Bharat Rashtra Samithi

Bharat Rashtra Samithi

KCR
telangana talli img

తెలంగాణ సర్వతోముకాభివృద్దే లక్ష్యంగా నూతన పారిశ్రామిక విధాన బిల్లు

-ఫ్రేం వర్క్‌లో వెల్లడైన సర్కారు విధానం

ఇవీ చేయబోతున్నవి.. -వెబ్‌సైట్‌లో ల్యాండ్‌బ్యాంక్ వివరాలు -జాతీయ రహదారుల వెంట పారిశ్రామిక కారిడార్లు -జిల్లాకు కనీసం రెండు పారిశ్రామిక వాడలు -ఫార్మా/కెమికల్ సిటీల్లో ఉమ్మడి మురుగునీటి శుద్ధి ప్లాంట్లు -ప్రత్యేకంగా చైనా సింగపూర్‌ల పవర్‌ప్లాంట్లు -సంప్రదింపులతో టారిఫ్ నిర్ణయించుకునే సౌలభ్యం -2014-15లో పార్మా సిటీ/కెమికల్ సిటీ, వరంగల్ టెక్స్‌టైల్స్ జోన్ -హైదరాబాద్‌లో రిచ్ ఏర్పాటు

Industrial-policy-frame-work

స్థానిక యువతకు ఉపాధి, సాంఘిక సమానత్వం, వెనుకబడిన ప్రాంతాల సమగ్రాభివృద్ధి, సహజ వనరుల సద్వినియోగం, నైపుణ్యాభివృద్ధి, నూతన ఆవిష్కరణలకు ప్రోత్సాహం, పారిశ్రామిక శ్రేయస్సు లక్ష్యాలుగా పేర్కొంటూ నూతన పారిశ్రామిక విధానానికి సంబంధించిన ఫ్రేంవర్క్ కాపీలను గురువారం అసెంబ్లీలో ఎమ్మెల్యేలకు పంపిణీ చేశారు. ఇన్నోవేట్, ఇన్‌క్యుబేట్, ఇన్‌కార్పొరేట్ నినాదంతో పారిశ్రామికాభివృద్ధికి అంకితమవుతున్నట్టు ప్రభుత్వం పేర్కొంది. అవినీతికి ఆస్కారం లేకుండా అన్ని శాఖల్లోనూ పారదర్శకత, తప్పులకు శాఖాధిపతులపై బాధ్యత, ఇబ్బందులు తెలుపుకునేందుకు ఆన్‌లైన్, హెల్ప్ డెస్క్‌లు, ప్రమాణాలను ఉల్లంఘించే ఉద్యోగులపై కఠిన చర్యలు, ప్రతి రంగానికి ప్రత్యేక విధానం, ప్రధాన కార్యదర్శి/పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి అధ్యక్షతన శాఖాపరమైన టాస్క్‌ఫోర్స్ తదితర ప్రతిపాదనలు ఈ ఫ్రేంవర్క్‌లో పొందుపరిచారు. మేడ్ ఇన్ తెలంగాణ- మేడ్ ఇన్ ఇండియా టార్గెట్‌తో గ్లోబల్ మార్కెట్‌ను ఆకట్టుకునేందుకు భారీ రాయితీలను ప్రకటించారు.

పారిశ్రామిక కారిడార్లు..: తొలి దశలో హైదరాబాద్- వరంగల్, హైదరాబాద్- నాగపూర్, హైదరాబాద్- బెంగుళూరు పారిశ్రామిక కారిడార్లు ఏర్పాటుచేస్తారు. రెండో దశలో హైదరాబాద్- మంచిర్యాల, హైదరాబాద్- నల్లగొండ, హైదరాబాద్- ఖమ్మం తీసుకుంటారు. వీటిని డీఎంఐసీ, పీసీపీఐఆర్ వంటి ప్రత్యేక పెట్టుబడి జోన్లుగా ప్రకటిస్తారు. ఇక్కడ ప్రత్యేక జోనింగ్ నిబంధనల ద్వారా ప్రైవేటు భూములను క్రమబద్ధీకరిస్తారు. హైదరాబాద్ నుంచి వరంగల్ వరకు రోడ్డు మార్గాల సమీపంలో పారిశ్రామిక కారిడార్లు అభివృద్ధి చేస్తారు. ప్రతి జిల్లా ప్రధాన కార్యస్థానాన్ని హైస్పీడ్ రైలు, రోడ్డు నెట్‌వర్క్‌కు అనుసంధానం చేస్తారు. ప్రతి జిల్లాలోనూ కనీసం రెండు ప్రధాన పారిశ్రామిక వాడలు ఏర్పాటు చేయాలని నిశ్చయించారు. అన్ని ఇరిగేషన్ ప్రాజెక్టుల నుంచి 10% నీటిని పరిశ్రమలకు కేటాయిస్తారు.

విద్యుత్ సరఫరాకు ప్రత్యేక డిస్కమ్‌లు..: పారిశ్రామిక వాడలకోసం ప్రత్యేక విద్యుత్ డిస్కంలను ఏర్పాటు చేస్తారు. వీటికి సంప్రదాయేతర ఇంధనాన్ని ప్రోత్సహిస్తారు. భారీ పారిశ్రామికవాడల్లో వాటికోసమే ప్రైవేటు మర్చంట్ పవర్ ప్లాంట్‌లు ఉంటాయి. పారిశ్రామిక పార్కుల్లోనుంచి వెలువడే కాలుష్యాన్ని నియంత్రించేందుకు ఉమ్మడి మురుగునీటి శుద్ధి ప్లాంట్లను ఏర్పాటు చేస్తారు.

