Bharat Rashtra Samithi

Bharat Rashtra Samithi

KCR
telangana talli img

త్వరలో 9గంటల ఉచిత కరెంటు

– పాలమూరు ఎత్తిపోతలతో జిల్లా కరువును తరిమికొడతాం – కేసీఆర్ పట్టుబడితే దాని అంతుచూసే దాకా వదలరు – నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు – కొడంగల్ కాంగ్రెస్ నుంచి భారీగా టీఆర్‌ఎస్‌లో చేరికలు

Harish-Rao-inviting-congress party members in-to-Party

తెలంగాణ ఏర్పడితే రాష్ట్రం అంధకారమైతదని అన్నవారేగానీ.. 24 గంటల కరెంటు ఉంటుందని ఎవరూ కలలో కూడా ఊహించలేదని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి టీ హరీశ్‌రావు అన్నారు. కానీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు రాజధాని హైదరాబాద్‌తో పాటు కొడంగల్ నియోజకవర్గంలోని మారుమూల తండాలో కూడా కోతల్లేకుండా కరెంటు ఇచ్చారన్నారు. ఇదేరీతిన రానున్న రోజుల్లో రైతులకు తొమ్మిది గంటల ఉచిత విద్యుత్తును సరఫరా చేస్తామని స్పష్టం చేశారు.

మహబూబ్‌నగర్ జిల్లా కొడంగల్ నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ ముఖ్యనేతలు కృష్ణయ్య, మల్లిక్‌రెడ్డి ఆధ్వర్యంలో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీసంఖ్యలో టీఆర్‌ఎస్‌లో చేరారు. తెలంగాణ భవన్‌లో సోమవారం మధ్యాహ్నం మంత్రులు హరీశ్‌రావు, జూపల్లి కృష్ణారావు, సీ లక్ష్మారెడ్డి, తదితరుల సమక్షంలో వారంతా గులాబీ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ.. జై తెలంగాణ అని జెండా పట్టిననాడు తెలంగాణ వస్తదా? అన్నరు. కానీ కేసీఆర్ పట్టుబట్టిండంటే దాని అంతు చూసేదాకా విడవరు అని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో కేవలం కమీషన్లు, కాంట్రాక్టర్ల కోసమే ప్రాజెక్టులు చేపట్టారని, నీళ్లకోసం కాదన్నారు. కృష్ణా బేసిన్‌లో లేని హంద్రీనీవా, పోతిరెడ్డిపాడు, గాలేరునగరి సుజల స్రవంతికి శ్రీశైలం నుంచి నీళ్లు తీసుకుపోగా లేంది.. హక్కుదారులైన మహబూబ్‌నగర్ జిల్లావాసుల కోసం శ్రీశైలంనుంచి నీళ్లెందుకు తీసుకోవద్దని ప్రశ్నించారు.

అందుకే సీఎం స్వయంగా ఇంజినీర్‌లా మారి, పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని చేపడుతున్నారని మంత్రి చెప్పారు. ఆయన దిశానిర్దేశంలో పాలమూరు జిల్లాకు సాగు నీరిచ్చే బాధ్యత తనదేనన్నారు. జిల్లాలో అత్యధికంగా కొడంగల్ తాలూకాలోని 1.08 లక్షల ఎకరాలకు ఈ పథకం ద్వారా సాగునీరు అందుతుందన్నారు. పాలమూరు పథకంలో భూసేకరణ చట్టం కాకుండా ల్యాండ్ పర్చేజ్ విధానాన్ని అమలు చేస్తున్నామని మంత్రి తెలిపారు. వచ్చే వారంలోనే నోటిఫికేషన్ జారీ అవుతుందన్నారు.

