బంగారు తెలంగాణ గమ్యాన్ని ముద్దాడేవరకూ ఆట, పాటలు, డప్పు చప్పుళ్లు, గజ్జెల మోతలు ఆగకూడదని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు కళాకారులకు పిలుపునిచ్చారు. ఉద్యమాన్ని ప్రజల వద్దకు చేర్చిన ఘనత ముమ్మాటికీ కళాకారులదేనని ఆయన ప్రశంసించారు. ఎక్కడ తెలంగాణ సభలు జరిగినా కళాకారులు బస్సులు, బండ్లు, లారీలు అని చూడకుండా వెల్లువలా తరలివచ్చేవారని గుర్తు చేసుకున్నారు. కళాకారుల వల్లనే ఉద్యమం అజేయశక్తిగా మారిందని, వారికి ఉద్యోగాలివ్వడం అనేది చాలా చిన్న అంశమని అన్నారు. ఉద్యోగాలతోపాటు వారి కుటుంబాలకు హెల్త్‌కార్డులు కూడా ఇస్తామని ఆయన ప్రకటించారు.

-గమ్యాన్ని ముద్దాడే దాకా గజ్జెమోత ఆగవద్దు -తెలంగాణ ఉద్యమాన్ని అజేయ శక్తిగా మార్చింది కళాకారులే -కళాకారుల కుటుంబాలకు హెల్త్‌కార్డులిస్తాం -ఇక మా బ్రాండ్ అంబాసిడర్లు మీరే -ప్రభుత్వం, ప్రజల మధ్య వారథిగా మారాలి -రసమయి క్యాబినెట్ మంత్రి అవుతారు -తెలంగాణ సాంస్కృతిక సారథి భవనానికి మిద్దె రాములు పేరు -కళాకారుల సమ్మేళన సభలో సీఎం కేసీఆర్ తెలంగాణ ధూం ధాం ప్రారంభించి ఎక్కడెక్కడో ఉన్న కళాకారులందరినీ ఒక్క వేదిక మీదికి తెచ్చి ఉద్యమాన్ని ఉర్రూతలూగించిన రసమయి బాల్‌కిషన్ త్వరలో క్యాబినెట్ మంత్రి అవుతాడని కేసీఆర్ చెప్పారు. తెలంగాణ సాంస్కృతిక సారథి భవనానికి మిద్దె రాములు పేరును, పక్కనే ఉన్న మరో భవనానికి వరంగల్ శంకరన్న పేరు, భవనంలోని ఆర్ట్ గ్యాలరీకి కాపు రాజయ్య పేరు పెడుతామని చెప్పారు. ఆదివారం హైదరాబాద్‌లో జరిగిన తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారుల సమ్మేళన సభలో కేసీఆర్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఉద్వేగం, ఉత్తేజం, ఉల్లాసం కలిగలిపి అనర్ఘళంగా సాగిన కేసీఆర్ ప్రసంగం ఆసాంతం ఉద్యమ ప్రస్థానాన్ని స్పృషిస్తూ, కళాకారుల సేవలను ప్రస్తుతిస్తూ.. భవిష్యత్తు కర్తవ్యాన్ని నిర్దేశిస్తూ సాగింది. సాంస్కృతిక సారథులుగా ఎంపికైన కళాకారులు ఇకనుంచి బంగారు తెలంగాణ నిర్మాణంలో కీలక పాత్ర వహించాలని, ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారథిగా పనిచేస్తూ ఈ ప్రభుత్వం మాది.. మనకోసం ఉందిఅనే భావన ప్రజల్లో కలిగించేలా తమ కళారూపాలతో ప్రజల్లోకి వెళ్లాలని సూచించారు. ఈ సమావేశం అనంతరం ప్రభుత్వం ఒక ప్రకటన విడుదల చేస్తూ అంతర్జాతీయ స్థాయిలో హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద 14 ఎకరాల విస్తీర్ణంలో అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణ సంస్కృతి, వారసత్వం ఉట్టిపడేలా కళాభారతి భవనాన్ని నిర్మించనున్నట్టు తెలిపింది.

