రాష్ట్రంలో విద్యావిధానాన్ని ప్రక్షాళన చేసి కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అందిస్తామని విద్యాశాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి చెప్పారు. సోమవారం నల్లగొండ జిల్లా నకిరేకల్, చౌటుప్పల్, సూర్యాపేటలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొని మాట్లాడారు. 60 ఏండ్లుగా ఆంధ్రాపాలకుల విద్యా విధానం కొనసాగుతున్నదని, తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన నేపథ్యంలో విద్యార్థుల బంగారు భవిష్యత్‌కు బాటలు వేయాలనే విద్యావిధానాన్ని ప్రక్షాళన చేస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో ఫ్లోరైడ్ మహమ్మారిని తరిమికొట్టేందుకు వాటర్‌గ్రిడ్‌కు ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని వివరించారు.

-కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య -ఫ్లోరోసిస్ నుంచి రక్షించేందుకే వాటర్‌గ్రిడ్ -విద్యాశాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి వలసపాలకుల నిర్లక్ష్యం వల్లే 60ఏండ్లుగా ఫ్లోరిన్ విషపునీటిని తాగుతూ ప్రజలు కాలం వెళ్లదీస్తున్నారన్నారు. ప్రత్యేక రాష్ట్రం సిద్ధించిన ఆరు నెలల్లోనే సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో రూ.35వేల కోట్లతో వాటర్‌గ్రిడ్ పథకం ఏర్పాటుకు ప్రణాళిక రచించడం అభినందనీయమన్నారు. ఈ గ్రిడ్‌తో పది జిల్లాల్లో ఇంటింటికీ నల్లాల ద్వారా రక్షిత జలాలు అందే వీలు కలుగుతుందన్నారు. ఆంధ్రాలో విలీనం ఫలితంగా తెలంగాణ వనరులన్నీ ధ్వంసానికి, దోపిడీకి గురయ్యాయన్నారు.
45వేల చెరువుల పునరుద్ధరణ చేపట్టామని, ప్రజలు సహకరించాలని కోరారు. రైతులు చెరువు మట్టిని పంటపొలాల్లోకి తరలించుకోవాలని విజ్ఞప్తిచేశారు. అభివృద్ధి ప్రణాళికలు తయారు చేసేందుకే ఆరునెల సమయం పట్టేంతగా తెలంగాణ విధ్వంసానికి గురైందని ఆవేదన వ్యక్తంచేశారు. కాకతీయులకాలంలో నిర్మించిన చెరువులే ఆయువుపట్టని, చెరువులన్నింటినీ ధ్వంసం చేయడంతోపాటు కృష్ణానీటిని సీమాంధ్రకు తరలించారని మండిపడ్డారు. కార్యక్రమాల్లో శాసనమండలి డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్‌రావు, ఎమ్మెల్యేలు కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, వేముల వీరేశం, కలెక్టర్ టీ చిరంజీవులు పాల్గొన్నారు.