Bharat Rashtra Samithi

Bharat Rashtra Samithi

KCR
telangana talli img

తెలంగాణ విధాత

భయపడను నేను.. వానగాలికి.. వరద దెబ్బ కాకలికి.. అశ్రువులకు త్రేతాగ్నికేని వెలుగు చీకట్ల మధ్య తప్పించుకొనుచు భండనమొనర్చు దివ్య కోదండి నేను..
– దాశరథి

పద్దెనిమిదేండ్ల క్రితం ఒకే ఒక్కడు.. తన జాతికి విమోచనం కల్పించడంకోసం ఒంటరిగా బయలుదేరాడు. ఆయన సింహనాదానికి తెలంగాణలో గడ్డిపోచ సైతం కత్తి చేపట్టింది. ఆయన ఇచ్చిన ఒక్క పిలుపునకు డొక్కలకు కొంచెం గంజి లేకపోయినా.. పంతం పట్టి నెగ్గడం కోసం యావత్ సమాజం ఉద్యమబాట పట్టింది. ఆయన వెనక నడిచిన తెలంగాణమొక అగ్నిబాణమై వలస పాలనను నేలగూల్చింది. గెలిచిన తెలంగాణకు పాలకుడైన ఆయన దార్శనికతకు ఇవాళ యావద్దేశం మోకరిల్లుతున్నది.
– ఆయనే కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు.

కోవెల సంతోష్‌కుమార్
ఈ దేశంలో మహాత్మాగాంధీ తర్వాత రక్తపు బొట్టు చిందకుండా ఉద్యమం ఎలా చేయాలో నేర్పించిన వీరుడు. అందరినీ ఒప్పించి, మెప్పించి.. తన దారిలోకి వచ్చేలా చేయడమెలాగో చూపిన వ్యూహకర్త. ఎన్నికల రాజకీయాల్లో సాటిలేని దురంధరుడు.. యావత్ దేశానికే మార్గదర్శకుడైన పాలకుడు. ఒకప్పుడు తెలంగాణ పేరే వినిపించని పరిస్థితులనుంచి.. ఇప్పుడు ఆసేతు హిమాచలం తెలంగాణ మంత్రం పఠించేలా చేసిన ద్రష్ట. తెలంగాణ పరిపాలకుడిగా ముఖ్యమంత్రి కేసీఆర్ కార్యదక్షతను సమస్తదేశం వేనోళ్ల కొనియాడుతున్నది. కేంద్ర ప్రభుత్వంతోపాటు అన్ని రాష్ర్టాలు కూడా ఆయన అడుగుల్లో అడుగులు కలుపుతున్నాయి. నిజమైన ప్రజాసేవలో రాజకీయాలు, అధికార అహంభావాలు అడ్డురాకూడదని భావించే నాయకుడు ముఖ్యమంత్రి కేసీఆర్. రాజకీయాల్లో ముక్కుసూటితనం, సేవాభావంలో సమిష్టి కృషి అవసరమని మనసావాచా నమ్మిన నేత కేసీఆర్. ఉద్యమకాలం నుంచి కూడా నిర్మొహమాటంగా, నిక్కచ్చిగా నిలబడి నిగ్గదీసే స్వభావం ఆయనది. ఆయనది పరిణతి కలిగిన వ్యవహారశైలి, నిర్మాణాత్మకమైన ఆలోచనావిధానం, రాజకీయాల వ్యక్తిగత సంబంధాలను పాలునీళ్లలాగా వేరుచేసి చూడగల నేర్పు కేసీఆర్‌కు మాత్రమే చెల్లింది. ఆయనలోని ఎనర్జీ, నిత్యనూతనోత్సాహం.. అన్నింటికీ మించిన ఓపికకు అంతేలేదు. కేసీఆర్ నడక.. నడవడి ఒక స్ఫూర్తి.. ఆయన కార్యదక్షత ఒక మార్గదర్శకత్వం.

