-సీఎం కేసీఆర్ నిర్ణయం మేరకు నడుచుకుంటాం
-కార్యకర్తల కృషి ఫలితమే ఈ విజయం
-మీడియా సమావేశాల్లో ఎంపీలు నామా, మాలోత్ కవిత, రాములు
పార్లమెంట్ ఎన్నికల్లో తమను గెలిపించిన ప్రజలకు రుణపడి ఉంటామని ఖమ్మం, మహబూబాబాద్, నాగర్‌కర్నూల్ ఎంపీలు నామా నాగేశ్వరరావు, మా లోత్ కవిత, పీ రాములు స్పష్టం చేశారు. శుక్రవారం వారు ఆయా జిల్లా కేంద్రాల్లో మీడియా తో మాట్లాడుతూ.. తమ విజయం వెనుక కార్యకర్తల కృషి ఎంతో ఉన్నదని స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ సూచనలకు అనుగుణంగా నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తామన్నారు.సీఎం కేసీఆర్ ఆదేశాలే శిరోధార్యం: నామాటీఆర్‌ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ఏది ఆదేశిస్తే అది చేయడమే తన కర్తవ్యమని ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు అన్నారు. ఖమ్మంలోని తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. పార్టీ విధానాలను అమలు చేయడం, అధినేత చెప్పింది చేయడమే తాను నేర్చుకున్నానన్నారు. ఖమ్మం నుంచి టీఆర్‌ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన తనను అత్యధిక మెజార్టీతో గెలిపించిన నియోజకవర్గ ప్రజలకు రుణపడి ఉంటానన్నారు. ఇది తన ఒక్కడి గెలుపు కాదని టీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు, నియోజకవర్గ ప్రజల గెలుపుగా అభివర్ణించారు. తన గెలుపు ద్వారా సీఎం కేసీఆర్ నిర్ణయాన్ని జిల్లా ప్రజలే బలపరిచారని, ఉమ్మడి జిల్లాలో ఆరున్నర లక్షల ఎకరాలకు సాగునీరు అందించే సీతారామ ఎత్తిపోతల పథకాన్ని త్వరితగతిన పూర్తిచేసేలా కృషి చేస్తానన్నారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యే కొండబాల కోటేశ్వరరావు, ప్రముఖ వ్యాపార వేత్త వద్దిరాజు రవిచంద్ర, ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పిడమర్తి రవి, ఖమ్మం మేయర్ జీ పాపాలాల్ తదితరులు పాల్గొన్నారు.
సీఎం కేసీఆర్ గిరిజనుల గుండెల్లో ఉన్నారు..
ఆదివాసీ గిరిజనులు సీఎం కేసీఆర్‌ను హృదయాల్లో నింపుకొన్నారని ఎమ్మెల్సీ, మహబూబాబాద్ పార్లమెంట్ ఎన్నికల ఇంచార్జి సత్యవతి రాథోడ్ అన్నారు. శుక్రవారం మానుకోటలోని ఎంపీ మాలోత్ కవిత నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, ఎంపీ మాలోత్ కవితతో కలిసి ఆమె మాట్లాడారు. సీఎం కేసీఆర్ మహబూబాబాద్ నియోజకవర్గ ఎంపీ టికెట్ ఇస్తూ.. మీరు తప్పక విజయం సాధిస్తారు అని ఆశీర్వదించినట్టుగానే మహబూబాబాద్ ప్రజలు ఆశీర్వదించి 1,46,663 వేల మెజార్టీని కట్టబెట్టారన్నారు. కవిత విజయానికి పూర్తిస్థాయిలో సహకరించిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, పార్టీ కార్యకర్తలందరికీ కృతజ్ఞతలు తెలిపారు.
సంక్షేమ పథకాలే గెలిపించాయి: రాములు రాష్ట్రంలో సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తాయని, ఈ పథకాలే టీఆర్‌ఎస్ ఎంపీల గెలుపునకు సోపానంగా నిలిచాయని నాగర్‌కర్నూల్ ఎంపీ పోతుగంటి రాములు అన్నారు. శుక్రవారం నాగర్‌కర్నూల్ జిల్లా వెల్దండలో మీడియాతో మాట్లాడారు. సీఎం కేసీఆర్ సహకారంతో కేంద్రం నుంచి వచ్చే నిధులను సక్రమంగా వినియోగిస్తామన్నారు. సీఎం కేసీఆర్ వల్లే నాగర్‌కర్నూల్ ప్రజలకు సేవ చేసే భాగ్యం కలిగిందన్నారు. తన గెలుపు కోసం కృషి చేసిన మంత్రి నిరంజన్‌రెడ్డి, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, నాయకులు,కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు.