలితం వల్లనే తెలంగాణ ఉద్యమం వీగిపోకుండా, ఉద్యమశక్తులు జారిపోకుండా, అంతిమలక్ష్యమైన రాష్ట్ర అవతరణను కళ్ల చూడగలిగాం. టీఆర్‌ఎస్ పార్టీ పుట్టుకకు, దాని ఎదుగుదలకు సైద్ధాంతిక బలానికి ఎన్ని ప్రగతిశీల శక్తులు అండగా నిలిచాయో, ఎన్ని పోరాటశక్తులు కలిసి నడిచాయో! ఎన్ని ఉద్ధాన పతనాలు చవిచూసినా, ఎంతటి ప్రజాదరణో తోడవగా ఇక్కడిదాకా నడిచివచ్చింది. ఇప్పటికీ చెక్కుచెదరని విశ్వాసాన్ని కూడగట్టుకొని మేరుశిఖరంగా నిలిచింది. దీన్ని కాపాడుకోవలసిన బాధ్యత నాయకుడి నుంచి కిందిస్థాయి కార్యకర్త వరకు అందరిపైనా ఉంటుంది. అందుకే కేసీఆర్ ప్రతి పార్టీ మీటింగ్‌లోనూ, ప్రజల ఆదరణ లేకుంటే పార్టీ ఉనికి లేదనీ, నిత్యం ప్రజల్లో ఉండాలని, ప్రజల సమస్యల పట్ల సత్వరమే స్పందించాలనీ, నాయకులుగా కాకుండా, సేవకులుగా పేరు తెచ్చుకోవాలనీ హితబోధ చేస్తుంటారు.
ప్రజల్లో గందరగోళాన్ని సృష్టించేవారు, పచ్చి అద్ధాలను ప్రచారం చేసేవాళ్లు, వాస్తవాలను వక్రీకరించేవాళ్లు, మన పక్కనే పొంచి ఉంటారు. కులాలు, మతాలు, వర్గాల పేరుతో చిచ్చుపెట్టే వాళ్లుంటారు. అమాయక ప్రజలను రెచ్చగొట్టే వాళ్లుంటారు. అధికార లాలసతో అసత్యాలపై ఆధారపడుతూ, అభివృద్ధిని కూడా అడ్డుకోవడానికి అడ్డదారులు తొక్కుతారు. ఇలాంటి సందర్భాల్లోనే నాయకుడి విజన్‌ను, పార్టీ విధానాలను అమలవుతున్న పథకాలను, సాధించిన ప్రగతిని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకుపోయి ప్రజలకు సరైన అవగాహన కల్పించాల్సిన బాధ్యత ప్రతి కార్యకర్తపై ఉంటుంది.
పరాధీనత నుంచి స్వయం పాలన వైపు సాగిన సుదీర్ఘ పోరాటంలో టీఆర్‌ఎస్ పార్టీ పాత్ర చరిత్రలో నమోదైంది. సకలజనుల వికాసం, సాంకేతిక ప్రగతి, విద్య, ఆరోగ్యం, శాంతియుత సహజీవన వాతావరణం రాజకీయ సుస్థిరత, వేగవంతమైన అభివృద్ధి, వినూత్న ఆలోచనలు కలిగిన నాయకుని, విశ్రాంతి లేని శ్రమ ఫలితంగా, పార్టీ సాధించుకున్న విజయాలు. శిథిలాల్లోంచి చిగురించిన చిరు మొలకలా ఆరంభమైన పార్టీ నేడు వటవృక్షమై తెలంగాణ అంతటా విస్తరించింది. దీన్ని పదికాలాలు కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిది. (వ్యాసకర్త: శాసనమండలి సభ్యులు) నారదాసు లక్ష్మణ్‌రావు