-రైతును రాజు చేసేదాకా విశ్రమించను -ఆరేండ్లలో అద్భుతం ఆవిష్కృతమైంది -దేశంలోనే నంబర్‌వన్ రాష్ట్రంగా ఉన్నాం -2014లో రూ.4.80 లక్షల కోట్ల జీఎస్డీపీ రూ.9.69 లక్షల కోట్లకు పెరిగింది -125 రోజులుగా సజీవంగా కాకతీయకాల్వ -యాసంగిలో 2.25 కోట్ల టన్నుల ధాన్యం దిగుబడి -పోడుభూములపై ప్రజాదర్బారు నిర్వహిస్తాం -మంచిని మెచ్చుకునే సంస్కృతి కాంగ్రెస్‌కు లేదు -అసెంబ్లీలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు -ద్రవ్య వినిమయబిల్లుపై చర్చకు సమాధానం

చావునోట్లోకి వెళ్లి సాధించుకున్న తెలంగాణను ఏ దారికి తీసుకెళ్లాలో అక్కడకు తీసుకెళతామని, ప్రాణంపోయినా కాంప్రమైజ్ అయ్యేది లేదని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అన్నారు. సజల సుజల సస్యశ్యామల తెలంగాణను సాధించి తీరుతామని తేల్చి చెప్పారు. తెలంగాణోళ్లకు పరిపాలన చేతకాదని, తాము లేకుంటే చీకట్లోనే ఉంటారని శాపనార్థాలు పెట్టినోళ్ల అంచనాలన్నీ ఇవాళ తలకిందులయ్యాయని అన్నారు. సంక్షేమం, వ్యవసాయం, తలసరి ఆదాయం, విద్యుత్‌వినియోగం.. ఇలా అన్ని అంశాల్లో తెలంగాణ నంబర్‌వన్‌గా నిలిచిందని, ఆరంటే ఆరేండ్లలో ఎవరికీ సాధ్యంకాని పనులుచేస్తూ అద్భుతాన్ని ఆవిష్కరించామని వివరించారు. సోమవారం అసెంబ్లీలో ద్రవ్య వినిమయబిల్లుపై చర్చకు సీఎం కేసీఆర్ సమాధానమిచ్చారు. ఆర్థికమాంద్యంలోనూ ప్రజాసంక్షేమాన్ని విస్మరించడం లేదని చెప్పారు. రైతుబంధు పథకాన్ని ఐక్యరాజ్యసమితి మెచ్చుకున్నదని, ఎంతోమంది కేంద్రమంత్రులు ప్రశంసించారని గుర్తుచేశారు. పదేండ్ల కాంగ్రెస్ పాలనలో రాష్ట్ర జీఎస్డీపీ రూ.4.80 లక్షల కోట్లు మాత్రమేనని, కానీ నేడు జీఎస్డీపీ రూ.9,69,694 కోట్లకు పెరిగిందని చెప్పారు. అనేకరంగాల్లో తెలంగాణ దూసుకుపోతున్నదని, అభివృద్ధిని కండ్లముందు ఉంచామని.. ఈ విషయాన్ని కాగ్ నివేదికలే స్పష్టం చేస్తున్నాయని తెలిపారు. కేంద్రమంత్రులు సైతం పార్లమెంట్ సాక్షిగా ప్రకటించిన విషయాన్ని గుర్తుంచుకోవాలని పేర్కొన్నారు. మంచిని మంచి అని మెచ్చుకునే సంస్కారం కాంగ్రెస్‌కు లేదని విమర్శించారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క నోటినుంచి ఒక్క పొగడ్తకూ తమ ప్రభుత్వం నోచుకోవడం లేదని అన్నారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడా ఇంతకంటే ఎక్కువగా విమర్శలు చేశారని, వాటిపై కూడా తాము వాదించామని, అవన్నీ కూలంకషంగా గమనించే ప్రజలు తీర్పు ఇచ్చారని చెప్పారు.