పుట్టింటికి వచ్చినట్టున్నది.. పది నెలలుగా సచివాలయంలో ఉక్కిరిబిక్కిరిగా గడిపిన తనకు ఈ సభతో పుట్టింటికి వచ్చిన అనుభూతి కలుగుతున్నదని తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారుల సమ్మేళన సభలో సీఎం కేసీఆర్ అన్నారు. కళాకారులతో తనకున్న అనుబంధంనుంచి అనేక ఉద్యమ ఘట్టాలు, అనుభవాలు ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. కళాకారులు ఆకలి కడుపులతో, తినీతినక, అటుకులు బుక్కి పాటలు పాడి పజల్లో చైతన్యం తెచ్చారని అన్నారు.
ఉద్యమంలో ఒక్కో జ్ఞాపకం గుర్తుకు వస్తే కండ్లలో నీళ్లు తిరుగుతాయని అన్నారు. ఎన్నో అణచివేతలు, అవమానాలు, అవహేళనలు ఎదుర్కున్నామని అన్నారు. అయినా బెదరకుండా కళాకారులు తీసుకున్న గట్టి సంకల్పం వల్లే స్వరాష్ట్రం సాధించుకున్నామని అన్నారు. ఎక్కడికక్కడ ఎందరో గాయకులు, కవులు, కళాకారులు ఉద్యమం తమది అన్న గొంతు కలిపి నడిచారని అన్నారు. ఉద్యమ ప్రస్థానంలో ఒక్కోపాట ఒక ఆణిముత్యమని చెప్పారు. మా జిల్ల పేరు చెపితే జల్లు మనాలే .. గుంటూరు జిల్లాలో గుంటెడు జాగడిగితిమా..అయ్యోనివా నువ్వు అవ్వోనివా వంటి పాటలు ప్రత్యర్థులను బెంబేలెత్తించాయని గుర్తు చేసుకున్నారు.
ప్రతి పాటకు తెలంగాణ రుణపడి ఉందని అన్నారు. ఎండకు ఎండి వానకు తడిసి ఎన్నో ఇక్కట్టు పడ్డం.. 2003లో వరంగల్ కళాకారుల యాత్ర జరిపినం.. హేలనగా మాట్లడి గోల చేసిన వారిని బోల్తా కొట్టించినం అని గుర్తు చేసుకున్నారు. ప్రభుత్వం 550 మంది కళాకారులను ప్రభుత్వంలో భాగస్వాములను చేసింది.. ఇంకా పదో ఇరవయ్యో మిగిలితే వారికీ అవకాశం ఇస్తం.. అని కేసీఆర్ అన్నారు. నిన్నటిదాకా ఉద్యమకారులైన కళాకారులు ఇకనుంచి బంగారు తెలంగాణకు కరదీపికలు కావాలని అన్నారు. ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధులు కావాలని, ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకుపోవాలని అన్నారు. తెలంగాణ పునర్నిర్మాణం కోసం ప్రభుత్వం రూపొందిస్తున్న పథకాలపై పాటలు కట్టాలి.. ప్రజల్లో ప్రచారానికి గజ్జె కట్టాలి అని కోరారు.

సాంస్కృతిక సారథి భవనంలో కళాకారులకు కావలిసిన అన్ని ఏర్పాట్లు చేస్తామని చెప్పారు. ప్రజల భాషలో మాట్లాడి ప్రజల్లో మమేకం కాగలిగిన శక్తి కళాకారుల సొంతం..మీరు పూనుకుంటే ప్రతి కార్యక్రమం తప్పకుండా విజయవంతమవుతుంది అని ఆయన అన్నారు. ఇకనుంచి ప్రభుత్వం చేపట్టే పథకాల ప్రకటనలకు సినిమా యాక్టర్లను పెట్టం మీరే మా యాక్టర్లు.. మీరే పాటల రచయితలు..అని చెప్పారు. సంక్షేమ పథకాలైన మిషన్ కాకతీయ, హరిత హారంవంటి పథకాలతో పాటు ప్రజల్లో నెలకొన్న మూఢాచారాలు, వెనుకబాటుతనాన్ని పారదోలేందుకు నడుం కట్టాలని అన్నారు. కళాబృందాలకు తగిన వసతి, భోజన సదుపాయం, వారికి కావల్సిన వస్తు సామాగ్రిని అందించాలని సాంస్కృతిక శాఖ ప్రధాన కార్యదర్శి బీపీ ఆచార్యను సీఎం ఆదేశించారు.
