-ఆదర్శ పట్టణాలుగా మార్చాలి -అదనపు కలెక్టర్లు ఆ దిశగా పనిచేయాలి -పదిరోజుల పట్టణప్రగతి విజయవంతం -మార్పుదిశగా పట్టణాల్లో ముందడుగు -మున్సిపల్ చట్టంపై పెరిగిన అవగాహన -పుర సమీక్షలో మంత్రి కే తారకరామారావు

పట్టణప్రగతి కార్యక్రమంతో పట్టణాల్లో మార్పుదిశగా ముందడుగు పడిందని పురపాలకశాఖ మంత్రి కే తారకరామారావు అన్నారు. ప్రస్తుత మున్సిపాలిటీల్లోని మౌలికవసతులు, పౌర సౌకర్యాలపై సంపూర్ణ నివేదిక రూపలక్పనతోపాటు, ఆదర్శ పట్టణాలుగా తీర్చిదిద్దేందుకు తీసుకోవాల్సిన చర్యలపై రోడ్‌మ్యాప్ రూపొందించుకొని, ఆ దిశగా పనిచేయాలని అధికారులకు సూచించారు. మరోసారి పురపాలికలపైన సమీక్ష నిర్వహిస్తానని, ఆ సమావేశంనాటికి పూర్తిస్థాయి ప్రణాళికలతో సిద్ధంగా ఉండాలని ఆదేశించారు.
పట్టణప్రగతి పూర్తయిన నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన కార్యక్రమాలపై శుక్రవారం హైదరాబాద్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవవనరుల కేంద్రంలో జిల్లాల అదనపు కలెక్టర్లు, వివిధ విభాగాల అధిపతులు, పురపాలకశాఖ ముఖ్యఅధికారులతో మంత్రి కేటీఆర్ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ.. మోడల్ మార్కెట్లు, పార్కులు, డంప్‌యార్డులు, పబ్లిక్‌టాయిలెట్లు, స్ట్రీట్‌వెండింగ్ జోన్లు, నర్సరీలు, శ్మశానవాటికలు, అర్బన్ లంగ్‌స్పేసెస్, ఓపెన్‌జిమ్స్ వంటి సౌకర్యాలు కచ్చితంగా ఉండే లా చూడాలని కోరారు. వీటిని వచ్చే నాలుగున్నరేండ్లలో పూర్తిచేయాలన్నారు. ఏ పట్టణమైనా ఒకేరోజులో ఆదర్శంగా మారదని, నిరంతర అభివృద్ధి కొనసాగించాలని పేర్కొన్నారు. ప్రతి అదనపు కలెక్టర్‌కు తన పరిధిలోని పట్టణాల వివరాలు ఆమూలాగ్రం తెలిసి ఉండాలని చెప్పారు.
తొలిదశ విజయవంతం పట్టణాల మార్పే లక్ష్యంగా ప్రభుత్వం చేపట్టిన తొలిదశ పట్టణప్రగతి విజయవంతమైందని మంత్రి కేటీఆర్ అన్నారు. పదిరోజులపాటు ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలంతా ఈ కార్యక్రమం విజయవంతానికి ప్రయత్నం చేశారని కొనియాడారు. పట్టణాల్లో గుణాత్మకమార్పు తేవడంలో ఈ కార్యక్రమం తొలిఅడుగుగా భావిస్తున్నామని తెలిపారు. పదిరోజుల కార్యక్రమంతో పట్టణాల్లో స్వచ్ఛమైన మార్పు కనిపిస్తున్నదని, మంచి మార్పునకు బీజం పడిందని చెప్పారు. పురప్రజల కోసం ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన నూతన మున్సిపల్ చట్టంపై ప్రజల్లో అవగాహన పెంచడంలో పట్టణ ప్రగతి విజయం సాధించిందని తెలిపారు.
ప్రతి ఉద్యోగికి ధన్యవాదాలు ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు పట్టణ ప్రగతి కోసం పనిచేసిన ప్రతి ఉద్యోగికి పురపాలకశాఖ తరపున మంత్రి కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు. పట్టణప్రగతితో పట్టణాల్లో దీర్ఘకాలిక సమస్యలను గుర్తించామని, వెంటనే పరిష్కరించగలిగే పారిశుద్ధ్యం వంటి సమస్యలపై ప్రణాళికా బద్ధంగా పనిచేయాలని ఆదేశించారు. గుర్తించిన సమస్యల పరిష్కారం కోసం వార్డు కమిటీలతోపాటు ప్రజలను భాగస్వాములను చేయాలని కోరారు. నూతన పురపాలక చట్టం తప్పనిసరి చేసిన ప్రాథమిక కార్యక్రమాల అమలుపై ప్రత్యేక దృష్టిపెట్టాలని సూచించారు. పట్టణప్రగతిలో చేపట్టిన వార్డు పారిశుద్ధ్య ప్రణాళిక, పట్టణ/ నగర పారిశుద్ధ్య ప్రణాళిక, పట్టణ వాటర్ ఆడిట్, పట్టణ హరిత ప్రణాళిక వంటి కార్యక్రమాలపైన ప్రధానంగా దృష్టి సారించాలని కోరారు.