-పథకంపై సీఎం కేసీఆర్ సమీక్ష -గర్భిణులు, బాలింతలు, పిల్లలకు ప్రతిరోజూ కోడిగుడ్డు -5.90 లక్షల మంది గర్భిణీలు, బాలింతలు, -18.20 లక్షల మంది పిల్లలకు పోషకాహారం -36 వేల అంగన్‌వాడీల్లో అమలు
క్రమబద్ధీకరణకు ఇదే చివరి అవకాశం -నిర్ణీత గడువులోగా దరఖాస్తు చేసుకోవాలి -ఇకనుంచి ఆక్రమణలు సహించేదిలేదు -పీడీ యాక్టు ప్రయోగించడానికీ సిద్ధం -సమీక్షలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు

రాష్ట్రంలోని తల్లీబిడ్డల సంక్షేమంకోసం కేసీఆర్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బాలింతలు, గర్భిణులు, చిన్న పిల్లలకు సంపూర్ణ పోషకాహారం ఇచ్చేందుకు ఆరోగ్య లక్ష్మి పథకాన్ని తీసుకువచ్చింది. ఈ పథకంద్వారా దాదాపు 36వేల అంగన్‌వాడీల ద్వారా గర్భిణులు, బాలింతలు, చిన్న పిల్లలకు ఒక పూట సంపూర్ణ భోజనం అందించేందుకు సంకల్పించింది.
ఈ పథకంపై సోమవారం సాయంత్రం సచివాలయంలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఉన్నతాధికారులతో సమీక్షించారు. భూ ఆక్రమణలు, నిర్మాణాల క్రమబద్ధీకరణ అంశంపై విడిగా సంబంధిత అధికారులతో ఆయన సమీక్ష జరిపారు. ఈ సదుపాయాన్ని నిర్దిష్ట గడువులోనే అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. క్రమబద్ధీకరణకు దరఖాస్తు చేసుకోనివారి స్థలాలను, నిర్మాణాలను అక్రమంగా గుర్తించి, వాటిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందని స్పష్టం చేశారు.
తల్లీబిడ్డ ఆరోగ్యంగా ఉండాలి: రాష్ట్రంలోని తల్లి, బిడ్డలందరూ ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షించిన ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు.. తల్లీ, బిడ్డల ఆరోగ్యంకోసం ప్రభుత్వం అందించే పౌష్టికాహారాన్ని అందుకోవాలని పిలుపునిచ్చారు. అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా గర్భిణులు, బాలింతలకు, పిల్లలకు ప్రతిరోజూ ఒకపూట పోషకాలతో నిండిన సంపూర్ణ భోజనం అందించే కార్యక్రమాన్ని నూతన సంవత్సర కానుకగా జనవరి ఒకటి నుంచి అందిస్తున్నట్టు ముఖ్యమంత్రి వెల్లడించారు. సచివాలయంలో ఆరోగ్యలక్ష్మి పథకంపై ఉన్నతాధికారులతో సమీక్షించిన సీఎం.. గర్భిణులు, బాలింతలకు మంచి ఆహారం అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ పథకాన్ని రాష్ట్రంలోని 31,897 అంగన్‌వాడీ కేంద్రాలు, 4076 మినీ అంగన్‌వాడీ కేంద్రాల్లో అమలు చేస్తున్నట్లు చెప్పారు.
ఆరోగ్య లక్ష్మి కార్యక్రమం..: గతంలో గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారం అందించే కార్యక్రమం మొక్కుబడిగా సాగింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమంలో చాలా మార్పులు తెచ్చింది. గతంలో ఏడు నెలల నుంచి మూడేండ్ల వయసున్న పిల్లలకు నెలకు 8 కోడిగుడ్లు అందించేవారు. దీనిని నెలకు 16 కోడిగుడ్లకు పెంచాలని ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారు. గుడ్లతోపాటు గోధుమలు, పాలపొడి, శనగపప్పు, చక్కెర, నూనెలతో కూడిన రెండున్నర కిలోల ప్యాకెట్‌ను ప్రతినెల మొదటి తేదీన అందిస్తున్నారు.