జాతి నిర్మాణంలోనూ కీలక భూమిక తెలంగాణ తనకుతాను పునర్నిర్మాణం చేసుకోవడమే కాదు.. జాతి నిర్మాణంలోనూ కీలకభూమిక పోషిస్తున్నదని సీఎం కేసీఆర్ చెప్పారు. దేశాన్ని సాకే రాష్ర్టాల్లో తెలంగాణ ముందుంటుందని, కేంద్రానికి మనం భిక్ష వేస్తున్నామా.. కేంద్రం మనకు భిక్ష వేస్తున్నదా.. అనేది ఆలోచించాలని సూచించారు. కేంద్రం నుంచి వచ్చే పన్నుల వాటాల్లో కోతపెట్టారని, ఐదేండ్లలో తెలంగాణ నుంచి కేంద్రానికి రూ. 2,72,926 కోట్లు ట్యాక్స్‌ల రూపంలో వెళితే.. అక్కడినుంచి మాత్రం రూ.1,12,854 కోట్లు మాత్రమే వచ్చాయని తెలిపారు. మనకు రావాల్సిన వాటా ఇవ్వకుండా రూ.1400 కోట్లు అప్పు తీసుకోవాలని చెప్తున్నారని మండిపడ్డారు.
అప్పులు.. తప్పుకాదు.. అభివృద్ధి చెందాలంటే అప్పులు చేయాల్సి ఉంటుందని, అగ్రరాజ్యంగా చెప్పుకొనే అమెరికా అత్యధికంగా అప్పుఉన్న దేశాల్లో ముందున్నదని కేసీఆర్ తెలిపారు. అప్పులు ఎందుకు తీసుకుంటున్నామనే విషయం ముఖ్యంకాదని, వాటిని వేటికోసం ఖర్చుపెడుతున్నామన్నదే అవసరమన్నారు. హిరోషిమా, నాగసాకిపై బాంబుదాడులకు కకావికలమైన జపాన్ 400% అప్పులు చేసి ఇవాళ అభివృద్ధిలో, జీడీపీలో అగ్రస్థానంలో ఉన్నదనే విషయాన్ని తెలుసుకోవాలని సూచించారు. కాళేశ్వరంతోపాటు సంక్షేమం, అభివృద్ధి పనుల కోసం లక్షకోట్లు అప్పు తీసుకొచ్చామని, రెండేండ్లలో అప్పు మొత్తం తీరిపోతుందని వెల్లడించారు. 23 జిల్లాలున్న ఉమ్మడి రాష్ర్టానికి రూ.1.35 లక్షల కోట్ల బడ్జెట్ ఉంటే ఇప్పుడు తెలంగాణ బడ్జెట్ ఎంతుందో గమనించాలని హితవుపలికారు. తెలంగాణ తలసరి ఆదాయంలో నంబర్‌వన్‌గా ఉన్నదన్నారు.
నాణ్యమైన విద్యుత్ ఇండియాలో ఎక్కడాలేనివిధంగా నాణ్యమైన విద్యుత్‌ను సరఫరా చేస్తున్నామన్న సీఎం కేసీఆర్.. క్వాలిటేటివ్ పవర్‌ను కాపాడుకుందామా? చార్జీలను భరిద్దామా? అని ప్రశ్నించారు. చార్జీలను పెంచే విషయంలో వెనకడుగు వేసేదిలేదని.. ఈ విషయంలో మాయామశ్చీంద్రా అంటూ మోసం చేయదల్చుకోలేదని స్పష్టంచేశారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ కోసం ఖర్చుచేసిన పూర్తి లెక్కలను ప్రచురించిన మొట్టమొదటి ప్రభుత్వం దేశంలో తమదేనని చెప్పారు. పోడుభూముల సమస్య వారసత్వంగా వచ్చిందని, దీర్ఘకాలిక సమస్యలను దశలవారీగా పరిష్కరిస్తామని తెలిపారు. ఇందుకోసం తండాల్లో ప్రజాదర్బార్ నిర్వహిస్తామని, ఏజెన్సీ ప్రాంతాల అభివృద్ధి కోసం రూ.100 కోట్లు కేటాయించినట్టు తెలిపారు.
రియల్ రంగం పురోగతి ఆరేండ్లలో స్టాంప్‌డ్యూటీ, రిజిస్ట్రేషన్ చార్జీలను నయాపైసా కూడా పెంచలేదని సీఎం కేసీఆర్ చెప్పారు. రియల్ ఎస్టేట్‌రంగం పురోగతి చెందుతున్న క్రమంలో ఆశావహ దృక్పథంతో కాస్త బడా లక్ష్యాలను నిర్దేశించుకున్నామని వివరించారు. పలు రంగాల పనితీరును మెరుగుపరిచి, లీకేజీలను అరికట్టడంవల్ల ఆదాయం పెంపొందించినట్టు చెప్పారు. అర్టీసీకి బడ్జెట్‌లో రూ.1000 కోట్లు కేటాయించామని, సంస్థను లాభాల్లోకి తీసుకొచ్చేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. రాష్ట్రానికి పరిశ్రమలు వస్తున్నాయని, ఐటీ ఆదాయం పెరుగుతున్నదని తెలిపారు. వ్యవసాయరంగాన్ని లాభసాటిగా మార్చి, రైతును రాజును చేసేవరకు విశ్రమించనని స్పష్టంచేశారు.
