Bharat Rashtra Samithi

Bharat Rashtra Samithi

KCR
telangana talli img

వరమాయె.. కంటి వెలుగు

-ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా ప్రజలందరికీ ఉచిత కంటి పరీక్షలు -అవసరమైనవారికి అద్దాలు.. శస్త్రచికిత్సలు -వాడవాడలా జోరుగా శిబిరాలు -కంటి వెలుగుపై ప్రజల్లో పెరిగిన ఆసక్తి -ఒక్క మంగళవారమే 1.20 లక్షల మందికి పరీక్షలు

విశేష పథకాలు.. వినూత్న కార్యక్రమాలు! ఇదీ తెలంగాణ ప్రత్యేకత! ఈ క్రమంలోనే ప్రజాసంక్షేమమే పరమావధిగా మరో వినూత్న కార్యక్రమాన్ని తెలంగాణ ప్రభుత్వం దిగ్విజయంగా ప్రజల్లోకి తీసుకెళ్లింది! అదే కంటి వెలుగు! దేశంలోనే కాదు.. ప్రపంచంలోనే ఎక్కడా కనీవినీ ఎరుగని రీతిలో చేపట్టిన ఈ కార్యక్రమంలో ప్రభుత్వమే ఉచితంగా కంటి పరీక్షలు చేయిస్తూ.. అవసరమైనవారికి ఉచితంగానే కంటి అద్దాలు, మందులు సమకూరుస్తున్నది. అంతేకాదు.. శస్త్ర చికిత్సలను కూడా ప్రభుత్వమే ఉచితంగా చేయిస్తూ మరో ఆదర్శప్రాయమైన విధానానికి శ్రీకారం చుట్టింది! దవాఖానకు వెళ్లాల్సిన పనిలేకుండా.. ప్రజల ముంగిటకే వైద్యాన్ని తీసుకువచ్చి.. గ్రామగ్రామాన ప్రత్యేక శిబిరాలు నిర్వహిస్తూ.. వరమోలె వచ్చింది.. కంటి వెలుగు అంటూ.. గరీబోళ్ల మన్ననలందుకుంటున్నది! ప్రజలకు కొత్తగా ఏదన్నా చేయాలంటే.. అది ఒక్క తెలంగాణ ప్రభుత్వం వల్లే సాధ్యమని ఆచరణలో చాటిచెప్తున్నది!

కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌లో దర్జీ పనిచేసే చొక్కం సులోచన.. ఇప్పుడు సంతోషంగా తన పని తాను చేసుకుంటున్నది! పొలానికి పొయ్యివచ్చేటప్పుడు తొవ్వ కనిపించక తన్లాడిన కరీంనగర్ జిల్లా ఇల్లందకుంటకు చెందిన నాగుల సంపత్‌కు ఆ సమస్య తొలిగిపోయింది! ప్రైవేటు దవాఖానకు పోవటానికి డబ్బుల్లేక ఇబ్బందిపడిన రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేటకు చెందిన దాసరి లక్ష్మి చూపు ఇప్పుడు మెరుగైంది! వీరేకాదు.. ఖమ్మం జిల్లాకు చెందిన యనమల సుగుణ.. ఆదిలాబాద్ జిల్లా గిరిజన రైతు దుర్వ భుజంగ్‌రావు.. జగిత్యాల జిల్లాకు చెందిన తీపిరెడ్డి రాజేశ్వర్‌రెడ్డి.. ఇద్దరా ముగ్గురా..! అక్షరాలా 4,60,537 మంది! వీరంతా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కంటివెలుగు కార్యక్రమంలో ఇప్పటివరకు కంటి పరీక్షలు చేయించుకున్నారు. వీరిలో కొందరు ఉచితంగా అద్దాలు పొందితే.. మరికొందరు ప్రభుత్వ ఖర్చుతో కంటికి శస్త్రచికిత్సలు చేయించుకుని దృష్టిలోపాలను సరిచేసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా కంటి వెలుగు వైద్య శిబిరాల్లో ఐదు రోజుల వ్యవధిలో 4,60,537 మందికి కంటిపరీక్షలు పూర్తిచేయగా.. 80,280 మందికి రీడింగ్ అద్దాలను అందజేశారు. ప్రత్యేక దృష్టి లోపం ఉన్న వారికోసం 65,341 అద్దాలను ఆయా శిబిరాల్లోని వైద్యులు ప్రతిపాదించారు. ప్రభుత్వమే తమ ముంగిట్లో కంటివైద్య శిబిరాలు నిర్వహిస్తుండటంతో ప్రజల్లోనూ ఆసక్తి పెరిగింది. దీనికితోడు ప్రజలకు కల్పిస్తున్న అవగాహనతో కంటి శిబిరాలు దిగ్విజయంగా సాగుతున్నాయి. ఫలితంగా ఒక్క మంగళవారమే రాష్ట్రవ్యాప్తంగా 821 చోట్ల చేపట్టిన వైద్యశిబిరాల్లో 1,20,222 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. 21,129 మందికి రీడింగ్ అద్దాలు అందజేయగా, ప్రత్యేక దృష్టిలోపం ఉన్న 27,281 మందికి ప్రత్యకమైన కంటి అద్దాలకోసం ప్రతిపాదించారు. కాటరాక్ట్ ఆపరేషన్లకు 12632 మందిని ప్రతిపాదించగా.. వైద్యశాఖ ముందుగా సిద్ధంచేసిన 114 దవాఖానాల్లో ఒకే రోజు 677మందికి కాటరాక్ట్ ఆపరేషన్లు పూర్తిచేశారు.