ఉద్యమవీరుడు
తెలంగాణ విముక్తికోసం 47 ఏండ్ల వయస్సులో (2001) రాజకీయ భవిష్యత్తును పణంగా పెట్టి ఉద్యమ అడుగులు వేసినప్పుడు అంతా తేలిగ్గా తీసిపారేశారు. మూడేండ్లు తిరిగేసరికి ప్రతి నాయకుడి నోటా.. తెలంగాణ పేరు పలకాల్సిన పరిస్థితి వచ్చింది. పద్నాలుగేండ్లు గడిచేసరికి నాడు తీసిపారేసిన వారందరూ సాగిలపడి నాలుగున్నరకోట్ల మంది ప్రతినిధిగా నిలిచిన ఆయన ఆకాంక్షను నెరవేర్చాల్సివచ్చింది. ఈయనకు పాలనేం చేతనవునులే అంటూ కొట్టిపారేసినవారంతా స్వరాష్ట్రం ఏర్పడిన తర్వాత ఏడాది తిరిగేసరికే సోదిలోకి లేకుండాపోయారు. ప్రజలకోసం చిత్తశుద్ధితో పనిచేయడమెలాగో కార్యాచరణలో చూపించిన నేత కేసీఆర్. ఆయనలోని బహుముఖీనమైన ప్రజ్ఞ ఒకేసారి భిన్న పార్శాలలో ప్రస్ఫుటమవుతుంది. అది అసాధారణమైంది. ఆయన అచ్చమైన లౌకికవాది. సిసలైన రాజకీయ నాయకుడు.. ఆధ్యాత్మికవాది.. ఆర్థికవేత్త.. ఇంజినీరు.. అన్నదాత. సమకాలీన దేశ రాజకీయాల్లో ఇప్పుడు శిఖరాయమానుడైన నాయకుడు ఎవరైనా ఉన్నారా అంటే.. కేసీఆర్ మాత్రమేనని చెప్పవచ్చు. తన స్వప్నాన్ని సాకారం చేసుకొని.. దాని ఫలాలను రాష్ట్రమంతటా వెదజల్లేందుకు ముఖ్యమంత్రిగా బాధ్యతలను చేపట్టిన నాయకుడు. అదే సమయంలో యావత్‌దేశ అభివృద్ధికి తనదైన బాటను పరచిన నేత. రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి ఎవరూ ఊహించని స్థాయిలో వ్యూహరచన చేయడం కేసీఆర్‌కు మాత్రమే సాధ్యమైంది.

లౌకికవాదానికి ప్రతీక
ముఖ్యమంత్రిగా ఆయన ఒకేసారి అనేక రంగాల గురించి సమాంతరంగా ఆలోచించగలరు. ఒకేసారి అనేక వర్గాల సంక్షేమం గురించి నిర్ణయాలు తీసుకోగలరు. భారీ స్థాయిలో యజ్ఞయాగాదులు అద్భుతంగా నిర్వహిస్తారు. అదే సమయంలో ఇమామ్, మౌజమ్‌లకు.. పేద ముస్లింలకు నజరానాలు ఇస్తారు. అన్ని మతాల సంక్షేమం కోసం నిర్ణయాలు తీసుకుంటారు. భారతదేశ రాజకీయాల్లో లౌకికమనే పదానికి అచ్చమైన ప్రతిరూపమాయన. ఇంకా చెప్పాలంటే గంగాజమునా తెహజీబ్ అన్న మాటకు అసలైన అర్థం కేసీఆర్. గత అయిదేండ్లలో ఆయన పరిపాలన చేసినతీరే ఇందుకు నిదర్శనం. తెలంగాణను తెచ్చుకొన్నప్పటి నుంచి రాష్ర్టాన్ని సుసంపన్నంచేయడానికి ఆయన చేపట్టని చర్యలేదు. ప్రధానంగా ఆర్థిక నిర్వహణలో కేసీఆర్‌కు సాటిరాగల నేతలు లేరు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఏడు దశాబ్దాలలో అర్బన్ ఎకానమీ, కార్పొరేట్ ఎకానమీపై దృష్టిపెట్టి గ్రామీణ ఆర్థిక వ్యవస్థను కునారిల్లజేసిన పాలక వ్యవస్థలే తప్ప.. రూరల్ ఎకానమీని పరిపుష్టంచేయడం ద్వారా సంపదను ద్విగుణీకృతం చేయవచ్చని ఆలోచించిన వారు లేరు. అలాంటి ఏకైక పరిపాలకుడు కేసీఆర్. గత అయిదేండ్లలో అన్ని రకాల కులవృత్తులను బలోపేతం చేయడం ద్వారా ఆర్థిక వ్యవస్థకు ఊతం కల్పించడమన్నది దేశంలో మరే ముఖ్యమంత్రి మస్తిష్కంలోకి వచ్చి ఉండదు. తీసుకున్న నిర్ణయాలన్నీ మొదట చిన్నగానే కనిపించవచ్చు.. కానీ వాటి ప్రభావం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై పడుతున్న తీరును చూస్తే ఆశ్చర్యమేస్తుంది. గొర్రెలు-మేకల పంపిణీ పథకాన్ని ప్రవేశపెట్టినపుడు అంతా ఎద్దేవాచేశారు. కానీ ఇవాళ ఆ పశుసంపదే యాదవులకు ఆర్థికంగా దన్నుగా నిలిచింది. కోట్ల రూపాయలను ఆర్జించి పెడుతున్నది. మత్స్యకారుల ఆర్థిక పరిస్థితిని బాగుపరచడానికి ఉచితంగా చేపపిల్లలను చెరువుల్లో వేసి పట్టుకొనే అవకాశం కల్పించారు. చేనేతరంగమైతే మునుపెన్నడూ లేనంతగా అభివృద్ధి చెందింది. రజకులు.. నాయీ బ్రాహ్మణులు.. అందరి ప్రగతికోసం కార్యక్రమాలు చేసుకుంటూపోయారు. స్వరాష్ట్రం ఏర్పడిన తర్వాత ఒక ముఖ్యమంత్రిగా కేసీఆర్ ప్రజలకు దగ్గరైనంతగా బహుశా దేశంలోనే మరే నేతా దగ్గర కాలేదేమో. ఆయనకు పెరిగినంత ఆదరణ మరెవరికీ పెరుగలేదు. అయిదేండ్లలో ఏకంగా 450 పథకాలను ప్రవేశపెట్టారంటే కేసీఆర్ మేధలో తెలంగాణ ఎంతగా ఆవరించి ఉన్నదో అర్థం చేసుకోవచ్చు.