3నుంచి 6 సంవత్సరాల పిల్లలకు గతంలో నెలకు 16 గుడ్లు అందించేవారు. తెలంగాణ రాష్ట్రంలో రోజుకు ఒక కోడిగుడ్డును ఇవ్వాలని నిర్ణయించారు. గుడ్లతోపాటు ప్రతిరోజూ పిల్లలకు అన్నం, పప్పు, కూరగాయలు, స్నాక్స్ అందిస్తున్నారు. గర్భిణులు, బాలింతలకు గతంలో నెలకు 3 కిలోల బియ్యం, ఒక కిలో కందిపప్పు, అరకిలో నూనె అందించేవారు. 68 ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో నెలకు 16 గుడ్లు, 81 ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో నెలకు 25 గుడ్లు అందించేవారు. తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 149 ఐసీడీఎస్ ప్రాజెక్టుల్లో నెలకు 30 రోజులపాటు గుడ్లు అందిస్తున్నారు. గుడ్లతోపాటు కనీసం 25 రోజులపాటు సంపూర్ణ భోజనం, రోజూ 200 మిల్లీ లీటర్ల పాలు అందిస్తున్నారు. ఈ పథకంద్వారా తెలంగాణలోని 5,90,414 మంది గర్భిణీలు, బాలింతలకు, 18,20,901 మంది పిల్లలకు ప్రభుత్వం పోషకాహారం అందుతుంది.
బాలింతలు, పాలిచ్చే తల్లులకు ఆరోగ్యలక్ష్మి రాష్ట్రంలోని గర్భిణీలకు, పాలిచ్చే తల్లులకు ఐసీడీఎస్ ద్వారా అమలు చేస్తున్న ఒక్కపూట సంపూర్ణ మధ్యాహ్న భోజనం పథకానికి ఆరోగ్యలక్ష్మి పేరును ఖరారు చేస్తూ స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ పూనం మాలకొండయ్య సోమవారం ఉత్తర్వులు జారీచేశారు. గతంలో ఇందిరమ్మ అమృత హస్తం పథకంకింద మహిళలకు కొన్ని సరుకులు ఇచ్చేవారు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో బాలింతలకు, పాలిచ్చే తల్లులకు ఒక్కపూట మధ్యాహ్న భోజనం పథకంగా దీన్ని మార్చారు. పథకం మార్గదర్శకాలు కూడా మారిన నేపథ్యంలో ఈ పథకానికి ఆరోగ్యలక్ష్మి పేరును ఖరారు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
క్రమబద్ధీకరించకుంటే చర్యలు తప్పవు:సీఎం కేసీఆర్ ప్రభుత్వ స్థలాలను క్రమబద్ధీకరించేందుకు కల్పించిన సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని, నిర్ణీత గడువులోగానే అందరూ దరఖాస్తు చేసుకోవాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు సూచించారు. ప్రభుత్వ భూములను ఆక్రమించి, భవనాలు కట్టుకున్న వారు కూడా వెసులుబాటును ఉపయోగించుకోవాలన్నారు. దరఖాస్తు చేసుకోని ప్రతి స్థలాన్ని స్వాధీనం చేసుకుంటామని ప్రకటించారు. సోమవారం పేదల భూములు, ఇతర నిర్మాణాల క్రమబద్ధీకరణ అంశంపై సచివాలయంలో ముఖ్యమంత్రి సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆక్రమణలకు తావులేకుండా పూర్తిస్థాయి ప్రక్షాళన చేసేందుకే ప్రభుత్వం క్రమబద్ధీకరణ నిర్ణయం తీసుకుందని అన్నారు.
క్రమబద్ధీకరణకు ఇదే చివరి అవకాశమని చెప్పారు. రెగ్యులరైజ్ చేసుకోని వారిని ఆక్రమణదారులుగా పరిగణిస్తామన్నారు. అలాంటి ఆక్రమణదారులపై ప్రభుత్వ అత్యంత కఠినంగా వ్యవహరిస్తుందని, పీడీ యాక్టు కూడా ప్రయోగించేందుకు వెనుకాడదని హెచ్చరించారు. 125 గజాల వరకు ప్రభుత్వ భూమిలో పేదలు ఆక్రమించుకొని నివాసాలు ఏర్పాటు చేసుకుంటే ఉచితంగానే రెగ్యులరైజ్ చేయాలని నిర్ణయించినందున, వారంతా వెంటనే దరఖాస్తు చేసుకోవాలన్నారు. మిగతా వారి విషయంలో కూడా ప్రభుత్వం నిర్దేశించిన ధర ప్రకారం చెల్లించాలన్నారు. దరఖాస్తుతోపాటు ఆ మొత్తంలో 25% చెల్లించాల్సి ఉంటుందని గుర్తు చేశారు.