తెలంగాణ సస్యశ్యామలం: సంక్షేమ పథకాలే కాదు.. దీర్ఘకాలంలో తెలంగాణను సస్యశ్యామలం చేయాలనే తలంపుతో మిషన్ కాకతీయ, హరితహారం వంటి కార్యక్రమాలు చేపట్టామని వీటిని ప్రజా ఉద్యమంగా మార్చే బాధ్యతను కళాకారుల తీసుకోవాలని అన్నారు. కాకతీయ రాజులు నిర్మించిన వేల చెరువులను పునరుద్ధరించుకోవాల్సి ఉందని అన్నారు. తెలంగాణలో చెరువుల ప్రాధాన్యతను గుర్తించిన బచావత్ ట్రిబ్యునల్ కృష్ణా బేసిన్ నుంచి 95 టిఎంసీలు, గోదావరినుంచి 175 టిఎంసీలు కేటాయించిందని చెప్పారు. ఈ నీటిని నిల్వ చేసుకోవడానికి చెరువులను పునరుద్ధరించుకోవాల్సి ఉందన్నారు. మిషన్ కాకతీయతో బోర్ల కాలం పోయి మళ్లీ బావుల కాలం వస్తుందని సీఎం వివరించారు. బోర్లు ఎండిపోయి రైతులు ఆత్మహత్యలు చేసుకున్న సంఘటనలు కలిచివేసి మిషన్ కాకతీయకు శ్రీకారం చుట్టామని చెప్పారు.
నా జీవితం పండింది.. పదవినిచ్చి కట్టేశారు..: తెలంగాణ రాష్ట్రం సాధించడంతోనే నా జీవితం పండింది.. ధన్యమైంది. ఇది సాలు అనుకున్నా. అయితే ప్రజలు పదవిని ఇచ్చి కట్టిపారేశారు అంటూ కేసీఆర్ తన ప్రసంగంలో ఉద్వేగానికి గురయ్యారు. 14 ఏండ్లు మీవెంట ఉన్నా. కష్టాలు, కన్నీళ్లు పంచుకున్నం. ఏ పరిస్థితి వచ్చినా ధైర్యం వీడకుండా నడిచిండ్రు..అందరినీ తట్టి లేపిండ్రు.. తెలంగాణ తెచ్చిండ్రు.. మీరొక తుఫాన్.. ఒక శక్తి.. మిమ్మల్ని గుండెల్లో పెట్టుకోవాలె. తెలంగాణ గెలువాలె.. ఆ ఆత్మైస్థెర్యం మీరే ఇవ్వాలె అని సీఎం అన్నారు.. నాకు 61 ఏండ్లు.. ఎన్నేండ్లుంటనో.. నేను ఉన్నా లేకున్నా మీరు తెలంగాణను ముందుకు తీసుకుపోవాలె.. అని కేసీఆర్ అన్నారు.
జిద్దు పడితే అన్నీ సాధ్యమే..: తెలంగాణ వచ్చినా ఆంద్రోళ్లతో పంచాయితీలు ఒడువలేదని కేసీఆర్ అన్నారు. అయితే వెనుకంజ వేయబోమని అన్నారు. జిద్దు పడితే ఏదైనా సాధ్యపడుతుందని అన్నారు. తెలంగాణ వస్తే రాష్ట్రం అంధకారం అవుతుందని కట్టె పట్టుకోని కిరణ్‌కుమార్ చెప్పిండు. ఆయన ఇవ్వాళ్ల ఎక్కడున్నడు? నేడు కరెంట్ ఎట్ల వస్తుంది? అని ప్రశ్నించారు. ఇక నుంచి తెలంగాణలో కరెంట్ కోతలు ఉండవు అని చెప్పారు. వచ్చే మార్చి నుంచి పగటిపూట 9 గంటల నాణ్యమైన కరెంట్‌ను అందిస్తామని ప్రకటించారు.
బాలకిషన్ మంత్రి అవుతాడు..: ఉద్యమంలో బాలకిషన్ చేసిన కృషికి తగిన ఫలితం త్వరలోనే వస్తుందని సీఎం కేసీఆర్ అన్నారు. ఇపుడు క్యాబినెట్ ర్యాంకే వచ్చింది.. త్వరలో మంత్రివర్గంలో సభ్యుడవుతాడని అన్నారు. సాంస్కృతికశాఖ మంత్రి అయ్యే మంచిరోజులున్నాయని చెప్పారు. ధూం..ధాం కార్యక్రమాలపై కేసీఆర్ మాట్లాడుతున్నప్పుడు రసమయి కంటతడి పెట్టడంతో ఇక నుంచి కళాకారులు కంటతడి పెట్టరాదు.. అన్ని ప్రభుత్వ ఫలాలు అందిస్తామని సీఎం భరోసా ఇచ్చారు.
