Bharat Rashtra Samithi

Bharat Rashtra Samithi

KCR
telangana talli img

విభజన భారం మీదే

ఉమ్మడి హైకోర్టు విభజనకు చొరవ తీసుకోవాలని ప్రధాని నరేంద్రమోదీకి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు విజ్ఞప్తి చేశారు. న్యాయాధికారులు, న్యాయవాదుల ఆందోళన సందర్భంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సైతం హామీ ఇచ్చిన నేపథ్యంలో ఇక విభజన అంశంలో కేంద్రమే ముందుకు రావాలని ఆయన కోరారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం కేసీఆర్ సోమవారం పార్లమెంటులో ప్రధానిని కలుసుకున్నారు. సుమారు 35 నిమిషాల పాటు జరిగిన సమావేశంలో రాష్ర్టానికి సంబంధించిన వివిధ అంశాలను ఆయన ప్రధాని దృష్టికి తెచ్చారు. హైకోర్టు విభజన అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించిన సీఎం, గతంలో ఎక్కడా లేనివిధంగా రాష్ట్రం ఏర్పడి రెండేండ్లయినా స్వంత హైకోర్టులేని విచిత్ర పరిస్థితి తెలంగాణలో ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాలకు వేర్వేరు హైకోర్టులు ఏర్పడేలా ప్రధాని స్థాయిలో చొరవ తీసుకోవాలని కోరారు.

CM-KCR-with-PM-Narendra-Modi

-హైకోర్టుపై ప్రధాని హోదాలో చొరవ తీసుకోండి -మిషన్ కాకతీయ, భగీరథకు సహాయం అందించండి -ఎఫ్‌ఆర్‌బీఎం చిక్కులు తొలగించండి.. మోదీకి సీఎం కేసీఆర్ విజ్ఞప్తి -పార్లమెంటులో ప్రధానమంత్రిని కలిసిన సీఎం -35 నిమిషాలపాటు ఇరువురి సమావేశం -ఓబీసీలకు కేంద్రంలో మంత్రిత్వశాఖ ఏర్పరచాలని కేసీఆర్ సూచన

అలాగే కొత్తగా ఏర్పడిన తమ రాష్ట్రం ప్రజలకు దీర్ఘకాల ప్రయోజనాలు చేకూర్చేందుకు చేపట్టిన అనేక వినూత్న పథకాలకు కేంద్రం ఆర్థిక సాయం అందించాలని కోరారు. ప్రధానమంత్రి కృషి సించాయి యోజన ప్రాజెక్టులకు తక్కువ వడ్డీతో నాబార్డు ఇచ్చే రుణాలను ఎఫ్‌ఆర్‌బీఎంతో ముడిపెట్టవద్దని సూచించారు. తెలంగాణకు ఎఫ్‌ఆర్‌బీఎం కింద 3.5% మేరకు రావలిసిన రుణాల అంశంలో ఏర్పడిన కొన్ని సాంకేతిక సమస్యలను తొలగించాలని కోరారు. దేశంలో సుమారు 60% జనాభాగా ఉన్న ఓబీసీలకు కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వశాఖను ఏర్పాటు చేయాలని కూడా సీఎం ప్రత్యేకంగా సూచించారు. ఈ మేరకు ఆయా అంశాలకు సంబంధించిన విజ్ఞాపన పత్రాన్ని ప్రధానికి అందజేశారు. అనంతరం కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతితో కూడాసీఎం భేటీ అయ్యారు.

విభజన ప్రక్రియ పూర్తి చేయండి రాష్ట్ర హైకోర్టు విభజన విషయంలో జోక్యం చేసుకోవాలని ప్రధానితో జరిగిన సమావేశంలో సీఎం విజ్ఞప్తి చేశారు. హైకోర్టు విభజన డిమాండ్‌తో తమ రాష్ట్రంలో న్యాయవాదులు విధులు బహిష్కరించి ఆందోళన చేపట్టారని, దేశ చరిత్రలోనే తొలిసారిగా కింది కోర్టుల న్యాయమూర్తులు మూకుమ్మడి రాజీనామాలు చేసి ఆందోళనలో పాల్గొన్నారని ప్రధాని మోదీకి వివరించారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జోక్యం, సలహా మేరకు ఆందోళనను విరమించి విధులకు హాజరయ్యారని చెప్పారు. విభజన ప్రక్రియను తాము చూసుకుంటామంటూ ప్రధాన న్యాయమూర్తి హామీ ఇచ్చారని, ఈ నేపథ్యంలో చొరవ తీసుకుని విభజన ప్రక్రియ త్వరగా పూర్తయ్యేలా చూడాలని కేసీఆర్ కోరారు. దీనికి ప్రధాని సానుకూలంగా స్పందించారు.

