Bharat Rashtra Samithi

Bharat Rashtra Samithi

KCR
telangana talli img

రాష్ట్ర వ్యవసాయానికి పునరుజ్జీవం

చిన్న, సన్నకారు రైతులతో కూడి ఉన్న తెలంగాణ వ్యవసాయరంగం ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలతో పూర్తిగా స్వరూప స్వభావాలను మార్చుకోనున్నది. ఆరు దశాబ్దాలుగా సంక్షోభంలో చిక్కుకుపోయిన వ్యవసాయరంగం కొత్తపుంతలు తొక్కనున్నది. దీనికి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్లీనరీ సెషన్‌లో రైతులకు నేరుగా పెట్టుబడి సహాయం అందించాలని తీసుకున్న చరిత్రాత్మక నిర్ణయం వ్యవసాయానికి ఊతమివ్వనున్నది. గిట్టుబాటు ధరలులేక, తక్కువ దిగుబడులతో అప్పుల పాలైన రైతులు కేసీఆర్ విధానాలతో గట్టెక్కనున్నారు.ప్రభుత్వం నిత్యనూతనంగా ఆలోచించి సమగ్ర, సంతులిత వ్యవసాయ విధానాలను అవలంబించాలి. ప్రజావసరాలను తీరుస్తూ ప్రజలను అభివృద్ధి మార్గంలో పయనింపజేయాలి. ఇదే నేటి అవసరం. ఇది ప్రభుత్వం, ప్రజలు సమిష్టిగా కలిసి నడువాల్సిన బాట. అనుసరించాల్సిన వ్యవసాయ విధానం.

ముఖ్యమంత్రి విధానాలతో రైతులు అధిక దిగుబడులు సాధించి ఇన్నాళ్లుగా ఎదుర్కొంటున్న సమస్యలకు దూరమవుతారు. వ్యవసాయరంగంలో వస్తున్న ఈ మార్పులు ఆహారభద్రతకు, రైతుల స్వయంసమృద్ధికి బాటలు వేయనున్నా యి. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పథకాల వల్ల చిన్న, సన్నకారు రైతులతో పాటు సమస్త గ్రామీణ సమాజం ఎంతో లబ్ధి పొందనున్నది.

ఈ నేపథ్యంలో మన వ్యవసాయంరంగాన్ని పరిశీలిస్తే- గ్రామీణ వ్యవసాయరంగమంతా పూర్తిగా సహజ వనరులపైనే ఆధారపడి ఉన్నది. అలాగే ప్రజల ఆహార అవసరాలను తీర్చేదిగా, ఆహారభద్రతకు హామీగా ఉంటున్నది. వ్యవసాయంలో అంతర్భాగంగా ఉన్న భూమి, నీరు, గాలి, జీవవైవిధ్యం, పంటల వైవిధ్యం లాంటివన్నీ పాటించినప్పుడే వ్యవసాయరంగం సుస్థిరంగా ఉంటుంది. కానీ కొన్ని దశాబ్దాలుగా పాలకులు అనుసరించిన విధానాల ఫలితంగా వ్యవసాయరంగం పూర్తిగా గతితప్పి విధ్వంసమైంది. దీంతో ప్రకృతి, సహజ వనరులపై తీవ్రమైన ప్రతికూల ప్రభావం పడింది. కాలుష్యం పెరిగింది. భూసారం తగ్గి పంటల దిగుబడి తగ్గిపోయింది. దీంతో అన్నపూర్ణగా ఉండాల్సిన గ్రామాలు ఆకలికి ఆలవాలంగా మారిపోయాయి. వవసాయరంగానికి ఊతమిచ్చే వనరు లు ధ్వంసమైపోయాయి. ఈ క్రమంలో గ్రామీణ వ్యవసాయం పూర్వవైభవం సంతరించుకోవాలంటే బహుముఖ కార్యాచరణ అవసరం. రైతులను నష్టాల బారినుంచి రక్షించి, ప్రజలను ఆహారకొరత కోరల్లోనుంచి విముక్తి కలిగించాలి. ఈ కర్తవ్యాలు నెరవేరాలంటే ద్విముఖంగా కృషి జరుగాల్సిన అవసరముంది. రైతును అన్నిరకాలుగా ఆర్థికంగా బలోపేతం చేస్తూనే, ఆహారభద్రత దిశగా అడుగులు వేయాల్సి ఉన్నది.