దారిద్య్రాన్ని పారద్రోలితేనే తెలంగాణకు సార్థకత..: దళితవాడలు, తండాలనుంచి దారిద్య్రం పారద్రోలినపుడే తెలంగాణ రాష్ట్రం సాధించి నందుకు సార్థకత ఏర్పడుతుందని కేసీఆర్ అన్నారు. దళితులు దుర్భర దారిద్య్రంలో కొట్టు మిట్టాడుతున్నారని, ఈ పాటి దానికి గత ప్రభుత్వాలు ఏదో దేశమంతా దోచి దళితులకు పెట్టామన్నట్టు ప్రచారాలు చేసుకున్నాయని దుయ్యబట్టారు. ఏదైనా సాధించాలంటే పట్టుదల ఉండాలని, కొత్తగా ఆలోచించాలని చెప్పిన కేసీఆర్ బంగ్లాదేశ్‌లో ప్రొఫెసర్ యూనస్ చేసిన ప్రయోగాన్ని వివరిం చారు.
రోజువారీ వ్యాపారానికి వడ్డీలు తీసుకుని నలిగిపోతున్న మహిళలకు తానే వడ్డీకి రుణాలు ఇచ్చి ఆరునెలల తర్వాత వారిని పిలిచి ఆ డబ్బులు వారికి తిరిగి ఇవ్వడంతో పాటు ప్రతి ఒక్కరు మరొక్కరికి సాయపడాలని పిలుపు నిచ్చి, ఒక ఉద్యమానికి శ్రీకారం చుట్టారని ఆ ఉద్యమమే ప్రపంచ వ్యాప్తంగా స్వయంసహాయ బృందాల ఆవిష్కరణకు దారి తీసిందని వివరించారు. తెలంగాణ ప్రభుత్వం దారిద్య్ర నిర్మూలనకు ప్రాధాన్యత నిస్తున్నదని కోరుట్ల ఎమ్మెల్యే తన నియోజకవర్గంలో 60 వేలమంది పింఛన్లు తీసుకుంటున్నారని చెప్పడమే దానికి నిదర్శనమన్నారు.
ఒకరికి నివాళి.. ఒకరికి మాయని మచ్చ.. ఆంధ్ర యాసతో తిప్పలు పడ్డ చంద్రయ్య పిట్టకథ తెలిసిన భాషలో స్వేచ్ఛగా మాట్లాడాలే తప్ప తెలిసీ తెలియని భాషతో తిప్పలు పడవద్దని కేసీఆర్ అన్నారు. వచ్చీరాని ఆంధ్రయాస ఎలాంటి తంటాలు తెస్తుందో పిట్టకథల ద్వారా ఆయన వివరించారు తాను సిద్దిపేట ఎమ్మెల్యేగా ఉన్నపుడు చంద్రయ్య అనే నాయకుడిని ఎంపీపీగా చేశామని, పదవి రానపుడు తెలంగాణ యాసలో మాట్లాడే ఆయన పదవి వచ్చిన తర్వాత ఆంధ్రయాసలో మాట్లాడడం మొదలు పెట్టాడని వివరించారు. ఈ క్రమంలో ఓ రోజు సిద్దిపేట సమీపంలోని పాలమాకులకు ఓ శంఖుస్థాపన కార్యక్రమానికి వెళ్లామని అక్కడ జరిగిన సభలో ఎంపిపి చంద్రయ్య కొంచెం ఆంధ్రోళ్ల భాష మాట్లాడిండు. ఏందీ అంటే .. మన పాలమాకుల అభివృద్ధికి ఎమ్మెల్యే చాలా కృషి చేస్తున్నారు. ఆయన కృషి, నాకృషి వలన సంతోషంగా ఉంటున్నాం.