నీతి ఆయోగ్ సిఫారసుల మేరకు నిధులివ్వండి.. తెలంగాణ రాష్ట్రం చేపట్టిన మిషన్ కాకతీయకు రూ. 5000 కోట్లు, మిషన్ భగీరథ ప్రాజెక్టుకు రూ. 19,205 కోట్లు విడుదల చేయాల్సిందిగా నీతి ఆయోగ్ సిఫారసు చేసిందని సీఎం కేసీఆర్ ప్రధాని దృష్టికి తెచ్చారు. ఆ మేరకు నిధుల్ని విడుదల చేసి రాష్ర్టానికి ఆర్థికంగా చేయూతనందించాలని కోరారు. మిషన్ కాకతీయ ద్వారా 45,941 చెరువులు పునరుద్ధరిస్తున్నామని, ఫలితంగా భూగర్భ నీటి మట్టం పెరగడంతో పాటు ప్రతి పొలానికీ సాగునీరు అందే అవకాశం ఉందని చెప్పారు.

ఈ పథకానికి రూ. 25,000 కోట్లు ఖర్చవుతుందని,18.85 లక్షల ఎకరాల భూమికి సాగునీరు అందుతుందని వివరించారు. అలాగే ప్రతి ఇంటికీ నల్లా ద్వారా రక్షిత త్రాగునీటిని అందించేందుకు రూ. 42,850 కోట్ల ఖర్చుతో మిషన్ భగీరథ ప్రాజెక్టును చేపట్టామన్నారు. ప్లోరైడ్ కలుషిత నీటిని తాగుతూ శాశ్వత అంగవైకల్యం పొందుతున్న లక్షలాది మందిని ఆ ప్రాణాంతక వ్యాధి నుంచి బయటపడేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని వివరించారు. ఈ రెండు ప్రాజెక్టుల పనితీరును నీతి ఆయోగ్ వైస్ ఛైర్మన్, సీఈవో, ఇతర ఉన్నతాధికారులు క్షేత్రస్థాయిలో అధ్యయనం చేసి రూ. 24,205 కోట్లను ఇవ్వాల్సిందిగా సిఫారసు చేశారని చెప్పారు.

ఓబీసీలకు ప్రత్యేక మంత్రిత్వశాఖను ఏర్పాటు చేయండి దేశ జనాభాలో సుమారు 60% మేరకు వివిధ వెనుకబడిన కులాలకు చెందినవారు ఉన్నందున వారి సంక్షేమం కోసం కేంద్ర స్థాయిలో ఒక ప్రత్యేక మంత్రిత్వశాఖను ఏర్పాటు చేయడం సముచితంగా ఉంటుందని ప్రధానికి కేసీఆర్ సూచించారు. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఈ మేరకు ఒక తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించిందని తెలిపారు. బీసీల్లో సుమారు 30% మంది అట్టడుగు వర్గాలకు చెందినవారేనని, తెలంగాణలో కొన్ని సంచారజాతులు కూడా బీసీ జాబితాలో ఉన్నాయని వివరించారు. బీసీల సంక్షేమానికి కేంద్రం నుంచి తగిన న్యాయం జరగడంలేదన్న ఒక సాధారణ అభిప్రాయం అన్ని రాష్ర్టాల్లోనూ ఉన్నదని, వివిధ రాష్ర్టాలు కూడా ఓబీసీల సంక్షేమం కోసం ప్రత్యేక మంత్రిత్వశాఖ ఉండాలన్న డిమాండ్లు చేస్తున్నాయని గుర్తుచేశారు. ఈ నేపథ్యంలో కనీసంగా రూ. 25,000 కోట్ల బడ్జెట్‌తో ఓబీసీల సంక్షేమానికి ప్రత్యేక మంత్రిత్వశాఖను ఏర్పాటు చేస్తే బాగుంటుందని చెప్పారు.

హైకోర్టు విభజనపై ప్రధాని సానుకూల స్పందన.. ప్రధానితో సీఎం భేటీ అనంతరం ఎంపీ జితేందర్‌రెడ్డి మీడియాకు వివరాలు వెల్లడించారు. ఉత్తరాఖండ్, జార్ఖండ్, చత్తీస్‌గఢ్ రాష్ర్టాలకు స్వల్పకాలంలోనే ప్రత్యేక హైకోర్టులు ఏర్పాటైనా తెలంగాణ విషయంలో ఇది జరగలేదని ప్రధానికి కేసీఆర్ వివరించారని తెలిపారు. ప్రధాని సైతం సానుకూలంగా స్పందించి న్యాయమంత్రితో మాట్లాడి వీలైనంత త్వరగా సమస్యను పరిష్కరించడానికి చొరవ తీసుకుంటామని హామీ ఇచ్చారని తెలిపారు. నీతి ఆయోగ్ సిఫారసుల మేరకు మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ ప్రాజెక్టులకు ఆర్థిక సాయం, ఎఫ్‌ఆర్‌బీఎంలో ఏర్పడిన సాంకేతిక చిక్కులు, ప్రధానమంత్రి కృషి సించాయి యోజనకు ఇచ్చే నాబార్డు రుణాలను ఎఫ్‌ఆర్‌బీఎంతో ముడిపెట్టడం తదితర అనేక అంశాలను సీఎం ప్రస్తావించారని తెలిపారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the BRS Party.