Bharat Rashtra Samithi

Bharat Rashtra Samithi

KCR
telangana talli img

సహకరించండి.. సాధిస్తా

– సిటీలోకి వచ్చేందుకు 5 స్కైవేల నిర్మాణం – త్వరలో వెయ్యి మార్కెట్ల ఏర్పాటు – రూ. 10వేల కోట్లతో రహదారుల అభివృద్ధి – మొదటి దశలో 2 కారిడార్లు, 16 జంక్షన్లు – వేసవిలో హుస్సేన్‌సాగర్ ప్రక్షాళన – 24 అంతస్తుల్లో అధునాతన కమాండ్ కంట్రోల్ రూం – టీ న్యూస్ ముఖ్యమంత్రితో ముఖాముఖిలో.. -నగర అభివృద్ధిపై విజన్ ఆవిష్కరించిన సీఎం కేసీఆర్

KCR-in-T-News మహానగర అభివృద్ధిపై సీఎం కేసీఆర్ తన విజన్‌ను ఆవిష్కరించారు. బుధవారం టీ న్యూస్ నిర్వహించిన ముఖ్యమంత్రితో ముఖాముఖి కార్యక్రమంలో పలు అంశాలపై అభిప్రాయాలను ప్రజలతో పంచుకున్నారు. గత పాలకుల నిర్లక్ష్యంతో అస్తవ్యస్తంగా తయారైన గ్రేటర్‌ను అభివృద్ధి బాటలో నడిపేందుకు ఎకామ్ సంస్థతో సమగ్ర సర్వే నిర్వహిస్తున్నట్టు వెల్లడించారు. జిల్లాల నుంచి నగరానికి వచ్చేందుకు చుట్టూ 5 స్కైవేలను నిర్మించనున్నట్టు చెప్పారు. రూ. 10వేల కోట్లతో ఎక్కడా వర్షం నీరు నిలవకుండా రహదారులను అభివృద్ధి చేస్తామన్నారు. కోటి మంది జనాభా ఉన్న సిటీలో కేవలం 24 మార్కెట్లే ఉన్నాయని, త్వరలో వెయ్యి మార్కెట్లను ఏర్పాటు చేస్తామన్నారు. కూకట్‌పల్లి నాలాను మళ్లించి ఈ వేసవిలో హుస్సేన్‌సాగర్‌ను ప్రక్షాళన చేసి వచ్చే వర్షాకాలంలో మంచినీటితో నింపుతామన్నారు. జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ పరిధిలో 10కోట్ల మొక్కలను నాటేందుకు నిర్ణయించామన్నారు. ప్రభుత్వం ఆత్మవిశ్వాసంతో పనిచేస్తున్నదని.. ప్రజల సహకారంతో విశ్వనగరాన్ని సాధించి చూపిస్తానని సీఎం స్పష్టం చేశారు.

సిటీకి రూ.1250 కోట్లతో మొదటి దశ శస్త్రచికిత్స సిటీబ్యూరో: మహానగర సమస్యలు అధిగమించాలంటే గ్రేటర్‌కు శస్త్రచికిత్స చేయాల్సిందేనని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అన్నారు. మొదటి దశలో రూ.1250 కోట్లతో సర్జరీని మొదలుపెడుతున్నట్లు ప్రకటించారు. అమెరికాలోని డల్లాస్ నగరం తరహాలో గ్రేటర్‌ను తీర్చిదిద్దుతామంటూ ప్రకటించారు. బుధవారం రాత్రి టీ న్యూస్ చానెల్ నిర్వహించిన ముఖ్యమంత్రితో ముఖాముఖి కార్యక్రమంలో సీఎం కేసీఆర్ పాల్గొని గ్రేటర్ హైదరాబాద్‌ను విశ్వనగరంగా మార్చేందుకు రూపొందించిన ప్రణాళికను ప్రజల అభిప్రాయాలను పంచుకున్నారు.

సమగ్ర సర్వే నగర అభివృద్ధి కోసం ఎకామ్ సంస్థతో సమగ్ర సర్వే, దీనితోపాటు ఎల్‌అండ్‌టీ సంస్థ, షాపూర్‌జీ పల్లొంజీ సంస్థ సైతం ముందుకువచ్చాయి.

