Bharat Rashtra Samithi

Bharat Rashtra Samithi

KCR
telangana talli img

సృజనాత్మకతకు పెద్దపీట

-మన తీరు మారాలి
-పిల్లల ఆలోచనలను ప్రోత్సహించాలి
-తల్లిదండ్రులకు కేటీఆర్‌ పిలుపు
-సృజన ఎవరి గుత్తసొత్తూ కాదు
-కరికులంలో ఆవిష్కరణలు
-ఇంజినీరింగ్‌ కోర్సుల తరహాలో అప్రెంటిస్‌ విధానం
-విద్యార్థులు ఆవిష్కరణలను వివరిస్తుంటే ముచ్చటేసింది
-స్కూల్‌ ఇన్నోవేషన్‌ చాలెంజ్‌ ముగింపులో మంత్రి వ్యాఖ్యలు

పాఠశాల కరికులంలో ఆవిష్కరణలను ఒక అంశంగా ప్రవేశపెట్టాలని మున్సిపల్‌, ఐటీ, పరిశ్రమలశాఖల మంత్రి కే తారకరామారావు అభిప్రాయపడ్డారు. ఇంజినీరింగ్‌ కోర్సుల తరహాలో పాఠశాల స్థాయిలోనే సృజనాత్మకతకు పెద్దపీట వేయాలన్నారు. అప్రెంటిస్‌షిప్‌, ప్రాక్టీస్‌ స్కూల్‌.. ఇలా ఏదో ఒక పేరుతో మార్కులివ్వడం (కోర్సు క్రెడిట్స్‌) తోపాటు, స్కూళ్లతో పరిశ్రమలను అనుసంధానంచేసే అంశాన్ని సైతం పరిశీలించాలన్నారు. విద్యాశాఖ, తెలంగాణ ఇన్నోవేషన్‌ సెల్‌, యూనిసెఫ్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘స్కూల్‌ ఇన్నోవేషన్‌ చాలెంజ్‌’ ముగింపు కార్యక్రమం సోమవారం హైదరాబాద్‌లోని మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి కేటీఆర్‌ విద్యార్థులు రూపొందించిన ఆవిష్కరణలను పరిశీలించి, వారితో ముచ్చటించారు.

అనంతరం కేటీఆర్‌ మాట్లాడుతూ సృజనాత్మకత ఎవరి గుత్తసొత్తు కాదన్నారు. హైదరాబాద్‌లోనో కార్పొరేట్‌ స్కూళ్లలో చదువుకొంటేనే గొప్పగొప్ప ఆలోచనలు వస్తాయనుకోవడం పొరపాటని, అందుకు ఇక్కడికొచ్చిన విద్యార్థులు రూపొందించిన ప్రాజెక్టులే నిదర్శనమని తెలిపారు. వివిధ స్టాళ్ల వద్ద గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చిన విద్యార్థులు ఆత్మవిశ్వాసంతో, గుండెనిబ్బరంతో తాము చేసిన ఆవిష్కరణల గురించి చెప్తుంటే ముచ్చటేసిందని, మం త్రులు, అధికారులు, కొత్తవాళ్లు ఉన్నారన్న భయం, బెరుకు, జంకు లేకుండా ఇంగ్లిష్‌లో వివరిస్తుంటే తాను అబ్బురపడ్డానన్నారు. హైడ్రాలిక్‌ వీల్‌చైర్‌ రూ పొందించిన బషీరా నేపథ్యం, బిందె తీస్తే బంద్‌ అ య్యే నల్లా, షీ ఫర్‌ అజ్‌ ప్రాజెక్ట్‌లు సృజనాత్మకతకు అద్దంపడుతున్నాయని, వీరిని కొద్దిగా ప్రోత్సహిస్తే, వారిలోని తెలివితేటలను వాడుకుంటే అద్భుతాలు సృష్టించగలరని మంత్రి కేటీఆర్‌ అన్నారు.

ఆలోచనలు మారాలి..
‘చదివితే డాక్టర్‌ కావాలి. ఇంజినీర్‌ కావాలని తల్లిదండ్రులు అంటున్నారు. ఏదైనా కొత్త ఆవిష్కరణలు రూపొందిస్తే మెగ్గలోనే తుంచేస్తున్నారు. ఎంసెట్‌రాయి. నీట్‌ రాయి. డాక్టర్‌, ఇంజినీర్‌ కావాలంటున్నారు. ఈ ఆలోచనలు మారాలి’ అని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. పిల్లల ఆలోచనలను ప్రోత్సహించేలా తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల్లో మార్పు రా వాల్సిన అవసరమున్నదని, ఈ మార్పు వస్తే విద్యార్థులు తాము ఉద్యోగం వెతుక్కోవడం కాదు. పది మందికి ఉద్యోగాలిస్తారన్నారు. గొప్ప గొప్ప ఆలోచనలకు తెలంగాణ కేరాఫ్‌గా మారుతుందన్నారు. ‘ప్రపంచంలోనే యంగెస్ట్‌ కంట్రీ మనదే. నేటి సార్ట ప్స్‌.. రేపటి ఎంఎన్‌సీ కంపెనీలనీ ప్రధాని మోదీ అంటున్నారు. ఇదే కోవలో సార్టప్స్‌ను ప్రొత్సహిస్తే వేల ఉద్యోగావకాశాలు కల్పించినవాళ్లమవుతాం. మన దేశంలో 65% జనాభా 35 ఏండ్లు లోపుంటే, 50% పైగా జనాభా 27 ఏండ్లలోపు వారున్నారు. ఇంత విలువైన యువతను, వారిలోని సృజనను ప్రోత్సహించాల్సిన అవసరమున్నది. గత ఆరేండ్ల కాలంలో ఇన్నోవేషన్‌ సెల్‌, టీహబ్‌, వీ హబ్‌, రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ సర్కిల్‌ ఆఫ్‌ హైదరాబాద్‌ను అందుబాటులోకి తీసుకొచ్చి తెలంగాణలో కొత్త ఆవిష్కరణలు, సృజనలను ప్రోత్సహిస్తున్నాం’ అని మంత్రి కేటీఆర్‌ వెల్లడించారు. ఇలాంటి ఇన్నోవేషన్‌ చాలెంజ్‌లను జిల్లాల స్థాయిలోనూ నిర్వహించాలని విద్యాశాఖ అధికారులకు సూచించారు.

మరే రాష్ట్రంలో లేనట్టుగా విద్య: మంత్రి సబిత
కరోనా నేపథ్యంలో పిల్లల చదువులకు ఆటంకం కలుగకుండా ఏర్పాట్లుచేశామని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. టీశాట్‌, దూరదర్శన్‌ల ద్వారా పాఠాలను ప్రసారం చేస్తున్నామని తెలిపారు. తన పర్యటనలో ఓ విద్యార్థి కూరగాయలమ్ముతూ ఫోన్లో పాఠాలు వింటున్నాడని, తాను కారు ఆపి వెళ్లి ఆ విద్యార్థిని అడిగితే టీ శాట్‌ ప్రసారాలు వింటున్నట్లు చెప్పాడని, తెలంగాణలో చదువులకు ఆటంకం కలుగలేదనడానికి ఇదే తార్కాణమని చెప్పారు. విద్యార్థుల కోసం ఎస్సీఈఆర్టీ ద్వారా వర్క్‌షీట్లను సైతం అందజేస్తున్నామని చెప్పారు. విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రా రామచంద్రన్‌, పరిశ్రమలు, ఐటీశాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌రంజన్‌, ఇంటర్‌బోర్డు కార్యదర్శి సయ్యద్‌ ఒమర్‌ జలీల్‌, పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ శ్రీదేవసేన, రైతుబంధుసమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

రెండో బహుమతి.. మల్టీపర్పస్‌ అగ్రికల్చర్‌బ్యాగ్‌..
రైతులు, కూలీలు.. పొలంలో మిరపకాయలు, కూరగాయలు, పండ్లు, పత్తిలాంటికి ఏరడానికి ఇబ్బందులు పడుతుంటారు. విత్తనాలు, ఎరువులు వెదజల్లడానికి సైతం పెద్ద పెద్ద గంపలు, తట్టలు వాడుతూ శక్తినంతా కోల్పోతుంటారు. దీనివల్ల నడుంనొప్పి, వెన్నునొప్పుల వంటివి ఇబ్బందిపెడుతుంటాయి. దీనికి పరిష్కారంగా మహబూబాబాద్‌ జిల్లా దంతాలపల్లి జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల విద్యార్థులు రాజేశ్‌, అభిషేక్‌, వేణు మల్టీపర్పస్‌ అగ్రికల్చర్‌బ్యాగ్‌ను తయారుచేశారు. కేవలం రెండు ఎరువుల సంచులను వాడి, బుజానికి తగిలించుకొనే బ్యాగుగా మార్చి మార్కులు కొట్టేశారు. వీటిని బుజాలకు తగిలించుకొని 10 కిలోల బరువునైనా మోయవచ్చని విద్యార్థులు చెప్పారు.

