-అంబరాన్నంటే వేడుకలకు సన్నాహాల్లో తెలంగాణ -రాష్ర్టావిర్భావ ఘడియకోసం ఉత్కంఠగా ఎదురుచూపులు నేటి అర్ధరాత్రి నుంచే తెలంగాణకు స్వాగతోత్సవాలు -మా రాష్ట్రం, మా ప్రభుత్వం అంటూ నినాదాలు -వారంపాటు ప్రభుత్వం ఆధ్వర్యంలో పండుగ
దాస్యశంఖలాలను ఛేదించుకుని భారతావని 1947, ఆగస్టు 14 అర్ధరాత్రి స్వాతంత్య్రం పొందిన వేళ.. దేశం యావత్తు సంబురాలు జరుపుకున్నట్లే.. ఆరు దశాబ్దాల వివక్షను బద్దలుకొడుతూ 2014, జూన్ 1 అర్ధరాత్రి తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతున్న వేళ తెలంగాణ సమాజం అంబరాన్నంటేలా రాష్ర్టావిర్భావ సంబురాలకు సిద్ధమైంది. తెలంగాణ రాష్ట్ర సాధనకు అరవైఏళ్లుగా కళ్లలో వత్తులు వేసుకుని ఎదురుచూసిన ప్రజల తరాల కల నెరవేరుతున్న వేళ.. ధూంధాంగా కదం తొక్కి వేడుక జరుపుకునేందుకు సన్నద్ధమవుతున్నారు. ఔర్ దక్కా తెలంగాణ పక్కా అంటూ ఉద్యమించిన సబ్బండవర్గాలూ తెలంగాణకు ఘనంగా స్వాగతం పలికేందుకు సన్నాహాల్లో మునిగిపోయాయి. మన రాష్ట్రం-మన ప్రభుత్వం అని ఆకాశాన్నంటేలా నినదించడానికి సకల ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుండటంతో రాష్ర్టావిర్భావ వేడుకలకు తెలంగాణ ఇప్పటికే సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. విద్యుత్ కాంతుల వెలుగుల్లో వీధులన్నీ కేసీఆర్ ఫ్లెక్సీలు, వాల్‌పోస్టర్లతో గులాబీమయమయ్యాయి. తెలంగాణ రాష్ర్టావిర్భావ ఘడియకోసం క్షణం క్షణం ఉత్సాహంగాతెలంగాణ సమాజం ఎదురుచూస్తున్నది.
తెలంగాణ రాష్ట్ర సాధన మూడుతరాల కోరిక. తాతలు, తండ్రులు, కొడుకులు.. తెలంగాణ రాష్ట్రసాధనలో ఇలా ప్రతి ఒక్కరూ ఎప్పుడో ఒకప్పుడూ ప్రత్యక్షంగానో… పరోక్షంగానో ఉద్యమించినవారే. నిర్లక్ష్యాన్ని, వివక్షను అనుభవించినవారే. అలా మూడుతరాలు పడిన మానసికక్షోభకు తెరదించుతూ మరికొన్ని గంటల్లో తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించనున్నది. 1969 ఉద్యమంలో 369 మంది హత్యకు గురైనా, మలిదశ తెలంగాణ ఉద్యమంలో 1200మందికిపైగా విద్యార్థి, యువకులు అమరవీరులైనా… వేలకొద్ది జనం వందల కేసుల్లో ఇరుక్కుపోయినా అందరి లక్ష్యం జై తెలంగాణే. జూన్ 2ను తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవమని రాష్ట్రపతి ప్రకటించిన నేపథ్యంలో జూన్1 అర్ధరాత్రి నుంచే యావత్తు తెలంగాణ సమాజం సంబురాల్లో మునిగి తేలియాడబోతున్నది.
సంస్కతి ఉట్టిపడేలా సంబురాలు: తెలంగాణ రాష్ట్ర ఆకాంక్ష వెనుక ఉన్న బలమైన కారణం సంస్కతిక వివక్ష. రాష్ర్టావిర్భావ వేడుకల్లో తెలంగాణ సంస్కతినే హైలైట్ చేస్తూ తెలంగాణ సమాజం సంబురాలకు సిద్ధం అవుతున్నది. తెలంగాణలో బోనాలు అంటే పెద్ద పండుగ. జూన్ 1 అర్ధరాత్రి ప్రతి జిల్లాలో బోనాల ఉరేగింపును చేపడుతున్నారు. చిందు, యక్షగానాలతో ప్రత్యేక ఆకర్షణలు జోడించనున్నారు.
