Bharat Rashtra Samithi

Bharat Rashtra Samithi

KCR
telangana talli img

సూపర్ కార్

-తెలంగాణవ్యాప్తంగా టీఆర్‌ఎస్ ప్రభంజనం.. 63 సీట్లతో జయకేతనం -సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్న గులాబీ పార్టీ మట్టికరిచిన కాంగ్రెస్, 19 సీట్లకే పరిమితం.. బీఎస్పీకి రెండు సీట్లు -టీడీపీ, బీజేపీ కూటమికి 20 సీట్లు.. మూడుచోట్ల వైఎస్సార్సీపీ విజయం ఏడు స్థానాలు నిలబెట్టుకున్న మజ్లిస్.. రెండు చోట్ల గెలిచిన వామపక్షాలు -11 ఎంపీ స్థానాల్లో టీఆర్‌ఎస్ జోరు..రెండుకు పడిన కాంగ్రెస్ స్కోరు -కేసీఆర్‌కు ఎంపీగా 3,97,029, ఎమ్మెల్యేగా 19,218 ఓట్ల మెజార్టీ

రాష్ట్రసాధన కలను సాకారం చేసిన టీఆర్‌ఎస్సే తెలంగాణ రాష్ట్రంలో తొలి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. గత నెల 30న నిర్వహించిన సార్వత్రిక ఎన్నికల ఫలితాలు శుక్రవారం వెలువడగా, పది జిల్లాల్లో టీఆర్‌ఎస్ సీట్లు సాధించింది. ఖమ్మం, హైదరాబాద్‌లో ఒక్క సీటుకే పరిమితమైంది.

carఅనూహ్యంగా నిజామాబాద్‌లో తొమ్మిది స్థానాలు గెలుచుకుంది. ప్రధానంగా ఉత్తర తెలంగాణలో కారుజోరుకు ఎదురే లేకుండాపోయింది. దక్షిణ తెలంగాణలోనూ గణనీయమైన స్థానాలు సాధించడంతో సొంత మెజార్టీ సాధ్యమైంది. తెలంగాణ ఇచ్చామని చెప్పుకున్న అధికార కాంగ్రెస్ మట్టికరిచింది. కేవలం 20 స్థానాలకు పరిమితమైంది. టీడీపీ, బీజేపీ కూటమి 20చోట్ల గెలిచింది. ఖమ్మం జిల్లాలో మూడుచోట్ల వైఎస్సార్సీపీ విజయం సాధించింది. రాజధానిలో ఏడు చోట్ల మజ్లిస్ తన స్థానాలను నిలబెట్టుకుంది. ఆదిలాబాద్ జిల్లాలో రెండు చోట్ల బీఎస్పీ ఖాతా తెరిచింది. సీపీఎం, సీపీఐలు ఒక్కోస్థానాన్ని గెలిచాయి.

నర్సంపేటలో కాంగ్రెస్ రెబల్ అభ్యర్థి విజయం సాధించారు. ఎంపీ స్థానాల్లోనూ టీఆర్‌ఎస్ జోరు కొనసాగింది. రెండు స్థానాల నుంచి 11 స్థానాలకు టీఆర్‌ఎస్ ఎగబాకింది. కాంగ్రెస్ 12 స్థానాల నుంచి రెండు స్థానాలకు దిగజారింది. బీజేపీ, టీడీపీ చెరోస్థానాన్ని సొంతం చేసుకున్నాయి. ఎప్పటిలాగే మజ్లిస్ హైదరాబాద్ స్థానాన్ని సొంతం చేసుకుంది. అనూహ్యంగా వైఎస్సార్సీపీ కూడా ఒక స్థానాన్ని సాధించింది. ఎన్నికల్లో పలువురు ఎంపీ, ఎమ్మెల్యేలు ఓటమి చవిచూశారు.

