Bharat Rashtra Samithi

Bharat Rashtra Samithi

KCR
telangana talli img

సాగునీటిరంగానికి అగ్రస్థానం

-ప్రాజెక్టుల నిర్మాణానికి రూ.22,500 కోట్లు కేటాయింపు
-ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ద్వారా రూ.11,250 కోట్లు
-2018-19లో ఇప్పటికే రూ.21 వేల కోట్లు దాటిన వ్యయం
-ప్రాజెక్టులకు ఇప్పటివరకు అయిన వ్యయం రూ.లక్ష కోట్లు
-ఈ ఏడాదిలోనే బీడుభూములకు కాళేశ్వరం జలాలు

సీఎం కేసీఆర్ జల సంకల్పం కండ్ల ముందు సాక్షాత్కరించే సమయం ఆసన్నమైంది. గత నాలుగున్నరేండ్లలో సాగునీటిరంగంలో వేసిన బలమైన పునాది.. దేశంలోనే ఎక్కడాలేని విధంగా బడ్జెట్ కేటాయింపుల్లో వేసిన పెద్దపీటతో ఈ ఏడాదే రాష్ట్ర రైతాంగం ఆ ఫలాలను అందుకోనున్నది. ఈ క్రమంలో తాజాగా ప్రవేశపెట్టిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌లోనూ సాగునీటిరంగానికే అగ్రస్థానం కల్పించారు. బడ్జెట్‌లో రూ.22,500 కోట్ల నిధులు కేటాయించారు. కేంద్రం కూడా ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టిన నేపథ్యంలో రాష్ట్రం కూడా ఆ మేరకు బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. శుక్రవారం ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ద్వారా సాగునీటిరంగానికి ప్రభుత్వం ఆర్నెల్లకుగాను రూ.11,250 కోట్లు కేటాయించింది. మరోవైపు తాజా ఆర్థిక సంవత్సరంలో పది నెలల సమయంలోనే సాగునీటి ప్రాజెక్టులపై వ్యయం రూ.21 వేల కోట్లు దాటడమనేది మరో రికార్డు. ఇంత భారీస్థాయిలో పనులు జరిగినందున ఈ ఏడాదిలోనే కాళేశ్వరం నుంచి గోదావరి జలాలు బీడు భూములను తడుపనున్నాయి.

