
వరద బాధితులకు మంత్రి కేటీఆర్ భరోసా హైదరాబాద్‌లో అర్హులైన వరద బాధితులందరికీ తక్షణ ఆర్థికసాయం రూ.పదివేలు అందజేస్తామని పురపాలకశాఖ మంత్రి కే తారకరామారావు హామీ ఇచ్చారు. సాయం అందలేదని బాధితులెవరూ ఆందోళన చెందాల్సిన అవసరంలేదని భరోసా ఇచ్చారు. అర్హులైన వరద బాధితుల్లో ఇంకా ఎవరికైనా సాయం అందకుంటే.. వారందరికీ సాయం అందేవరకు ఈ కార్యక్రమం కొనసాగుతుందని చెప్పారు. ఇప్పటికే ప్రభుత్వ, జీహెచ్‌ఎంసీ అధికారుల సాయంతో వరద ప్రభావిత కుటుంబాలను గుర్తించి, ఆర్థికసాయం అందించామని ఆయన తెలిపారు. తమకు ఆర్థికసాయం అందలేదని పలు ప్రాంతాలనుంచి కొంతమంది చేస్తున్న విజ్ఞప్తులు తమ దృష్టికి వచ్చాయని చెప్పారు. ప్రతి బాధిత కుటుంబానికి సాయం అందించాలన్నదే ప్రభుత్వ ప్రయత్నమని పేర్కొన్నారు. ఆర్థికసాయం అందించే కార్యక్రమంపై జీహెచ్‌ఎంసీ అధికారులు, హైదరాబాద్ జిల్లా యంత్రాంగంతో సమీక్షించి నిర్ణయం తీసుకుంటామని మంత్రి కేటీఆర్ చెప్పారు.