Bharat Rashtra Samithi

Bharat Rashtra Samithi

KCR
telangana talli img

వాటర్ గ్రిడ్ సర్వేకు సన్నాహాలు

-అంతర్జాతీయ ప్రమాణాలతో గ్రిడ్ నిర్మాణం -నాణ్యత విషయంలో రాజీపడే ప్రసక్తి లేదు -డీజీపీఎస్ ద్వారా వివరాల సేకరణ -నల్లగొండ జిల్లాలో ప్రారంభించనున్న సీఎం -పనులపై పంచాయతీరాజ్ మంత్రి కేటీఆర్ సమీక్ష -నెలాఖరుకల్లా సర్వే ప్రాథమిక పనులు పూర్తిచేయాలి -అధికారులకు మంత్రి ఆదేశం

KTR01 రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న వాటర్ గ్రిడ్ పనులను అంతర్జాతీయ నాణ్యత ప్రమాణాలతో చేపట్టాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి కే తారకరామారావు అధికారులకు సూచించారు. వాటర్ గ్రిడ్ పనులపై శుక్రవారం సచివాలయంలో మంత్రి ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రిడ్ పనులను ఆషామాషీగా తీసుకోవద్దని, అధికారులంతా ప్రత్యేక శ్రద్ధతో పనిచేయాలని సూచించారు. అధికారులు ఎవరికి వారు కాలపరిమితిని విధించుకొని గ్రిడ్ నిర్మాణాన్ని సకాలంలో పూర్తిచేసేలా చూడాలన్నారు.

గ్రిడ్ నిర్మాణానికి సంబంధించి నాణ్యత ప్రమాణాలు, శానిటేషన్ విషయంలో రాజీపడేది లేదని స్పష్టంచేశారు. ప్రపంచంలోనే అత్యంత నాణ్యమైన ప్రమాణాలను పాటించేలా చర్యలు తీసుకోవాలన్నారు. సర్వే పనుల నిర్వహణలో ఔత్సాహిక ఏజెన్సీలను భాగస్వామ్యులను చేయాలని సూచించారు. వచ్చే వారం సర్వే పనుల నిర్వహణలో ఆసక్తి ఉన్న సంస్థల నుంచి కొటేషన్లను ఆహ్వానించాలని సమావేశంలో నిర్ణయించారు. అక్టోబర్ చివరి నాటికి గ్రిడ్‌కు సంబంధించిన ప్రాథమిక సర్వే పనులు పూర్తిచేయాలని మంత్రి కేటీఆర్ అధికారులను ఆదేశించారు.

సీఎం కేసీఆర్ సూచనల మేరకు ఇప్పటివరకు చేపట్టిన గ్రిడ్ పనుల వివరాలను అధికారులు మంత్రికి వివరించారు. సాధ్యమైనంతవరకు గ్రావిటీ ఆధారంగా వాటర్ గ్రిడ్‌ను నిర్మించేలా అనువైన ప్రాంతాలను గుర్తించాలని అధికారులకు కేటీఆర్ సూచించారు. వాటర్ గ్రిడ్ పనులను నల్లగొండ జిల్లాలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రారంభించనున్నారని, ఆ జిల్లా డిటైల్డ్ ప్రాజెక్టు రిపోర్ట్(డీపీఆర్)ను ముందుగా పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు.

గ్రిడ్‌కు స్థానికంగా తగినంతగా నీటి వనరులు, ప్రవాహావేగం ఉండేలా ఎత్తైన ప్రాంతాలను గుర్తించాలని సూచించారు. గ్రిడ్ సర్వే పనులను పరిశీలించడానికి డిఫరెన్షియల్ గ్లోబల్ పొజిషనింగ్ సిస్టం (డీజీపీఎస్) పరికరాలను కొనుగోలు చేయాలని నిర్ణయించారు. మరో వారంలోగా డీజీపీఎస్ ద్వారా గ్రిడ్ ప్రాంతాన్ని పరిశీలించనున్నారు. గ్రిడ్‌ను పర్యవేక్షించడానికి అక్కడక్కడ బేస్ స్టేషన్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. గ్రిడ్ నిర్వహణకు ప్రత్యేక అథారిటీని ఏర్పాటు చేసే విషయాన్ని పరిశీలిస్తున్నట్లు మంత్రి కేటీఆర్ చెప్పారు. గ్రిడ్‌కు సంబంధించిన డీపీఆర్ నివేదికను సాధ్యమైనంత త్వరగా పూర్తిచేయాలని సూచించారు. గ్రిడ్ పనులను సీఎం పర్యవేక్షించేందుకు వీలుగా రిమోట్ సెన్సింగ్ డిపార్ట్‌మెంట్ సహకారంతో ప్రత్యేక సాప్ట్‌వేర్ ద్వారా ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు.

రోడ్డు, కాంటూరు, హాబిటేషన్, వెలివేషన్‌పై మ్యాపింగ్ పూర్తిచేసినట్లు అధికారులు మంత్రికి వివరించారు. వచ్చేవారం ఇరిగేషన్, రోడ్లు భవనాల శాఖ ఇంజినీరింగ్ అధికారులతో సమావేశం నిర్వహించనున్నట్లు మంత్రి చెప్పారు. రాష్ట్రంలో ఇప్పటికే కొనసాగుతున్న పలు తాగునీటి పథకాల నిర్వహణ, రాబోయే వేసవి దృష్ట్యా తాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకునేందుకు అవసరమైన బడ్జెట్‌ను కేటాయించేందుకు అంచనాలు రూపొందించాలని మంత్రి అధికారులను సూచించారు. ఈ సమీక్ష సమావేశంలో సీఎం అదనపు కార్యదర్శి స్మితా సబర్వాల్, పంచాయతీరాజ్ ముఖ్యకార్యదర్శి జే రేమండ్ పీటర్, గ్రామీణ తాగునీటి శాఖ ఇంజినీరింగ్-ఇన్-చీఫ్ సురేందర్‌రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the BRS Party.