రైతు సమన్వయ సమితుల ఏర్పాటుకు శ్రీకారం -గ్రామ, మండల, జిల్లాల వారీగా ఏర్పాటు -సెప్టెంబర్ 9నాటికి పూర్తిచేయాలని నిర్ణయం -సమితుల స్వరూపంపై మార్గదర్శకాలు జారీ -ప్రతి సమన్వయ సమితికి ఒక కో-ఆర్డినేటర్ -రాష్ట్ర రైతు సమన్వయ సమితి -సభ్యుల ఎంపికను పర్యవేక్షించనున్న సీఎం కేసీఆర్! -సమితులకు నోడల్ ఏజెన్సీగా వ్యవసాయశాఖ -రాష్ట్రస్థాయిలో నోడల్ అధికారిగా వ్యవసాయశాఖ కమిషనర్ -జిల్లాస్థాయిలో నోడల్ అధికారిగా కలెక్టర్
అన్నదాతలకు దన్నుగా నిలిచేందుకు రైతు సమన్వయ సమితుల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. రైతులను సంఘటితం చేయడంలో కీలకమైన ముందడుగు వేసింది. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఆలోచనలకు అనుగుణంగా గ్రామ, మండల, జిల్లా, రాష్ట్రస్థాయి రైతు సమన్వయ సమితుల ఏర్పాటు, ఇందులో సభ్యుల సంఖ్య, ఎంపిక విధానం తదితర కీలక అంశాలతో ప్రభుత్వం ఆదివారం ఉత్తర్వులు జారీచేసింది. గ్రామస్థాయి నుంచి జిల్లాస్థాయి రైతు సమన్వయ సమితి సభ్యులు, కో-ఆర్డినేటర్ సభ్యుడిని నామినేటెడ్ పద్ధతిలో ఖరారు చేసే బాధ్యతను ఆయా జిల్లాలవారీగా ఇంచార్జీ మంత్రులకు అప్పగించారు. ఇంచార్జీ మంత్రుల పేర్లను సైతం జీవోలో పేర్కొన్నారు. ఈ మొత్తం ప్రక్రియను సెప్టెంబర్ 9నాటి కి పూర్తిచేయాలని ఉత్తర్వుల్లో సూచించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిననాటి నుంచి రైతు సంక్షేమం కోసం తీసుకున్న అన్ని చర్యలను, రైతు సమగ్ర సర్వే తీరుతెన్నులు, ఎకరానికి ప్రతి సీజన్‌లో రూ.4వేల పెట్టుబడి, ప్రస్తుతం అత్యంత కీలకమైన రైతు సమితుల ఏర్పాటు అంశాలను జీవోలో వివరించారు. గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు సమితుల్లో ఎంతమంది సభ్యులు ఉండాలన్న అంశాన్ని సీఎం కేసీఆర్ ఖరారు చేశారు. జిల్లా రైతు సమన్వయ సమితుల సమాహారంగా ఏర్పాటుచేయనున్న రాష్ట్ర రైతు సమన్వయ సమితి సభ్యుల ఎంపికను స్వయంగా ముఖ్యమంత్రి పర్యవేక్షిస్తారని వ్యవసాయశాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. రాష్ట్ర రైతు సమన్వయ సమితి వద్ద రూ.500కోట్ల మూలనిధి ఏర్పాటు చేయనున్నారు. కనీస మద్దతు ధర విషయంలో రైతులకు ఇబ్బందులు తలెత్తినప్పుడు ఈ నిధులను రాష్ట్ర రైతు సమన్వయ సమితి వినియోగించుకునే వీలు కల్పించారు.
ప్రతి సీజన్‌కు రూ.4వేల పెట్టుబడి వ్యవసాయానికి పెట్టుబడి పథకం కింద రాష్ట్రంలోని ప్రతి రైతుకు ప్రతి సీజన్‌లో ఎకరానికి రూ.4వేలు పెట్టుబడి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ మొత్తాన్ని విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు ఇతర పెట్టుబడికి రైతులు వినియోగించుకునేలా ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. ఈ పథకాన్ని 2018-19 ఏడాది నుంచి అమల్లోకి తెచ్చేందుకు వేగంగా ముందుకు సాగుతున్నది. వానాకాలంతోపాటు యాసంగి పంటవేసే రైతులకు ప్రతి ఎకరాకు రూ.4వేల పెట్టుబడి ఇవ్వనున్నారు. సాధారణ పంటలతోపాటు ఉద్యాన పంటలు పండించే అన్నదాతలకు కూడా ఈ పథకం వర్తిస్తుందని ఉత్తర్వుల్లో స్పష్టంచేశారు.
