Bharat Rashtra Samithi

Bharat Rashtra Samithi

KCR
telangana talli img

ఉగాదికల్లా మాస్టర్‌ప్లాన్

-సమగ్ర ఆధ్యాత్మిక కేంద్రంగా యాదగిరిగుట్ట -గుట్టపై భక్తి భావన ఉప్పొంగాలి -బాట పొడవునా శ్రీవారి నామస్మరణ..మంత్రోచ్చారణలతో ప్రాంతం పులకించాలి -ఆలయ అభివృద్ధికి ప్రతి బడ్జెట్లో 100 కోట్లు -ప్రధాన ఆలయం చుట్టూ మాడ వీధులు -రాయగిరినుంచి నాలుగు లైన్ల రోడ్డు -త్వరలో చిన్నజీయర్ స్వామిని గుట్టకు తీసుకువస్తాం -గుట్ట అభివృద్ధిపై సీఎం కేసీఆర్ సమీక్ష -గుట్టపై హెలీప్యాడ్ ప్రతిపాదనకు తిరస్కరణ

KCR-visit-to-Yadagirigutta

యాదగిరిగుట్టకు వెళ్లే దారిలో ప్రవేశించగానే లక్ష్మీనరసింహుడి స్తోత్రాలు వినిపించాలి.. గుట్టకు వెళ్లే నాలుగు మార్గాల్లోనూ దారి పొడవునా వేదమంత్రోచ్చారణలతో ఆ ప్రాంతం పులకించిపోవాలి.. ఎటు చూసినా భక్తిభావాన్ని పెంపొందించేలా.. నైతిక విలువలకు ఊతమిచ్చేలా.. పర్యావరణాన్ని కాపాడే విధంగా బోధనలు కనిపించాలి.. గుట్టకువెళ్లే నాలుగు మార్గాల్లోనూ సువాసనలు వెదజల్లే సుగంధ మొక్కలు నాటాలి.. ఈ క్షేత్రాన్ని సందర్శించే భక్తుల్లో ఆధ్యాత్మిక భావనలు ఉప్పొంగడమేకాకుండా.. నిత్యజీవన ఒత్తిడి నుంచి విముక్తి పొందే వాతావరణం గుట్ట ఆలయంలోనే కాదు.. పరిసరాల్లోనూ నెలకొనాలి.. అని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అన్నారు. యాదగిరిగుట్ట దేవాలయం అభివృద్ధిపై సీఎం కేసీఆర్ బుధవారం సమీక్ష జరిపారు. అభివృద్ధి పనులకు సంబంధించిన మాస్టర్‌ప్లాన్ ఉగాది నాటికి సిద్ధం చేయాలని, ఉగాది నుంచి పనులు ప్రారంభించాలని సమీక్ష సందర్భంగా అభిప్రాయం వ్యక్తమైంది. గుట్టపై భక్తులకు సకల సదుపాయాలు కల్పించాలని సీఎం ఈ సందర్భంగా అధికారులను ఆదేశించారు.