వ్యయంలోనూ మరో రికార్డు
ప్రభుత్వం బడ్జెట్ కేటాయింపులు చేయడమే కాదు.. నీటిపారుదలశాఖ పనులను వేగంగా కొనసాగిస్తుండటంతో ఆ మేరకు ప్రాజెక్టులు త్వరితగతిన పూర్తవుతున్నాయి. 2018-19 ఆర్థిక సంవత్సరంలోనూ భారీస్థాయిలో వ్యయం నమోదైంది. గత ఆర్థిక సంవత్సరం లో సుమారు రూ.22 వేల కోట్ల వరకు వ్యయం చేయగా, తాజా ఆర్థిక సంవత్సరం జనవరి 31 వరకు సుమారు రూ.21,500 కోట్ల వ్యయం నమోదైంది. ఇందులో అధికంగా కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలోనే దాదాపు రూ.13 వేల కోట్లకుపైగా పనులు జరిగాయి. ఇప్పటివరకు ఈ పథకానికి రూ. 44,600 కోట్లు ఖర్చుచేశారు. అందుకే ఈ ఏడాదిలోనే కాళేశ్వరం ఎత్తిపోతల పథకం నుంచి నీటి విడుదలకు ప్రభుత్వం సిద్ధమైంది. అలాగే తాజా ఆర్థిక సంవత్సరంలో పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలకు రూ.1,805.17 కోట్లు వ్యయమవగా, మొత్తంగా రూ. 4,872.47 కోట్లు ఖర్చుచేశారు. సీతారామ ప్రాజెక్టుకు ఈ ఏడాది రూ.1,588.17 కోట్లు ఖర్చవగా, మొత్తంగా రూ.1,855.46 కోట్లు వెచ్చించారు. అలాగే ఎస్సారెస్పీ వరద కాల్వకు ఈ ఏడాది రూ.1,295.21 కోట్లు వ్యయం చేయగా, మొత్తంగా రూ.6,806.81 కోట్లు ఖర్చు చేశారు. రాష్ట్రంలోని 36 భారీ, మధ్యతరహా ప్రాజెక్టులపై ఇప్పటివరకు వెచ్చించిన వ్యయం రూ.1,03,157.66 కోట్లుగా ఉన్నది. సమైక్య రాష్ట్రంలో తెలంగాణకు సాగునీటి విషయంలో జరిగిన అన్యాయం అంతా ఇంతా కాదు. కాగితాల మీద ప్రాజెక్టులు, కరువులతో అల్లాడే ప్రజలు అనే దుస్థితి ఆవరించింది. సమైక్య రాష్ట్రంలోనే పాలకులు జారీచేసిన అనేక అధికారిక ఉత్తర్వుల్లోనే తెలంగాణ ప్రాంతానికి కృష్ణా, గోదావరి జలాల్లో 1,350 టీఎంసీల నీటి వాటా ఉన్నది. కానీ ఈ నీటిని వాడుకునేందుకు అనువుగా ప్రాజెక్టుల నిర్మాణం మాత్రం జరుగలేదు. నదీజలాల్లో తెలంగాణకు ఉన్న వాటాను సమర్ధంగా వినియోగించుకొని 1.25 కోట్ల ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యంతో ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టులను నిర్మిస్తున్నది. గతంలో ప్రాజెక్టుల నిర్మాణానికి దశాబ్దాలు పట్టేది. కానీ తెలంగాణ ప్రభుత్వం నాలుగేండ్లల్లోనే 90 శాతం నిర్మాణ పనులు పూర్తి చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఈ ఏడాది వర్షాకాలంలోనే రైతులకు సాగునీరు అందించేందుకు ప్రభుత్వం ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నది. రాష్ట్రంలో పనులు ప్రారంభించిన అన్ని ప్రాజెక్టులను ఈ ఐదేండ్లల్లో పూర్తిచేసి, తెలంగాణను సస్యశ్యామలం చేసేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో పనిచేస్తున్నది.
– బడ్జెట్ ప్రసంగంలో సీఎం కేసీఆర్

1.25 కోట్ల ఎకరాలకు సాగునీరు
రాష్ట్రంలో 1.25 కోట్ల ఎకరాలను సస్యశ్యామలం చేయాలనే సీఎం కేసీఆర్ జల సంకల్పానికి శ్రీకారం చుట్టే వచ్చే ఆర్థిక సంవత్సరంలోనూ సాగునీటిరంగానికి బడ్జెట్‌లో ప్రథమ ప్రాధాన్యం లభించింది. భారీ, మధ్యతరహా ప్రాజెక్టులకు రూ.20,120.33 కోట్లు, మిషన్ కాకతీయకు రూ.2,379.66 కోట్లు కేటాయించింది. ఇలా మొత్తంగా రూ. 22,500 కోట్ల కేటాయింపులతో సాగునీటిరంగానికి పెద్దపీట వేశారు. నీటిపారుదలశాఖ రూపొందించిన జాబితా ప్రకారం.. కాళేశ్వరం ప్రాజెక్టుకు కేటాయింపులు భారీ గా ఉండనున్నాయి. ఆ తర్వాత పాలమూరు-రంగారెడ్డి, సీతారామ, డిండి ఎత్తిపోతల పథకాలకూ సముచిత ప్రాధాన్యం ఇవ్వనున్నారు. ఎస్సారెస్పీ పునర్జీవన పథకం, తుపాకులగూడెం బరాజ్ సహా ఆన్‌గోయింగ్ ప్రాజెక్టులకు తగిన ప్రాధాన్యం కల్పించనున్నారు. కాళేశ్వరానికి రూ.3,500 కోట్ల కేటాయింపులతోపాటు మరో రూ.2,430 కోట్లకుపైగా రుణాలు తీసుకునే అవకాశాలున్నా యి. సీతారామ ప్రాజెక్టుకు దాదాపు రూ. 500 కోట్లకుపైగా కేటాయింపులతోపాటు మరో రూ.2 వేల కోట్లకుపైగా రుణాలు తీసుకునే సూచనలున్నాయి. తుపాకులగూడెం బరాజ్‌కు దాదాపు రూ.400 కోట్లకుపైగా కేటాయింపులతోపాటు రూ.2 వేల కోట్లకుపైగా రుణాలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కీలకమైన ప్రాజెక్టులకు సంబంధించి నిధుల కొరత ఉండకుండా ఉండేందుకు ముందు జాగ్రత్త చర్యగా కార్పొరేషన్లను ఏర్పాటుచేసింది. ఈ క్రమంలో 2019-20 ఆర్థిక సంవత్సరంలో సుమారు రూ.10,430 కోట్లకుపైగా వివిధ బ్యాంకుల నుంచి రుణా లు పొందేందుకుగాను నీటిపారుదలశాఖ ప్రతిపాదనలు రూపొందించింది.