ఓరుగల్లులో గులాబీ పరిమళం trs7ఓరుగల్లులో గులాబీ పార్టీ జెండా ఎగురవేసింది. జిల్లాలోని 12 అసెంబ్లీ స్థానాలకు ఎనిమిది చోట్ల టీఆర్‌ఎస్ విజయఢంకా మోగించింది. వరంగల్ తూర్పులో బస్వరాజు సారయ్యపై టీఆర్‌ఎస్ అభ్యర్థి కొండా సురేఖ 52,085 ఓట్ల ఆధిక్యంతో, వరంగల్ పశ్చిమలో టీఆర్‌ఎస్ సిట్గింగ్ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్ హ్యాట్రిక్ కొట్టారు. వర్ధన్నపేటలో టీఆర్‌ఎస్ అభ్యర్థి ఆరూరి రమేష్ 86,094 మెజార్టీతో విజయ సాధించారు. రమేష్ 1,16,977 ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్థి కొండేటి శ్రీధర్ 30,883, టీడీపీ, బీజేపీ మద్దతుతో పోటీచేసిన ఎమ్మెస్పీ అధ్యక్షుడు మందకష్ణ మాదిగ 20,510 ఓట్లకే పరిమితమయ్యారు.

స్టేషన్‌ఘన్‌పూర్‌లో టీఆర్‌ఎస్ అభ్యర్థి టీ రాజయ్య కాంగ్రెస్ అభ్యర్థి గుండె విజయరామారావుపై గెలుపొందారు. పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య కంచుకోటను గులాబీ పార్టీ బద్దలు కొట్టింది. టీఆర్‌ఎస్ అభ్యర్థి ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి 32,915 ఓట్ల మెజార్టీతో గెలిచారు. ములుగులో టీఆర్‌ఎస్ అభ్యర్థి అజ్మీరా చందూలాల్ 16,399 ఓట్ల మెజార్టీతో టీడీపీ అభ్యర్థి సీతక్కపై, మహబూబాబాద్‌లో టీఆర్‌ఎస్ అభ్యర్థి శంకర్‌నాయక్ సిట్టింగ్ ఎమ్మెల్యే కవితపై, పరకాలలో టీఆర్‌ఎస్ అభ్యర్థి ముద్దసాని సహోదర్‌రెడ్డిపై టీడీపీ అభ్యర్థి చల్లా ధర్మారెడ్డి, పాలకుర్తిలో టీడీపీ అభ్యర్థి ఎర్రబెల్లి దయాకర్‌రావు 4,040 ఓట్ల అతితక్కువ మెజార్టీతో విజయం సాధించారు. నర్సంపేటలో దొంతి మాధవరెడ్డి స్వతంత్ర అభ్యర్థిగా విజయం సాధించారు.

డోర్నకల్‌లో కాంగ్రెస్ అభ్యర్థి డీఎస్ రెడ్యానాయక్ గెలుపొందారు. మాజీ ప్రభుత్వ చీఫ్ విప్ గండ్ర వెంకటరమణారెడ్డిపై టీఆర్‌ఎస్ అభ్యర్థి సిరికొండ మధుసూదనాచారి విజయం సాధించారు. వరంగల్ లోక్‌సభ స్థానం నుంచి బరిలో ఉన్న టీఆర్‌ఎస్ అభ్యర్థి కడియం శ్రీహరి సరికొత్త రికార్డును సష్టించారు. కాంగ్రెస్ అభ్యర్థి సిరిసిల్ల రాజయ్యపై ఆయన 3.80 లక్షల పైచిలుకు మెజార్టీతో గెలిచారు. మహబూబాబాద్ లోక్‌సభలో టీఆర్‌ఎస్ అభ్యర్థి అజ్మీరా సీతారాంనాయక్ తన సమీప ప్రత్యర్థి, కేంద్రమంత్రి బలరాంనాయక్‌పై 35,656 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.

నల్లగొండలో సగం సీట్లు కైవసం పోరుగడ్డ నల్లగొండలో టీఆర్‌ఎస్ నగారా మోగించింది. సగం స్థానాలు సొంతం చేసుకుని జిల్లాలో తనకు తిరుగులేదని నిరూపించింది. ఒక లోక్‌సభ, ఆరు అసెంబ్లీ స్థానాలు గెలిచి అగ్రస్థానంలో నిలిచింది. భువనగిరి లోక్‌సభ స్థానంలో టీఆర్‌ఎస్ అభ్యర్థి బూర నర్సయ్యగౌడ్, కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిపై గెలుపొందారు. నల్లగొండ పార్లమెంట్‌లో కాంగ్రెస్ అభ్యర్థి గుత్తా సుఖేందర్‌రెడ్డి టీడీపీ అభ్యర్థి తేరా చిన్నపరెడ్డిపై విజయం సాధించారు. జిల్లాలో 12 అసెంబ్లీ నియోజవర్గాల్లో సూర్యాపేటలో గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి, ఆలేరులో గొంగిడి సునీత, భువనగిరిలో పైళ్ల శేఖర్‌రెడ్డి, మునుగోడులో కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, నకిరేకల్‌లో వేముల వీరేశం, తుంగతుర్తిలో గాదరి కిషోర్ విజయం సాధించారు. కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేలుగా నల్లగొండలో కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, హుజూర్‌నగర్‌లో నలమాద ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోదాడలో నలమాద పద్మావతి, నాగార్జునసాగర్‌లో కుందూరు జానారెడ్డి గెలువగా, దేవరకొండలో మిత్రపక్షమైన సీపీఐ అభ్యర్థి రమావత్ రవీంద్రకుమార్ విజయం సాధించారు.

మెతుకు సీమలో ఎనిమిది స్థానాలు మెదక్ జిల్లాలో కారు జోరుకు కాంగ్రెస్ పార్టీకి చెందిన హేమాహేమీలు మట్టికరుచుకుపోయారు. టీడీపీ, బీజేపీ కూటమి అడ్రస్ గల్లంతయ్యింది. జిల్లాలో రెండు పార్లమెంట్, 10 అసెంబ్లీ నియోజకవర్గాలుండగా 8 అసెంబ్లీ స్థానాలను టీఆర్‌ఎస్ కైవసం చేసుకుంది. రెండు ఎంపీ స్థానాలు కూడా టీఆర్‌ఎస్ ఖాతాలో పడ్డాయి. టీఆర్‌ఎస్ ఉద్యమనేత కే చంద్రశేఖర్‌రావుకు మెదక్ ఎంపీగా, గజ్వేల్ ఎమ్మెల్యేగా జనం బ్రహ్మరథం పట్టారు. సిద్దిపేటలో హరీశ్‌రావు 93,328, గజ్వేల్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసిన టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ 19,218 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.

ఆందోలు నుంచి పోటీ చేసిన మాజీ ఉపముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ టీఆర్‌ఎస్ అభ్యర్థి బాబుమోహన్ చేతిలో 3,205 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. సంగారెడ్డి నుంచి పోటీ చేసిన జయప్రకాశ్‌రెడ్డి(జగ్గారెడ్డి)పై టీఆర్‌ఎస్ అభ్యర్థి చింత ప్రభాకర్ 29,236 వేల భారీ మెజార్టీతో, మాజీ మంత్రి సునీతారెడ్డిపై పోటీ చేసిన టీఆర్‌ఎస్ అభ్యర్థి మదన్‌రెడ్డి 14,160, దుబ్బాక మాజీ ఎమ్మెల్యే చెరుకు ముత్యంరెడ్డిపై టీఆర్‌ఎస్ అభ్యర్థి సోలిపేట రామలింగారెడ్డి 37,899, మెదక్‌లో టీఆర్‌ఎస్ అభ్యర్థి పద్మాదేవేందర్‌రెడ్డి మెదక్ మాజీ ఎంపీ విజయశాంతిపై 39,234, పటాన్‌చెరులో టీఆర్‌ఎస్ అభ్యర్థి గూడెం మహిపాల్‌రెడ్డి టీడీపీ అభ్యర్థి సఫాన్‌దేవ్‌పై విజయం సాధించారు.

జహీరాబాద్‌లో మాజీ మంత్రి గీతారెడ్డి టీఆర్‌ఎస్ అభ్యర్థి మాణిక్యరావుపై 1,164 ఓట్ల స్వల్ప మెజార్టీతో, నారాయణ్‌ఖేడ్‌లో కాంగ్రెస్ అభ్యర్థి క్రిష్టారెడ్డి టీఆర్‌ఎస్ అభ్యర్థి భూపాల్‌రెడ్డిపై గెలిచారు. మెదక్ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసిన టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ హ్యాట్రిక్ సాధించారు. కాంగ్రెస్ అభ్యర్థిపై 3,97,029 ఓట్ల మెజార్టీతో కేసీఆర్ గెలుపొందారు. జహీరాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసిన బీబీ పాటిల్‌ కాంగ్రెస్ అభ్యర్థి సురేష్ షెట్కార్‌పై 1,44,631 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.

రంగారెడ్డిలో కారు దూకుడు రంగారెడ్డి జిల్లాలో కారు దూసుకొచ్చింది. చేవెళ్ల పార్లమెంట్‌లో టీఆర్‌ఎస్ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి కార్తీక్‌రెడ్డి పై, మల్కాజ్‌గిరిలో టీడీపీ-బీజేపీ కూటమి అభ్యర్థి సీహెచ్ మల్లారెడ్డి టీఆర్‌ఎస్ అభ్యర్థి మైనంపల్లి హన్మంత్‌రావుపై గెలుపొందారు. అసెంబ్లీ స్థానాలైన ఇబ్రహీంపట్నం నుంచి పోటీచేసిన జిల్లా టీడీపీ అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, రాజేంద్రనగర్‌లో తాజా మాజీ ఎమ్మెల్యే టీ ప్రకాశ్‌గౌడ్, మహేశ్వరం నుంచి టీడీపీ అభ్యర్థి తీగల కష్ణారెడ్డి, శేరిలింగంపల్లిలో టీడీపీ అభ్యర్థి అరికెపూడి గాంధీ, కుత్బుల్లాపూర్‌లో టీడీపీ అభ్యర్థి కేపీ వివేకానంద, కూకట్‌పల్లిలో టీడీపీ అభ్యర్థి మాధవరం కష్ణారావు, ఎల్‌బీ నగర్‌లో టీడీపీ అభ్యర్థి ఆర్ కష్ణయ్య, తాండూర్‌లో టీఆర్‌ఎస్ అభ్యర్థి పట్నం మహేందర్‌రెడ్డి, మేడ్చల్‌లో టీఆర్‌ఎస్ అభ్యర్థి మలిపెద్ది సుధీర్‌రెడ్డి, వికారాబాద్‌లో టీఆర్‌ఎస్ అభ్యర్థి బీ సంజీవరావు తాజా మాజీ మంత్రి గడ్డం ప్రసాద్‌కుమార్‌పై, మల్కాజ్‌గిరిలో టీఆర్‌ఎస్ అభ్యర్థి కనకారెడ్డి విజయం సాధించారు. చేవెళ్లలో కాంగ్రెస్ అభ్యర్థి కాలే యాదయ్య, పరిగిలో కాంగ్రెస్ అభ్యర్థి టీ రాంమోహన్‌రెడ్డి, ఉప్పల్‌లో బీజేపీ అభ్యర్థి ఎన్వీఎస్‌ఎస్ ప్రభాకర్ విజయం సాధించారు.

