-టీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేండ్లు .. అన్ని రంగాల్లో రెట్టింపు అభివృద్ధి.. డబుల్ సంక్షేమం.. రాష్ట్రమంతటికీ విస్తరించిన ఐటీ వెలుగులు.. -వ్యవసాయానికి ఊతం.. అన్నదాతలకు అండ.. కరోనా కష్టకాలంలో కడుపునిండా భోజనం.. సాగునీటి ప్రాజెక్టులతో బీడుభూములకూ నీళ్లు.. రెట్టింపు పెన్షన్‌తో వృద్ధుల మోముల్లో సంతోషం

2018 డిసెంబర్ 13.. తెలంగాణ చరిత్రలో మరో సువర్ణాధ్యాయం మొదలైన రోజు. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు నేతృత్వంలోని టీఆర్‌ఎస్ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చిన రోజది. ఆదివారానికి సరిగ్గా రెండేండ్లు. నాలుగున్నరేండ్ల పాలనలో అభివృద్ధి, సంక్షేమ జల్లులో తడిసి ముద్దయిన తెలంగాణ ప్రజలు.. నమ్మకంతో టీఆర్‌ఎస్‌కు రెండోసారి పట్టం కట్టారు. వారి నమ్మకాన్ని నిజం చేస్తూ టీఆర్‌ఎస్ 2.0 ప్రభుత్వంలో సంక్షేమం డబుల్ అయ్యింది. కరోనా కాలంలోనూ సంక్షేమాన్ని ఆపకపోవడమే ఇందుకు నిదర్శనం. సర్కారు సంస్కరణలు అభివృద్ధిని కొత్త పుంతలు తొక్కించాయి. రెండేండ్ల టీఆర్‌ఎస్ పాలనను ఓ సారి పరిశీలిస్తే ప్రతి రంగంలోనూ అద్భుతమైన ప్రగతే కనిపిస్తుంది. వ్యవసాయంలో నియంత్రిత సాగు.. నూతన రెవెన్యూ చట్టం, ధరణి పోర్టల్, పారదర్శకంగా వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్, కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభం, జిల్లాల్లో ఐటీ వెలుగులు, ఆర్టీసీలో కార్గో సేవలు, మిషన్ భగీరథతో 95 శాతానికి పైగా ఇండ్లకు స్వచ్ఛమైన తాగునీరు.. ఇలా ఏ రంగం తీసుకున్నా సంస్కరణలు.. సంక్షేమం జోడెడ్లుగా టీఆర్‌ఎస్ పాలన కనిపిస్తున్నది.
రెవెన్యూలో నవశకం భూ లావాదేవీలు అత్యంత సులభంగా, అవినీతి రహితంగా సాగాలన్న రాష్ట్ర ప్రజలు, ముఖ్యమంత్రి కేసీఆర్ కల సాకారమైంది. ప్రభుత్వం రెవెన్యూ వ్యవస్థను ప్రక్షాళన చేసింది. రైతుల పాలిట గుదిబండగా మారిన వీఆర్వో వ్యవస్థను రద్దు చేసింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. సంక్లిష్టంగా ఉన్న రెవెన్యూ చట్టాన్ని సరళతరం చేస్తూ అద్భుతమైన నూతన చట్టాన్ని తీసుకొచ్చింది. ఈ ఏడాది సెప్టెంబర్ 22న గెజిట్ జారీ అయ్యింది. నూతన రెవెన్యూ చట్టం ఆధారంగా రూపొందిన ధరణి పోర్టల్‌ను అక్టోబర్ 29న మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మూడుచింతలపల్లిలో సీఎం కేసీఆర్ ప్రా రంభించారు. అప్పటి నుంచి పోర్టల్ ద్వారా వ్యవసాయ భూ ముల రిజిస్ట్రేషన్లు చేపట్టారు. ఇప్పటివరకు 56 వేల రిజిస్ట్రేషన్లు జరిగాయి. వ్యవసాయేతర భూముల స్లాట్ బుకింగ్స్ మొదలుకాగా.. సోమవారం నుంచి రిజిస్ట్రేషన్లు ప్రారంభం కానున్నాయి.
