Bharat Rashtra Samithi

Bharat Rashtra Samithi

KCR
telangana talli img

రోడ్లకు మహర్దశ

-రహదార్ల అభివృద్ధికి రెండు కార్పొరేషన్లు -750 కోట్లతో రాజీవ్ రహదారికి మెరుగులు -రూ.2వేల కోట్లతో 10 వేల కి.మీ. అభివృద్ధి -గోదావరిపై మరో రెండు వంతెనలు -ఆదిలాబాద్ జిల్లా వరకూ రాజీవ్ రహదారి -జిల్లా కేంద్రాలన్నింటికీ రింగురోడ్లు -జిల్లా నుంచి రాజధానికి నాలుగు లైన్లు -మండలం నుంచి జిల్లా కేంద్రాలకు డబుల్‌లైన్లు -రహదారుల సమీక్షా సమావేశంలో సీఎం కేసీఆర్ నిర్ణయాలు

KCR Review with Roads&Buildings Department

రాష్ట్రంలో రహదార్లకు మహర్దశ పట్టనుంది. ఈ దిశగా ప్రభుత్వం దృష్టి సారించింది. రహదారుల అభివృద్ధి కోసం రెండు కార్పొరేషన్లు ఏర్పాటు చేయనున్నట్టు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. ప్రధాన రహదార్ల కోసం తెలంగాణ రోడ్డు డెవలప్‌మెంట్ కార్పొరేషన్, గ్రామీణ రోడ్ల అభివృద్ధికి రూరల్ రోడ్డు డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఏర్పాటుకు సంబంధించి వెంటనే చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

 

రాష్ట్రంలో రోడ్ల పరిస్థితిపై శుక్రవారం సచివాలయంలో జరిగిన సమీక్షలో సీఎం అధికారులకు పలు సూచనలు చేశారు. అన్ని జిల్లా కేంద్రాల నుంచి రాజధానికి నాలుగులైన్ల రోడ్లు, మండల కేంద్రాల నుంచి జిల్లా కేంద్రాలకు డబుల్ లైన్ రోడ్లు వేయాలని ఈ సందర్భంగా నిర్ణయించారు. గోదావరి నదిపై మరో రెండు వంతెనలు నిర్మించాలని, రాజీవ్ రహదారిని ఆదిలాబాద్ జిల్లాలోకి విస్తరించాలని, హైదరాబాద్-వరంగల్ రహదారిని పూర్తి స్థాయిలో నాలుగులైన్ల రహదారిగా మార్చాలని ఆ మార్గంలో బైపాస్ రోడ్ల నిర్మాణాలు త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

అన్ని జిల్లా కేంద్రాలకు రింగురోడ్ల నిర్మాణానికి వెంటనే ప్రతిపాదనలు రూపొందించాలని సూచించారు. ఎంత ఖర్చయినా సరే.. జిల్లాల నుండి ప్రజలు నగరానికి వేగంగా చేరాలని, అదే సమయంలో అడ్డూ అదుపులేకుండా జరుగుతున్న రోడ్లు ప్రమాదాలకు పుల్‌స్టాప్ పడాలని సీఎం మార్గనిర్దేశం చేశారు. ముఖ్య రహదారులేవీ గ్రామాల గుండా వెళ్లడానికి వీల్లేదని ఆయా చోట్ల బైపాస్‌లు, వంతెనలు నిర్మించాలని సూచించారు. నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు, నేషనల్ హైవేస్ చీఫ్ ఇంజనీర్ గణపతిరెడ్డి, ఆర్‌అండ్‌బీ ఇంజనీరింగ్ చీఫ్ రవిందర్‌రావు, క్వాలిటీ కంట్రోల్ ఈఎన్‌సీ బిక్షపతి తదితరులు ఈ సమావేశంలో పాల్గొని రోడ్ల స్థితిగతులను వివరించారు.

ప్రస్తుతం వరంగల్, కరీంనగర్, సంగారెడ్డి, మహబూబ్‌నగర్, నల్గొండ జిల్లా కేంద్రాలనుండి హైదరాబాద్‌కు నాలుగు లైన్ల రోడ్లు ఉన్నాయని, కొద్దిపాటి మరమ్మతులు చేస్తే అవి పూర్తిస్థాయిలో ఉపయోగంలోకి వస్తాయని అధికారులు సీఎం దృష్టికి తెచ్చారు. కాగా నిజామాబాద్, ఖమ్మం రహదారులను ఇంకా నిర్మించాల్సి ఉందని చెప్పారు.