మూడో బహుమతి.. ఆర్గానిక్‌ చాక్‌పీస్‌
ఇప్పుడు వాడుతున్న చాక్‌పీస్‌లను జిప్సంతో తయారుచేస్తారు. దీనివల్ల టీచర్లు, విద్యార్థులు శ్వాసకోశ వ్యాధుల భారినపడుతుంటారు. ఈ పరిస్థితి నుంచి శాశ్వత విముక్తి కల్పిస్తూ ఆర్గానిక్‌ చాక్‌పీస్‌ను తయారుచేశారు.. ఆదిలాబాద్‌ జిల్లా బంగారిగూడ తెలంగాణ మోడల్‌ స్కూల్‌ విద్యార్థులు హర్షిత్‌ వర్మ, కొమ్మావర్‌ రుద్ర. జిప్సంకు బదులుగా లైమ్‌పౌడర్‌ను వాడి ఈ చాక్‌పీస్‌లను తయారుచేశారు.వేపనూనె, నిమ్మనూనె, పసుపు, యూకలిప్టస్‌, పిప్పర్‌మెంట్‌, ఓమా పౌడర్‌లను కూడా ఈ చాక్‌పీస్‌ తయారీలో వాడుకోచ్చని, ఈ పౌడర్‌ గాలిని పీల్చినా ఆరోగ్యానికి మంచిదేనని విద్యార్థులు వివరించారు.

రూ.2కే ఆర్గానిక్‌ స్త్రీ రక్షా ప్యాడ్లు..
నెలసరి సమయంలో మహిళలు ప్రస్తుతానికి వాడుతున్న శానిటరీ ప్యాడ్లు అత్యధిక ఖర్చుతో కూడినవి. పైగా వీటి తయారీలో వాడే పాలిథిన్‌ తొందరగా భూమిలో కలిసిపోయేది కాదు. వీటి వాడకం క్యాన్సర్‌కు దారితీస్తున్నది. ఈ పరిస్థితిని గమనించిన యాదాద్రి భువనగిరి జిల్లా ముల్కలపల్లి జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల విద్యార్థినులు అనిత, శైలజ, లలిత సంయుక్తంగా ఆర్గానిక్‌ స్త్రీరక్షాప్యాడ్లను తయారుచేశారు. కాటన్‌ లేయర్ల మధ్యలో గుర్రపుడెక్క ఆకు, వేప, పసుపు, మెంతులు, సబ్జ గింజలను ఉపయోగించి వీటిని తయారుచేశారు. వీటిలో సబ్జ గింజలు, మెంతులు తడిదనాన్ని పీల్చుకుంటాయి. వేప, పసుపు ఇన్ఫెక్షన్‌ కాకుండా రక్షిస్తాయి. కేవలం రెండు రూపాయలకే ఒక ప్యాడ్‌ను అందించవచ్చు. ఈ ఇన్నోవేషన్‌కు ప్రథమ బహుమతి కింద రూ.75 వేల నగదు లభించింది.

విజేతలకు చెక్కులు..
మొత్తం 25 ఆవిష్కరణల్లో నుంచి ముగ్గురు విజేతలను ఎంపికచేయగా, వారికి మెమెంటో, సర్టిఫికెట్లతోపాటు, చెక్కులను మంత్రులు అందజేశారు. ఆర్గానిక్‌ జీరోవేస్ట్‌ స్త్రీరక్షా ప్యాడ్స్‌ను తయారుచేసిన యాదాద్రి భువనగిరి జిల్లా ముల్కలపల్లి జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల విద్యార్థులు డీ అనిత, డీ శైలజ, డీ లలితలకు మొదటి బహుమతి (రూ.75 వేలు), మల్టీ పర్పస్‌ అగ్రికల్చర్‌ బ్యాగ్‌ను తయారుచేసిన మహబూబాబాద్‌ జిల్లా దంతాలపల్లి జిల్లా పరిషత్‌ ఉన్నతపాఠశాల విద్యార్థులు కే రాజేశ్‌, ఏ అభిషేక్‌, సీహెచ్‌ వేణుకు ద్వితీయ బహుమతి (రూ.50 వేలు), ఆర్గానిక్‌ చాక్‌పీస్‌ను తయారుచేసిన ఆదిలాబాద్‌ జిల్లా బంగారిగూడ తెలంగాణ మోడల్‌ స్కూల్‌ విద్యార్థులు హర్షిత్‌వర్మ, రుద్రలకు తృతీయ బహుమతి (రూ.35, 500) ని చెక్కుల రూపంలో మంత్రులు కేటీఆర్‌, సబితారెడ్డి అందజేశారు.

వారంతా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్నవారు. తమ ఆలోచనలకు పదునుపెట్టి కొత్త ఆవిష్కరణలను తయారుచేశారు. రాష్ట్రస్థాయికి ఎంపికై హైదరాబాద్‌ దాకా వచ్చారు. వీరంతా మంత్రి కేటీఆర్‌తో ముచ్చటించాలని తహతహలాడారు. వారి ఆకాంక్షలకు తగినట్లుగానే మంత్రి కేటీఆర్‌ ప్రతిస్టాల్‌ను సందర్శించి, అక్కడ విద్యార్థులను వెన్నుతట్టి ప్రోత్సహించారు. గంటన్నరపాటు అందరితో గడిపి అందరిలో ఉత్సాహాన్ని నిం పారు. విద్యార్థులతో కేటీఆర్‌ సంభాషణ సాగిందిలా..