సమతూకంగా బడ్జెట్
సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో వ్యవసాయం, మౌలిక సదుపాయాలు, ఆరోగ్యం, విద్య, సంక్షేమ రంగాలకు కేటాయింపులు సమతూకంగా జరిగా యి. మ్యానిఫెస్టోలో చేసిన వాగ్దానాలను నెరవేర్చే లా కేటాయింపులు ఉన్నాయి. పెంచిన పింఛన్లు, రైతుబంధు, రుణమాఫీ పథకాలకు నిధులు కేటాయించారు. తెలంగాణలో 2004-14 మధ్య మూలధన వ్యయం రూ.54,052 కోట్లు ఉండగా, 2014-18 మధ్య అది రూ. 1,68,913 కోట్లకు పెరిగింది. సమతూకమైన బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన సీఎం కేసీఆర్‌కు హృదయపూర్వక అభినందనలు. – ట్విట్టర్‌లో టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

దేశంలో ఎక్కడా లేని విధంగా ఇటీవల ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చేలా సీఎం కేసీఆర్ ఈ బడ్జెట్‌లో నిధులు కేటాయించారు. సీఎం కేసీఆర్ ప్రజలకు ఏమి చేయాలో తెలిసిన నేతగా పథకాలు రచించి వాటిని వారికి చేరేలా ప్రణాళికాబద్ధ్దంగా అమలు చేస్తూ దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి కోసం నిధులు కేటాయించారు.
– బాజిరెడ్డి గోవర్ధన్, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే

4,053 కోట్లు
విశ్వనగరాల సరసన హైదరాబాద్‌ను నిలబెట్టేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. రాష్ట్రంలోని నగరాలు, పట్టణాల్లో రోజురోజుకు పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా మౌలిక సదుపాయాల కల్పనకు సమగ్ర కార్యాచరణను అమలు చేస్తున్నారు. ఇందుకోసం పురపాలన, పట్టణాభివృద్ధికి 4,053.60 కోట్లు కేటాయించగా.. ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో.. రూ.2026.80 కోట్లు కేటాయించారు.

కేటాయింపులివి 22,500 కోట్లు
-నీటిపారుదలశాఖకు కేటాయింపులు..
-భారీ, మధ్యతరహా ప్రాజెక్టులకు రూ.20,120.33 కోట్లు
-ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌లో రూ.10,060.17 కోట్లు
-మిషన్ కాకతీయకు రూ.2,379.66 కోట్లు
-ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌లో రూ.1,189.83 కోట్లు

సాగునీటి ప్రాజెక్టులపై జరిగిన వ్యయం
ఏడాది ఖర్చు మొత్తం (రూ.కోట్లల్లో)
2014-15 5,200.00
2015-16 7,176.50
2016-17 13,614.00
2017-18 23,520.00
2018-19 21,489.04 (జనవరి 31 నాటికి)

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the BRS Party.