జంటనగరాల్లో టీడీపీ- బీజేపీ హైదరాబాద్ జంటనగరాల్లో టీడీపీ- బీజేపీ కూటమి అత్యధిక స్థానాలు దక్కించుకుంది. టీఆర్‌ఎస్ రెండు స్థానాల్లో విజయం సాధించింది. కాంగ్రెస్ పార్టీ ఖాతా తెరవలేదు. సికింద్రాబాద్‌లో టీఆర్‌ఎస్ అభ్యర్థి పద్మారావు టీడీపీ అభ్యర్థి కూన వెంకటేశ్‌గౌడ్‌పై, మలక్‌పేటలో ఎంఐఎం అభ్యర్థి అహ్మద్‌బిన్ అబ్దుల్ బలాలా బీజేపీ అభ్యర్థిపై వెంకట్‌రెడ్డిపై, నాంపల్లిలో ఎంఐఎం అభ్యర్థి జాఫర్ హుస్సేన్ టీడీపీ అభ్యర్థి మహ్మద్ ఫిరోజ్‌ఖాన్‌పై, కార్వాన్‌లో ఎంఐఎం అభ్యర్థి కౌసర్ మొయినుద్దీన్ బీజేపీ అభ్యర్థి బద్దం బాల్‌రెడ్డిపై, చార్మినార్‌లో ఎంఐఎం అభ్యర్థి పాషాఖాద్రి టీడీపీ అభ్యర్థి ఎంఏ బాసిత్‌పై, చాంద్రాయణగుట్టలో ఎంఐఎం అభ్యర్థి అక్బరుద్దీన్ ఓవైసీ ఎంబీటీ అభ్యర్థి ఖయూం ఖాన్‌పై, యాకుత్‌పురలో ఎంఐఎం అభ్యర్థి ముంతాజ్ మహ్మద్‌ఖాన్ బీజేపీ అభ్యర్థి రూప్‌రాజ్‌పై, బహదూర్‌పురలో ఎంఐఎం అభ్యర్థి మోజంఖాన్ టీడీపీ అభ్యర్థి అబ్దుల్ రెహమాన్‌పై, ముషీరాబాద్‌లో బీజేపీ అభ్యర్థి డాక్టర్ కే లక్ష్మణ్‌ టీఆర్‌ఎస్ అభ్యర్థి ముఠాగోపాల్‌పై, అంబర్‌పేటలో బీజేపీ అభ్యర్థి కిషన్‌రెడ్డి టీఆర్‌ఎస్ అభ్యర్థి ఎడ్ల సుధాకర్‌రెడ్డిపై, ఖైరతాబాద్‌లో బీజేపీ అభ్యర్థి చింతల రాంచంద్రారెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి దానం నాగేందర్‌పై 20,846 ఓట్ల మెజార్టీతో, గోషామహల్‌లో బీజేపీ అభ్యర్థి రాజాసింగ్ కాంగ్రెస్ అభ్యర్థి మూల ముఖేష్ గౌడ్‌పై 46,784 ఓట్ల మెజార్టీతో, సనత్‌నగర్‌లో టీడీపీ అభ్యర్థి తలసాని శ్రీనివాస్ యాదవ్ టీఆర్‌ఎస్ అభ్యర్థి దండె విఠల్‌పై, కంటోన్మెంట్‌లో టీడీపీ అభ్యర్థి జీ సాయన్న టీఆర్‌ఎస్ అభ్యర్థి గజ్జెల నగేశ్‌పై, జూబ్లీహిల్స్‌లో టీడీపీ అభ్యర్థి మాగంటి గోపీనాథ్ ఎంఐఎం అభ్యర్థి నవీన్‌యాదవ్‌పై, మల్కాజిగిరి పార్లమెంట్‌లో టీడీపీ అభ్యర్థి మల్లారెడ్డి టీఆర్‌ఎస్ అభ్యర్థి మైనంపల్లి హన్మంతరావుపై 28,993 ఓట్ల మెజార్టీతో, హైదరాబాద్ ఎంఐఎం అభ్యర్థి అసదుద్దీన్ ఓవైసీ బీజేపీ అభ్యర్థి భగవంత్‌రావుపై 55,035 ఓట్ల మెజార్టీతో, సికింద్రాబాద్‌లో బీజేపీ అభ్యర్థి బండారు దత్తాత్రేయ టీఆర్‌ఎస్ అభ్యర్థి భీంసేన్‌పై 50,425 ఓట్ల మెజార్టీతో విజయంసాధించారు.