ఒక్కో అడ్డంకిని తొలిగిస్తూ.. రెవెన్యూ వ్యవస్థ ప్రక్షాళనలో ప్రభుత్వం ఒక్కో అడ్డంకిని తొలిగించింది. తాసిల్దార్లు, ఆర్డీవోల విచక్షణాధికారాలకు చెక్ పెడుతూ రెవెన్యూ కోర్టులను రద్దు చేసింది. ఆస్తుల రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ ఒకేచోట జరిగేలా పంచాయతీ, మున్సిపల్, రిజిస్ట్రేషన్ చట్టాల్లో సవరణలు చేసింది. ఆర్డీవోలు, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఐజీ విచక్షణాధికారాలకు కత్తెర వేసింది. లావాదేవీల సమయంలో క్రయ, విక్రయదారుల కుటుంబసభ్యుల వివరాలు నమోదు చేస్తూ, భవిష్యత్తులో ఇబ్బందులు రాకుండా చూస్తున్నది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ భూములు, అసైన్డ్, దేవాదాయ, వక్ఫ్, అటవీ భూముల వివరాలన్నీ ధరణిలో అప్‌లోడ్ చేసి, ఆటోలాక్ చేసింది. దీంతో ఆయా భూములకు రక్షణ ఏర్పడింది.

పురపాలకానికి కొత్త రూపు రాష్ట్రంలో పసిడిపట్టణ వ్యవస్థను రూపుదిద్దేందుకు ప్రభుత్వం నూతన మున్సిపల్ చట్టాన్ని 2019లో తీసుకొచ్చింది. మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల రూపురేఖలు మార్చడమే కాకుండా పురసేవల లభ్యతను మరింత బాధ్యతాయుతంగా అందించేలా ఈ చట్టం రూపుదిద్దుకున్నది. బడ్జెట్‌లో 10 శాతాన్ని గ్రీన్‌బడ్జెట్‌గా తేవడమే కాకుండా అన్ని పట్టణాలు, నగరాలు ఆకుపచ్చని శోభను సంతరించుకోవాలని చట్టం స్పష్టంచేసింది. నాలుగు ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేయడం ద్వారా సమాజంలో అన్ని వర్గాలు పాలనలో భాగస్వామ్యం కావాలని కొత్త చట్టం పేర్కొన్నది. జవాబుదారీతనాన్ని పెంచింది. కొత్తగా ఏడు మున్సిపల్ కార్పొరేషన్లు, 76 మున్సిపాలిటీలను ఏర్పాటుచేసి పురపాలనలో విప్లవాత్మక అడుగువేసింది. పట్టణప్రగతి కార్యక్రమాన్ని చేపట్టి స్వచ్ఛపట్టణ నిర్మాణానికి ఊతమిచ్చింది. టీఎస్‌బీపాస్‌ను ప్రవేశపెట్టి పట్టణాలు, నగరాల్లో గృహ నిర్మాణ వ్యవస్థను సమూలంగా సంస్కరించింది. మరోవైపు అధికారులు దశాబ్దాల తరబడి ఒకేచోట తిష్టవేసి ఇష్టారాజ్యంగా వ్యవహరించే విధానానికి స్వస్తిపలికింది.
విప్లవాత్మక అడుగు.. టీఎస్‌బీపాస్ దేశంలో ఎక్కడాలేనివిధంగా భవన నిర్మాణం, లేఅవుట్ అనుమతుల్లో సరళీకృత, ఏకీకృత విధానమైన టీఎస్‌బీపాస్ (తెలంగాణ రాష్ట్ర భవన నిర్మాణ అనుమతుల ఆమోదం, స్వీయ ధ్రువీకరణ విధానం)ను ప్రవేశపెట్టి గృహ నిర్మాణ అనుమతుల్లో అద్భుతమైన సంస్కరణను తీసుకొచ్చింది. 75 చదరపు గజాల వరకు ఉన్న ప్లాట్‌లో నిర్మించే భవనం ఎత్తు 7 మీటర్ల కన్నా తక్కువగా ఉంటే రిజిస్ట్రేషన్ చేసుకోవడంతోనే అనుమతి పత్రం జారీ అవుతున్నది. ఇది లక్షల మంది గృహనిర్మాణదారులకు ఊరట కల్పించింది.
కొత్త మున్సిపల్ చట్టం అమలు- 19 జూలై 2019 కొత్తగా ఏడు మున్సిపల్ కార్పొరేషన్లు ఏర్పాటు – పాతవి 6 + కొత్తవి 7 మొత్తం 13
బడంగ్‌పేట, బండ్లగూడ జాగీర్, మీర్‌పేట, బోడుప్పల్, పీర్జాదిగూడ, జవహర్‌నగర్, నిజాంపేట కొత్తగా 76 మున్సిపాలిటీల ఏర్పాటు- 52 పాతవి + 76 కొత్తవి = 128 మొత్తం
పట్టణ ప్రగతి కార్యక్రమం- 24 ఫిబ్రవరి 2020 నుంచి 10 రోజుల పాటు
జిల్లాల్లో ఐటీ వెలుగులు రాష్ట్రంలో ఐటీ రంగం కొత్త పుంతలు తొక్కింది. హైదరాబాద్ కేంద్రంగా దేశంలోనే అగ్రగామిగా వెలుగొందుతున్న ఐటీ.. ఇప్పుడు జిల్లాలకు విస్తరించింది. ఒకప్పుడు మహానగరాలకే పరిమితమైన కంపెనీలు ఇప్పుడు పల్లెల బాట పట్టాయి. ఇప్పటికే హైదరాబాద్ తర్వాత ఐటీ విస్తరించిన తొలి జిల్లాగా వరంగల్ రికార్డు సృష్టించింది. 27 ఎకరాల్లోని ప్రత్యేక ఆర్థిక మండలిలో (సెజ్) 2016లో ఐటీ సేవలు ప్రారంభం అయ్యాయి. ఆ తర్వాత రూ.38 కోట్లతో కరీనంగర్‌లో నిర్మించిన ఐటీ టవర్‌ను ఈ ఏడాది జూలై 21న మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. టవర్‌ను ప్రారంభించేనాటికే కార్యకలాపాలు ప్రారంభించేందుకు 26 కంపెనీలు ముందుకొచ్చాయి. ఇందులో 15 కంపెనీలకు ఆఫీస్ స్పేస్ కేటాయించారు. ఈ టవర్ ద్వారా మొత్తం 3,600 మందికి ఉద్యోగాలు లభించనున్నాయి. తాజాగా ఐటీరంగం ఖమ్మంలోనూ కాలుమోపింది. ఖమ్మం జిల్లా కేంద్రంలో నిర్మించిన ఐటీ టవర్‌ను ఈ నెల 7న మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. రూ.27 కోట్లతో నిర్మించిన ఈ భవనంలో కార్యకలాపాలు ప్రారంభించేందుకు ఇప్పటికే 16 కంపెనీలు సిద్ధమయ్యాయి. 430 మందిని నియమించుకున్నాయి. త్వరలో మరో 430 మందికి ఉద్యోగాలు ఇవ్వబోతున్నారు. మహబూబ్‌నగర్, నిజామాబాద్‌లలోనూ ఐటీ టవర్ల నిర్మాణం శరవేగంగా సాగుతున్నది. తాజాగా సిద్దిపేట జిల్లాలోనూ ఐటీ టవర్‌కు బీజం పడింది. కొండపాక మండలం దుద్దెడలో టవర్ నిర్మాణానికి సీఎం కేసీఆర్ ఈ నెల 10న శంకుస్థాపన చేశారు. రూ.45 కోట్లతో దీనిని నిర్మించనున్నారు. మరోవైపు రాష్ట్రంలో ఐటీ ఎగుమతులు జాతీయ సగటును మించాయి. కరోనా సమయంలో జాతీయస్థాయిలో ఐటీ వృద్ధిరేటు 8.09 శాతం ఉండగా, తెలంగాణలో 17 శాతం నమోదైంది. లుక్ ఈస్ట్ విధానాన్ని అమలు చేస్తుండటంతో హైదరాబాద్ నలువైపులా ఐటీ విస్తరిస్తున్నది.
