-చేనేత పరిశ్రమకు రూ.1200 కోట్లు..
-సమైక్య ప్రభుత్వంలో ఇచ్చింది 70 కోట్లే
-నేతన్నల బతుకుల్లో వెలుగులు నింపిన సీఎం
-ప్రతి సోమవారం చేనేత దుస్తులు ధరించాలి
-కాళేశ్వరం నిర్మించి చరిత్రలోకెక్కాం
-ఎమ్మెల్యే, టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
ఉమ్మడిపాలనలో ఆత్మహత్యలతో ఉరిసిల్లగా మారిన సిరిసిల్లను సిరిసిల్లగా మార్చిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని సిరిసిల్ల ఎమ్మెల్యే, టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు అన్నారు. చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని శుభాకాంక్షలు తెలియజేశారు. కాళేశ్వరం ప్రాజెక్టును అత్యంత వేగంగా పూర్తిచేసిన రాష్ట్రంగా తెలంగాణ ప్రపంచచరిత్రలోకెక్కిందని చెప్పారు. ఈ ప్రాజెక్టును నిర్మించినందుకు సీఎం కేసీఆర్‌కు నోబెల్ బహుమతి ఇవ్వాలని కేంద్ర ఐఏఎస్‌ల బృందం పేర్కొన్నది. ఇంకేం కావాలి! అని అన్నారు. బుధవారం రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఆయన విస్తృతంగా పర్యటించారు. చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని పాతబస్టాండ్ వద్ద ఉన్న నేతన్న విగ్రహానికి పూలమాలవేశారు. అనంతరం శివనగర్‌లోని కుసుమ రామయ్య ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో అదనపు తరగతి గదులను ప్రారంభించారు. పొదుపుభవన్‌లో జెడ్పీ చైర్‌పర్సన్ న్యాలకొండ అరుణ అధ్యక్షతన జరిగిన సర్వసభ్య సమావేశానికి హాజరై జిల్లా అభివృద్ధిపై సభ్యులకు సూచనలు చేశారు. అక్కడినుంచి జిల్లాకేంద్రంలోని పద్మనాయక కల్యాణ మండపానికి చేరుకుని, టీఆర్‌ఎస్ పట్టణ బూత్‌కమిటీ సమావేశంలో మున్సిపల్ ఎన్నికలపై కార్యకర్తలు, నాయకులకు దిశానిర్దేశం చేశారు.
స్వరాష్ట్రంలో చేనేతకు రూ.1200 కోట్లు సమైక్య పాలనలో చేనేత, మరమగ్గాల కార్మికుల ఆత్మహత్యలకు ప్పాలడితే నాటి ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని కేటీఆర్ విమర్శించారు. చేనేత పరిశ్రమ అభివృద్ధికి అప్పటి ప్రభుత్వం బడ్జెట్‌లో రూ.70 కోట్లు కేటాయిస్తే స్వరాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వం రూ.1200 కోట్లు కేటాయించిందని చెప్పారు. చేనేత, మరమగ్గాల పరిశ్రమలకు వేర్వేరుగా కార్పొరేషన్లు ఏర్పాటుచేసి, చేనేత కార్మికులు, మరమగ్గాల కార్మికులకు రుణమాఫీ చేసిన విషయాన్ని గుర్తుచేశారు. కార్మికులకు నెలకు రూ.15వేల వేతనం అందాలన్న ఉద్దేశంతో బతుకమ్మ చీరెల తయారీ ఆర్డర్లు సిరిసిల్లకే ఇచ్చి, వారి కుటుంబాల్లో వెలుగులు నింపామని చెప్పారు. చేనేత కార్మికులకు చేతినిండా పనికల్పించడం కోసం ప్రతి సోమవారం చేనేత దుస్తులు ధరించాలని చేనేతలక్ష్మి పథకం ప్రవేశపెట్టామన్నారు. ప్రభుత్వం ఇచ్చిన పిలుపుతో రాజన్న సిరిసిల్ల జిల్లా ఉద్యోగులంతా చేనేత దుస్తులు ధరించేలా చర్యలు తీసుకున్న కలెక్టర్ కృష్ణభాస్కర్‌ను కేటీఆర్ అభినందించారు.

కోటి ఎకరాల మాగాణే లక్ష్యం తెలంగాణ కోటి ఎకరాల మాగాణి కావాలన్న సంకల్పంతో సీఎం కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించారని కేటీఆర్ ఉద్ఘాటించారు. మధ్యమానేరు ప్రాజెక్టు సమైక్యపాలనలో నత్తనడకన సాగిందని కేటీఆర్ విమర్శించారు. దానిని రీడిజైన్‌చేసి అదనంగా రూ.350 కోట్లు కేటాయించి, సకాలంలో పూర్తిచేశామని చెప్పారు. నిర్వాసితుల సమస్యలను ప్రభు త్వం 99% పరిష్కరించిందని చెప్పారు. సమస్యల పేరు చెప్పి ధర్నాలు, ఆందోళనలు చేస్తూ నిర్వాసితులపై విపక్షాలు కపటప్రేమ చూపిస్తున్నాయని మండిపడ్డారు. వేములవాడలో జరుగుతున్న అభివృద్ధిని కాంగ్రెస్ జీర్ణించుకోలేక పోతున్నదన్నారు. ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ మాట్లాడుతూ.. నిజజీవితంలో తాను తారకరాముడి పాలన చూస్తున్నానని అన్నారు. సిరిసిల్లకు కేటీఆర్ ఎమ్మెల్యే కావడం ఈ ప్రాంత ప్రజల అదృష్టమని చెప్పారు. కాళేశ్వరంను పూర్తిచేసిన సీఎంకు ధన్యావాదాలు తెలుపుతూ తీర్మానం చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు రమేశ్‌బాబు, సుంకె రవిశంకర్, కలెక్టర్ కృష్ణభాస్కర్, జెడ్పీ చైర్‌పర్సన్ అరుణ, టెస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్‌రావు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు పాల్గొన్నారు.

ఆసరా పింఛన్లకు కేంద్రం ఇచ్చేది రూ.200 కోట్లు ఆసరా పెన్షన్లకింద రాష్ట్ర ప్రభుత్వం రూ.1200 కోట్లు చెల్లిస్తున్నదని కేటీఆర్ తెలిపారు. అందులో కేంద్రం ఇచ్చేది రూ.200 కోట్లు మాత్రమేనన్నారు. దీనిపై కొంతమంది తప్పుడు లెక్కలతో ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని విమర్శించారు. అన్ని గ్రామాల్లో హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. పంచాయతీరాజ్ చట్టంపై అవగాహన పెంపొందించుకోవాలని ప్రజాప్రతినిధులకు కేటీఆర్ సూచించారు. మున్సిపల్ ఎన్నికల్లో అన్ని స్థానాల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలని కార్యకర్తలకు, నాయకులకు పిలుపునిచ్చారు.
