Bharat Rashtra Samithi

Bharat Rashtra Samithi

KCR
telangana talli img

ఉమ్మడి కాలంలో మాపై..మోతకోలేంది?

-మూసేసిన ఫైళ్లన్నీ అందుబాటులోకి తెండి -మా అభ్యంతరాలు కేంద్రానికి చెప్పండి -ఏ ప్రాజెక్టుకు ఎంత అప్పు చేశారు? -ప్రధాన కార్యదర్శి విభజన ప్రజెంటేషన్ సందర్భంగా కేసీఆర్ ఉమ్మడి కాలంలో మాపై..మోతకోలేంది?

KCR 24-05-14

హైదరాబాద్ ఉమ్మడి రాజధానిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పాలన, పౌరసేవల ఖర్చు తెలంగాణ ప్రభుత్వం భరించబోదని తెలంగాణకు కాబోయే ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. వాళ్లు ఇక్కడి సేవలు వాడుకుని మామీద ఆ ఖర్చు రుద్దడమేంది? దీనివల్ల మా ఖజానా మీద అదనపు భారం పడుతుంది…ఆ ఖర్చులు వాళ్లనుంచి వసూలు చేసేలా చర్యలు తీసుకోండి. ఈ విషయమై కేంద్రానికి కూడా లేఖ రాయండి అని ఆయన అధికారులను ఆదేశించారు. -ఒకే ప్రాంగణంలో రెండు ప్రభుత్వాఫీసులు వద్దు -అక్రమ ఉద్యోగుల పెన్షన్ భారం ఎవరిదో తేల్చాలి -సమస్యలను ఇరు రాష్ర్టాల సీఎంలం పరిష్కరించుకుంటాం-సమగ్ర వివరాలివ్వలేకపోయిన అధికారులు -జూన్ 2లోగా పూర్తి వివరాలందించాలన్న గులాబీ బాస్ -సీమాంధ్ర సీఎం సచివాలయంలో వద్దు.. -గవర్నర్ దృష్టికి తీసుకొచ్చిన టీఆర్‌ఎస్ అధినేత

శుక్రవారం లేక్‌వ్యూ అతిథి గృహంలో రాష్ట్ర విభజన అంశంపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ ప్రసన్నకుమార్ మహంతితోపాటు పలువురు సీనియర్ అధికారులతో సమీక్షించారు. రాష్ట్ర విభజనకు సంబంధించి 21 కమిటీలు రూపొందించిన రిపోర్టుల్లోని సారాంశాన్ని 45 పేజీల నివేదిక రూపంలో అధికారులు కేసీఆర్‌కు అందించారు. ఈ సందర్భంగా అనేక అంశాలపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. సుమారు 3 గంటలపాటు దీంట్లోని అన్ని అంశాలను క్షుణ్ణంగా పరిశీలించిన కేసీఆర్ పలు అంశాలపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశారు. అనేక అంశాలపై ప్రశ్నలు వేసి సమాచారం రాబట్టారు.

