-దేవాలయ వ్యవస్థను కాపాడాలి:తెలంగాణ అర్చక సమాఖ్య -2న అన్ని తెలంగాణలోని అన్ని దేవాలయాల్లో కేసీఆర్ పేరుమీద పూజలు నిర్వహించాలని పిలుపు
దేశంలోని అన్ని రాష్ర్టాల కంటే తెలంగాణను అభివృద్ధి చేయడం టీఆర్‌ఎస్ అధినేత, కాబోయే తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుతోనే సాధ్యమని తెలంగాణ అర్చక సమాఖ్య రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు గంగు ఉపేంద్రశర్మ పేర్కొన్నారు. గురువారం కాచిగూడలోని అర్చక భవన్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణలోని నిర్వీర్యమైన దేవాలయాల వ్యవస్థ, అర్చక వ్యవస్థను టీఆర్‌ఎస్ ప్రభుత్వం కాపాడాలని విజ్ఞప్తి చేశారు.
తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న కేసీఆర్ పేరిట.. జూన్ 2న ఆగమానుసారంగా తెలంగాణలోని అన్ని దేవాలయాలల్లో ప్రత్యేక పూజలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. తెలంగాణలోని 11,220 దేవాలయాల అభివృద్ధిని ఆకాంక్షిస్తున్న కేసీఆర్ సీఎంగా ప్రమాణం చేయనున్న రోజున.. తెలంగాణలోని అర్చకులు, దేవాదాయాల ఉద్యోగ సంఘాలు వేడుకలు జరుపుకుని తెలంగాణ సత్తాను చాటాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో తెలంగాణ అర్చక సమాఖ్య కార్యదర్శి టీ రత్నాకర్, ప్రతినిధులు రామలింగారావు, వరియోగం రఘురామయ్య, ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి మైపాల్ పాల్గొన్నారు.