పార్టీలు, సంఘాల ఆధ్వర్యంలో.. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ తరఫున ఆదివారం సాయంత్రం నుంచి తెలంగాణ ఆవిర్భావ వేడుకలు జరుపుకోవాలని టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య పార్టీ శ్రేణులకు పిలుపు నిచ్చారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును స్వాగతిస్తూ కాంగ్రెస్ శ్రేణులు ఘనంగా రాష్ట్ర అవతరణ ఉత్సవాలు నిర్వహించుకోవాలన్నారు. తెలంగాణ రాష్ట్ర సంబురాలు ఆదివారం అర్ధరాత్రి నుంచే ప్రారంభిస్తామని బీజేపీ ప్రకటించింది. రాత్రి 12 గంటల తరువాత గన్‌పార్క్‌లోని అమరవీరుల స్థూపం వద్ద నివాళులు అర్పించి సంబురాలు నిర్వహిస్తామని పేర్కొంది. ఆదివారం అర్ధరాత్రి పార్టీ కార్యాలయం మఖ్దూంభవన్ వద్ద వేడుకలను ప్రారంభిస్తామని సీపీఐ తెలంగాణ రాష్ట్ర శాఖ కార్యదర్శి చాడా వెంకటరెడ్డి తెలిపారు.
తెలంగాణ రాష్ర్టావిర్భావాన్ని పురస్కరించుకొని బైక్ ర్యాలీ నిర్వహిస్తున్నామని సీపీఐ(ఎంఎల్) న్యూ డెమోక్రసీ ప్రకటించింది. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావాన్ని ఘనంగా జరుపుకోవాలని సీఐటీయూ-వ్యవసాయ కార్మిక సంఘం అధ్యక్షుడు జీ నాగయ్య, ప్రధాన కార్యదర్శి ఆర్ సుధాభాస్కర్ పిలుపునిచ్చారు. తెలంగాణ ఐటీ అసోసియేషన్ ఆధ్వర్యంలో సంబురాలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు ఆ సంఘం అధ్యక్షుడు సందీప్ మక్తాల శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. తెలంగాణ లారీ అసోషియేషన్ ఆధ్వర్యంలో తెలంగాణ సంబురాలు జరుపుకునేందుకు ఏర్పాట్లు చేసినట్లు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. మున్సిపల్ అధికారులు, ఉద్యోగులందరూ స్థానిక మున్సిపాలిటీ కార్యాలయాల్లోనే రాష్ట్ర అవతరణ వేడుకలను ఘనంగా జరుపుకోవాలని మున్సిపల్ ఉద్యోగ కార్మిక సంఘం అధ్యక్షుడు తిప్పర్తి యాదయ్య, మున్సిపల్ అధికారుల సంఘం అధ్యక్షుడు ఎల్ తాజ్‌మోహన్‌రెడ్డిలు పిలుపునిచ్చారు.
నగరంలో పటాకుల మోత గ్రేటర్‌కు సోమవారం అర్ధరాత్రి దీపావళి శోభ సంతరించనుంది. తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో భారీ ఎత్తున పటాకులు కాల్చేందుకు తెలంగాణ ఫైర్ వర్క్ డీలర్స్ ఆసోసియేషన్ పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తుంది. నెక్లెస్ రోడ్డులోని పీపుల్స్ ప్లాజా వద్ద పెద్ద ఎత్తున పటాకులను కాల్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కార్యక్రమంలో 25మందికిపైగా టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు పాల్గొననున్నారని ఆసోసియేషన్ ప్రతినిధి మానిక్‌రావు వెల్లడించారు.
హైదరాబాద్‌లో ప్రత్యేక ఏర్పాట్లు తెలంగాణ ఉద్యమానికి దిక్సూచిగా నిలిచిన హైదరాబాద్‌కేంద్రంలో ఆవిర్భావ వేడుకలు కనీవిని ఎరుగని రీతిలో ఉత్సవాలు చేయడానికి ప్రభుత్వం, జీహెచ్‌ఎంసీ, టీఆర్‌ఎస్ పార్టీ భారీ ఏర్పాట్లు చేస్తున్నాయి. ఆదివారం రాత్రి 12గంటలకు నెక్లెస్‌రోడ్డులో టీఆర్‌ఎస్ పార్టీ పటాకుల మోతతో మారుమోగించనుంది. హైదరాబాద్‌లోని 500సెంటర్లలో గులాబీబాస్ కేసీఆర్ ఫ్లెక్సీలను ఏర్పాటు చేస్తున్నారు. ప్రతి కార్నర్‌లో టీఆర్‌ఎస్ జెండాలు ఇప్పటికే రెపరెపలాడుతున్నాయి.