-యాత్రలో వందలమంది గూండాలెందుకు?
-పథకం ప్రకారమే దాడులు: మంత్రి జగదీశ్‌రెడ్డి
-కల్లాల్లో రక్తంపారించేందుకే బండి యాత్ర: పల్లా
-బండీ.. నీ రౌడీయిజాన్ని సాగనివ్వం: గాదరి కిశోర్
-తెలంగాణపై పడిన గుజరాత్ పురుగులు: కంచర్ల

యాత్రల పేరుతో గూండాలను వెంటేసుకొని ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద బీజేపీ నేతలు రైతులపై దాడులు చేయటంపై టీఆర్‌ఎస్ నేతలు తీవ్రంగా స్పందించారు. ప్రశాంతంగా ధాన్యం కొనుగోళ్లు సాగుతున్న ఐకేపీ కేంద్రాలవద్ద రైతులను రెచ్చగొట్టి, తమ మాట వినని రైతులపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తన గూండాలతో దాడులు చేయించారని మండిపడ్డారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో, నల్లగొండలో పలువురు మంత్రులు, టీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులు సోమవారం మీడియాతో మాట్లాడుతూ బీజేపీ తీరును ఎండగట్టారు.
బండీ.. నీ ఆటలు సాగవ్‌బండి సంజయ్ వంద కార్లలో గూండాలను వెంటేసుకొని నల్లగొండకు వచ్చారని ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ విమర్శించారు. సీఎం కేసీఆర్‌ను కదిలించాలని చూస్తే ప్రళయమే వస్తుందని హెచ్చరించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలవద్ద బీజేపీ గూండాలు రాళ్లు, కర్రలతో రైతులపై దాడి చేశారని విమర్శించారు. ఉద్యమాల నల్లగొండ గడ్డపై బండి ఆటలు సాగవని హెచ్చరించారు. నల్లగొండ జిల్లాపై బండి సంజయ్ బందిపోటు యాత్ర ప్రారంభించారని ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి మండిపడ్డారు. గతంలో హుజూర్‌నగర్‌లో బండి బ్యాచ్ అరాచకం సృష్టించిందని గుర్తుచేశారు. బండి సంజయ్ అరాచకంపై నల్లగొండ రైతులు తిరగబడ్డారని, రేపు సామాన్యులు తిరగబడతారని హెచ్చరించారు. ఊర్లమీదపడి రౌడీయిజం చేస్తే చూస్తూ ఉరుకోబోమని స్పష్టంచేశారు. బండి సంజయ్ గూండాయిజాన్ని తరిమికొడతామని ఎమ్మెల్యే గాదరి కిశోర్ హెచ్చరించారు. గుజరాత్ పురుగులు వచ్చి తెలంగాణ పంటలను నాశనం చేసేందుకు కుట్రచేస్తున్నాయని ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి విమర్శించారు. పురుగుమందులతో గుజరాత్ పురుగులను నాశనం చేయాలని రైతులకు పిలుపునిచ్చారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెచ్చిన రైతు వ్యతిరేక చట్టాలకు మద్దతు తెలుపనందుకే రాష్ట్రంలో ధాన్యం కొనుగోలుచేయకుండా ఎఫ్‌సీఐ చేత మెలిక పెట్టించారని విమర్శించారు.
పథకం ప్రకారమే దాడి: మంత్రి జగదీశ్‌రెడ్డి
బండి సంజయ్ పథకం ప్రకారమే రైతులపై దాడులు చేయించాడని విద్యుత్తుశాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి ఆరోపించారు. సంజయ్ వాహనాల్లో రాళ్లు తెచ్చుకొని పర్యటనచేయటం సిగ్గుచేటని విమర్శించారు. రైతులపై బీజేపీ గూండాల దాడిని తీవ్రంగా ఖండించారు. నిజంగా రైతుల సమస్యలు తెలుసుకొనేందుకే బండిసంజయ్ వస్తే, ఆయన వెంట అన్ని కార్లు.. అంతమంది గూండాలు ఎందుకని ప్రశ్నించారు. బీజేపీ నేతల నిర్వాకంతో రైతుల వడ్ల రాశులన్నీ మట్టిపాలయ్యాయని ఆవేదన వ్యక్తంచేశారు. నిజంగా సంజయ్‌కి చిత్తశుద్ధి ఉంటే రైతుల ప్రశ్నలకు సమాధానం చెప్పాలని డిమాండ్‌చేశారు. బండి సంజయ్ తక్షణమే రైతులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
కల్లాల్లో రక్తం పారించటమే బండి లక్ష్యం: పల్లా
రైతుల కల్లాల్లో రక్తం పారించాలన్న ఉద్దేశంతోనే బండి సంజయ్ యాత్రకు వెళ్లారని రైతుబంధుసమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి విమర్శించారు. దీన్ని ఎలా తిప్పికొట్టాలో తమకు తెలుసని స్పష్టంచేశారు. రైతులపై బండి అనుచరుల దాడులను తీవ్రంగా ఖండించారు. యాసంగి పంట వడ్ల కొనుగోలుపై బీజేపీ వైఖరి స్పష్టం చేయాలని డిమాండ్‌చేశారు. బీజేపీ నేతలు రైతాంగం దృష్టిని మళ్లించి గందరగోళానికి గురిచేయటమే పనిగా పెట్టుకుంటే తాము చూస్తూ ఉరుకోబోమని హెచ్చరించారు. యాసంగి వడ్ల కొనుగోలుపై బీజేపీ వైఖరి చెప్పేదాకా రైతులు వెంటాడి వేటాడుతారని స్పష్టంచేశారు. రైతులను కార్లతో తొక్కిస్తే ఊరుకొనేందుకు తెలంగాణ రాష్ట్రం ఉత్తరప్రదేశ్ కాదనే విషయాన్ని బీజేపీ నేతలు గుర్తుంచుకోవాలని హెచ్చరించారు. రైతులపై దాడికి పాల్పడిన బీజేపీ గూండాలను అరెస్ట్‌చేసి కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్‌చేశారు.