స్కైవేలు సిటీలో ప్రయాణం ఇబ్బందిగా మారింది. దీనికోసం జిల్లాల నుంచి నగరానికి రావడానికి 5 స్కైవేలు ఏడాదిలోగా నిర్మాణం. జేబీఎస్ నుంచి తూంకుంట, బోయిన్‌పల్లి, బాలానగర్, ఉప్పల్ ప్రాంతాలకు కోసం ఏర్పాటు. మధ్యలో దిగేందుకు ఎక్కేందుకు ఇంటర్‌మీడియం ర్యాంపులు. స్కైవేల నిర్మాణానికి లీ అసోసియేట్స్ సంస్థతో సర్వే నిర్వహిస్తున్నట్లుగా వివరించారు.

అందరి సహకారం కావాలి హైదరాబాద్ అద్భుతమైన పట్టణం. పెట్టుబడులు రాబోతున్నాయి. అంతర్జాతీయ కంపెనీలు పెట్టుబడులు పెట్టడానికి సిద్ధంగా ఉన్నయి. నగరం అభివృద్ధి కావాలనుకునే వారి సహాయ సహకారాలు ప్రభుత్వానికి అవసరం. అవసరమైతే రెండింతల నష్టపరిహారం అందిస్తాం.

ఇంకా అభివృద్ధి కావాలి.. నగరం ప్రపంచ పటంలో చోటు సంపాదించింది. మద్రాసు కన్నా 15 సంవత్సరాల ముందే విద్యుత్‌ని ఉత్పత్తి చేసింది. 42ఏళ్ల పాటు ఢిల్లీ కన్నా పెద్దనగరంగా విరసిల్లింది. కాని జనాభాపెరుగుతోంది. నగరం విస్తరిస్తోంది. జనాభాను అంచనావేసి నగరాన్ని సమాంతరంగా అభివృద్ధి చేయాలి.

నీటి బెడద తీర్చడానికి 10వేలకోట్లు రోడ్డుమీద ఒక్కచుక్కనీరులేకుండా ఉండాలంటే 10 వేల కోట్ల అవసరం. ఇప్పటికీ బేగంపేట సీఎం ఆఫీస్‌ముందు మీటర్ లోతు నీళ్లు ఉంటయ్. రాజ్‌భవన్ ముందు, అసెంబ్లీ ముందు ఇండ్లన్నీ మునిగిపోతయ్. నగరంలో వర్షాలొస్తే కార్లు బోట్లయితయ్. అన్నింటా నిర్లక్ష్యం జరిగింది.

గ్లోరియస్ సిటీ…

హైదరాబాద్ ఓ గ్లోరియస్ సిటీ. నాలుగు వందల ఏళ్ల చరిత్ర ఉంది. హైదరాబాద్ బాగు కోసంజీహెచ్‌ఎంసీ అధికారులతో ప్లాన్ తయారు చేయించినం. తెలంగాణ భూమి పుత్రుల చేతిలోకి వచ్చినంక మారాలి. దీనికి ప్రజల సహకారం అవసరం. ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది. మాకు ఆత్మవిశ్వాసం ఉంది. అయితే ప్రజల సహకారం కావాలె. అప్పుడే పెట్టుబడులు వస్తాయి. ఎక్కడైనా అభివృద్ధికి సాయం అవసరం. అనేక ైఫ్లె ఓవర్లు, స్కైలైన్లు వేయాల్సి అవసరం ఉంది. అయితే చాలా మలుపుల దగ్గర తప్పనిసరి. లేకపోతే బండ్లకు యాక్సిడెంట్లు అయితయ్..కొన్ని ఇండ్లను తీసేయాల్సి ఉంటుంది. ప్రజలకు నష్టం చేయాలన్నది ప్రభుత్వ ఉద్దేశం కాదు. ఎవరైనా నష్టపోతే రెండింతలు నష్టపరిహారం చెల్లిస్తాం. వచ్చే ఐదారేళ్లలో నగర స్వరూపాన్నే మార్చేస్తాం. ఆ విశ్వాసంతోనే ముందుకువెళుతున్నాం.

1000 అంగళ్లు ఏర్పాటు చేస్తాం సిటీబ్యూరో: నగరంలోని దాదాపు కోటిమంది జనాభాకు కేవలం 24 మార్కెట్లు ఉండటం దారుణమని సీఎం కేసీఆర్ అన్నారు. ప్రతి పౌరుడికి మౌలిక సదుపాయాలతో పాటు పౌరసరఫరాలు, రైతు బజార్లు అందుబాటులో ఉండేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు. నగరంలో ప్రధాన రహదారులకు దగ్గరలో ఉన్న ప్రభుత్వ కార్యాలయాల ప్రాంతంలో రైతు బజార్లను ఏర్పాటు చేయడానికి చర్యలు చేపడుతున్నట్లు సీఎం స్పష్టం చేశారు. నిజాం నాటి కాలంలో ఏర్పాటు చేసిన మోండా మార్కెటు ఏడున్నర ఎకరాలలో ఉన్న ఏకైక రైతు బజారన్నారు. మిగిలిన రైతు మార్కెట్లన్నీ అరఎకరం కూడా లేవన్నారు. భవిష్యత్తులో 1000 మార్కెట్లు ఆధునిక హంగులతో ఏర్పాటు చేస్తామన్నారు.

అందరికీ ఇళ్లు నగరంలో నివాసించే ప్రతి పౌరుడికి సొంత ఇళ్లు ఉండేందుకు పక్క ప్రణాళికలు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. సనత్‌నగర్ నియోజకవర్గ పరిధిలోని ఐడీహెచ్ కాలనీలో శిథిలావస్థకు చేరిన భవనాల పునర్‌నిర్మాణాకి శ్రీకారం చుట్టామన్నారు. ఈ కాలనీ నగరంలో మోడల్ కాలనీగా రూపుదిద్దుకుంటుందన్నారు. సికింద్రాబాద్‌లోని అంబేద్కర్ కాలనీలో ఒక కుటుంబం 7/6 అడుగుల కలిగిన ఇంట్లో 60 నుంచి 70ఏళ్లుగా జీవిస్తున్నట్లు కేసీఆర్ వివరించారు. వీటన్నింటిని దృష్టిలో ఉంచుకొని తమ ప్రభుత్వం పేదల కోసం పని చేయాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. మణికేశ్వర్‌నగర్‌లో ఉన్న ఆరు ఎకరాల ప్రభుత్వ స్థలంలో పేదలకు ఇళ్లు కట్టిస్తామని చెప్పారు.

కబ్జాలకు అడ్డుకట్టకే జీవో 58 గ్రేటర్ హైదరాబాద్‌లో భూ మాఫీయా, కబ్జాదారులు, ఆక్రమణదారులకు అడ్డుకట్ట వేయడానికి జీవో 58ని ప్రభుత్వం తీసుకవచ్చిందన్నారు. అందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా 125 గజాల స్థలం కలిగిన 3,41,949 మంది దరఖాస్తు చేసుకున్నట్లు తెలిపారు. దీనిలో గ్రేటర్, హెచ్‌ఎండీఏ పరిధిలో దాదాపు 2లక్షల 34వేల మంది ఉన్నారన్నారు. రంగారెడ్డిలో 1,51,100,జీహెచ్‌ఎంసీ పరిధిలో 63,523 దరఖాస్తులు అందినట్లు అధికారిక రికార్డుల్లో ఉందన్నారు. ప్రభుత్వం విడుదల చేసిన 58 జీవోని ఇచ్చిన సమయంలో అర్హులైన ప్రతి ఒక్కరు వినియోగించుకొవాలి. క్రమబద్ధీకరణ సమయం ముగిసిన తర్వాత ఎట్టి పరిస్థితిలో నూ ప్రభుత్వ భూములను వదిలేదని లేదన్నారు.