90 రోజుల్లో పూర్తి చేయాలి స్థలాల క్రమబద్ధీకరణ ప్రక్రియను 90 రోజుల్లో పూర్తి చేయాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. డిసెంబర్ 31న ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయినందున, ఆ తర్వాత 20 రోజుల్లోపే అందరూ దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందన్నారు. దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ ఏప్రిల్ మాసంవరకు పూర్తవుతుందని చెప్పారు. ఆ తర్వాత తెలంగాణలో ఏ ప్రాంతంలోనూ అంగుళం భూమికూడా దురాక్రమణ జరగడానికి వీల్లేదన్నారు. ఆక్రమణకు ఎవరైనా ప్రయత్నిస్తే ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని పునరుద్ఘాటించారు. వారందరినీ కబ్జాదారులుగా గుర్తించి చర్యలు తీసుకుంటామన్నారు. అక్రమ కబ్జాలు కొనసాగిస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో రాజీపడమని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని ప్రతి అంగుళం భూమికీ పట్టా ఉండాలని అభిప్రాయపడ్డారు.
దురాక్రమణలకు చరమగీతం పాడాలి రాష్ట్రంలో ప్రభుత్వ భూముల దురాక్రమణకు చరమగీతం పాడాలని సీఎం కేసీఆర్ ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ క్రమంలో క్రమబద్ధీకరణ ప్రక్రియను చేపట్టామన్నారు. అలాగే భూముల రిజిస్ట్రేషన్లన్నీ సక్రమంగా ఉండాలన్నారు. మొత్తంగా భూముల వ్యవహారంలో సమూల ప్రక్షాళన జరుగాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమని చెప్పారు. సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ, రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బీఆర్ మీనా, సీఎంవో ముఖ్య కార్యదర్శి నర్సింగ్‌రావు తదితరులు పాల్గొన్నారు.
క్రమబద్ధీకరణ ప్రక్రియకు ఇద్దరు ఐఏఎస్‌లు ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన క్రమబద్ధీకరణ ప్రక్రియను వేగవంతంగా, లోపాలు లేకుండా పూర్తి చేసేందుకు అనుభవం కలిగిన ఇద్దరు ఐఏఎస్ అధికారులను రెండు, మూడు రోజుల్లో ప్రత్యేక అధికారులుగా నియమించేందుకు సీఎం కేసీఆర్ అంగీకరించినట్లు తెలిసింది. 20 రోజుల్లో దరఖాస్తుల స్వీకరణ, మొత్తంగా 90 రోజుల్లో పరిశీలన, దర్యాప్తు, పట్టాల పంపిణీ వంటి కార్యక్రమాన్ని చేపట్టడం పట్టణ ప్రాంతాల్లో కష్టతరం. ప్రధానంగా హెచ్‌ఎండీఏ పరిధిలో అమలు చేయడంలో ఇబ్బందులు ఎదురవుతాయని సీఎంకు రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ బీఆర్ మీనా వివరించారు. ఒక్కొక్క మండలం నుంచి వేలల్లో దరఖాస్తులు వచ్చే అవకాశం ఉంది. ప్రతి స్థలం దగ్గరికి వెళ్లి ఫోటోలు తీయడం మొదలుకొని విచారణను పూర్తి చేసేందుకు సమయం ఎక్కువగా పడుతుంది. ఈ క్రమంలో వేగంగా ముగించడంలో లోపాలు తలెత్తే అవకాశం ఉంది. అందుకే ప్రత్యేక అధికారుల నియామకం అనివార్యమన్న సూచనను సీఎం కేసీఆర్ ఆమోదించినట్లు సమాచారం.