హైదరాబాద్‌లోని ఉమ్మడి ప్రభుత్వ సంస్థల నిర్వహణ వ్యయం గురించి ఆరా తీసి వాటి నిర్వహణకయ్యే వ్యయాన్ని ఇరు రాష్ర్టాలు భరించేలా మార్పులు చేయాలని ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ నిర్వహించేందుకు అయ్యే ఏ ఖర్చూ తెలంగాణ ప్రభుత్వం చెల్లించబోదని ఆయన స్పష్టం చేశారు. ఒకే ప్రాంగణంలో ఇరు రాష్ర్టాల కార్యాలయాలకు ఒప్పుకొనేది లేదని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ సీఎంకు సచివాలయంలో కాకుండా మరోచోట కార్యాలయం చూడాలని సూచించినట్టు తెలిసింది. తెలంగాణకు కేటాయించిన అప్పు మొత్తం వివరాలు తెలుసుకుని ఏ ప్రాజెక్టుకు ఎంత కేటాయించారో సమగ్రంగా వివరాలు తయారు చేయాలని ఆదేశించారు. తెలంగాణలో నిబంధనలకు విరుద్ధంగా సర్వీస్, ఫ్యామిలీ పెన్షన్లు పొందుతున్నవారు 80 వేల మంది ఉన్నారని, వీటి భారం తెలంగాణ ఖజానాపై పడే పక్షంలో ఆ మొత్తం వివరాలు ఇవ్వాలని కేసీఆర్ ఆదేశించినట్లుగా తెలిసింది. ఫైళ్ల విభజన ప్రజెంటేషన్ సందర్భంగా మూసివేసిన ఫైళ్ల సంఖ్య గమనించిన కేసీఆర్ ఆ ఫైళ్లన్నీ తమకు అందుబాటులో ఉంచాలన్నారు. ప్రభుత్వ రంగ సంస్థల వ్యయం పంచండి ప్రభుత్వ రంగ సంస్థలపై చర్చ సందర్భంగా మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ, అపార్డ్‌లాంటి సంస్థలు ఇరు రాష్ర్టాలకు సేవలందిస్తాయని అధికారులు వివరించారు. వాటి నిర్వహణ ఖర్చు వివరాలు వాకబు చేసిన కేసీఆర్ ఆ వ్యయాన్ని తెలంగాణ సర్కార్‌కే అంటగట్టడం సమంజసం కాదని చెప్పినట్లు తెలిసింది. ఉమ్మడి రాష్ట్రంలో సుమారు 70 సంస్థలు షెడ్యూల్ 9లో ఉన్నాయని, వాటిలో మీట్, ఫిషరీస్ లాంటి సంస్థలను రద్దు చేస్తున్నట్లు అధికారులు కేసీఆర్ దృష్టికి తెచ్చారు. తెలంగాణలో ఇప్పటికీ ఉన్నవారికి తోడుగా అదనంగా 42 ఐఏఎస్, 23 ఐపీఎస్, 33 ఐఎఫ్‌ఎస్ అధికారులు కావాలని కేంద్రానికి లేఖ రాసినట్లు సీఎస్ కేసీఆర్‌కు చెప్పారు. ఫైళ్ల విభజన చర్చ సందర్భంగా ఇప్పటికే ఇరు రాష్ర్టాల ఫైళ్ల విభజన పూర్తయిందని అధికారులు చెప్పారు. మొత్తం ఫైళ్లు 44లక్షల 72వేల 132 కాగా ఆంధ్రప్రదేశ్‌కు చెందినవి 6లక్షల 48వేల 505, తెలంగాణవి 6లక్షల 29వేల 925, ఉమ్మడివి 2లక్షల 77వేల 33 ఉన్నాయని వివరించారు. మరో 29లక్షల 16వేల 589 పైళ్లను నిబంధనల ప్రకారం క్లోజ్ చేసినట్లు అధికారులు చెప్పగా వాటిని పునః సమీక్షించుకునేందుకు అందుబాటులో ఉంచాలని కేసీఆర్ ఆదేశించారు. అధికార నివాసాలు ఒకేచోట వద్దు… తెలంగాణలో మొత్తం 68వేల 182 స్థిరాస్తులు, భవనాలు ఉన్నాయని అధికారులు తెలిపారు. అసెంబ్లీ, సచివాలయం, మండలి, అధికారుల నివాసాలు, మంత్రుల నివాసాలు, కార్యాలయాల విభజన పూర్తయిందని అధికారులు చెప్పారు. ఇందులో ఎమ్మెల్యే క్వార్టర్లు బ్లాకులుగా విభజించి బ్లాక్-1 ఒకరికి, బ్లాక్-2 ఒక రాష్ట్రానికి కేటాయించినట్లు తెలిపారు. ఇందులో ఒక్కో రాష్ర్టానికి 56 చొప్పున కేటాయించినట్లు తెలిపారు. కేసీఆర్ దీనికి అభ్యంతరం చెబుతూ ఒకే ప్రాంగణంలో ఇరు రాష్ర్టాలకు ఎందుకు కేటాయిస్తున్నారని ప్రశ్నించారు. దీనివల్ల ఇబ్బందులు వస్తాయని ఆందోళన వ్యక్తం చేసినట్టు తెలిసింది. తెలంగాణ పరిధిలోకి వచ్చే కాంట్రాక్టుల వివరాలను అడిగిన కేసీఆర్ ఉమ్మడి రాష్ట్రంలో ప్రభుత్వాలు తీసుకున్న కాంట్రాక్టులను తప్పనిసరిగా కొనసాగించాల్సి ఉంటుందా? అని అధికారులను ప్రశ్నించారు. కొనసాగించడం లేదా రద్దు చేయడంలో కొత్త ప్రభుత్వానికి పూర్తి అధికారం, స్వేచ్చ ఉంటుందని సీఎస్ చెప్పారు. రైల్ కోచ్ ఫ్యాక్టరీ, జిల్లా కేంద్రాలనుంచి జాతీయ రహదారులకు అనుసంధానంపై అడిగి తెలుసుకున్నారు. హోంశాఖపై చర్చ సందర్భంగా తెలంగాణలో 6వేలమంది పోలీసుల భర్తీ అవసరమవుతుందని అధికారులు తెలిపారు.