భక్తి కార్యక్రమాలకు ఎలాంటి ఆటంకాలు, ఇబ్బందులు లేకుండా వసతిగృహాలు, మంటపాలు, వంటశాలలు నిర్మించాలని సూచించారు. నల్లగొండ జిల్లాలోని యాదగిరిగుట్టపై ఉన్న లక్ష్మీనరసింహస్వామి దేవస్థానాన్ని వాటికన్ సిటీ తరహాలో అభివృద్ధి చేస్తానని చెప్పిన ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు.. ఆ దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేయిస్తున్నారు. ఈ పవిత్ర కార్యక్రమంలో బుధవారం నేరుగా దిగిన ముఖ్యమంత్రి.. యాదగిరిగుట్టకు రోడ్డుమార్గంలో చేరుకుని.. దేవాలయం అభివృద్ధి, విస్తరణ పనులపై సమీక్షించారు. గుట్టకు చేరుకున్నది మొదలు.. పైన ఆలయాన్ని చేరుకునేదాకా.. మార్గమధ్యంలో అక్కడక్కడ తన కాన్వాయ్‌ని నిలిపి.. అక్కడ ఉన్న చెత్త తొలగించాలని, నాలాలు శుభ్రపరచాలని, రోడ్ల గుంతలను పూడ్చాలని అధికారులను ఆదేశించారు. అంతకుముందు ప్రముఖ ఆర్కిటెక్టులు రాజ్, జగన్, టెంపుల్ ఆర్కిటెక్ట్ ఆనంద్‌సాయి, స్థపతి సౌందర్‌రాజన్, యాదగిరిగుట్ట డెవలప్‌మెంట్ అథారిటీ సారథి కిషన్‌రావులతో కలిసి ఏరియల్ సర్వే నిర్వహించారు. అనంతరం రోడ్డుమార్గంలో ఆలయానికి చేరుకున్నారు. ముచ్చటగా మూడోసారి వచ్చిన ముఖ్యమంత్రికి ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా స్వామివారికి కేసీఆర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం దాదాపు 40 నిమిషాలపాటు గుట్టపైన, మధ్యభాగంలో, గుట్ట పాద ప్రాంతంలో కాలినడకన తిరిగి అణువణువు పరిశీలించారు. ఎక్కడెక్కడ ఏమి చేయాలో అధికారులతో కలిసి అంచనా వేశారు. యాదగిరిగుట్ట అభివృద్ధికి ప్రతి ఏటా బడ్జెట్‌లో రూ.100 కోట్లకు తక్కువ కాకుండా కేటాయిస్తామని ఈ సందర్భంగా కేసీఆర్ ప్రకటించారు. యాదగిరిగుట్టను సమగ్ర ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దుతామని ప్రతినబూనారు. పూజాది కార్యక్రమాలు ముగిసిన తర్వాత దేవాదాయశాఖ, రెవెన్యూ శాఖ, అధికారులు, ఆలయ ఆర్కిటెక్టులు, స్థపతి తదితరులతో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ తెలంగాణలో అతిపెద్ద దైవక్షేత్రమైన యాదగిరిగుట్టను అద్భుత రీతిలో తీర్చిదిద్దాలని చెప్పారు. ఉగాదిలోపు ఆలయ మాస్టర్‌ప్లాన్ సిద్ధం కావాలని, అభివృద్ధి పనులన్నీ ఉగాది నుంచి మొదలు పెట్టాలని సమీక్ష సందర్భంగా అభిప్రాయం వ్యక్తమైంది. అయితే.. ఆగమశాస్త్ర నియమాల ప్రకారమే నిర్మాణాలు జరగాలని, ప్రస్తుతం ఉన్నవాటిలో మార్పులు చేయాలని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. త్వరలో త్రిదండి శ్రీ చిన్నజీయర్ స్వామిని యాదగిరిగుట్టకు తీసుకువచ్చి అభివృద్ధికోసం ఆయన సలహాలు, సూచనలు కూడా తీసుకుంటామని చెప్పారు. రాయగిరినుంచి యాదగిరిగుట్టవరకు నాలుగు లైన్ల రోడ్డు నిర్మించాలని ఆర్‌అండ్‌బీ అధికారులను సీఎం ఆదేశించారు. గుట్టకు నాలుగు వైపుల ఉన్న వంగపల్లి, తుర్కపల్లి, రాయగిరి, రాజుపేటరోడ్లను బాగా అభివృద్ధి చేయాలని, రోడ్లు పక్కన ఆకర్షణీయమైన పూల మొక్కలు నాటాలని ఆదేశించారు. గుట్టచుట్టూ సుగంధం వెదజల్లే చెట్లు పెంచాలని ముఖ్యమంత్రి అటవీ శాఖ అధికారులను ఆదేశించారు.

KCR-visit-to-Yadagirigutta01

నాలుగు దిక్కుల నుంచి యాదగిరిగుట్టకు వెళ్లే మార్గంలో ప్రవేశించగానే వేదమంత్రాలు, స్తోత్రాలు, భక్తిగీతాలు, ఆలయ ప్రకటనలు వినిపించే విధంగా సౌండ్ సిస్టం ఏర్పాటు చేయాలన్నారు. రోడ్లకు ఇరువైపులా భక్తి భావాన్ని, నైతిక విలువలను పెంపొందించేలా, పర్యావరాణాన్ని కాపాడే విధంగా రాతలు కనిపించాలని సూచించారు. రాయగిరి, యాదగిరి గుట్టలను మిషన్ కాకతీయ కార్యక్రమం ద్వారా పునరుద్ధరించి, వాటిని పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చేయాలని నీటిపారుదల శాఖాధికారులను ఆదేశించారు. గుట్ట పైభాగంలో దాదాపు 14.5 ఎకరాల స్థలం ఉందని, దీనిని అణువణువు సమర్థవంతంగా, వ్యూహాత్మకంగా ఉపయోగించుకోవాలని చెప్పారు. ప్రధాన ఆలయం చుట్టూ మాడ వీధులు నిర్మించాలని సూచించారు. చాలాదూరం నుంచి కూడా గోపురం, ఆలయం చక్కగా కనిపించే విధంగా నిర్మాణం ఉండాలన్నారు. గుట్టపై భాగంలోనే ప్రధాన ఆలయంతో పాటు కళ్యాణ మంటపం, యాగశాల, ప్రవచన శాల, వ్రతశాల, వంటశాల నిర్మించాలని చెప్పారు. కనీసం 500 గదులు వచ్చే విధంగా కాటేజీలు నిర్మించాలని సూచించారు. గుట్టపైన కొన్ని వాహనాలు నిలిపిఉంచేందుకు వీలుగా పార్కింగ్ స్థలం ఏర్పాటు చేయాలని ఆదేశించారు. గుట్టపైకి వచ్చేందుకు, కిందికి వెళ్లేందుకు వేర్వేరు దారులు నిర్మించాలని సూచించారు. పెళ్లిళ్లు, వ్రతాలను పునరుద్ధరించాలని, సామూహిక సత్యనారాయణస్వామి వ్రతాలు చేసుకునే వెసులుబాటు కల్పించాలని ముఖ్యమంత్రి సూచించారు.

నిర్మాణాలు జరిగే సందర్భంగా కూడా పూజలకు ఆటంకం కలగని ప్రత్యామ్నాయ మార్గాలను చూడాలని చెప్పారు. గుట్టపై హెలీప్యాడ్ నిర్మించాలని కొందరు అధికారులు చేసిన సూచనను ముఖ్యమంత్రి తిరస్కరించారు. ఆలయాన్ని అభివృద్ధిచేసే క్రమంలో సంప్రదాయాలను, పవిత్రతను కాపాడటంకూడా అత్యంత కీలకమని ముఖ్యమంత్రి చెప్పారు. ప్రభుత్వం ఇచ్చే నిధులతోపాటు అనేకమంది దాతలుకూడా ముందుకు వస్తారని, కార్పొరేట్ సంస్థలు, బహుళజాతి కంపెనీలు కూడా ఆలయ అభివృద్ధిలో పాలుపంచుకునే అవకాశం ఉందని ముఖ్యమంత్రి అన్నారు. తాను ఎప్పటికపుడు యాదగిరిగుట్టకు వస్తూనే ఉంటానని, నిత్యం పనులను పర్యవేక్షిస్తానని చెప్పారు. యాదగిరిగుట్టలో నిర్మించే ఎత్తైన ఆంజనేయస్వామి విగ్రహానికి మెరుగైన కావాల్సిన రాయి ఎక్కడ దొరుకుతుందో తెలుసుకోవాలని, మంచి నైపుణ్యం కలిగిన శిల్పులకు దాని తయారీ బాధ్యత అప్పగించాలని సీఎం చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ గొంగిడి సునీత, ఆలయ ఈవో గీత, ప్రధానార్చకులు నల్లన్‌దీగల్ లక్ష్మీ నర్సింహాచార్యులు, కారంపూడి నర్సింహాచార్యులు, అర్చకులు పాల్గొన్నారు.

శరణు శరణు పుస్తకావిష్కరణ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి ప్రచురించిన శరణు శరణు అనే ఆధ్యాత్మిక పుస్తకాన్ని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఆవిష్కరించారు. యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహాస్వామికి చెందిన తైలవర్ణ చిత్రాలు, స్తోత్రాలు, భక్తి గీతాలు, స్థల పురాణ గాథలు, దైవ మహత్యపు వివరణలు ఈ పుస్తకంలో ఉన్నాయి

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the BRS Party.