సరస్సు సగమైంది జంట నగరంలో నిజాం పాలన (5వేల సంవత్సరాల)లో 1400 ఎకరాల విస్తీర్ణంలో హుస్సేన్‌సాగర్ సరస్సు ఉండేదని కేసీఆర్ వివరించారు. గత పాలకుల నిర్లక్ష్యంతో ప్రస్తుతం సరస్సు 995 ఎకరాల విస్తీర్ణంలో ఉందన్నారు. సాగర్ నీళ్ల కింద కూడా మా భూమి ఉందంటూ కేసులు పెట్టడం ఎంత దుర్మార్గమంటూ ప్రశ్నించారు.కానీ హుస్సేన్‌సాగర్‌కు సంబంధించిన ఇంచు భూమిని కూడా వదిలిపెట్టబోమంటూ హెచ్చరికలు జారీ చేశారు. నెక్లెస్‌రోడ్డుకు కేటాయించిన భూమిని మినహా మిగిలిన భూమంతా స్వాధీనం చేసుకుంటామని స్పష్టం చేశారు. ఈ సాగర్‌లోకి వచ్చే నాలుగు నాలాల్లో కూకట్‌పల్లి నాలా మాత్రం కాలుష్యాన్ని మోసుకొస్తుందన్నారు.

వేసవిలో సాగరమథనం హుస్సేన్ సాగర్ ప్రక్షాళనకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. రానున్న వేసవిలో సాగర్‌లో ప్రజా ఉద్యమంగా పనులు చేపడుతామన్నారు. ఈ పనుల్లో రాష్ట్ర మంత్రి వర్గంతో పాటు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, నగర వాసులు పాల్గొంటారని చెప్పారు. ప్రస్తుతం కూకట్‌పల్లి నాలా డైవర్షన్ చేసి వర్షకాలంలో మళ్లీ సాగర్‌ను నింపేందుకు ప్రయత్నం చేస్తామన్నారు.

అత్యాధునిక కమాండ్ కంట్రోల్‌కు త్వరలో భూమి పూజ నమస్తే తెలంగాణ, క్రైంబ్యూరో: నగరంలో అత్యాధునిక టెక్నాలజీతో శాంతి భద్రతల పర్యవేక్షణ కోసం 24 అంతస్థుల కమాండ్ కంట్రోల్ ఏర్పాటు చేస్తామని, త్వరలో భూమి పూజ చేయనున్నట్లు సీఎం కేసీఆర్ తెలిపారు. సింగపూర్‌కు వెళ్లిన సమయంలో అక్కడ శాంతి భద్రతలపై ప్రస్తావన వచ్చిందన్నారు. చిన్న దేశమైనా పోలీసులు బయట కన్పించకుండా చక్కగా శాంతి భద్రతలు నిర్వహిస్తున్నారన్నారు. అక్కడ ప్రతి 50 మందికి ఒక సీసీ కెమెరా చొప్పున ఏర్పాటు చేసి నిఘా కొనసాగిస్తున్నారన్నారు. మన నగరంలో కూడా నిఘా వ్యవస్థ ఏర్పాటు చేసి కమాండ్ కంట్రోల్‌కు అనుసంధానం చేస్తామన్నారు. అక్కడి నుంచి నగరంలో జరిగే ప్రతి విషయాన్ని సీసీ కెమెరాలో వీక్షించి శాంతి భద్రతలు పర్యవేక్షిస్తారన్నారు. తెలంగాణ ప్రభుత్వం రాగానే పేకాట క్లబ్బులు మూసివేసిందన్నారు.ఎన్ని ఒత్తిళ్లు, ఆరోపణలు వచ్చినా వెనక్కి తగ్గలేదన్నారు.

ఆదర్శం… డల్లాస్ నగరం సిటీబ్యూరో : యూఎస్‌ఏలోని టెక్సాస్‌లో డల్లాస్ ఒక ముఖ్యమైన నగరం. ఇది యునైటెడ్ స్టేట్స్‌లో ఆర్థిక నగరంగా, అతి పెద్ద అర్బన్ సెంటర్‌గా ప్రసిద్ధిగాంచింది. బ్యాకింగ్, కామర్స్, టెలికమ్యూనికేషన్, కంప్యూటర్ టెక్నాలజీ, విద్యుచ్ఛక్తి, హెల్త్ కేర్, వైద్య పరిశోధన రంగాల్లో డల్లాస్ ఇతర దేశాలకు ఆదర్శంగా నిలిచింది. జీడీపీ పరంగా ఇది ప్రపంచంలోనే 14వ స్థానంలో ఉంది. నూనె కర్మాగారాలతో పాటు అద్భుతమైన రవాణా వ్యవస్థ కలిగి ఉండటం ఈ ప్రాంతం విశేషం.

