-గ్రామజ్యోతికి అనూహ్య స్పందన.. గ్రామాభివృద్ధికి కమిటీల ఏర్పాటు -పర్యటనలతో ప్రజల్లో ఉత్సాహం నింపుతున్న మంత్రులు, ఎమ్మెల్యేలు

ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన గ్రామజ్యోతి సభల్లో ప్రజలు సంఘటిత శక్తిని ప్రదర్శిస్తున్నారు. సీఎం కేసీఆర్ పిలుపు మేరకు చేపట్టిన ఈ కార్యక్రమంలో ఊరూరా ప్రజాచైతన్యం వెల్లివిరుస్తున్నది. ప్రజాప్రతినిధులు, అధికారులు రంగంలోకి దిగి గ్రామాల్లో చేపట్టాల్సిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై దృష్టి సారించి ప్రణాళికలు రూపొందించే పనిలో నిమగ్నమయ్యారు. పథకం ప్రారంభించేనాటికి ఉన్న పరిస్థితులకు రోజురోజుకు ప్రజల నుంచి ఆదరణ పెరుగుతున్నది. ఇంతకాలం తమను సంఘటిత పరిచేందుకు ఉద్దేశించిన కార్యక్రమాలేవీ లేవని, ప్రభుత్వం ఆ దిశగా సమాయత్తం చేస్తుండడంపై హర్షం వ్యక్తమవుతున్నది. గ్రామజ్యోతిలో ఐదో రోజైన శుక్రవారం జిల్లాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు విస్తృతంగా పర్యటించారు. ప్రజల భాగస్వామ్యం ఉన్నప్పుడే ప్రభుత్వ పథకాలు విజయవంతమై ఆశించిన అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు.

దత్తత గ్రామాల్లో కలియదిరిగిన మంత్రులు: కరీంనగర్ జిల్లాలో గ్రామజ్యోతికి మంచి స్పందన కనిపిస్తోంది. మంత్రి ఈటల రాజేందర్ కమలాపూర్‌లో గ్రామజ్యోతిలో పాల్గొని మొక్కలు నాటారు. చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్, పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్‌తో కలిసి గొల్లపల్లి మండలంలో నిర్వహించిన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కరీంనగర్ ఎంపీ బీ వినోద్ బోయినపల్లి, సిరిసిల్ల, చిగురుమామిడి మండలాల్లో జరిగిన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. వరంగల్ జిల్లా రేగొండ మండలంలోని రూపిరెడ్డిపల్లెను స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి దత్తత తీసుకున్నట్లు ప్రకటించారు. మరో గంగదేవిపల్లిలా రూపిరెడ్డిపల్లిని అభివృద్ధి చేద్దామని సభలో పిలుపునిచ్చారు. నల్లగొండ జిల్లా కనగల్ మండలం బోయినపల్లిలో గ్రామజ్యోతిలో విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి పాల్గొన్నారు.
ఆదిలాబాద్ మండలం ధర్మూగూడ, మాలేబోరిగామ్, చిన్న మాలేబోరిగామ్, న్యూచించుఘాట్, చించుఘాట్, పిప్పల్‌ధరి, వాన్‌వట్, లోకారి, తంతోలి, అనుకుం ట, బంగారుగూడలో అటవీ, పర్యావరణ శాఖ మంత్రి జోగు రామన్న పర్యటించారు. కంకట, మలక్‌చించోలి, బీరవెల్లి గ్రామాల్లో గ్రామజ్యోతిలో దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి పర్యటించారు. స్వర్ణ గ్రామంలో రాత్రి నిద్ర చేశారు. మహబూబ్‌నగర్ జిల్లా పెద్దకొత్తపల్లి మండలం పెద్దకార్పాముల గ్రామాన్ని దత్తత తీసుకున్న భారీ పరిశ్రమలశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు గ్రామంలో పర్యటించారు. దత్తత తీసుకున్న మిడ్జిల్ మండలంలోని దోనూరు, జడ్చర్ల మండలంలోని వల్లూరు గ్రామాల్లో వైద్యారోగ్య శాఖమంత్రి లకా్ష్మరెడ్డి పర్యటించారు.