-అమెజాన్ సంస్థ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రాంగణాన్ని హైదరాబాద్‌లో ఏర్పాటు చేస్తున్నది. -అమెజాన్ వెబ్ సర్వీసెస్ రాష్ట్రంలో రూ.20,761 కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్టు ప్రకటించింది. -మైక్రాన్ సంస్థ అతిపెద్ద రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ సెంటర్‌ను ప్రారంభిస్తున్నది.
ఐటీ ఎగుమతులు -2018-19 1.09 లక్షల కోట్లు -2019-20 1.28 లక్షల కోట్లు
వృద్ధిరేటు -2018-19 17% -2019-20 18%
ఆసరా రెట్టింపు రెండోసారి అధికారంలోకి వచ్చాక ఆసరా పెన్షన్లు రెట్టింపయ్యాయి. గత ఏడాది మే నుంచి 39.35 లక్షల మందికి పెంచిన పెన్షన్ అందిస్తున్నారు. కొత్తగా 8.5 లక్షల మందికి పెన్షన్లు ప్రారంభమయ్యాయి. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం ఏటా రూ.12 వేల కోట్లు ఖర్చు చేస్తున్నది. బీడీ కార్మికులకు పీఎఫ్ కటాఫ్ డేట్‌ను తొలిగించారు. ఇంట్లో అర్హులందరికీ పెన్షన్లు ఇస్తున్నారు. కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ లబ్ధిదారుల సంఖ్య గణనీయంగా పెరిగింది. కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ కింద దివ్యాంగ వధువులకు సాయం రూ.1.25 లక్షలకు పెంచారు. బాల్య వివాహాలు తగ్గిపోయాయి. దివ్యాంగులకు 5 శాతం అదనపు రిజర్వేషన్ కల్పిస్తున్నారు. నీరా పాలసీ తెచ్చారు.
విద్యా పరుగులు కేజీ టు పీజీ విద్యలో భాగంగా రాష్ట్రంలో విద్యావెలుగులు ప్రసరిస్తున్నాయి. గత ఏడాది 119 నియోజకవర్గాల్లో కొత్తగా బీసీ గురుకులాలు ప్రారంభమయ్యాయి. పాతవి 161 గురుకులాలుండగా.. కొత్తగా 119తో మొత్తం 280 వరకు పెరిగాయి. వీటితోపాటు డిగ్రీకాలేజీల్లో కలిపి 3 లక్షల మంది చదువుకుంటున్నారు. ఒక్కో విద్యార్థిపై ప్రభుత్వం రూ.1.20 లక్షలు ఖర్చు చేస్తున్నది. సిద్దిపేట జిల్లా ములుగులో ఫారెస్టు కాలేజీ, రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్, హార్టికల్చర్ యూనివర్సిటీ భవనాలను గత డిసెంబర్ 11న ప్రారంభించారు. గజ్వేల్‌లో ఎడ్యుకేషనల్ హబ్ ఆదర్శంగా నిలిచింది.