ఈ క్రమంలో ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు వ్యవసాయరంగానికి పూర్వ వైభవం తెచ్చేందుకు ఉపకరిస్తాయి. మిషన్‌కాకతీయ, హరితహారం, భూసార పరీక్షలు, సేంద్రియ ఎరువుల వినియోగం, పంటల వైవిధ్యంలాంటివన్నీ తెలంగాణ వ్యవసాయరంగానికి జీవం పోస్తున్నా యి. అలాగే శాస్త్ర, సాంకేతికరంగాల అభివృద్ధిని వ్యవసాయరంగంలో వినియోగించుకోవాల్సి ఉన్నది. ఇలాంటి నిర్మాణాత్మక కార్యక్రమాలతో నే మన భవిష్యత్ అవసరాలు తీరుతాయి. ఇక రెండో అంశంగా చూస్తే-వ్యవసాయరంగానికి తోడు ఉద్యానవనం కూడా తోడవ్వాలి. పశువులు, ఇతర జీవాల పెంపకం, చేపల పెంపకం లాంటివన్నీ గ్రామీణ వ్యవసా యరంగానికి అనుబంధంగా అభివృద్ధి చెందినప్పుడే రైతు ఆర్థికంగా నిలదొక్కుకుంటాడు, బలోపేతమవుతాడు. కానీ గ్రామీణ వ్యవసాయరంగానికి చిన్న కమతాలు తీవ్ర ప్రతిబంధకంగా ఉన్నాయి. దీనికితోడు కావలసిన పెట్టుబడుల కొరత, శాస్త్ర, సాంకేతిక రంగాల వినియోగం కనిష్ఠ స్థాయిలో ఉండటం కూడా రైతుకు భారంగా తయారయ్యాయి.

దీంతో గ్రామీణ చిన్న, సన్నకారు రైతాంగమంతా తీవ్రమైన సంక్షోభంలో కూరుకుపోయింది. ఇలాంటి పరిస్థితిని అధిగమించేందుకు సీఎం కేసీఆర్ గ్రామీణస్థాయి నుంచి రైతు సంఘాలను ఏర్పాటుచేసి వ్యవసాయ ఉత్పత్తుల ధరలను నిర్ణయించే అధికారం రైతుల చేతుల్లో ఉండేట్లు చర్యలు తీసుకుంటున్నారు. అలాగే క్రాప్ కాలనీల ఏర్పాటుతో వ్యవసాయ ఉత్పత్తులకు మార్కెట్‌లో గిట్టుబాటు ధరలు వచ్చేందుకు అవకాశం ఏర్పడుతుంది. ఈ క్రమంలో వ్యవసాయ ఉత్పత్తిదారుల మధ్య అనారోగ్యకర పోటీ స్థానంలో అనుసంధాన విధాన ప్రక్రియ నెలకొనాలి. దీంతో మార్కెట్ మాయాజాలం నుంచి రైతులను దూరంచేసి గిట్టుబాటు ధర లు రావటానికి అవకాశం ఉంటుంది. ఈ దిశగా రైతులను నియమబద్ధ పంట విధానాలను అనుసరించేలా ప్రోత్సహించాలి. దీనికిగాను వ్యవసాయదారులకు వ్యవసాయ శాస్త్రవేత్తల సాయం ఎల్లప్పుడూ అవసరం. వీరి సాయంతో అవసరమైన, నాణ్యమైన పంటలు సాగుచేస్తారు. తద్వా రా మార్కెట్ ఒడిదొడుకుల నుంచి గట్టెక్కవచ్చు. ఈ విధమైన ఉత్తమ ఫలితాలు సాధించాలంటే రైతు సమాఖ్యలు, రైతు ఉత్పత్తిదారుల సం ఘాలు, కో-ఆపరేటివ్ సొసైటీలు ఉమ్మడిగా కలిసి పనిచేస్తే రైతులు ఎదుర్కొంటున్న అనేకానేక సమస్యలను దూరం చేయవచ్చు.

మూడోదిగా చెప్పుకుంటే- దేశంలో, రాష్ట్రంలో చాలావేగంగా నగరీకరణ జరిగిపోతున్నది. గ్రామాల నుంచి పెద్దఎత్తున పేద ప్రజలు, నిరు ద్యోగులు నగరాలకు వచ్చి చేరుతున్నారు. దీంతో ఆహారధాన్యాల అవసరం రానురాను పెరిగిపోతున్నది. ఈ క్రమంలోనే తలసరి ఆదాయం కూడా పెరుగుతున్నది. తలసరి ఆదాయ పెరుగుదలతో జీవనవిధానం లో గణనీయ మార్పులు సంతరించుకుంటున్నాయి. నవనాగరిక పోకడలు సర్వసాధారణమైపోతున్నాయి. ఈ నేపథ్యంలో ఆహారప దార్థాల మార్కెట్‌లోకి అంతర్జాతీయ బహుళజాతి సంస్థలు చొరబడుతున్నాయి. దీంతో ప్రజల ఆహారపు అలవాట్లలో తీవ్రమైన మార్పులు సంభవించటమే కాకుండా, మంచి నాణ్యమైన, పౌష్టికాహారం అందరికి అందుబాటులో లేకుండా పోతున్నది. ఆహార లభ్యతలో తీవ్ర వ్యత్యాసం నెలకొంటున్నది. ఈ క్రమంలోనే తీవ్రమైన ఆహారపదార్థాల దుర్వినియోగం ఒక పక్కన ఉంటే ఆకలి మంటలు మరో పక్కన సహవాసం చేసే స్థితి ఉంటున్నది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలందరికీ ఆహార కొరతను తీర్చే పథకా లు అత్యవసరం. మరోవైపు ప్రజారోగ్యం అనేది కూడా ప్రజలకు అందుబాటులో ఉండే ఆహారపదార్థాలపై ఆధారపడి ఉంటుందన్నది జగమెరిగిన సత్యమే. మంచి పోషకాలతో ఉన్న ఆహారం అందరికి అందుబాటు లో లేకుంటే ప్రజలు రోగాల బారిన పడే పరిస్థితులు ఉంటాయి. కాబట్టి అందరికీ మంచి పౌష్టికరమైన ఆహారం అందించేందుకు అనేకరకాల పథకాలు తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. దీనికి విద్యార్థులకు సన్నబియ్యం పథకం మొదలు గ్రామీణ గర్భిణీ స్త్రీలకు పోషకాలు అందించే ఆహారాన్ని అందించే పథకాలను చెప్పుకోవచ్చు.