ఇరిగేషన్‌పై అభ్యంతరాలు.. జలవనరులకు సంబంధించి కేంద్రం అపెక్స్ కౌన్సిల్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించిందని అధికారులు కేసీఆర్ దృష్టికి తెచ్చారు. కృష్ణ, గోదావరి రివర్ మేనేజ్‌మెంట్‌లను ఏర్పరిచి నీటి వినియోగం, నిర్వహణ, పంపిణీ చేస్తారని వివరించారు. కేసీఆర్ స్పందిస్తూ ఉమ్మడి రాష్ట్రం ఆధారంగా బ్రిజేష్ ట్రిబ్యునల్ తీర్పునిచ్చింది. ఇప్పుడు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కాబట్టి తన తీర్పును పునః సమీక్షించుకోవాలని కోరుతాం అని చెప్పినట్లు తెలిసింది. విద్యుత్ రంగంపై అధికారులు పూర్తి సమాచారం వెల్లడించలేక పోవడంతో పూర్తి వివరాలు కావాలని కేసీఆర్ ఆదేశించారు. బిల్లులోని సెక్షన్ 94 ప్రకారం పన్ను రాయితీల అంశంపై కేసీఆర్ ఆరా తీశారు.

పన్నుల వ్యవస్థలో మార్పులు తేవాలి… ఆర్థిక చర్చ సందర్భంగా కేసీఆర్ పలు అంశాలకు సంబంధించి కూలంకశంగా వివరాలు తెలుసుకున్నారు. తెలంగాణకు పన్నులు, పన్నేతర ఆదాయంతోపాటు ఫైనాన్స్ కమిషన్ సూచనల ప్రకారం కేంద్రంనుంచి వచ్చే వాటాను కలుపుకుని రాబోయే 10 నెలల్లో రూ. 50,759కోట్లుగా లెక్కచూపారు. 2013-14లో పన్నుల ఆదాయంలో భారీ క్షీణత నమోదైందని చెప్పారు. గత అనిశ్చితుల కారణంగానే ఇలా ఉందని, కొత్త సర్కార్ ఏర్పడితే మార్కెట్‌లో విశ్వాసం పెరిగి ఆర్ధిక లావాదేవీలు పుంజుకుంటాయని అధికారులు చెప్పినట్లుగా తెలిసింది. ఇక తెలంగాణకు రూ. 67,000 కోట్ల అప్పులు ఉన్నాయని అధికారులు వివరించారు. జాతీయ, అంతర్జాతీయ ఆర్థిక సంస్థల రుణంతో చేపట్టిన ప్రాజెక్టుల్లో తెలంగాణ ప్రాంతంలో ఏఏ ప్రాజెక్టు కింద ఎంత ఖర్చు పెట్టారు..? ఎంత ఆయకట్టు వచ్చింది…? ఏఏ ప్రాంతంలో రైతాంగానికి మేలు జరుగుతోందనే అంశాలతో కూడిన నివేదిక కావాలని కేసీఆర్ కోరారు.

ఉద్యోగుల పూర్తి వివరాలు కావాలి.. అధికారులు ఉద్యోగుల వివరాలు ఇచ్చినపుడు రాష్ట్రంలో మొత్తం 12.94లక్షల ఉద్యోగుల్లో రాష్ట్రస్థాయి, జోన్, మల్టీజోన్, జిల్లా అధికారులెందరు వివరాలివ్వాలని ఆయన కోరారు. రెండున్నర లక్షల ఖాళీల్లో ఆంధ్రప్రదేశ్‌కు ఎందరు, తెలంగాణకు ఎందరో స్పష్టతకావాలని ఆయన అడిగారు. న్యాయశాఖ, సర్వీస్‌శాఖ, జీఏడీ ఇతర ప్రభుత్వ కీలక శాఖలన్నీ చర్చించుకుని ఈ సమస్యలన్నీ పరిష్కరించేలా రిపోర్టు ఉండాలి తప్ప ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు వివాదాలతో ప్రతి విషయానికి కేంద్ర ప్రభుత్వం వద్దకు వెళ్లేలా ఉండరాదని కూడా ఆయన కోరారు.