జల సవ్వళ్లు రెండేండ్లలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన నీటి సంరక్షణ చర్యలు, నిర్మించిన రిజర్వాయర్ల ఫలితంగా రాష్ట్రంలో భూగర్భజలాలు గణనీయంగా పెరిగాయి. 2019 నవంబర్‌తో పోల్చితే ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా భూగర్భజలమట్టం సుమారు 2.58 మీటర్ల నీటి నిల్వలు పెరిగాయి. 2010-19 మధ్య కాలంతో పోల్చినప్పుడు రాష్ట్రంలోని 95శాతం మండలాల్లో 0.2 నుంచి 13.06 మీటర్లలో భూగర్భజలమట్టం పెరిగింది. 2019 జూన్ 21న సీఎం కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టును ప్రారంభించారు. ప్రస్తుతం కాళేశ్వరం ఫలాలు రాష్ట్రమంతటికీ అందుతున్నాయి. యాసంగి ముగిసేనాటికి 2019-20 నీటి సంవత్సరంలో గోదావరిజలాల వినియోగం 200-250 టీఎంసీల వరకు ఉంటుందని నీటిపారుదలశాఖ లెక్కలే చెప్తున్నాయి. కృష్ణా, గోదావరి జలాల్లో మనవాటాను సద్వినియోగం చేసుకోవడంలో సఫలీకృతులమయ్యాం. 2019-20లో సాగునీటి ప్రాజెక్టులకు కేటాయించిన నిధుల్లో 8,076.83 కోట్లు వెచ్చించగా అందులో 83 శాతం అంటే రూ.6,670.05 కోట్లను కేవలం ఆన్‌గోయింగ్ ప్రాజెక్టులపైనే ప్రభుత్వం ఖర్చు చేసింది. అనేక ప్రాజెక్టులు అందుబాటులోకి వచ్చాయి. సాగు కష్టాలు తీరాయి.

మెరుగైన వైద్యం గతేడాది డిసెంబర్ 4న ఎయిమ్స్ ప్రారంభమైంది. 2018 ఆగస్టు 15న ప్రారంభమైన కంటివెలుగు పథకం ద్వారా కోటిన్నర మందికి పరీక్షలు నిర్వహించారు. ప్రభుత్వ దవాఖానల్లో మెరుగైన వైద్య సేవలు అదుతుండటంతో 6 లక్షల ప్రసవాలు జరిగాయి. వీరందరికీ కేసీఆర్ కిట్లు అందాయి. సిజేరియన్ ఆపరేషన్లు తగ్గించి, సాధారణ డెలివరీలు చేస్తున్నారు. గతంలో ప్రభుత్వ దవాఖానల్లో 30 శాతం డెలివరీలు ఉండగా ఇప్పుడు రెట్టింపయ్యాయి. మెడికల్ కాలేజీల్లోనూ ఐసీయూ సేవలు అందుబాటులోకి వచ్చాయి.
-46 డయాలసిస్ కేంద్రాల ఏర్పాటు -నగదురహితంగా ఎంప్లాయీస్, జర్నలిస్టుల హెల్త్ స్కీం (ఈజీహెచ్‌ఎస్) అమలు -ఆరోగ్యశ్రీ పథకంలో 35 శాతం వరకు పెరిగిన సేవలు -మృతదేహాల తరలింపునకు 50 పరమపద వాహనాల ఏర్పాటు
విద్యుత్ ధగధగ 2019 మార్చి 25 నుంచి మణుగూరులో బీటీపీఎస్ మొదటి యూనిట్ విద్యుత్ ఉత్పత్తి ప్రారంభమైంది. విద్యుత్‌శాఖలో ఆర్టిజన్ల సర్వీసుల క్రమబద్ధీకరణ, ఇతర ఉద్యోగుల్లాగే ఇంక్రిమెంట్లు, పీఆర్సీ ఇతర సౌకర్యాలు కల్పించారు. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతిలో విద్యుత్ సమస్యలను పరిష్కరించారు. అన్నివర్గాలకు నిరంతర విద్యుత్ సరఫరా జరుగుతున్నది.
మా తండాలో మా పాలన రెండో దఫా అధికారంలోకి వచ్చాక ‘మా తండాల్లో మా పాలన’ నినాదం కార్యరూపం దాల్చింది. ప్రభుత్వం కొత్తగా 4,079 గ్రామపంచాయతీలను ఏర్పాటుచేసింది. దీంతో రాష్ట్రంలో గ్రామ పంచాయతీల సంఖ్య 12,769కి పెరిగింది. గత ఏడాది సెప్టెంబర్ 19న పంచాయతీరాజ్ ట్రిబ్యునల్ ఏర్పాటైంది. సెప్టెంబర్ 6 నుంచి నెలరోజులు సాగిన పల్లె ప్రగతి గ్రామాల రూపురేఖలను మార్చింది.
విశ్వనగరం దిశగా.. రెండేండ్లలో హైదరాబాద్ విశ్వనగరం దిశగా అనేక అడుగులు పడ్డాయి. గతేడాది నవంబర్ 29న హైటెక్ సిటీ నుంచి రాయదుర్గం వరకు మెట్రో ప్రారంభమైంది. నగరంలో 9 ఫ్లైఓవర్లు, 4 అండర్‌పాస్‌లు, 3 ఆర్వోబీలు మొదలయ్యాయి.
దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి ప్రారంభం (25 సెప్టెంబర్ 2020) -కరోనా సమయంలో రూ.2 వేల కోట్ల విలువైన 15 ఫ్లైఓవర్లు, 300 కిలోమీటర్ల రోడ్ల పనులు, 29 లింకురోడ్ల నిర్మాణం శరవేగంగా పూర్తి. -హైదరాబాద్‌లో వరదల వల్ల నష్టపోయిన కుటుంబాలకు 10 వేల చొప్పున ఆర్థిక సాయం -రాష్ట్రవ్యాప్తంగా 179 అన్నపూర్ణ భోజనం సెంటర్ల ద్వారా రోజుకు 52 వేలమందికి భోజనం. కరోనా సమయంలో వలస కూలీలకు ప్రత్యేక భోజన ఏర్పాట్లు.
ఆర్టీసీకి పూర్వవైభవం ఆర్టీసీలో నష్టాలను పూడ్చి.. లాభాలను ఆర్జించి పెట్టాలనే ఉద్దేశంతో 2020 జూన్ 19న కార్గో సేవలను ప్రారంభించింది. ఇటీవల డోర్ డెలివరీ సర్వీసులను సైతం ప్రారంభించి దూసుకుపోతున్నది. కార్గో, పార్సిల్ సేవలకు సంబంధించి జీఎమ్మార్ విమాన సంస్థతో మొదటి మైలునుంచి చివరి మైలు వరకు అనే ధ్యేయంతో ‘ఎయిర్ కార్గో ఫీడర్ సర్వీస్’పై టీఎస్‌ఆర్టీసీ ఒప్పందం కుదుర్చుకున్నది.

పరిశ్రమల్లో టాప్ ప్రపంచంలోనే అతిపెద్ద క్యాంపస్ ప్రారంభించిన అమెజాన్ (10 జనవరి 2020). 10 ఎకరాల్లో 30 లక్షల చదరపు అడుగుల నిర్మాణం, 9 వేల మంది ఉద్యోగులు. ఈ ఏడాది నవంబర్ 6వ తేదీన రూ.20,760 కోట్ల భారీ పెట్టుబడి పెట్టేందుకు అమెజాన్ నిర్ణయించింది.
-బయోఫార్మా రంగానికి ప్రోత్సాహం.. రూ.60 కోట్లతో బీ-హబ్ -సిర్పూర్ పేపర్ ఫ్యాక్టరీ పునరుద్ధరణ – 7 ఫిబ్రవరి 2019న ప్రారంభం -దేశంలోనే అతిపెద్ద ముచ్చర్ల ఫార్మాసిటీ (19,333 ఎకరాలు). రూ.27,800 కోట్ల అంచనా వ్యయంతో నిర్మాణం. 4.25 లక్షల మందికి ఉపాధి -30 అక్టోబర్ 2020న ఎలక్ట్రానిక్ వెహికల్ పాలసీ ప్రకటన. ఎలక్ట్రానిక్ వాహనాలు తయారుచేసే పరిశ్రమలకు ప్రోత్సాహకాలు -వినియోగదారుల ప్రోత్సాహం కోసం రిజిస్ట్రేషన్, రోడ్ ట్యాక్స్ రద్దు -మొత్తం 14 వేల పరిశ్రమలకు అనుమతులిచ్చారు. రూ. 2 లక్షల కోట్లకుపైగా పెట్టుబడులు వచ్చాయి. మొత్తం 15 లక్షలమందికి ఉపాధి లభించింది. -ఈవోడీబీలో వరుసగా మూడుసార్లు టాప్-3లో చోటు దక్కించుకుంది.
వ్యవసాయానికి మరింత ఊతం సీఎం కేసీఆర్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీ ప్రకారం రైతులకు తొలిదశ రుణమాఫీని చేసింది. రూ.25 వేల వరకు గల రుణాలను మాఫీ చేసింది. తద్వారా 5.88 లక్షల మందికి లబ్ధి చేకూరింది. ఇందుకు ప్రభుత్వం ఏకంగా రూ.1,210 కోట్లు అందించింది. 2019 జూలైలో రైతులకు వడ్డీ లేని రుణాల బకాయిలు రూ.256 కోట్లు ప్రభుత్వం చెల్లించింది. ఇక కరోనా సమయంలో పాడి రైతులను ఆదుకునేందుకు రుణ పరిమితిని రూ.1.6 లక్షల నుంచి రూ.3 లక్షలకు పెంచింది. ఇక 3 లక్షల మంది రైతులకు కిసాన్ క్రెడిట్ కార్డులను జారీచేసింది. గతంలో రైతుబంధు కింద ఏడాదికి ఎకరాకు రూ.8 వేలు ఇస్తుండగా.. గతేడాది వానకాలం నుంచి రూ.10 వేలకు పెంచింది. ఈ పథకం ద్వారా ఏటా 57 లక్షల మంది రైతులు లబ్ధిపొందుతుండటం విశేషం. ఇందుకు ప్రభుత్వం ఏటా రూ.14 వేల కోట్లు ఖర్చు చేస్తున్నది. అర్హులైన మరింత ఎక్కువ మందికి రైతుబీమా సౌకర్యం కల్పించింది. దీంతో ప్రభుత్వంపై భారం రూ.2,271 కోట్ల నుంచి రూ.3,556 కోట్లకు పెరిగింది. ఈ ఏడాది 32.73 లక్షల మంది రైతులకు బీమా సౌకర్యం కల్పించింది. ఇప్పటివరకు 31,654 మంది రైతు కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున రూ.1,582 కోట్లు బీమా కింద చెల్లించడం విశేషం.
నియంత్రిత సాగు మూస పద్ధతిలో సాగుతున్న వ్యవసాయాన్ని కొత్త పుంతలు తొక్కించేందుకు రెండోసారి అధికారంలోకి వచ్చాక టీఆర్‌ఎస్ ప్రభుత్వం కీలకమైన సంస్కరణలకు తెరలేపింది. సీఎం కేసీఆర్ ఈ ఏడాది వానకాలం నుంచి నియంత్రిత సాగు విధానానికి శ్రీకారం చుట్టారు. మార్కెట్లో డిమాండ్ గల పంటలను ఎంత విస్తీర్ణంలో పండించాలో మార్గనిర్దేశం చేశారు. నియంత్రిత సాగు అనుకున్నదానికి మించి సత్ఫలితాలనిచ్చింది. 1.25 కోట్ల ఎకరాల్లో సాగు లక్ష్యంగా పెట్టుకోగా, ఏకంగా 1.35 కోట్ల ఎకరాలకు పైగా సాగు చేయడం విశేషం.
ధాన్యం సేకరణలో రికార్డులు 2019- 20లో రికార్డుస్థాయిలో 1.12 కోట్ల టన్నుల ధాన్యాన్ని సేకరించారు. దేశంలో మొత్తం ధాన్యం కొనుగోళ్లలో తెలంగాణ వాటానే 63 శాతం. దేశంలో మద్దతు ధరకు రైతుల పంటలను కొనుగోలు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమే. గత, ఈ సీజన్‌లో 6,500 వరకు కేంద్రాలు ఏర్పాటు చేసి గ్రామాల్లోనే పంటలను కొనుగోలు చేసింది. కరోనా సమయంలో రైతులు తమ పంటలను అమ్ముకోవడంలో ఇబ్బంది లేకుండా ప్రభుత్వమే ప్రతి గింజను మద్దతు ధర ఇచ్చి మరీ కొనుగోలు చేసింది.