ఫోన్‌ఇన్‌లో సీఎం ఏమన్నారంటే..

ఆస్తి పన్ను వసూలు నేపథ్యంలో విధించే వడ్డీని రద్దు చేస్తామని సీఎం స్పష్టం చేశారు. అంతేకాకుండా బస్తీలు, మురికివాడల్లోని ప్రజలకు ఆస్తి పన్ను ఉండదన్నారు. పార్కింగ్ అనుమతులతో సమన్వయం ఉండాలి, పోలీసు, జీహెచ్‌ఎంసీ అధికారులతోనే అనుమతి ఇవ్వాలి.

బిల్డింగ్ రెగ్యులరైజేషన్ నిలిపివేయాలి. జీహెచ్‌ఎంసీ అధికారులు గతంలో ఇచ్చిన అనుమతులను పునరుద్ధరించాలి. : -మధుసూదన్‌రావు,లక్డికాపూల్

సీఎం: మీరు ప్రస్తావించిన విషయాలను క్షుణ్ణంగా పరిశీలించి అధికారులతో చర్చిస్తామన్నారు. గత ప్రభుత్వాలు చేసిన నిర్లక్ష్యంతోనే అనుమతులు ఇచ్చారు. గత్యంతరం లేక క్రమబద్ధీకరిస్తున్నాం.

చెరువులు, పార్కులు భూకబ్జాలకు పాల్పడుతున్నారు. పిల్లలు ఆడుకునే పరిస్థితి లేకుండా పోయింది. : -రమేష్, వనస్థలిపురం

సీఎం: మీరు చెప్పిన విషయం వాస్తవామే. కాలనీ వాసులకు, పిల్లల ఆహ్లాదం కోసం ప్రయత్నాలు చేస్తున్నాం.

ఉప్పల్, కుషాయిగూడలో పబ్లిక్ టాయిలెట్స్ లేక మహిళలు ఇబ్బంది పడుతున్నారు. : -సత్తయ్య, కుషాయిగూడ

సీఎం: ప్రజలకు ఉపయోగపడే సమస్యను లేవనెత్తినందుకు కృతజ్ఞతలు. ఈసమస్యపై నేడు అధికారులతో చర్చించి, ప్రత్యామ్నాం ఏర్పాటు చేస్తాం.

డిజైన్ హైదరాబాద్ అద్భుతంగా ఉంది. : -రవీందర్‌రెడ్డి, మియాపూర్ సీఎం: హైదరాబాద్‌లో కాస్మోపాలిటన్ కల్చర్‌ను పెంపొందింద్దాం. అందరి సహకారాన్ని తీసుకుందాం.

నగరంలో 20 సంవత్సరాలుగా జీవిస్తున్నాం. మాకు ఇండ్లు నిర్మించి ఇయ్యాలే. : -పూర్ణ, అమీర్‌పేట

సీఎం: ఇండ్లు లేని ప్రతి పౌరుడికి ఇల్లు ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటాం. మీరు మీ పరిధిలోని తహసీల్దార్ కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకోండి.

హైదరాబాద్ విజన్ బాగుంది. సిటీలో భూగర్భజలాలు అడుగుంటి పోయాయి. వర్షపు నీటితో సమస్య తీవ్రమవుతోంది. : -శివకుమార్, మలక్‌పేట

సీఎం: హైదరాబాద్‌లో సరస్సు, చెరువుల రక్షణకు చర్యలు తీసుకుంటున్నాం. అధునాతన టెక్నాలజీతో వర్షపు నీరు భూమిలో సింక్ అయ్యేందుకు ప్రయత్నాలు చేస్తున్నాం.

పాత బస్తీని పట్టించుకోండి. : రాజన్‌బాబు, సోమాజిగూడ సీఎం: కొత్త, పాత బస్తీల తేడా లేదు. పాత బస్తీనే అసలైన హైదరాబాద్. అన్ని బస్తీలను సమంగానే అభివృద్ధి చేస్తాం.

సహకరించండి.. సాధిస్తా

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the BRS Party.