-ప్రజాప్రతినిధులకు మంచి శిక్షణ అవసరం -అవినీతిని నిరోధించే కార్యకర్తలుగా ప్రజాప్రతినిధులు తయారుకావాలి -అపార్డ్ సందర్శన సందర్భంగా సీఎం కేసీఆర్ -ప్రభుత్వ పథకాలపై అధికారులతో మేధోమథనం
దేశంలో గ్రామీణాభివృద్ధికి ఆద్యుడైన మొదటి కమ్యూనిటీ డెవలప్‌మెంట్ మంత్రి ఎస్కే డేను మార్గదర్శకంగా తీసుకోవాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు అన్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టే పథకాలు క్షేత్రస్థాయిలోనే రూపొందాలని, అక్కడే అమలుకావాలని చెప్పారు. ఇందుకోసం స్థానిక సంస్థలను బలోపేతం చేయాల్సిన అవసరముందని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి అధికారులతో కలిసి మంగళవారం సాయంత్రం రాజేంద్రనగర్‌లోని ఆంధ్రప్రదేశ్ అకాడమీ ఆఫ్ రూరల్ డెవలప్‌మెంట్ (అపార్డ్)ను సందర్శించారు.
మహాత్మాగాంధీ విగ్రహానికి పూలమాల వేసి మామిడి మొక్కను నాటిన ఆయన అనంతరం అపార్డ్ ఆధ్వర్యంలో రూపొందిన పుస్తకాలను, ఆడియోలను నిశితంగా పరిశీలించి పలు విషయాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా అధికారులతో మేధోమథనం నిర్వహించారు. గ్రామం నుంచి రాష్ట్ర స్థాయి వరకు రూపొందించాల్సిన ప్రణాళికలు, స్థానిక సంస్థల అధికారాలు, విధులు, సంక్షేమ పథకాల అమలు, జాతీయ ఉపాధి హామీ పథకాలలో లోపాలను సవరించి కొత్త విధానాలకు శ్రీకారం చుట్టే విషయంలో విస్తృతంగా చర్చలు జరిపారు. స్థానిక సంస్థలను బలోపేతం చేయడానికి అన్నిరకాల చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. తెలంగాణ రాష్ట్ర నవ నిర్మాణానికి అపార్డ్ సేవలను పూర్తిగా వినియోగించుకోవాలని, ప్రజాప్రతినిధులకు వివిధ అంశాలపై శిక్షణ ఇప్పించాలని చెప్పారు. గ్రామస్థాయిలో పనిచేసే ఉద్యోగులందరినీ స్థానిక పంచాయతీల పరిధిలోకి తేవాలని కోరారు.
స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు సర్పంచులు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎంపీపీలు మొత్తం కలిసి 18వేల వరకు ఉంటారని, వారందరికి అపార్డ్, ఎన్‌ఐఆర్డీ, ఎంసీహెచ్చార్డీలతో శిక్షణ ఇప్పించి సుశిక్షితులను చేయాలని సూచించారు. కిందిస్థాయిలోనే అవినీతిని నిరోధించే కార్యకర్తలుగా ప్రజాప్రతినిధులు తయారుకావాలని ముఖ్యమంత్రి అన్నారు. ఈ సమావేశంలో ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ నర్సింగ్‌రావు, స్పెషల్ చీఫ్ సెక్రటరీ రేమండ్ పీటర్, జీహెచ్‌ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్, ప్రభుత్వ సలహాదారులు రమణాచారి, గోయల్, రామలక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.