దేశమంతటా కేసీఆర్ రైతువిధానం
అన్నింటికి మించి వ్యవసాయంపై కేసీఆర్ ఆలోచనే ఒక అద్భుతం. వ్యవసాయరంగాభివృద్ధికి ముఖ్యమంత్రి రచించిన ప్రణాళికను గత ఏడు దశాబ్దాలలో భారతదేశంలో మహామహులని భావిస్తు న్న నేతలు కూడా ఊహించి ఉండరు. తెలంగాణలో పంటలు పండుతాయా అన్నది ఒకనాటి మాట. తెలంగాణ వచ్చినంత మాత్రాన మారేదేముంది? కరంటు లేదు.. రాదు.. నీళ్లు లేవు.. పీఠభూమి కాబట్టి అవకాశమే లేదు. ప్రాజెక్టులు కట్టలేరు.. ఉన్న కొద్దో గొప్పో వ్యవసాయం 24లక్షల పైచిలుకు బోర్లపై సాగాల్సిందే.. 2014కు ముందు ఇలా ఉన్న తెలంగాణ.. ఐదేండ్లయ్యేసరికి ఊహించలేనంతగా మారిపోయింది. దేశం మొత్తం కేసీఆర్ అనుసరించిన వ్యవసాయ విధానం బాట పట్టింది. రైతుబంధు, రైతు బీమా, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ పథకాలు దేశానికి ఆదర్శమయ్యాయి. కేంద్రంతోసహా అనేక రాష్ర్టాలు రైతుబంధును ఏదోరూపంలో అమలుచేయాల్సిన పరిస్థితిని కల్పించిన నేత కేసీఆర్ అనడంలో సందేహం లేదు. స్వల్పకాలిక, దీర్ఘకాలిక ప్రయోజనాలను ఆశించి ముఖ్యమంత్రిగా కేసీఆర్ చేపట్టిన చర్యలు ఒక్కటొక్కటిగా ఫలితాలిస్తున్నకొద్దీ యావద్దేశం అబ్బురపోవడం మొదలైంది. రాష్ట్రపతి.. ప్రధానమంత్రి, కేంద్ర మంత్రు లు.. కీలక ఆర్థిక వ్యవస్థల అధినేతలు.. రాష్ర్టాల ముఖ్యమంత్రులు.. అధికారుల బృందాలు.. శాస్త్రవేత్తలు.. ఒకరితర్వాత ఒకరు రావడం.. ఒక్కో పథకాన్ని గురించి తెలుసుకోవడం.. అందరికీ ఆశ్చర్యమే.. ఇవన్నీ ఎలా చేయగలుగుతున్నారు? ఆర్థిక నిర్వహణ ఎలా సాధ్యమవుతున్నది? ఎవరికీ అంతుపట్టలేదు. అర్థంకాలేదు. ఆర్థిక క్రమశిక్షణ అన్నది ఉంటే ఎంత క్లిష్టమైనదాన్నైనా సాధించితీరవచ్చని ముఖ్యమంత్రి కేసీఆర్ తన చేతలతో నిరూపించారు.

ఆయన మస్తిష్కం నుంచి ఆవిర్భవించిన ప్రతి పథకం వినూత్నమే. ఇక్కడ పుట్టిన ప్రతి పథకాన్ని కూడా పేర్లు మార్చుకొని అనేక రాష్ర్టాలు తమదగ్గర అమలు చేయడం మొదలుపెట్టాయి. చివరకు ఢిల్లీలో మోదీ సర్కారుకు సైతం కేసీఆర్ సంక్షేమ పథాన్ని ఎంచుకోక తప్పలేదు. మీకు పాలించుకోవడం చేతకాదు.. మేము లేకపోతే మీరు ఏమీ చేయలేరు.. అని బీరా లు పలికిన పొరుగురాష్ట్ర పాలకులు సైతం రైతుబంధును, కల్యాణలక్ష్మి పథకాలను పేర్లుమార్చుకొని కొత్త ముసుగులు తొడుక్కొని ప్రకటించుకోవలసి వచ్చిందంటే కేసీఆర్ పరిపాలనా ప్రభావం దేశమంతటా ఎలా ఆవరించిందో అర్థమవుతుంది. సాగునీటి ప్రాజెక్టుల విషయంలోనైతే కేసీఆర్ మేధకు జోహార్ అనని వారు ఉండరు. తెలంగాణ రాకముందు వరకు ఏ ప్రాజెక్టును నిర్మించాలన్నా ఏళ్లూ పూళ్లూ గడవాల్సిందే. ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం జరుగుతున్న తీరు.. కేసీఆర్‌లో సాక్షాత్తు భగీరథుడి సాక్షాత్కారమయ్యేలా చేస్తున్నది. తానే ఇంజినీర్ అయి.. ప్రాజెక్టు ఆనుపానులన్నీ అధ్యయనం చేసి ప్రాజెక్టును రీడిజైన్ చేసి అయిదేండ్లలో తుదిదశకు నిర్మాణాన్ని పూర్తిచేయడం అంటే అసాధారణమైన విషయం. అదికూడా అలాంటిలాంటి ప్రాజెక్టు కాదు.. గోదావరిని రివర్స్ పంపింగ్ చేయ డం.. భారీ పంపులు.. మోటర్లు బిగించడం.. సొరంగాలను తవ్వడం.. విద్యుత్ సౌకర్యం కల్పించడం.. ఒకటా రెండా.. ఇలాంటి ప్రాజెక్టును దేశంలో మరేదైనా ప్రభుత్వం చేపడితే వందేండ్లయినా పూర్తికాదేమో. నిశ్చయంగా ఇది భగీరథ సంకల్పమే. ఇది కేసీఆర్ వల్ల మాత్రమే సాధ్యమైంది. ఆయన మాత్రమే చేయగలిగిన ప్రాజెక్టు ఇది.

విద్యుత్ విప్లవం
విద్యుత్ వ్యవస్థలో ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన సంస్కరణలైతే ఎవరూ ఊహించలేదు. తెలంగాణ రాష్ట్రం వస్తే ముందుగా వచ్చే సంక్షోభం విద్యుత్తే అన్నా రు. కానీ.. స్వరాష్ట్రంలో తొట్టతొలి సంస్కరణ జరిగింది విద్యుత్‌రంగంలోనే. ప్రభుత్వ విద్యుత్ రంగ సంస్థలను బలోపేతం చేస్తూనే.. వివిధ మార్గాల నుంచి రాష్ర్టానికి విద్యుత్‌ను తీసుకువచ్చేందుకు ఆయన రచించిన వ్యూహం ఎవరికీ అంతుపట్టలేదు. రాష్ట్రం ఆవిర్భవించిన ఆరు నెలల్లోనే ఉన్న ఉత్పత్తికి రెట్టింపు డిమాండ్ ఉన్నచోట కోతలులేని కరంట్‌నివ్వడమంటే.. అది కేసీఆర్ దూరదృష్టివల్లనే సాధ్యమైంది. ఇవాళ దేశంలోనే వ్యవసాయరంగానికి 24 గంటలు నాణ్యమైన కరంట్‌ను ఇవ్వడం ఒక్క తెలంగాణలోనే సాధ్యం చేసిన నాయకుడు కేసీఆర్ మాత్రమే. పారిశ్రామిక అభివృద్ధిలో ముఖ్యమంత్రి కేసీఆర్ మార్గదర్శనంలో రూపొందిన టీఎస్‌ఐపాస్.. వినూత్నమైంది. దరఖాస్తుచేసిన పదిహేను రోజుల్లో పరిశ్రమలకు అనుమతులు మంజూరుచేయడం గతంలో ఎన్నడైనా విన్నమాటేనా? రాష్ర్టాన్ని అన్ని పార్శ్వాలలో అభివృద్ధి చేయడంపైన దృష్టిసారించిన నాయకుడు కేసీఆర్. ఓ వైపు సంపదను సృష్టిస్తూనే.. దాన్ని ప్రజలందరికీ సమానంగా పంచడమెలాగో ఆలోచించిన సిసలైన నేత. విద్య, వైద్య రంగాల్లో ఆయన అనుసరించిన, అమలుచేసిన విధానాలు యావత్‌దేశానికే ఆదర్శాలు. ఒకనాడు కునారిల్లిన ప్రభుత్వ విద్య, వైద్య రంగాల్లో సమూల మార్పులు చేయడం ఒక్క కేసీఆర్‌కే సాధ్యపడింది. గురుకుల విద్యావిధానాన్ని బలోపేతంచేసి ప్రభుత్వ విద్యను సబ్బండవర్ణాలందరికీ అందుబాటులోకి తీసుకువచ్చారు. వైద్యరంగంలో ముఖ్యమంత్రి కేసీఆర్ అనుసరిస్తున్న విధానం ఇప్పటివరకు దేశంలోనే ఎవరి ఊహకైనా తట్టి ఉండదు. రాష్ట్ర ప్రజలందరి హెల్త్ ప్రొఫైల్‌ను రికార్డు చేయడమన్నది తేలికైన పనికాదు. కంటివెలుగు పథకంతో ప్రారంభమైన ఈ చర్య.. చెవి, ముక్కు, గొంతు, దంత పరీక్షలు కూడా నాలుగు కోట్ల మంది ప్రజానీకానికి నిర్వహించి ప్రొఫైల్ సిద్ధం చేయడానికి పూనుకోవడం ప్రజాపాలకుడికి మాత్రమే సాధ్యమైన పని.

