-పార్టీ సభ్యత్వ నమోదులో దూసుకెళ్లాలి -టీఆర్‌ఎస్ సభ్యత్వాలపై మంత్రులు, ఎమ్మెల్యేలు -నియోజకవర్గాలవారీగా ప్రజాప్రతినిధుల పట్టు
పార్టీ సభ్యత్వ నమోదులో గత రికార్డును బ్రేక్ చేసి టీఆర్‌ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ మెప్పు పొందేందుకు మంత్రులు, ఎమ్మెల్యేలు పోటీపడుతున్నారు. రెండేండ్ల క్రితం తమతమ నియోజకవర్గాల్లో చేసిన సభ్యత్వాలను ఈసారి అధిగమించాలనే పట్టుదలతో ఉన్నారు. ఇందుకు గ్రామాలు, మండలాలవారీగా కార్యాచరణ రూపొందించుకొన్నారు. గ్రామస్థాయి నుంచి నియోజకవర్గస్థాయి వరకు పార్టీ అనుబంధ సంఘాల సభ్యులు స్థానిక ప్రజాప్రతినిధులతో మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రత్యేక సమావేశా లు నిర్వహిస్తున్నారు.
ఈ నెల 7న తెలంగాణభవన్‌లో టీఆర్‌ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ పార్టీ సభ్యత్వ నమోదుపై దిశానిర్దేశం చేసిన తర్వాత దీనిపై దృష్టి సారించారు. వార్డు, ఎంపీటీసీ సభ్యులు మొదలుకొని సర్పంచ్, ఎంపీపీ, జడ్పీటీసీ, కౌన్సిలర్లు, కార్పొరేట ర్లు, కార్పొరేషన్ చైర్మన్ల బాధ్యులతో సమావేశమై ప్రత్యేక కార్యాచరణను సిద్ధం చేసుకొన్నారు. 15 రోజుల్లో సభ్యత్వ నమోదును పూర్తిచేయాలని, గతంలో మాదిరిగా ఈసారి గడువు పెంచే ప్రసక్తేలేదని అధినేత కేసీఆర్ తేల్చిచెప్పిన నేపథ్యంలో గులాబీ శ్రేణులం తా సభ్యత్వ నమోదుపై దృష్టి కేంద్రీకరించారు. ఈ ప్రక్రియను ఏ రోజుకారోజు పర్యవేక్షించేందుకు 119 నియోజకవర్గాలకు రాష్ట్ర కార్యదర్శులు, జిల్లాలవారీగా పార్టీ ప్రధాన కార్యదర్శులను ఇంచార్జీలుగా నియమించారు. తెలంగాణభవన్ నుంచి సమన్వయం చేయటానికి రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్సీలు ప్రొఫెసర్ శ్రీనివాస్‌రెడ్డి, శేరీ సుభాష్‌రెడ్డిని నియమించారు.
క్రియాశీల సభ్యత్వాలపై దృష్టి పార్టీ సాధారణ, క్రియాశీల అనే రెండు క్యాటగిరీల సభ్యత్వాల్లో ఈసారి క్రియాశీల సభ్యత్వాలపై ఎమ్మెల్యేలు దృష్టి సారించారు. మన రికార్డును మనమే బ్రేక్ చేసుకోవాలి.. మనకెవ్వరూ పోటీలో ఉండకూడదు అని సభ్యత్వ నమోదును మంత్రులు ప్రతిష్ఠాత్మకంగా తీసుకొన్నట్టు తెలుస్తున్నది. క్రియాశీల సభ్యత్వాలు పొందిన కార్యకర్తలకు ఈసారి ప్రత్యేక గుర్తింపు కార్డులు ఇస్తామని గురువారం హుజూరాబాద్ విస్తృతస్థాయి కార్యకర్తల సమావేశంలో మంత్రి ఈటల రాజేందర్ పేర్కొనడం, ఖమ్మం జిల్లాలో ఏర్పాటుచేసిన సమావేశంలో మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ ‘సభ్యత్వాల్లో రాష్ట్రంలో మనమే నంబర్ వన్‌గా ఉండాలి’ అని పిలుపునివ్వడం ద్వారా గతంలో కన్నా ఈసారి అధినేత నిర్దేశించిన దానికంటే అధికంగా సభ్యత్వాలు నమోదయ్యే అవకాశాలున్నాయని ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.
సభ్యత్వ రుసుము సాధారణ సభ్యత్వం: రూ. 30 క్రియాశీల సభ్యత్వం: రూ.100 (ఎస్సీ, ఎస్టీలకు రూ.50)