హైదరాబాద్ నగరంలో భారీగా పెట్టుబడులు పెట్టాలని టాటా గ్రూపు కంపెనీ ప్రతినిధులను ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు కోరారు. హైదరాబాద్‌కు ఐటీఐఆర్ వస్తున్న క్రమంలో నగరం భారీగా విస్తరించనుందని, ఆ క్రమంలో టాటా వంటి సంస్థలు ఆ అభివృద్ధిలో పాలు పంచుకోవాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో 30 నుంచి 40 వేల కోట్ల రూపాయల వరకూ పెట్టుబడులు పెట్టాలని కేసీఆర్ వారిని కోరారు.

-టాటా కంపెనీని ఆహ్వానించిన సీఎం కేసీఆర్ -ముఖ్యమంత్రిని కలిసిన టాటా ప్రతినిధులు -వెయ్యి మెగావాట్ల విద్యుత్ కేంద్రం ఏర్పాటుకు రెడీ -సోలార్, బయో వేస్ట్ విద్యుత్తుపైనా ఆసక్తి టాటా పవర్ సంస్థ సీఇవో అండ్ మేనేజింగ్ డైరెక్టర్ అనిల్ సర్దానా నేతృత్వంలోని ప్రతినిధుల బృందం సీఎంతో శుక్రవారం భేటీ అయింది. రాష్ట్రంలో టాటా గ్రూపు కంపెనీ పెట్టుబడులు, ప్రాజెక్టుల ప్రతిపాదనలపై వారు చర్చించారు. వెయ్యి మెగావాట్ల విద్యుత్ కేంద్రం..: రాష్ట్రంలో వెయ్యి మెగావాట్ల థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రం ఏర్పాటు చేస్తామని టాటా కంపెనీ తెలిపింది. రెండేళ్లలో దీనిని పూర్తి చేసి విద్యుత్ ఉత్పత్తి ప్రారంభిస్తామని కంపెనీ ప్రతినిధులు సీఎంకు చెప్పారు. థర్మల్ పవర్‌తో పాటు సోలార్ పవర్ ఉత్పత్తి ప్లాంట్లను కూడా ఏర్పాటు చేస్తామని, విద్యుత్ సరఫరాకు సాంకేతిక సహకారాన్ని కూడా అందిస్తామని టాటా కంపెనీల ప్రతినిధులు తమ ప్రతిపాదనలను కేసీఆర్‌కు వివరించారు. థర్మల్ పవర్ కేంద్రాన్ని పూర్తిగా తమ కంపెనీ ఆధ్వర్యంలోనే ఏర్పాటు చేస్తామన్నారు.
బయోవేస్ట్ ఉపయోగించి విద్యుత్ ఉత్పత్తి చేసే ప్రాజెక్టులను కూడా ఏర్పాటు చేసేందుకు టాటా కంపెనీ ప్రతినిధులు ఆసక్తి వ్యక్తం చేశారు. విద్యుత్ ఉత్పత్తి ప్లాంటతో పాటు, విద్యుత్ ఉత్పత్తికి, సరఫరాకు అవసరమైన పరికరాలను కూడా టాటా గ్రూప్ ఆఫ్ కంపెనీల నుంచి అందిస్తామని వారు చెప్పారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్‌కు సమీపంలో ఐటిఐఆర్ ప్రాజెక్టును ఏర్పాటు చేయబోతుందని, ప్రస్తుతం ఉన్న కంపెనీలతో పాటు, కొత్తగా ఏర్పాటు చేయబోయే సాఫ్ట్ వేర్ కంపెనీలకు కూడా విద్యుత్ అవసరం ఎంతో ఉందని అన్నారు.
టాటా వంటి ప్రతిష్టాత్మకమైన కంపెనీలు హైదరాబాద్‌లో పెట్టుబడులు పెట్టడం వల్ల హైదరాబాద్ పారిశ్రామిక స్మార్ట్ సిటీగా అభివృద్ధి చెందడానికి దోహద పడుతుందని అభిప్రాయపడ్డారు. ముఖ్యమంత్రితో సమావేశమైన వారిలో టాటా కంపెనీల ప్రతినిధులు రాహుల్‌షా, దీపక్ తివారి, మధుకన్నన్‌లు ఉన్నారు. ఈ సమావేశంలో వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి, సీఎంవో ముఖ్యకార్యదర్శి ఎస్ నర్సింగరావులు పాల్గొన్నారు.