వివరాలివ్వలేక పోయిన అధికారులు… అధికారులిచ్చిన 45 పేజీల నివేదికలో కేసీఆర్ అనేక లోటుపాట్లు గుర్తించినట్లు సమాచారం. తెలంగాణ ప్రాంతంలో ఉన్న పలు కంపెనీల పేర్లు, కార్పొరేషన్లు, డైరెక్టర్లేట్లు, బోర్డులు ఈ నివేదికలో కనిపించడం లేదు. వాటి సంగతేంటని కూడా కేసీఆర్ ప్రశ్నించారు. అయితే వివరాలు అందుబాటులో లేక అధికారులు జవాబివ్వలేకపోయారు. లోటుపాట్లను సవరించి అపాయింటెడ్ డే అయిన జూన్ 2లేదా మొదటివారంలోగానీ పూర్తిసమాచారాన్ని తనకు అందించాలని కోరారు. తెలంగాణ సెంటిమెంట్‌ను అర్థం చేసుకుని నీటి కేటాయింపులు, ఆర్థిక వనరుల కేటాయింపు, ఆస్తి, అప్పుల కేటాయింపులు జరిగేలా చర్యలు తీసుకోవాలని కూడా జాగ్రత్తలు చెప్పారు.

29వ రాష్ట్రంగా ఏర్పడుతున్న తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్‌కూడా బాగుపడాలి, బాగుండాలి, దేశంలోని ఇతర రాష్ర్టాలతో సమానంగా అభివృద్ధి చెందాలి కానీ ఏ విషయంలనూ వివక్షత రాకుండా అధికారులే అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. పైగా అనుమానాలు పెరిగేలా అధికార యంత్రాంగం ప్రతిపాదనలు ఉండరాదు అని ఆకాంక్షిస్తున్నట్లుగా కేసీఆర్ అన్నట్లు సమాచారం. ఈ సమావేశంలో టీఆర్‌ఎస్ సెక్రెటరీ జనరల్ కే కేశవరావు, పొలిట్‌బ్యూరో సభ్యులు నాయిని నర్సింహ్మారెడ్డి, ఏకే గోయల్, పేర్వారం రాములు, రమణాచారి, రామచంద్రుడు, ప్రభుత్వం తరపున సీనియర్ ఐఏఎస్‌లు ఎస్పీ టక్కర్, పీవీ రమేష్, బీ వెంకటేషం, నాగిరెడ్డి, ప్రదీప్‌చంద్ర, సురేష్‌చందా, రేమాండ్ పీటర్, బీ శ్యాంబాబు, అజయ్ మిశ్రా, సంతోష్‌రెడ్డి, ప్రేంచంద్రారెడ్డి, ఎస్‌కే జోషి, డీజీపీ ప్రసాద్‌రావు, హైదరాబాద్ సీపీ అనురాగ్‌శర్మ, ఇంటెలిజెన్స్ ఐజీ మహేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

గవర్నర్‌తో కేసీఆర్ భేటీ ప్రధాన కార్యదర్శి బృందంతో సమావేశం అనంతరం కేసీఆర్ గవర్నర్‌ను కలిశారు. లేక్‌వ్యూ గెస్టుహౌస్‌లో సమావేశం ముగిసిన వెంటనే కేసీఆర్ నేరుగా రాజ్‌భవన్‌కు వెళ్లారు. ఒకే ప్రాంగణంలో రెండు రాష్ట్ర ప్రభుత్వాల కార్యాలయాలు ఉండటం సమంజసం కాదని, దీంతో రెండు రాష్ర్టాల ఉద్యోగుల మధ్య పొరపొచ్చాలు పెరిగే అవకాశం ఉందని టీఆర్‌ఎస్ అధినేత గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ దృష్టికి తెచ్చారు. సచివాలయంలో ఒకే ప్రాంగణంలో ఇద్దరు ముఖ్యమంత్రులు కొనసాగడం సమంజసంగా ఉండదని, సీమాంధ్ర ముఖ్యమంత్రి పనిచేసేలా మరో చోట ఏర్పాట్లు చేయడం మేలని సూచించినట్లు తెలిసింది. ఇక కమిషనరేట్లు, డైరెక్టరేట్లలో ఒక అంతస్తులో తెలంగాణ ఉద్యోగులు, మరో అంతస్తులో సీమాంధ్ర ఉద్యోగులు పనిచేయడం వల్ల సామరస్య వాతావరణం ఉండకపోవచ్చని, అలా ఉండటం వల్ల రాబోయే రోజుల్లో ప్రభుత్వాల మధ్య మరిన్ని సమస్యలు పెరిగే అవకాశం ఉందని గుర్తు చేసినట్లు తెలుస్తోంది. అధికార యంత్రాంగం రూపొందించిన నివేదికలోని లోటుపాట్లు కూడా వీరి మధ్య చర్చలో చోటుచేసుకున్నట్లు తెలిసింది.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the BRS Party.