ఇంతగా అభివృద్ది చేస్తున్న ఎమ్మెల్యేకు నా నివాళి అన్నడు. ప్రజలు నవ్వుకున్నరు. ఆ సభలో మాతో పాల్గొన్న ఒక మైనార్టీ నాయకుడికి ఇది అర్థం కాలే. కార్లో తిరిగి వచ్చేటపుడు అన్నా చంద్రయ్య ఏం మాట్లాడిండు ఎందుకు జనం నవ్విండ్రు అని అడిగితే విషయం ఇదీ అని చెప్పిన..దానికి ఆయన కారు ఆపు అని చంద్రయ్య కారు దిగు అంటూ పెద్ద పంచాయతీ పెట్టిండు అని చెప్పారు. అయినా చంద్రయ్య మారలేదని మరోసారి మిట్టపెల్లి గ్రామం నుంచి జిల్లా డీసీసీబీ వైస్‌చైర్మన్‌గా రామకృష్ణ ఎంపికైన సందర్భంగా జరిగిన సన్మాన కార్యక్రమానికి వెళ్లి రామకృష్ణను ప్రశంసిస్తున్నాననుకొని …రామకృష్ణ డీసీసీబీ వైస్ చైర్మెన్‌గా ఎన్నికవడం మన గ్రామానికి మాయని మచ్చ అంటూ మాట్లాడడంతో సభలో ఉన్నవాళ్లంతా గొల్లు మన్నారని వివరించారు.
ఏదో మాట్లాడబోయి ఏదో చేస్తే ఇలాగే ఉంటది.. సక్కగ వచ్చిన భాష, యాసలో మాట్లాడితే మంచిది.. అంటూ గత అనుభవాలను చెప్పి సభికులను నవ్వించారు.
14 ఎకరాల్లో అంతర్జాతీయ స్థాయిలో కళాభారతి తెలంగాణ ఘన చరిత్రను స్ఫురణకు తెచ్చే విధంగా వారసత్వ కట్టడాలకు అద్దంపట్టేలా, నిర్మాణ కౌశల్యానికి గుర్తుగా నిలిచిపోయేలా హైదరాబాద్‌లో తెలంగాణ కళాభారతిని నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రపంచ ప్రఖ్యాత అర్కిటెక్ట్ హఫీజ్ కాంట్రాక్టర్ కళాభారతి కోసం తయారుచేసిన డిజైన్‌కు సీఎం కేసీఆర్ ఆమోదముద్ర వేశారు. ఇందిరాపార్కు ఎదురుగా ఉన్న 14 ఎకరాల స్థలంలో నిర్మించే ఈ అద్భుత కట్టడానికి ముఖ్యమంత్రి త్వరలోనే శంకుస్థాపన చేస్తారని ముఖ్యమంత్రి కార్యాలయం ఆదివారం ఒక ప్రకటనలో తెలిపింది. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో నిర్మించే కళాభారతిలో 4 వేర్వేరు ఆడిటోరియాలు ఉంటాయి. 500 మందికి సరిపోయే ఒక చిన్న ఆడిటోరియం నుంచి వెయ్యి,15వందల మంది కెపాసిటీ కలిగిన రెండు మీడియం ఆడిటోరియాలు, 3వేల మంది కెపాసిటీ కలిగిన మరో పెద్ద ఆడిటోరియం ఇందులో ఉంటాయి. 125 X125 చదరపు మీటర్ల వైశాల్యంలో లక్షా ఇరవై ఐదువేల చదరపు అడుగుల విస్తీర్ణంలో కళాభారతిని నిర్మిస్తారు.
అంతర్భాగంగా అత్యాధునిక థియేటర్, ప్రివ్యూ థియేటర్, కళాకారులకు శిక్షణ-రిహార్సల్స్ కోసం ప్రతేక హాళ్లు, లైబ్రరీ, ఆర్ట్ మ్యూజియం గ్యాలరీ, పెయింటర్ గ్యాలరీ, శిల్పాకృతుల గ్యాలరీ, వీఐపీ లాంజ్, మీడియా లాంజ్ ఉంటాయి. 25,50,100 మందితో సదస్సులు నిర్వహించుకోవడానికి 3 ప్రత్యేక సెమినార్ హాళ్లు, డార్మిటరీ సౌకర్యం, అతిథి గృహాలు, 3రెస్టారెంట్లు, 40 గదులు,10 సూట్స్, వెయ్యి మందికి సరిపోయే ఫుడ్ కోర్టు ఉంటాయి. లలిత కళా అకాడమి, సంగీత నాటక అకాడమీ కార్యాలయాలకు ఇందులో చోటు ఉంటుంది. 3వేల వాహనాలకు సరిపోయేలా పార్కింగ్ ప్లేస్ ఏర్పాటు చేస్తారు. 10 వేల మందితో ఒకేసారి సమావేశాలు నిర్వహించుకున్నా సరిపోయేలా కళాభారతి డిజైన్‌ను రూపొందించారు.
కేసీఆర్‌కు భారీ పెన్ను బహూకరణ ఎం ఎస్ ఆచార్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో తయారు చేసిన బంగారు వర్ణపు పెన్నును ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఈ సభ లో బహుకరించారు. బంగారు వర్ణంతో 6 ఫీట్ల పొడుగు, 40 సెంటీమీటర్ల వెడల్పు ఉన్న ఈ పెన్ను బరువు 8 కిలోలు. పెన్నుపై తెలంగాణ చిత్ర పటం, ప్రొఫెసర్ జయశంకర్, సీఎం కేసీఆర్ చిత్రాలను పొందుపరిచారు.
కంటతడి పెట్టిన రసమయి.. తెలంగాణ వచ్చినంక కళాకారుల గొంతు ఆగింది.. పనులు లేవు.. పాటలు లేదు.. అడ్డా కూలిపనికి పోతున్న స్థితి. ఈ సమయంలో కేసీఆర్ మీకు నేనున్నా అంటూ ఈ బక్కచిక్కిన జీవితాలకు ప్రభుత్వ ఉద్యోగాలిచ్చారు. ఎన్ని జన్మలెత్తినా ఆయన రుణం తీరేది కాదు అంటూ తెలంగాణ సాంస్కృతిక సారథి ఛైర్మెన్ రసమయి బాలకిషన్ సభా వేదికపై కంటతడి పెట్టారు. కళాకారుల తరుపున సీఎం కేసీఆర్‌కు పాదాభివందనం చేశారు. తర్వాత ప్రసంగిస్తూ ఒక మారుమూల గ్రామంలో జీతగాని బిడ్డనైన తనను ఇంతవాడిని చేసిన గురువు.. ఉద్యమ నేత..కేసీఆర్ మాత్రమే. నాకు జన్మనిచ్చింది నా తండ్రి అయితే, పునర్జన్మనిచ్చింది మాత్రం కేసీఆర్ అని బాలకిషన్ అన్నారు.
ఉద్యమం నాటి చేదు అనుభవాలను గుర్తు చేసుకుని కన్నీరు కార్చారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ ఆయన భుజం తట్టి ఓదార్చారు. 550 మంది తెలంగాణ కళాకారులను ప్రభుత్వంలో భాగస్వాములను చేసి కేసీఆర్ మా కుటుంబాలను ఆదుకున్నారని బాల్‌కిషన్ అన్నారు. విప్లవం అంటే ఎక్కడో లేదు.. కేసీఆర్ వద్దనే ఉందని అన్నారు. ఇవాళ కళాకారులు గంటల తరబడి పాటలు పాడుతున్నారంటే ఆ ఎనర్జీ అంతా కేసీఆర్ ఇచ్చిందేనని అన్నారు.. మిషన్ కాకతీయ, హరితహారం వంటి కార్యక్రమాలను ప్రజలముందుకు తీసుకెళుతామని ప్రతిజ్ఞ చేశారు.
కళాకారులతో సీఎం సహపంక్తి భోజనాలు తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారుల సమ్మేళన సభలో పాల్గొనేందుకు వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ కళాకారులతో సహపంక్తి భోజనం చేశారు. ఉద్యమ సమయంలో కళాకారులతో గడిపిన జ్ఞాపకాలను ఈ సందర్భంగా నెమరు వేసుకున్నారు. వివిధ రకాల తెలంగాణ వంటకాల రుచి చూపించిన సాంస్కృతిక సారథి చైర్మన్ రసమయి బాలకిషన్‌ను ప్రశంసించారు. తొలుత కళాకారులు ఆర్ట్‌గ్యాలరీలో సీఎం రాకకోసం నిరీక్షించి ఆయన వచ్చాకే భోజనాలకు ఉపక్రమించారు. ఇంట్లో మన భోజనం చేసినట్లుగా ఉందని అన్న కేసీఆర్ ఉద్యమసమయంలో పాటలు పాడిన కళాకారులను పేరుపేరునా పిలిచి బాగున్నావా.. అంటూ పలకరించారు. తమను పేర్లతో సహా గుర్తుపెట్టుకుని పలకరించడంతో కళాకారులు ఆశ్చర్యానందాల్లో మునిగిపోయారు.