కాంగ్రెస్‌ని చూస్తే పిటీ సభలో కాంగ్రెస్ సభ్యులను ఉద్దేశించి సీఎం మాట్లాడుతూ.. ‘మీకు పని లేదు.. మాకు పుర్సత్ లేదు.. తెలంగాణ పట్ల మాకు ఫుల్ పని ఉన్నది. పూర్తిస్థాయి కమిట్‌మెంట్ ఉన్నది. ఒకవైపు కరోనా, మరోవైపు ఆర్థికమాంద్యం బెదిరిస్తున్నాయి. అయినా పట్టువదలకుండా రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్తున్నాం. కాంగ్రెస్ పార్టీని చూస్తే పిటీ అనిపిస్తున్నది. మేం చెప్పేది వాళ్లకు అర్థం కాదు’ అని అన్నారు.
వ్యవసాయంలో గణనీయమైన అభివృద్ధి వ్యవసాయరంగంలో గణనీయమైన అభివృద్ధి సాధించామని.. దర్జాగా కాలుమీద కాలేసుకుని పంటలు పండించుకునే స్థితికి రాష్ట్ర రైతాంగం వచ్చిందని సీఎం కేసీఆర్ చెప్పారు. 2014 వరకు 11.4% మైనస్‌లో ఉన్న వ్యవసాయరంగం.. ఇప్పుడు 23.7 శాతం ప్లస్‌కు వచ్చిందని, అంటే 34 నుంచి 35శాతం వృద్ధి సాధించినట్టని ప్రకటించారు. 38.19 లక్షల ఎకరాల్లో వరి సాగవుతున్నదని, 2.25 కోట్ల టన్నుల ధాన్యం ఉత్పత్తి వస్తుందని అంచనా వేస్తున్నామన్నారు. రైతులు పండించిన ప్రతిగింజనూ కొంటామని స్పష్టంచేశారు. ఇప్పటికే కంది విషయంలో కేంద్రం మోసంచేసేందుకు చూసిందని విమర్శించారు. తాము తక్షణంగా రూ.300 కోట్లు కొనుగోళ్లకు ఇచ్చామన్నారు. కాళేశ్వరం ద్వారా గోదావరి నది నుంచి 950 టీఎంసీల నీళ్లను తెస్తామని, వచ్చే ఏడాదిలోపే 530 టీఎంసీలను రాష్ట్రంలో వాడుకుంటామని తెలిపారు. గతంలో ఎస్సారెస్పీ కాలువల్లో నీరు ఎల్‌ఎండీ దాటి కిందకు రాలేదని.. కానీ ఇవాళ 125 రోజులుగా సజీవంగా పారుతున్నదని చెప్పారు. ఉద్యమ సమయంలో కాకతీయ కాల్వలను చూశామని, అప్పుడు నెర్రెలు బారి, తుమ్మచెట్లతో నిండిన కాలువలు ఇప్పుడు నీళ్లతో దుంకుతున్నాయని పేర్కొన్నారు. వచ్చే రెండేండ్లలో 1200 చెక్‌డ్యాములను పూర్తిచేస్తామని చెప్పారు. కాంగ్రెస్ సభ్యులు ప్రతిసారి ప్రాజెక్టుల డీపీఆర్లు కావాలని అడుగుతున్నారని, ఏ డీపీఆర్ కావాలో చెప్పాలని కోరారు. కాళేశ్వరం ప్రాజెక్టు డీపీఆర్ కావాలంటే పది లారీల కాగితాలు ఉంటాయని చెప్పారు. ప్రాజెక్టులకు బహిరంగ టెండర్లు పిలుస్తున్నామని, ప్రతిటెండర్ ఆన్‌లైన్‌లో ఉంటుందని పేర్కొన్నారు.
