-రూ.1600 కోట్లతో ఏర్పాటుకు కేంద్ర రక్షణశాఖ నిర్ణయం -సంస్థకు 100 ఎకరాలు కేటాయింపు.. దేశంలోనే మొదటిసారి

నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ సమీపంలో కేంద్ర ప్రభుత్వ రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ పరిశోధన యూనిట్‌ను ఏర్పాటు చేయాలని కేంద్ర రక్షణశాఖ నిర్ణయించిందని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు తెలిపారు. రూ.1600 కోట్ల వ్యయంతో నిర్మించే ఈ యూనిట్‌కు దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో అనువైన స్థలం కోసం అన్వేషించి నాగార్జునసాగర్‌ను రక్షణశాఖ అధికారులు గుర్తించారని సీఎం చెప్పారు. రక్షణశాఖ పరిశోధన సంస్థ ఏర్పాటుపై ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు సచివాలయంలో బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. పరిశోధన యూనిట్ ఏర్పాటు కోసం 100 ఎకరాల స్థలాన్ని కేటాయిస్తామని ముఖ్యమంత్రి తెలిపారు. భారత దేశంలో ఎక్కడా ఇలాంటి పరిశోధన యూనిట్ లేదని, ప్రపంచవ్యాప్తంగా కేవలం 5 దేశాల్లోనే ఇలాంటి పరిశోధన కేంద్రాలున్నాయని చెప్పారు. ప్రస్తుతం భారత రక్షణశాఖ తన అవసరాలకోసం మాస్కోలోని యూనిట్ పై ఆధారపడుతున్నదని, నాగార్జునసాగర్‌లో ఏర్పాటు చేసే యూనిట్‌తో దేశవ్యాప్తంగా అవసరమైన రక్షణ పరికరాలను తెలంగాణ రాష్ట్రం నుంచే తీసుకోవచ్చునని సీఎం తెలిపారు.
ఇలాంటి ప్రతిష్ఠాత్మక సంస్థ రాష్ర్టానికి రావడం గర్వకారణమని, ఈ యూనిట్‌కు అవసరమయ్యే నీరు, విద్యుత్ ఇతర సౌకర్యాలన్నింటిని కల్పించడానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం చెప్పారు. ఈ యూనిట్ వల్ల వందలాది మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగాలు లభిస్తామయని తెలిపారు. ప్రతిష్ఠాత్మకమైన ఈ యూనిట్‌కు దేశవిదేశాల నుంచి అధికారులు, శాస్త్రవేత్తలు వచ్చిపోతుంటారని వారి సౌకర్యార్థం నాగార్జునసాగర్‌లో విమానాలు దిగడానికి అవసరమైన రన్ వేను ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఈ సమావేశంలో మంత్రి హరీష్‌రావు, ప్రభుత్వ సలహాదారు కేవీ రమణా చారి, రెవెన్యూశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ మీనా, నీటిపారుదల శాఖ ముఖ్యకార్యదర్శి ఎస్‌కే జోషి, సీఎంవో ముఖ్యకార్యదర్శి నర్సింగరావు పాల్గొన్నారు.