చాలా ఆనందంగా ఉంది పేదలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను పరిష్కరించేందుకు టీఆర్‌ఎస్ ప్రభుత్వ సంక్షేమ పథకాలు బాగున్నాయి. రైతుబంధు, రైతుబీమాతో ఇటీవలే రైతులకు మేలు చేసిన సర్కార్ తాజాగా రాష్ట్రంలో ప్రతీ ఒక్కరి కండ్లలో వెలుగులు నింపేందుకు కంటి వెలుగు పథకం అమలులోకి తెచ్చింది. ఉచితంగా కంటి పరీక్షలు, శస్త్రచికిత్సలు నిర్వహించి, మందులు, కండ్లద్దాలు అందజేయడం ఆనందంగా ఉంది. – యనమల సుగుణ, ఇల్లెందు మండలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా

కల ఇప్పుడు నెరవేరింది.. రెక్కాడితే గానీ డొక్కాడని బతుకులు మావి. ఎన్నో రోజుల నుంచి కంటి పరీక్షలు చేసుకుందామన్నా డబ్బులు సరిపోక వీలుకాలేదు. సర్కారు ఉచితంగా కంటి పరీక్షలు చేస్తున్నదని తెలిసి వచ్చాను. డాక్టర్లు పరీక్ష చేసిండ్రు. అద్దాలు ఇచ్చిండ్రు. – దుర్వ భుజంగ్‌రావు, అంబుగాం, తాంసి మండలం, ఆదిలాబాద్ జిల్లా

బట్టలు కుట్టాలంటే ఇబ్బందయ్యేది సూదిలో దారం ఎక్కించాలంటే ఎంతో కష్టం అయ్యేది. ఇప్పుడు కంటి డాక్టర్లు మా వద్దకే వచ్చి అన్ని పరీక్షలు చేసి ఫ్రీగా అద్దాలు ఇస్తుంటే చెప్పలేనంత ఆనందం కలిగింది. ఏదో నామమాత్రంగా చూసి పొమ్మంటరని నా కూతుళ్లు చెప్తే.. నిజమే కావచ్చనుకున్న. కానీ డాక్టర్లు శ్రద్ధగా పరీక్షలు చేసిన్రు. ఇప్పుడు కండ్లు మంచిగ కనిపిస్తున్నాయి. సీఎం కేసీఆర్‌కు రుణపడి ఉంటాం. – చొక్కం సులోచన, టైలర్, హుజూరాబాద్, కరీంనగర్

సక్కగా పరీక్షలు చేసి అద్దాలిచ్చిండ్రు.. నాకు కండ్లు సరిగా కనబడకపోయేది. ఇదివరకు కండ్లకు చూయించుకోవాలంటే సిరిసిల్ల, కామారెడ్డికి పోయేది. లైను కట్టి, పైసలువెట్టి పరీక్షలు చేయించుకునేది. మళ్ల మూడు నెలల నుంచి కండ్లు గుంజుతున్నయి. కంటి వెలుగులో డాక్టర్లు పరీక్షలు చేసిండ్రు. మందులతోపాటు అద్దాలు ఉచితంగానే ఇచ్చిండ్రు. – మద్దికుంట లక్ష్మి. గంభీరావుపేట, రాజన్న సిరిసిల్ల జిల్లా

వరమోలె వచ్చింది సర్కారు కంటివెలుగు మా పాలిట వరమోలె వచ్చింది. కొన్నేండ్లసంది కండ్లు సరిగ కనవడ్తలేవు. దవాఖాన్ల చూపెట్టుకుందామంటె పైసల్లేవు. ప్రభుత్వం పుణ్యమా అని మా ఊర్లెనే వైద్య శిబిరం పెట్టిన్రు. డాక్టర్లు పరీక్షలు చేసి ఉచితంగనే అద్దాలిచ్చిన్రు. అవి పెట్టుకున్నంక మంచిగ కనవడుతున్నయ్. – తీపిరెడ్డి రాజేశ్వర్‌రెడ్డి, కీచులాటపల్లి, జగిత్యాల జిల్లా

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the BRS Party.