ఆడపిల్లకు అండ
తెలంగాణలో ఆడపిల్ల జీవితానికి ముఖ్యమంత్రి కేసీఆర్ కల్పించిన సామాజిక భద్రత అలాంటిలాంటి తేలికైన ప్రణాళిక కాదు. శిశువు గర్భంలో ఉండగానే పౌష్టికాహారమివ్వడం దగ్గరి నుంచి ప్రసవానికి ప్రభుత్వ దవాఖానకు తీసుకొచ్చి.. ప్రసవానంతరం పదమూడువేల నగదు, కేసీఆర్ కిట్ ఇచ్చి.. తిరిగి ఇంటి దగ్గర దింపి.. పెరిగిన కొద్దీ ఉచితంగా చదువు చెప్పి.. పెండ్లీడు వచ్చిన తర్వాత లక్షానూటపదహార్లు ఖర్చులకు ఇచ్చేంతవరకు సుదీర్ఘ ప్రణాళిక దేశంలో మరెక్కడా సమర్థంగా కనిపించదు. ఈ చర్యల ఫలితమే రాష్ట్రంలో లింగనిష్పత్తి పెరుగుదల. ముఖ్యమంత్రి కేసీఆర్ మానస పుత్రిక కల్యాణలక్ష్మి-షాదీ ముబారక్.. ఇవాళ దేశం మొత్తం ఆయన బాటలో పయనిస్తున్నది. ఒకటి కాదు.. రెండు కాదు.. ఇలా చెప్పు కొంటూ పోతే.. ఆయన ప్రజలకోసం ప్రారంభించిన ప్రతి పథకం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఏకకాలంలో ఇవన్నీ ఏవిధంగా అమలుచేస్తున్నారని ఆశ్చర్యమేస్తుంది. ఒక పక్క రాజకీయాల వ్యూహరచన చేస్తూనే.. ప్రత్యర్థుల ఎత్తులకు పైఎత్తులు వేస్తూనే.. మరోపక్క ప్రజాక్షేమం కోసం రాజీపడని అడుగులు వేయడం సమకాలీన రాజకీయాల్లో ఆయనకు మాత్రమే సాధ్యమైంది.

ఆయన ఎంత వేగంగా నిర్ణయాలు తీసుకోగలరంటే.. ఆ వేగాన్ని అందుకోవడం ఎవరివల్లా కానిపని. ఆయన తీసుకొనే ఏ నిర్ణయం కూడా తొందరపాటు నిర్ణయంగా కనిపించదు. ప్రతిదాని వెనుక ఆయన దూరదృష్టి ప్రస్ఫుటమవుతుంది. తీసుకొన్న నిర్ణయాన్ని వెనుకడుగు వేయకుండా అమలుచేయగల ధీశాలి. అడిగినవారికి అడిగినది లేదనకుండా ఇవ్వగలిగిన ఔదార్యమాయనది. ఆయన అడుగులో.. ఆలోచనలో ఆవరించింది బంగారు తెలంగాణ స్వప్నమే. అది సాకారం చేసుకోవడం కోసమే ఆయన తపన. ప్రజలకు అభివృద్ధి చేసి చూపించాలి. రాష్ర్టానికి వస్తున్న సంపదను ప్రజలకు పంచగలగాలి. అన్నింటికంటే ముఖ్యంగా ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఎలాంటి అవినీతి మచ్చ పడకుండా పరిపాలన సాగించినపుడు.. ఆ పాలకుడిని ప్రజలు కడుపులో పెట్టుకొని దాచుకొంటారు. ఆయన అది చేసి చూపించారు. అందువల్లే.. తెలంగాణ ప్రజలు హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. ఒక్కమాటలో చెప్పాలంటే.. ఆయన విషయంలో తెలంగాణే ముందు.. ఆ తర్వాత పార్టీ.. ఆ తర్వాతే వ్యక్తిగతం.. ఇది 65వసంతాలు నిండిన కేసీఆర్ వ్యక్తిత్వం.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the BRS Party.