-పీపుల్స్ సిటీగా హైదరాబాద్ -నగరంలో ఆహ్లాదకరమైన జీవనానికి చర్యలు: మంత్రి కేటీఆర్

ఎవరెన్ని కుట్రలు చేసినా మెట్రో రైల్ ప్రాజెక్టును సకాలంలో పూర్తిచేసి, నగర ప్రజలకు టీఆర్‌ఎస్ ప్రభుత్వం కానుకగా ఇస్తుందని పంచాయతీరాజ్, ఐటీశాఖ మంత్రి కే తారకరామారావు స్పష్టంచేశారు. హైదరాబాద్ టూరి జం ప్లాజాలో రాగడి డే సంస్థ, టైమ్స్ ఆఫ్ ఇండియా పత్రిక సంయుక్తంగా గురువారం నిర్వహించిన రాహాగిరి డే (పాదాచారుల దినోత్సవం) కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ హైదరాబాద్ నగరం అన్ని వర్గాలకు ఉపయోగపడేలా పీపుల్స్‌సిటీగా తీర్చిదిద్దాలని పేర్కొన్నారు. నగరంలోని అన్ని వర్గాల ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణ కల్పించినప్పుడే, వారి జీవనప్రమాణాలు మెరుగవుతాయన్నారు. ఈ బాధ్యత జీహెచ్‌ఎంసీ, నగర పోలీస్‌లపై ఉందని, రెండు శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
నగరంలోని ప్రజలందరికీ ఆహ్లాదకరమైన జీవితాన్ని అందించాలనే ఉద్దేశంతో హ్యాపెనింగ్ హైదరాబాద్ కార్యక్రమాన్ని రూపొందించినట్లు తెలిపారు. అక్టోబర్‌లో జరిగే మెట్రోపొలిస్ సదస్సుకు దేశ విదేశాల నుంచి ప్రతినిధులు హాజరవుతారని, ఈ సదస్సు నగరంలో జరుగడం గర్వకారణమన్నారు. పిల్లలు ఆడుకోవడానికి, వృద్ధులు నడవడానికి వీలుగా ఉదయం 6 గంటల నుంచి 12 గంటలవరకు ప్రతి ఆదివారం నగరంలోని ప్రధాన రోడ్లను మూసివేయాలన్న రాగడి డే ప్రతినిధులు చేసిన ప్రతిపాదనకు మంత్రి కేటీఆర్ సానుకూలంగా స్పందించారు. ఈ ప్రతిపాదనలను అమలుపై జీహెచ్‌ఎంసీ, నగర పోలీసులు చర్యలు తీసుకోవాలని సూచించారు.
మెట్రో రైల్‌తో హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలు తీరుతాయని, మెట్రో పరిధిలో పాదచారుల కోసం 164 ఫుట్‌పాత్‌లను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. చార్మినార్ అందాలు చూసేందుకు వచ్చే పర్యాటకుల కోసం ఫుట్‌పాత్‌లను ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. నగరంలో శాంతి భద్రతలను కాపాడేందుకు ఫ్రెండ్లీ పోలీసింగ్‌ను ప్రభుత్వం ప్రొత్సహిస్తున్నదని, ఇందుకు హోంమంత్రి నాయిని అనేక కార్యక్రమాలను రూపొందిస్తున్నారని చెప్పారు. జీహెచ్‌ఎంసీ, పోలీసు అధికారులు సోషల్ మీడియాను విరివిగా ఉపయోగించాలని, అప్పుడే సమస్యలు ప్రత్యక్ష్యంగా తెలుస్తాయని పేర్కొన్నారు. ఐటీశాఖ సోషల్ మీడియాకు ఒక ప్రత్యేక సెల్‌ను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో జీహెచ్‌ఎంసీ కమిషనర్ సోమేష్‌కుమార్, సీపీ మహేందర్‌రెడ్డి, ట్రాఫిక్ అడిషనల్ కమిషనర్ జితేందర్ తదితరులు పాల్గొన్నారు.