-నెలరోజుల్లోనే ఇంతటి నమోదు దేశంలోనే రికార్డు -క్రమశిక్షణ కలిగిన కార్యకర్తల పార్టీగా తీర్చిదిద్దడమే లక్ష్యం -కార్యకర్తలందరికీ రూ.2 లక్షల ప్రమాద బీమా -ఇన్సూరెన్స్ కంపెనీకి రూ.11.21 కోట్ల చెల్లింపు -రాష్ట్రంలో ప్రజలు సుభిక్షంగా ఉన్నారు -ప్రతిపక్షాలకు మాట్లాడేందుకు అంశాలు లేవు -అందుకే అర్థంలేని ఆరోపణలు -టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు

దేశంలో క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలు.. ఉత్తమ నిర్మాణం కలిగిన సంస్థగా టీఆర్‌ఎస్‌ను తీర్చిదిద్దాలన్నది పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు లక్ష్యమని, అందుకు అనుగుణంగానే తాము పనిచేస్తున్నామని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కే తారకరామారావు అన్నారు. రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలు ఎప్పుడు జరిగినా.. పోటీ చేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. నెల రోజుల్లోనే 50 లక్షల సభ్యత్వ నమోదు చేయడం దేశంలోనే రికార్డని కేటీఆర్ అన్నారు. తెలంగాణభవన్‌లో బుధవారం యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీకి.. పార్టీ కార్యకర్తల ప్రమాద బీమా ప్రీమియంకు సంబంధించిన రూ.11.21 కోట్ల చెక్కును కేటీఆర్ అందజేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ, సభ్యత్వ నమోదుతోపాటు పార్టీ పటిష్ఠతకు కమిటీలు వేయాలని, సంస్థాగత నిర్మాణంమీద దృష్టి సారించాలని తమ పార్టీ అధినేత కేసీఆర్ నిర్దేశించారని చెప్పారు.
కార్యకర్తలను సుశిక్షితులైన సైనికులుగా తయారుచేయడానికి జిల్లాల్లో కార్యాలయాలను నిర్మించాలని సూచించారని తెలిపారు. పార్టీ కమిటీల నిర్మాణం జరుగుతున్నదని, చాలాచోట్ల గ్రామ కమిటీలు, పట్టణాల్లో బూత్ కమిటీలు వేస్తున్నారని కేటీఆర్ అన్నారు. దసరా వరకు పార్టీ కార్యాలయాల నిర్మాణం పూర్తయితే పార్టీ నిర్మాణం మీద, నాయకులు, కార్యకర్తలకు శిక్షణ మీద దృష్టి పెడుతామన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వాన్ని సమర్థంగా నడుపుతున్నారని, ప్రభుత్వపరంగా ఇచ్చిన హామీలను అమలుచేస్తున్నారని చెప్పారు. రాష్ట్రంలో బ్రహ్మాండంగా వర్షాలు పడుతున్నాయని, ప్రజలు సుభిక్షంగా ఉన్నారన్నారు. ప్రతిపక్షాలకు సమస్యలు లేక ఏదో ఒకటి మాట్లాడాలని విమర్శిస్తున్నారని, వాటి పట్ల తమకు ఆసక్తి లేదని, ఎవరెన్ని విమర్శలు చేసినా, సమయం వచ్చినప్పుడు తమ వాదనను ప్రజలకు వినిపించి.. ప్రజాక్షేత్రంలోనే తేల్చుకొంటామని స్పష్టంచేశారు.
జిల్లా పరిషత్ ఎన్నికల్లో ప్రజలు టీఆర్‌ఎస్‌వైపు నిలిచారని, 32జెడ్పీలను టీఆర్‌ఎస్‌కు కట్టబెట్టారని చెప్పారు. మున్సిపల్ ఎన్నికల్లో ప్రజాకోర్టులో తేల్చుకుందామన్నారు. ఎవరు బాగా పనిచేస్తున్నారో నిర్ణయించేది ప్రజలేనని చెప్పారు. క్యాబినెట్ విస్తరణ గురించి తనకు తెలియదని కేటీఆర్ తెలిపారు. పార్టీలో అన్ని కమిటీలు వేసుకున్నాక, కమిటీలవారీగా జిల్లా, రాష్ట్రస్థాయిలో శిక్షణలు ఉంటాయని చెప్పారు. హైదరాబాద్‌లో సభ్యత్వ వేగం పెంచాల్సిన అవసరం ఉన్నదని, టీఆర్‌ఎస్వీ సభ్యత్వాన్ని కూడా చేయాలని కేటీఆర్ పేర్కొన్నారు. పార్టీ అనుబంధ సంఘాలను పటిష్ఠపర్చాల్సి ఉన్నదని, తద్వారా సంస్థాగత నిర్మాణాన్ని బలోపేతం చేస్తామన్నారు. మున్సిపల్ ఎన్నికలు ఎప్పుడు జరుపాలో ఎన్నికల సంఘం నిర్ణయిస్తుందని, ఎన్నికలు ఎప్పుడు వచ్చినా తాము సిద్ధంగా ఉన్నామని చెప్పారు. రాజకీయాల్లో విమర్శలు, ప్రతివిమర్శలు సహజమని, బీజేపీ పని బీజేపి చేస్తుందని, తమ పని తాము చేస్తున్నామని చివరికి ప్రజల పని ప్రజలు చేస్తారని అన్నారు. గడిచిన ఐదేండ్లుగా కాంగ్రెస్ నాయకులు అనేక మాటలు మాట్లాడారని, కొంతమంది శపథాలు చేశారని, మరికొందరు గడ్డాలు తీయబోమని చెప్పారని గుర్తుచేశారు.

ప్రమాద బీమాకు రూ.11.21 కోట్ల ప్రీమియం ఇప్పటివరకు 50 లక్షల సభ్యత్వం పూర్తయిందని టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. 2014-15 నుంచి పార్టీ కార్యకర్తలకు ప్రమాద బీమా కల్పించడం ఆనవాయితీగా వస్తున్నదని చెప్పారు. సభ్యత్వం తీసుకున్నవారికి ఆగస్టు 1 నుంచి ప్రమాద బీమా వర్తిస్తుందని ఆయన వెల్లడించారు. ప్రమాదవశాత్తు చనిపోయినవారికి రూ.2 లక్షలు చెల్లించడం జరుగుతుందన్నారు. దీనికి సంబంధించిన ప్రీమియం రూ.11.21 కోట్లను ఇన్సూరెన్స్ కంపెనీకి చెల్లించామని తెలిపారు. సభ్యత్వ నమోదు బ్రహ్మండంగా జరిగిందని, నెల రోజుల్లో 50లక్షల సభ్యత్వం చేయడం దేశంలో ఒక రికార్డుగా ఆయన అభివర్ణించారు. హైదరాబాద్ నగరంలో సభ్యత్వం కొనసాగుతున్నదన్నారు. పార్టీ సభ్యత్వాన్ని విజయవంతం చేయడానికి కృషిచేసిన పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు సహా ఇతర నాయకులకు కేటీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు తలసాని శ్రీనివాస్‌యాదవ్, సీహెచ్ మల్లారెడ్డి, మాజీ మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, జోగు రామన్న, ప్రభుత్వ విప్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు చల్లా ధర్మారెడ్డి, వినయ్‌భాస్కర్, ఎమ్మెల్సీలు మాదిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, శంభీపూర్‌రాజు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, టీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శి గట్టు రాంచందర్‌రావు, సాట్స్ చైర్మన్ వెంకటేశ్వర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.