అప్పుల నుంచి లాభాల్లోకి విజయ డెయిరీ తెలంగాణలో అభివృద్ధిని సామాజిక, మానవీయకోణంలో చూస్తున్నామని, కాంగ్రెస్ హయాంలో పింఛన్ రూ.200 ఉంటే.. ఇప్పుడు రూ.2,016 ఇస్తున్నామని కేసీఆర్ తెలిపారు. పేదింటి ఆడబిడ్డల కోసం కల్యాణలక్ష్మి పథకాన్ని అమలుచేస్తున్నామన్నారు. బోదకాలు బాధితులు, ఒంటరి మహిళలకు కూడా పింఛన్ ఇస్తున్నామని, దివ్యాంగులకు రూ.3వేల చొప్పున ఇస్తున్నామని చెప్పారు. ఆర్థికపరిస్థితి బాగాలేదని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయన్న సీఎం.. ఈ పథకాలన్నీ ఎలా నడుపుతున్నామని వాటిని ప్రశ్నించారు. టీడీపీ, కాంగ్రెస్ హయాంలో విజయడెయిరీని సర్వనాశనం చేశారని ఆరోపించారు. విజయ నెయ్యికి ముంబైతోపాటు ఉత్తరభారతంలోనూ అద్భుతమైన డిమాండ్ ఉండేదని.. దానిని శంకరగిరిమాన్యాలు పట్టించారని మండిపడ్డారు. పాలఉత్పత్తిదారులకు లీటర్‌పై రూ.4 ప్రోత్సాహం ఇచ్చి డెయిరీని అభివృద్ధిలోకి తీసుకువచ్చామన్నారు. రూ.30 కోట్ల అప్పులు తీర్చి.. ఇప్పుడు రూ.16 కోట్ల లాభాల్లోకి తీసుకొచ్చామని వెల్లడించారు. ఆదాయం పెంచుకోవడం కోసం కడుపుకట్టుకొని పనిచేస్తున్నామని తెలిపారు. మద్యం, బెల్టు షాపులను మూసివేయడం వల్ల ఉపయోగం ఉంటుందా? అని కేసీఆర్ ప్రశ్నించారు. మద్యం తాగడాన్ని నిరుత్సాహపరిచేందుకే మద్యం రేట్లు పెంచామని వివరించారు.
24 గంటలూ తాగునీటి సరఫరా హైదరాబాద్‌లో తాగునీటి సమస్యలు రాకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని.. నగరాన్ని విశ్వనగరంగా మార్చేందుకు రూ.10 వేల కోట్లను కేటాయించామని సీఎం కేసీఆర్ తెలిపారు. శివారుల్లో అద్భుతమైన రీతిలో మంచినీటి సరఫరా జరుగుతున్నదని చెప్పారు. రూ.3-4 వేల కోట్ల ఖర్చుతో హైదరాబాద్ చుట్టూ అభివృద్ధి చేస్తున్న రింగ్‌మెయిన్ పూర్తయితే తాగునీటికి ఎలాంటి ఢోకా ఉండబోదన్నారు. 24 గంటలు తాగునీటిని ఎలా సరఫరా చేయాలనే విషయంలో ‘ఆస్కీ’ నివేదిక తయారుచేస్తున్నదని తెలిపారు. మిషన్ భగీరథతో 24 వేల గ్రామాలకు మంచినీటిని అందిస్తున్నామని వివరించారు. ఏదో ఒకగ్రామం.. మారుమూలన కొన్ని ఇబ్బందులతో నీళ్లు రాకుంటే మొత్తం భగీరథ పథకమే దండుగ అన్నట్టు మాట్లాడటం సరికాదని అన్నారు. సభలో హుందాగా ఉండాలని సూచించారు.
‘చచ్చేందుకు తయారై.. పేగులు తెగే దాకా కొట్లాడి.. ఉపాసం ఉండో ఉప్పిడి ఉండో తెలంగాణను తెచ్చింది టీఆర్‌ఎస్ అని ప్రపంచానికి తెలుసు. దీన్ని మేం చెడగొట్టం.. మా ప్రాణంపోయినా సరే కాంప్రమైజ్ కాము. ఏ దారికి తీసుకుపోవాలో అక్కడికి తీసుకుపోతాం. సజల, సుజల, సస్యశ్యామల తెలంగాణ చేసేవరకూ విశ్రమించను’
– అసెంబ్లీలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు