-కొత్త భవనాలకు కట్టుదిట్టంగా అమలు -జీహెచ్‌ఎంసీకి మంత్రి కేటీఆర్ ఆదేశం -హైదరాబాద్‌ను స్మార్ట్‌సిటీగా మారుస్తామని వెల్లడి

హైదరాబాద్‌లో కొత్తగా నిర్మించే భవనాలపై (రూఫ్‌టాప్) సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేసే ప్యానళ్ల ఏర్పాటు తప్పనిసరికానుంది. ఈ మేరకు ఇప్పటికే ఉన్న నిబంధనలను కట్టుదిట్టంగా అమలుచేయాలని పంచాయతీరాజ్, ఐటీశాఖ మంత్రి కే తారకరామారావు జీహెచ్‌ఎంసీ అధికారులను ఆదేశించారు. నగరంలో రోజురోజుకూ పెరుగుతున్న విద్యుత్ డిమాండును కొంతైనా తీర్చేందుకు ఇది దోహదపడుతుందని ఆయన పేర్కొన్నారు.
వచ్చేనెల ఆరునుంచి 10వ తేదీవరకు నగరంలో జరగనున్న 11వ మెట్రోపొలిస్ అంతర్జాతీయ సదస్సు సన్నాహక కార్యక్రమాల్లో భాగంగా శుక్రవారం బంజారాహిల్స్‌లోని అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా (ఆస్కీ), జీహెచ్‌ఎంసీ సంయుక్తంగా భారత నగరాలు- స్మార్ట్‌సిటీలుగా మార్పుఅనే అంశంపై వర్క్‌షాప్‌ను ఏర్పాటుచేశాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ భవనాలపై సోలార్ ప్యానళ్ల ఏర్పాటుకు ఇప్పటికే నిబంధనలు ఉన్నప్పటికీ అవి అమలుకు నోచుకోవడంలేదన్నారు. ఇకమీదట దీన్ని కట్టుదిట్టంగా అమలుచేయాలని ఆయన జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ను ఆదేశించారు. స్మార్‌సిటీలంటే కేవలం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుకోవడమే కాదని, జీవన ప్రమాణాలను మెరుగుపర్చడం, నాణ్యమైన సేవలను అందించడమని పేర్కొన్నారు.
మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో సకాలంలో ప్రజలకు మెరుగైన, నాణ్యమైన సేవలందించాల్సిన ఆవశ్యకత ఉందని, స్మార్ట్‌సిటీల ప్రధాన ఉద్దేశం కూడా ఇదేనన్నారు. కేవలం లేఔట్ల ఏర్పాటుతో నగరం స్మార్ట్‌సిటీ అనిపించుకోదని, మెరుగైన పద్ధతుల్లో అన్నిరకాల పౌరసేవలు అందుబాటులోకి తేవాల్సిన అవసరం ఉందన్నారు. అమెరికా, బ్రిటన్, బ్రిస్‌బేన్ వంటి ప్రాంతాల్లో స్మార్ట్‌సిటీకి చేపట్టిన పద్ధతులు మన దేశంలో చేపట్టేందుకు అవకాశం లేదన్నారు. మన దేశంలో ఏ కొత్త విధానం ప్రవేశపెట్టినా ప్రజలు అర్థంచేసుకోవడానికి సమయం పడుతుందన్నారు. ముందుగా కొత్త విధానంపై ప్రజల్లో అవగాహన కల్పించడంతోపాటు క్రమశిక్షణ అలవాటయ్యేలా తగిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని మంత్రి అభిప్రాయపడ్డారు.
రాష్ట్రంలో పట్టణీకరణ 39శాతం పట్టణప్రాంతం ఉండగా, పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌లో 27శాతమే ఉందన్నారు. అందుకే స్మార్ట్‌సిటీ విధానంతో మెరుగైన జీవన ప్రమాణాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. అయితే, మెరుగైన పారిశుద్ధ్యం, నాణ్యమైన, శుభ్రమైన రోడ్లు, క్రమంతప్పకుండా తాగునీరు సరఫరా, ట్రాఫిక్ నియంత్రణ వంటి అనేక సవాళ్లను అధిగమించాల్సి ఉందన్నారు. స్మార్ట్‌సిటీగా తీర్చిదిద్దే చర్యల్లో భాగంగా భద్రతను పెంచేందుకు నగరంలో 50వేల సీసీ కెమెరాలను ఏర్పాటుచేస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో జీహెచ్‌ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్, రామగుండం ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ, ఆస్కీ డైరెక్టర్‌జనరల్ ఎస్‌కే రావు తదితరులు పాల్గొన్నారు.
ఉపాధి హామీ పథకాన్ని కుదించొద్దు కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ మంత్రి గడ్కరీకి కేటీఆర్ లేఖ మహత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని (ఎంఎన్‌ఆర్‌ఈజీఎస్) కుదించొద్దని రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి కే తారకరామారావు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తిచేశారు. వెనుకబడిన ప్రాంతాల్లోనే ఉపాధి హామీ పథకాన్ని అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్నట్టు వస్తున్న వార్తలపై మంత్రి స్పందించారు.
గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని కుదించే ఆలోచన చేయొద్దని కోరుతూ కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి నితిన్ గడ్కరీకి శుక్రవారం లేఖరాశారు. రాష్ట్రంలో ఉపాధి హామీ పథకాన్ని మరింత విస్తృతంగా అమలు చేసేందుకు సహకరించాలని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. కొత్తగా ఏర్పడిన తెలంగాణలో తొమ్మిది జిల్లాలు వెనుకబడినవేనని, కరువు ప్రభావితమైనవని లేఖలో వివరించారు. ఈ నేపథ్యంలో ఉపాధి హామీ పనిదినాలను వంద రోజుల నుంచి 150కి పెంచాలని విజ్ఞప్తి చేశారు. ఈ పథకం కింద రాబోయే రోజుల్లో చెరువుల నిర్మాణం, గోదాములు, కళ్లాల ఏర్పాటు, చెరువులు, కుంటల మరమ్మతులవంటి కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. పథకాన్ని వెనుకబడిన మండలాలకే కుదిస్తే కొత్తగా ఏర్పడిన తెలంగాణకు అన్యాయం జరుగుతుందని మంత్రి పేర్కొన్నారు.