కరీంనగర్‌లో 12 స్థానాలు. కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఎదురు దెబ్బ కరీంనగర్‌లో అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీఆర్‌ఎస్ ప్రభంజనం సష్టించింది. జిల్లాలో 13 అసెంబ్లీ నియోజకవర్గాలకు 12 స్థానాల్లో గులాబీజెండా ఎగిరింది. సిరిసిల్లలో టీఆర్‌ఎస్ అభ్యర్థి కేటీఆర్ కాంగ్రెస్ అభ్యర్థి కే రవీందర్‌రావుపై 53,004 ఓట్ల మెజార్టీతో, పెద్దపల్లిలో టీఆర్‌ఎస్ అభ్యర్థి మనోహర్‌రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి బానుప్రసాదరావుపై 62,677 ఓట్లతో, కరీంనగర్‌లో టీఆర్‌ఎస్ అభ్యర్థి గంగుల కమలాకర్ విజయం సాధించారు. హుజూరాబాద్‌లో టీఆర్‌ఎస్ అభ్యర్థి ఈటెల రాజేందర్ కాంగ్రెస్ అభ్యర్థి కేతిరి సుదర్శన్‌రెడ్డిపై 57,037 ఓట్ల అధిక్యతను, చొప్పదండిలో టీఆర్‌ఎస్ అభ్యర్థి బొడిగె శోభ ప్రత్యర్థి సుద్దాల దేవయ్యపై 54,961 ఓట్ల మెజార్టీతో, మానకొండూర్‌లో టీఆర్‌ఎస్ అభ్యర్థి రసమయి బాలకిషన్, హుస్నాబాద్‌లో టీఆర్‌ఎస్ అభ్యర్థి ఓడితెల సతీష్‌కుమార్, వేములవాడలో టీఆర్‌ఎస్ అభ్యర్థి సీహెచ్ రమేష్‌రావు, ధర్మపురిలో టీఆర్‌ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్, రామగుండంలో టీఆర్‌ఎస్ అభ్యర్థి సోమారపు సత్యనారాయణ, మంథనిలో టీఆర్‌ఎస్ అభ్యర్థి పుట్ట మధు కాంగ్రెస్ అభ్యర్థి దుద్దిళ్ల శ్రీధర్‌బాబుపై 19,366 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. కోరుట్లలో టీఆర్‌ఎస్ అభ్యర్థి విద్యాసాగర్‌రావు, జగిత్యాలలో కాంగ్రెస్ అభ్యర్థి టీ జీవన్‌రెడ్డి టీఆర్‌ఎస్ అభ్యర్థి డాక్టర్ సంజీవ్‌కుమార్‌పై 7,828 ఓట్ల మెజార్టీ సాధించారు.

ఇందూరులో టీఆర్‌ఎస్ ప్రభంజనం నిజామాబాద్ తొలిమహిళా ఎంపీగా కవిత రికార్డ్ ఇందూరు గడ్డపై టీఆర్‌ఎస్ అప్రతిహత రాజకీయ ఆధిపత్యాన్ని చాటుకుంది. 29 ఏళ్ల కిందటి అరుదైన రాజకీయ రికార్డును పునరావృతం చేసింది. ఎన్టీఆర్ ప్రభంజనంలో 1985 ఎన్నికల్లో అన్ని అసెంబ్లీ స్థానాలను టీడీపీ గెలుచుకుంది. తెలంగాణ రాష్ట్రంలో జరిగిన తొలి ఎన్నికల్లో తొమ్మిదింటికి తొమ్మిది అసెంబ్లీ స్థానాల్లో టీఆర్‌ఎస్ విజయఢంకా మోగించింది.

నిజామాబాద్ లోక్‌సభ బరిలో నిలిచి గెలిచిన తొలి మహిళా ఎంపీగా కల్వకుంట్ల కవిత మరో అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. నిజామాబాద్ రూరల్‌లో కాంగ్రెస్ అభ్యర్థి, పీసీసీ మాజీ చీఫ్ డీ శ్రీనివాస్.. టీఆర్‌ఎస్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ చేతిలో ఓడిపోయారు. బోధన్‌లో మాజీ మంత్రి సుదర్శన్‌రెడ్డి టీఆర్‌ఎస్ అభ్యర్థి షకీల్ చేతిలో ఓడిపోయారు. ఆర్మూర్‌లో కాగ్రెస్ అభ్యర్థి, మాజీస్పీకర్ సురేశ్‌రెడ్డి టీఆర్‌ఎస్ అభ్యర్థి జీవన్‌రెడ్డి చేతిలో, కామారెడ్డిలో కాంగ్రెస్ అభ్యర్థి షబ్బీర్‌అలీ టీఆర్‌ఎస్ అభ్యర్థి గంప గోవర్ధన్ చేతిలో, బాల్కొండలో కాంగ్రెస్ అభ్యర్థి, ప్రభుత్వ మాజీ విప్ ఈరవత్రి అనిల్ టీఆర్‌ఎస్ అభ్యర్థి ప్రశాంత్‌రెడ్డి చేతిలో ఓడిపోయారు. బాన్సువాడలో టీఆర్‌ఎస్ అభ్యర్థి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ఎల్లారెడ్డిలో టీఆర్‌ఎస్ అభ్యర్థి ఏనుగు రవీందర్‌రెడ్డి, జుక్కల్‌లో టీఆర్‌ఎస్ అభ్యర్థి హన్మంత్‌షిండే గెలుపొందారు.