రైతు వేదికలు రైతాంగాన్ని సంఘటితం చేసేందుకు రైతు వేదికలకు శ్రీకారం చుట్టింది. సాగు విషయాలను చర్చించుకునేందుకు వీలుగా రాష్ట్రవ్యాప్తంగా రూ.573 కోట్లతో 2,604 రైతు వేదికలను నిర్మించింది. జనగామ జిల్లా కొడకండ్లలో నిర్మించిన రైతు వేదికను అక్టోబర్ 31న సీఎం కేసీఆర్ ప్రారంభించారు. ఇక రైతు పండించిన పంటను ఆరబెట్టుకునేందుకు వీలుగా రాష్ట్రవ్యాప్తంగా లక్ష కల్లాలను నిర్మిస్తున్నది.
కరోనా కాలంలో కడుపు నింపింది కరోనా మహమ్మారి విజృంభణతో పేదలు ఉపాధి కోల్పోయి రోడ్డున పడే పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా తినడానికి తిండి కూడా లేని దీన పరిస్థితులు నెలకొన్నాయి. ఇలాంటి సందర్భంలో నేనున్నానంటూ తెలంగాణ ప్రభుత్వం పేదలకు అండగా నిలిచి కడుపు నింపింది. నాలుగు నెలలపాటు ప్రతి వ్యక్తికి 12 కిలోల చొప్పున ఉచితంగా రేషన్ బియ్యం సరఫరా చేసింది. ఆ తర్వాత మరో మూడు నెలలపాటు 2 కిలోల చొప్పున కందిపప్పు, నాలుగు నెలలపాటు 10 కిలోల చొప్పున బియ్యం పంపిణీ చేసింది. ఆర్థికంగా కూడా అండగా నిలిచింది. ఏప్రిల్, మే నెలల్లో ప్రతి కుటుంబానికి రూ.1,500 చొప్పున ఆర్థికసాయం కూడా అందజేసింది. ఇక రేషన్ విధానంలో నూతన అధ్యాయానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. రేషన్ పోర్టబిలిటీని ప్రవేశపెట్టి.. రాష్ట్రంలో ఎక్కడైనా రేషన్ సరుకులు తీసుకునే వీలు కల్పించింది. దీంతో ఎంతో మందికి ఇబ్బందులు తప్పాయి. ఇక రాష్ట్ర ఆలోచనను కాపీ కొట్టిన కేంద్ర ప్రభుత్వం వన్ నేషన్- వన్ రేషన్ కార్డును ప్రవేశపెట్టింది.
సంక్షేమంలో మేటి సంక్షేమంలో తెలంగాణ ప్రభుత్వం మేటిగా నిలిచింది. ప్రభుత్వ పథకాల ద్వారా ఎంతోమంది పేదలు లబ్ధిపొందారు. మిషన్ భగీరథ ద్వారా తాగునీరు, కాళేశ్వరం ద్వారా సాగునీరు, వృద్ధాప్య పింఛన్లు పెంచడం, ఆడ పిల్లల పెండ్లికి కల్యాణలక్ష్మి సాయం, హెల్త్ చెకప్‌లు, రైతుబంధు ఇలా ప్రభుత్వం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టింది. ముఖ్యంగా రైతుబంధు ద్వారా రైతుల ఆత్మహత్యలను చాలా వరకు అరికట్టగలిగింది. విద్యారంగాన్ని బలోపేతం చేసే దిశగా చర్యలు తీసుకొంటే బాగుంటుంది. -ప్రొఫెసర్ హరగోపాల్, విద్యావేత్త
రైతుబంధు బాగుంది ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ కార్యక్రమాల్లో రైతుబంధు, రైతు బీమా పథకాలు ఎంతో బాగున్నాయి. ఈ రెండు పథకాలు రైతులకు అండగా నిలుస్తున్నాయి. ఈ రెండు పథకాల అమలును ఇంకా కొంచెం సరళీకృతం చేస్తే బాగుంటుంది. వ్యవసాయం చేసే వారందరికీ కూడా ఈ పథకాలు దక్కేలా చూడాలి. -కన్నెగంటి రవి, రైతు స్వరాజ్య వేదిక