కేటీఆర్‌ : హలో అమ్మా
విద్యార్థులు: గుడ్‌ ఆఫ్టర్‌నూన్‌ సార్‌
కేటీఆర్‌ : మీరేం తయారుచేశారు.
విద్యార్థులు: హైడ్రాలిక్‌ లిఫ్టింగ్‌ వీల్‌చైర్‌ సర్‌
కేటీఆర్‌ : ఈ ఆలోచన మీకెందుకొచ్చింది?
విద్యార్థి : సార్‌ మై నేమ్‌ ఈజ్‌ బషీరా. మా నా న్నకు ఐదేండ్ల క్రితం పక్షవాతం వచ్చింది. నేను ఏడాది స్కూల్‌ బంద్‌చేసి నాన్నకు సపర్యలు చేశా. ఇప్పుడు వీల్‌చైర్‌, కర్ర పట్టుకుని నడుస్తున్నారు. అమ్మ ఐస్‌ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నది. మా నాన్న ఇబ్బందులు తీ ర్చడానికి వీల్‌చైర్‌ను తయారుచేశాం. మాకు సొంతిల్లు లేదు సార్‌.
కేటీఆర్‌ : గుడ్‌ అమ్మా. అధికారులకు చెప్పి డబుల్‌ బెడ్‌రూం ఇంటిని మంజూరుచేయిస్తాం.
బషీరా : థ్యాంక్యూ వెరీమచ్‌ సార్‌..
కేటీఆర్‌ : హాయ్‌
విద్యార్థులు: నమస్తే సార్‌
కేటీఆర్‌ : మీ పేర్లేమిటి?
విద్యార్థులు: మై నేమిజ్‌ నితిన్‌, హీ తౌసిప్‌, షీ అఖిల
కేటీఆర్‌ : మీ టీచర్లను పరిచయం చేయరా..
విద్యార్థులు: సర్‌ వీ ఇన్వెంటెడ్‌ రైస్‌ షిఫ్టింగ్‌ బ్యాగ్‌. దిస్‌ ఈస్‌ యూస్‌పుల్‌ టూ ప్రెగ్నెంట్‌ లేడీస్‌. డిసేబుల్డ్‌ పర్సన్స్‌ అండ్‌ సీనియర్‌ సిటిజన్స్‌
కేటీఆర్‌ : పిల్లలకు ఇలాంటివి అవసరమంటా రా. మీ బ్యాగ్‌లు చాలా బరువుగా ఉంటున్నాయి కదా.
విద్యార్థులు: అవును సార్‌
కేటీఆర్‌ : వెరీ స్మార్ట్‌. మీలో ఉన్న ఔట్‌స్టాండింగ్‌ కాన్ఫిడెన్స్‌. ఇన్వెన్షన్‌ చేయడమే కాదు. వాటి గురించి వివరంగా చెప్పడం వెరీ గుడ్‌. ఆల్‌ ది బెస్ట్‌. టీచర్‌ కల్పించుకుని సార్‌ మాస్కూల్లో కంప్యూటర్‌ ల్యాబ్‌లేదు. ఇబ్బందిపడుతున్నాం.
కేటీఆర్‌ : విద్యాశాఖ స్పెషల్‌ సీఎస్‌ను పిలిచి వెంటనే మంజూరుచేయండి.

‘చదివితే డాక్టర్‌ కావాలి. ఇంజినీర్‌ కావాలని తల్లిదండ్రులు అంటున్నారు. ఏదైనా కొత్త ఆవిష్కరణలు రూపొందిస్తే మొగ్గలోనే తుంచేస్తున్నారు. ఎంసెట్‌ రాయి. నీట్‌ రాయి. డాక్టర్‌, ఇంజినీర్‌ కావాలి అంటున్నారు. ఈ పద్ధతి మారాలి. పిల్లల ఆలోచనలను ప్రోత్సహించేలా తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల్లో మార్పు రావాల్సిన అవసరమున్నది. ఈ మార్పు వస్తే విద్యార్థులు తాము ఉద్యోగం వెతుక్కోవడం కాదు. పది మందికి ఉద్యోగాలిస్తారు. గొప్ప గొప్ప ఆలోచనలకు తెలంగాణ కేరాఫ్‌గా మారుతుంది’

– ఐటీ, పరిశ్రమలశాఖల మంత్రి కేటీఆర్‌

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the BRS Party.