ఆదిలాబాద్‌లో అనూహ్య ఆదరణ పార్లమెంటు సహా ఏడు నియోజకవర్గాల్లో కారు జోరు బీఎస్పీకి రెండు, కాంగ్రెస్‌కు ఒక ఎమ్మెల్యే.. అడ్రస్ లేని టీడీపీ ఆదిలాబాద్ జిల్లాలో పది అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఏడు, ఒక పార్లమెంట్ సెగ్మెంట్లలో టీఆర్‌ఎస్ విజయఢంకా మోగించింది. రెండు నియోజకవర్గాల్లో పోటీచేసిన బీఎస్పీ అనూహ్యంగా విజయం సాధించింది. కాంగ్రెస్ ఒక్క ఎమ్మెల్యేతోనే సరిపెట్టుకుంది. టీఆర్‌ఎస్ అభ్యర్థులు ఆదిలాబాద్ నుంచి జోగురామన్న, బోథ్ నుంచి రాథోడ్ బాపురావు, ఆసిఫాబాద్ నుంచి కోవ లక్ష్మీ, ఖానాపూర్ నుంచి రేఖా శ్యాంనాయక్, మంచిర్యాల నుంచి నడిపెల్లి దివాకర్‌రావు, చెన్నూర్ నుంచి నల్లాల ఓదెలు గెలిచారు.

బెల్లంపల్లి టీఆర్‌ఎస్ అభ్యర్థి దుర్గం చిన్నయ్య 52,528 ఓట్లతో సీపీఐ అభ్యర్థి గుండా మల్లేశ్‌పై గెలుపొందారు. సిర్పూర్-టి నియోజకవర్గ బీఎస్పీ అభ్యర్థి కోనేరు కోనప్ప 8837 ఓట్లతో టీఆర్‌ఎస్ అభ్యర్థి కావేటి సమ్మయ్యపై, నిర్మల్ నుంచి బీఎస్పీ అభ్యర్థి ఇంద్రకరణ్‌రెడ్డి 8,628 ఓట్లతో టీఆర్‌ఎస్ అభ్యర్థి శ్రీహరిరావుపై, ముథోల్ కాంగ్రెస్ అభ్యర్థి విఠల్‌రెడ్డి 14,686 ఓట్లతో సమీప బీజేపీ అభ్యర్థి రమాదేవిపై, ఆదిలాబాద్ ఎంపీ టీఆర్‌ఎస్ అభ్యర్థి గెడ్డం నగేశ్ 1,67,571 ఓట్ల మెజార్టీతో సమీప కాంగ్రెస్ అభ్యర్థి నరేష్ జాదవ్‌పై గెలుపొందారు. టీడీపీకి జిల్లాలో ఒక్కస్థానం కూడా దక్కలేదు.