ప్లాట్ల కేటాయింపు..: టీఎస్‌ఐఐసీ వెబ్‌సైట్‌లో ల్యాండ్ బ్యాంక్ పూర్తి వివరాలను ఉంచుతారు. హైవేలు, రైల్వే స్టేషన్, ఎయిర్‌పోర్ట్, సమీప పట్టణం నుంచి పార్కు ఎంత దూరంలో ఉందో తెలిపే సమాచారం అందులో ఉంటుంది. భారీ ప్రాజెక్టుల భూ కేటాయింపులను రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధి కమిటీ ఖరారు చేస్తుంది. కమిటీలో ప్రభుత్వ ప్రత్యేక ముఖ్య కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, సంబంధిత శాఖల కార్యదర్శులు ఉంటారు. మైక్రో, మీడియం పరిశ్రమలకు కలెక్టర్ స్థాయిలోనే కేటాయింపు జరుగుతుంది. భూ కేటాయింపులు ఔట్‌రైట్ సేల్ పద్థతిలో ఉంటాయి. ఎస్‌ఎంఈలకు దీర్ఘకాలిక లీజు పద్ధతిన కూడా అప్పగిస్తారు.

2014-15లో ఏం చేస్తారు..: 2014-15లో వ్యర్థాల నిర్వహణసహా మౌలిక సదుపాయాలతో కూడిన కొత్త పార్మా సిటీ/కెమికల్ సిటీ, హైదరాబాద్- వరంగల్ పారిశ్రామిక కారిడార్ అభివృద్ధి, తెలంగాణలో టెక్స్‌టైల్ జోన్‌గా వరంగల్ అభివృద్ధి కార్యక్రమాలు చేపడతారు. ఫుడ్ ప్రాసెసింగ్, విత్తన ఉత్పత్తి, దళిత ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు రుణ సదుపాయాలు, పారిశ్రామిక ఉత్పత్తులు, ఉత్పాదకాలపై అంతరాష్ట్ర వ్యాట్ హేతుబద్ధీకరణ, లేబర్ చట్టాలతో పాటు పురాతన పారిశ్రామిక రంగ నిబంధలన్నింటినీ సమీక్షించి సంస్కరించడంవంటివి చేపట్టారు.

హైదరాబాద్‌లో రిచ్(రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ సర్కిల్ ఆఫ్ హైదరాబాద్)ను ఏర్పాటు చేస్తారు. దీనిలో ఇక్రిశాట్, సీసీఎంబీ, ఐఐసీటీ, డీఆర్‌డీఎల్,నైపర్, ఐఐటీ,బిట్స్, ఐఐఐటీ,ఐఎస్‌బీ,యూఓహెచ్, ఓయూవంటి అనేక సంస్థలకు భాగస్వామ్యం కల్పించారు.

దళిత ఎంటర్‌ప్రెన్యూర్స్‌కు టీ-ప్రైడ్: ఈ కొత్త పాలసీలో దళిత, గిరిజన పారిశ్రామికులను ప్రోత్సహించేందుకు టీ-ప్రైడ్(దళిత ఔత్సాహిక పారిశ్రామికవేత్తల ఇంక్యుబేషన్ కోసం తెలంగాణ రాష్ట్ర కార్యక్రమం) కింద ప్రత్యక్ష నిధుల సాయాన్ని అందిస్తారు. ఎస్సీ, ఎస్టీ పారిశ్రామివేత్తల తరఫున ప్రభుత్వమే మార్జిన్ మనీ చెల్లిస్తుంది. పారిశ్రామికవాడల్లో ప్లాట్ల కేటాయింపులో ప్రాధాన్యం ఇస్తారు. కేంద్రం ఎస్‌ఎంఈ సేకరణ విధానం 20%తో కలిపి రాష్ట్ర శాఖాపరమైన సేకరణ విధానాన్ని ప్రకటిస్తారు. క్రిసిల్ రేటెడ్ ఎన్‌బీఎస్‌సీల నిధులు సమకూరితే సబ్సిడీ అర్హత కల్పిస్తారు. వాణిజ్య, పరిశ్రమల దళిత్ ఇండియా చాంబర్(డిక్కి)వంటి సంస్థలకు ప్రత్యేక కార్యక్రమాల రచన, అమలు బాధ్యతలప్పగిస్తారు.

హస్త కళలకు ప్రోత్సాహం: సంప్రదాయ చేతి వృత్తులు, కళాకారుల ప్రోత్సాహం కింద నిర్మల్ పెయింటింగ్స్, డోక్రా మెటల్ వర్క్స్, పెంబర్తి బ్రాస్, పోచంపల్లి ఇక్కత్, గద్వాల చీరలు, వరంగల్ కార్పెట్లు వంటి అనేక ఆర్టిసన్స్‌ను గుర్తించారు. ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్‌కు క్లస్టర్ల ఏర్పాటు, టెక్నాలజీ ఆధునీకరణ, డిజైన్ సపోర్ట్ కేంద్రాలు ఏర్పాటు చేస్తారు. మార్కెటింగ్‌లో ప్రభుత్వం తోడ్పాటు ఇస్తుంది.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the BRS Party.