రైతులు సంవత్సరాల తరబడి పరిహారంకోసం తిరగాల్సిన అవసరంలేదని, అధికారులు రైతులతో మాట్లాడి, వారిని సంతృప్తి పరిచిన వెంటనే చెక్కుల పంపిణీ ఉంటుందన్నారు. రైతులకు రూపాయి ఎక్కువనే పరిహారం ఇస్తామన్నారు. ఇక నుంచి కొడంగల్ నియోజకవర్గంలో గుర్నాథరెడ్డి కేవలం చేతులెత్తి నమస్కరిస్తూ ప్రజల్లోకి వెళ్లాలని, రెండు పక్కలా కృష్ణ, మల్లిక్‌రెడ్డిలు ఉండాలని, నియోజకవర్గ అభివృద్ధిని తాము చూసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు. కాంగ్రెస్ ఢిల్లీ, గల్లీల్లో మునిగిన పడవ అని, ఆ పార్టీలో ఉండి కూడా చేసేదేమీలేదన్నారు. గతంలో ఆ పార్టీ నుంచి జిల్లా మంత్రిగా పని చేసిన డీకే అరుణ పాలమూరు జిల్లాను ఎండబెట్టి అనంతపురానికి ఆ ప్రాంత నాయకులు నీళ్లు తీసుకుపోతే.. ఎదురుపోయి హారతి ఇచ్చారని విమర్శించారు.

నాలుగేండ్లలో అరవయ్యేండ్ల అభివృద్ధి.. కేసీఆర్ నాయకత్వంలో మహబూబ్‌నగర్ జిల్లాలో నాలుగేండ్లలోనే అరవయ్యేండ్ల అభివృద్ధి జరుగుతుందని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ఇప్పటివరకు 18 మంది సీఎంలు రాష్ర్టాన్ని, దాదాపు 16 మంది పీఎంలు దేశాన్ని పాలించారని, కానీ మూడున్నర, నాలుగేండ్లలో ప్రతి ఇంటికీ నల్లా నీళ్లు ఇయ్యకుంటే వచ్చే ఎన్నికల్లో ఓట్లు అడగబోమని నిండు సభలో చెప్పిన వారు లేరన్నారు. కేసీఆర్ దమ్మున్న నాయకుడిలా ప్రజలకు హామీ ఇచ్చారన్నారు.

మళ్లీ ద్వంద్వ వైఖరి… పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని నాలుగేండ్లలో పూర్తి చేస్తే తమ పార్టీని టీఆర్‌ఎస్‌లో కలిపేస్తామని నారాయణ్‌పేట ఎమ్మెల్యే చెప్పారని, మరోవైపు ఆ పార్టీ అధినేత చంద్రబాబు ఈ పథకాన్ని అడ్డుకుంటారని, ఇది టీడీపీ ద్వంద్వ వైఖరికి నిదర్శనమని మంత్రి లక్ష్మారెడ్డి విమర్శించారు. తెలంగాణ ప్రణాళిక బోర్డు ఉపాధ్యక్షుడు నిరంజన్‌రెడ్డి, ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ, రేవంత్‌రెడ్డిని గెలిపించిన కొడంగల్ ప్రజలు ఇప్పుడు పశ్చాత్తాపంతో బాధపడుతున్నారని, టీడీపీ ఆనవాళ్లు లేకుండా చేసి ప్రాయశ్చిత్తం చేసుకోవాలని అనుకుంటున్నారని అన్నారు. కొడంగల్ నుంచి రేవంత్‌రెడ్డిని గెలిపిస్తే ఏడాదిలో ఆ ప్రాంతానికి ఎంతో పేరు తెచ్చిండని నియోజకవర్గ టీఆర్‌ఎస్ ఇన్‌చార్జి గుర్నాథరెడ్డి ఎద్దేవా చేశారు.

గాంధీకే కాదు.. గాడ్సేకు కూడా పేరు వచ్చిందని, అదేవిధంగా రేవంత్ పేరు కూడా గాడ్సే లెక్క మారుమోగిందన్నారు. తెలంగాణ, ఏపీని మళ్లీ కలిపి, చంద్రబాబు నాయకత్వంలో సిగ్గులేకుండా బానిసత్వం చేయాలని రేవంత్ అనుకుంటున్నాడని విమర్శించారు. మహబూబ్‌నగర్ జిల్లా టీఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షుడు శివకుమార్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పాలమూరు జడ్పీ చైర్మన్ భాస్కర్, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు మర్రి జనార్ధన్‌రెడ్డి, ఏనుగు రవీందర్‌రెడ్డి, అంజయ్యయాదవ్, ఎమ్మెల్సీ యాదవరెడ్డి, మాజీ ఎమ్మెల్సీలు జగదీశ్వర్‌రెడ్డి, భూపతిరెడ్డి, ఇంద్రసేనారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the BRS Party.