రైతు సమగ్ర సర్వేతో తుది రూపు సీఎం కేసీఆర్ దిశానిర్దేశంలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రైతుల సంఖ్య, సాగుచేస్తున్న పంటల వివరాల సేకరణకు వ్యవసాయశాఖ రైతు సమగ్ర సర్వే ప్రారంభించింది. ఈ ఏడాది మే నుంచి జూలై వరకు వ్యవసాయ విస్తరణ అధికారులంతా ప్రతి రైతు ఇంటికి వెళ్లి వివరాలు సేకరించారు. కొన్ని ప్రాంతాల్లో రెవెన్యూపరంగా సమస్యలు వెలుగుచూశాయి. ఈ నేపథ్యంలో రెవెన్యూ, వ్యవసాయశాఖ ఉన్నతాధికారులతో సీఎం కేసీఆర్ పలు దఫాలుగా సమావేశాలు నిర్వహించి సమస్యల పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై సూచనలు చేశారు. వ్యవసాయ, రెవెన్యూ అధికారుల సమన్వయంతో గ్రామసభలు నిర్వహించి.. రైతులకు సంబంధించిన భూముల వివరాలను సేకరించారు. వీటి ఆధారంగా రైతు సమన్వయ సమితులను ఏర్పాటు చేయనున్నారు.
రైతుకు దన్నుగా ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచే సీఎం కేసీఆర్ నాయకత్వంలో అనేక రైతు సంక్షేమ నిర్ణయాలతో ప్రభుత్వం ముందుకు వెళుతున్నది. ఓ వైపు సాగునీటి సమస్యకు పరిష్కారం చూపుతూనే దిగుబడి పెంపు, పంటలకు గిట్టుబాటు ధర కల్పించడం, మార్కెట్ సదుపాయాలు పెంచేలా సీఎం కేసీఆర్ అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నారు. -రుణమాఫీ అమలుతో రైతులకు అప్పుల బాధ నుంచి విముక్తి కల్పించారు. -ఉత్పాదకతను పెంచి గిట్టుబాటు ధర కల్పించారు. -భారీ, మధ్యతరహా, చిన్ననీటిపారుదల రంగాల అభివృద్ధి కోసం పెద్దఎత్తున పెట్టుబడులు పెట్టారు -వ్యవసాయానికి 24 గంటల ఉచిత కరెంటు సరఫరా చేస్తున్నారు. -క్రాప్ కాలనీలను ప్రోత్సహిస్తున్నారు. -సూక్ష్మసేద్యానికి ప్రోత్సాహం అందిస్తున్నారు. -గోదాములను నిర్మించి పెద్దఎత్తున పంటల నిల్వకు అవకాశం కల్పించారు. -పాలీహౌస్‌లను ప్రోత్సహిస్తున్నారు. -వ్యవసాయంలో ఆధునిక పద్ధతులకు ప్రోత్సాహం అందిస్తున్నారు. -ప్రతి ఐదువేల ఎకరాలకు ఒక వ్యవసాయ విస్తరణ అధికారి (ఏఈవో)ని నియమించడం ద్వారా రైతులకు సమయానుగుణంగా విత్తనాలు, ఎరువుల పంపిణీ చేపడుతున్నారు. -వ్యవసాయంలో యాంత్రీకరణను ప్రోత్సహిస్తున్నారు. -ఈ-నామ్, మార్కెట్ సంస్కరణలు చేపట్టారు. -ఇప్పుడు రైతు సమన్వయ సమితుల ఏర్పాటుతో రైతుల్లో మరింత ఆత్మస్థైర్యం నింపాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు.
సమన్వయ సమితిలో చేరే అన్నదాతలకు ఉండాల్సిన అర్హతలు -గ్రామంలో నివాసం ఉంటూ పట్టా భూమిలో వ్యవసాయం చేస్తున్న రైతులకే గ్రామ రైతు సమన్వయ సమితిలో సభ్యుడిగా ఉండేందుకు అర్హత ఉంటుంది. -సమితి సభ్యుల్లో 1/3 వంతు మంది మహిళా రైతులు తప్పక ఉండాలి. -సమితి సభ్యుల్లో గ్రామంలోని అన్ని సామాజికవర్గాలకు చెందిన రైతులకు ప్రాధాన్యం ఉండాలి. -గ్రామ, మండల, జిల్లా, రాష్ట్రస్థాయి రైతు సమన్వయ సమితి సభ్యుల్లో ఒక కో-ఆర్డినేటర్‌ను ప్రభుత్వం నామినేషన్ పద్ధతిలో ఎంపికచేస్తుంది. -రైతు సమన్వయ సమితులకు వ్యవసాయశాఖ నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తుంది. రాష్ట్రస్థాయిలో వ్యవసాయశాఖ కమిషనర్ నోడల్ అధికారిగా వ్యవహరిస్తారు. జిల్లాస్థాయిలో కలెక్టర్ జిల్లా నోడల్ అధికారిగా వ్యవహరిస్తారు. కలెక్టర్‌కు సహాయాధికారిగా జిల్లా వ్యవసాయాధికారి ఉంటారు. -గ్రామ, మండల, జిల్లా రైతు సమన్వయ సమితుల సభ్యులు, కో-ఆర్డినేటర్ల ఖరారు బాధ్యతను జిల్లాలవారీగా ఇంచార్జీ మంత్రులకు అప్పగించారు.