గ్రామీణ ప్రజలు ముఖ్యంగా రైతులు ఆహార పదార్థాలను దుర్వినియోగం చేయకుండా ఎలా ఆహారాన్ని పవిత్రంగా భావిస్తారో అదంరికీ తెలిసిందే. కాబట్టే రైతులు ఏ పరిస్థితుల్లోనూ ఆహార కల్తీకి పాల్పడరు. అలా ఆహారాన్ని కల్తీ చేయడాన్ని అనైతికమైన చర్యగా భావిస్తారు. అలా ఎవరు పాల్పడినా దాన్ని తీవ్రంగా పరిగణిస్తారు. అసహ్యించుకుంటారు. కాబట్టి ఆహార కల్తీ నియంత్రణ కోసం ప్రజలు, ప్రభుత్వం కలిసి ఉమ్మడిగా ఎదుర్కోవాలి. ఈ క్రమంలోంచే నగరాలు, పట్టణాల్లోని ప్రజలకు మంచి నాణ్యమైన ఆహారం అందించగలుగుతాం. ఇలా ప్రజావసరాల ను గుర్తించి తీర్చే పనిని గ్రామాలనుంచి ప్రణాళికాబద్ధగా సమిష్టి అవగాహనతో చేసినప్పుడు పట్టణ ప్రాంత ప్రజల ఆహార అవసరాలు తీరుతాయి. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు వస్తాయి.

సీఎం కేసీఆర్ చేపడుతున్న పథకాల ప్రయోజనం నెరవేరాలంటే వాటి అమలు విషయంలో ప్రత్యేక శ్రద్ధ, నైపుణ్యాలు అత్యవసరం. ముఖ్యంగా వ్యవసాయ క్రాప్‌కాలనీల ఏర్పాటు, ఆహార విధానం లాంటివన్నీ ప్రణాళికాబద్ధంగా కొన్ని ప్రాంతాల్లో అమలుచేసి వాటి ఆదర్శంగా రాష్ట్రవ్యాప్తంగా విస్తరించాలి. పర్యావరణాన్ని, ఆహారవిధానానికి అనుగుణంగా తీర్చిదిద్దాలి. అధికోత్పత్తి అనేది ఎరువుల వాడకాన్ని ఎక్కువచేసి పర్యావరణానికి హానికరంగా మార్చివేయరాదు. పర్యావరణ పరిరక్షణకు అనుకూలమైన విధానాలతోనే అధికోత్పత్తిని సాధించి ఆహారభద్రతకు భరోసా కల్పించాలి. జనాభా పెరుగుదలతో ఏర్పడుతున్న ఆహార కొరతకు ఆధునిక వ్యవసాయిక విధానాలతోనే ఎదుర్కోవాలి. ప్రతి ఒక్కరి అభివృద్ధిలోనే సమాజ సమగ్రాభివృద్ధి ఇమిడి ఉన్నదని గుర్తించి కార్యాచరణకు పూనుకోవాలి. దీనికోసం ప్రభుత్వం నిత్యనూతనంగా ఆలోచించి సమగ్ర, సంతులిత వ్యవసాయ విధానాలను అవలంబించాలి. ప్రజావసరాలను తీరుస్తూ ప్రజలను అభివృద్ధి మార్గంలో పయనింపజేయాలి. ఇదే నేటి అవసరం. ఇది ప్రభుత్వం, ప్రజలు సమిష్టిగా కలిసి నడువాల్సిన బాట. అనుసరించాల్సిన వ్యవసాయ విధానం. -(వ్యాసకర్త: శాసనసభసభ్యులు, వేములవాడ)

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the BRS Party.