ఖమ్మంలో వైఎస్సార్సీపీ పాగా ఖమ్మం జిల్లాలో వైఎస్సార్సీపీ పాగా వేసింది. జిల్లాలోని పది నియోజకవర్గాల్లో నాలుగుచోట్ల కాంగ్రెస్ విజయభేరి మోగించగా, మూడింటిలో వైఎస్సార్సీపీ, సీపీఎం, టీడీపీ, టీఆర్‌ఎస్ ఒక్కో సీటు గెలుచుకున్నాయి. ఖమ్మం నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి పువ్వాడ అజయ్‌కుమార్ టీడీపీ నేత తుమ్మల నాగేశ్వరరావుపై 6,241 ఓట్ల తేడాతో గెలిచారు. పాలేరులో మాజీ మంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డి గెలుపొందారు. మధిరలో కాంగ్రెస్ అభ్యర్థి మల్లు భట్టి విక్రమార్క, మోత్కుపల్లి నర్సింహులుపై గెలిచారు. ఇల్లెందులో కాంగ్రెస్ అభ్యర్థి కోరం కనకయ్య, పినపాకలో వైఎస్సార్సీపీ అభ్యర్థి పాయం వెంకటేశ్వర్లు, వైరాలో వైఎస్సార్సీపీ అభ్యర్థి మధన్‌లాల్, కొత్తగూడెంలో టీఆర్‌ఎస్ అభ్యర్థి జలగం వెంకట్రావ్, భద్రాచలంలో సీపీఎం అభ్యర్థి సున్నం రాజయ్య, అశ్వారావుపేటలో వైఎస్సార్సీపీ అభ్యర్థి తాటి వెంకటేశ్వర్లు, సత్తుపలిలో టీడీపీ అభ్యర్థి సండ్ర వెంకటవీరయ్య గెలిచారు. ఖమ్మం ఎంపీగా వైఎస్సార్సీపీ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నామా నాగేశ్వరరావుపై 9,922 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.

పాలమూరులో గులాబీ గుబాలింపు ఈవీఎం మొరాయింపుతో కల్వకుర్తి ఫలితాల నిలిపివేత మహబూబ్‌నగర్ జిల్లాలో గులాబీ గుబాళించింది. అనూహ్యమైన రీతిలో టీఆర్‌ఎస్ అభ్యర్థులు ఏడు స్థానాల్లో విజయం సాధించారు. మహబూబ్‌నగర్ అసెంబ్లీ స్థానంలో టీఆర్‌ఎస్ అభ్యర్థి శ్రీనివాస్‌గౌడ్ 3,138 ఓట్ల ఆధిక్యతతో బీజేపీ అభ్యర్థి యెన్నం శ్రీనివాస్‌రెడ్డిపై, జడ్చర్లలో టీఆర్‌ఎస్ అభ్యర్థి లక్ష్మారెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి మల్లురవిపై 14,734 ఓట్ల మెజార్టీతో గెలిచారు. నాగర్‌కర్నూల్‌లో టీఆర్‌ఎస్ అభ్యర్థి మర్రి జనార్దన్‌రెడ్డి, అచ్చంపేటలో టీఆర్‌ఎస్ అభ్యర్థి గువ్వల బాలరాజు, కొల్లాపూర్‌లో టీఆర్‌ఎస్ అభ్యర్థి జూపల్లి కష్ణారావు, దేవరకద్రలో టీఆర్‌ఎస్ అభ్యర్థి ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, షాద్‌నగర్‌లో టీఆర్‌ఎస్ అభ్యర్థి అంజయ్యయాదవ్ గెలిచారు. గద్వాలలో కాంగ్రెస్ అభ్యర్థి, మాజీ మంత్రి డీకే అరుణ 8,271 ఓట్లతో టీఆర్‌ఎస్ అభ్యర్థి కష్ణమోహన్‌రెడ్డిపై, మక్తల్‌లో కాంగ్రెస్ అభ్యర్థి చిట్టెం రాంమోహన్‌రెడ్డి టీఆర్‌ఎస్ అభ్యర్థి ఎల్లారెడ్డిపై 10,185 ఓట్ల మెజార్టీతో, కొడంగల్‌లో టీడీపీ అభ్యర్థి రేవంత్‌రెడ్డి టీఆర్‌ఎస్ అభ్యర్థి గుర్నాథ్‌రెడ్డిపై గెలిచారు. నాగర్‌కర్నూల్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి నంది ఎల్లయ్య టీఆర్‌ఎస్ అభ్యర్థి మందా జగన్నాథంపై 3,785 ఓట్ల మెజార్టీతో, మహబూబ్‌నగర్ ఎంపీ టీఆర్‌ఎస్ అభ్యర్థి జితేందర్‌రెడ్డి, మాజీ కేంద్ర మంత్రి జైపాల్‌రెడ్డిపై 2,590ఓట్లతో విజయం సాధించారు. కల్వకుర్తిలో ఓ ఈవీఎం మొరాయించడంతో అధికారులు ఫలితాలు ప్రకటించలేదు.

 

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the BRS Party.