మండలాల నుంచి జిల్లా కేంద్రాలకు డబుల్ లైన్.. రాష్ట్రంలోని 149 మండల కేంద్రాలకు, జిల్లా కేంద్రాలకు మధ్య డబుల్ లైన్ లేదని, వెంటనే వాటిని అనుసంధానిస్తూ డబుల్ రోడ్లు వేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. మహబూబ్‌నగర్, అదిలాబాద్ లాంటి జిల్లాల్లో మండల కేంద్రాలకు కూడా మెరుగైన రోడ్లు లేవని, అన్నిటికన్నా ముందు అక్కడ పనులు ప్రారంభం కావాలని సీఎం సూచించారు. వచ్చే రెండేళ్లలో రెండువేల కోట్ల రూపాయలతో 10వేల కిలోమీటర్ల రహదారులను మరమ్మతులు చేయాలని నిర్దేశించారు.

జనాభాలో సగం భాగం టూవీలర్లు, ఆటోలు, ఫోర్ వీలర్లు, బస్‌ల ద్వారా రోజు ప్రయాణం చేస్తున్నారు.. కాబట్టి సగం రాష్ట్రం రోడ్ల మీదనే ఉన్నట్లుగా భావించాలన్నారు. అందువల్ల రహదారులను అద్దంలా తీర్చిదిద్దాలనేది మన లక్ష్యంగా పెట్టుకోవాలని అన్నారు.

రహదార్ల కోసం రెండు కార్పొరేషన్లు రహదారుల అభివృద్ధికోసం తెలంగాణ రోడ్డు డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌ను, రూరల్ రోడ్డు డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఏర్పాటుకు వెంటనే ఏర్పాట్లు చేయాలని సూచించారు. తెలంగాణలో ఆర్‌అండ్ బీ శాఖను మరింత బలోపేతం చేస్తామని, ఆ శాఖలో ఉన్న ఖాళీలను వెంటనే భర్తీ చేస్తామని చెప్పారు. అత్యవసర సమయాల్లో రోడ్డు పనులు తక్షణమే చేపట్టడానికి వీలుగా సీఈకి రూ.5లక్షలు, ఎస్‌ఈకి 2లక్షలు, ఈఈకి లక్ష వరకు అధికారం ఇస్తామని చెప్పారు. ప్రతి నియోజకవర్గంలో సగటున రూ.110 కోట్లు ఖర్చు చేస్తామని అన్నారు.

జిల్లా కేంద్రాలకు రింగురోడ్లు.. అన్ని జిల్లా కేంద్రాల్లో రింగురోడ్ల నిర్మాణానికి కావాల్సిన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించారు. రహదారుల అభివృద్ధి, నిర్మాణం, మరమ్మత్తుల పనుల్లో విపరీతమైన జాప్యం జరుగుతోందని సీఎం కేసీఆర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. దీన్ని నివారించడానికి టెండర్ విధానంలో కూడా మార్పులు చేయాలని అన్నారు. సాధారణ చిన్న పనులకు సంబంధించిన టెండర్ల గడువును ఏడు రోజులు, పెద్ద పనులకు 15రోజులు పెడతామన్నారు. 16వ రోజు వర్క్ అగ్రిమెంట్ చేసుకోవాలని సూచించారు.

రాజీవ్ రహదారి విస్తరణ, అభివృద్ధి.. సరైన ప్రణాళిక లేకుండా వంకర, టింకరగా అనేక మలుపులతో నిర్మించిన రాజీవ్ రహదారి బాగా మెరుగు పరచాల్సి ఉందని సీఎం అన్నారు. రాజధానిని పారిశ్రామిక ప్రాంతమైన గోదావరిఖనితో కలిపే ఈ రహదారి పై అడ్డంకులు, ఇబ్బందులు పూర్తిగా తొలగించేందుకు అవసరమైన చోట బైపాస్ రోడ్లు, ైఫ్లెఓవర్లు, అండర్ బ్రిడ్జిలు నిర్మించాలని సూచించారు. రహదారిని ఆదిలాబాద్ జిల్లా చందారా వరకూ విస్తరించాలని ఆదేశించారు. రహదారి విస్తరణ, అభివృద్ధి కోసం రూ.750కోట్లు ఖర్చు చేయనున్నట్లు వెల్లడించారు. 206 కిలోమీటర్ల పొడవున్న రాజీవ్ రహదారి నిత్యం ప్రమాదాలకు నిలయంగా మారిందని అన్నారు.

రహదారిపై వాహనాలు వేగంగా వెళ్లే పరిస్థితి లేదని, చాలా చోట్ల గ్రామాల మధ్య నుండే రహదారి వేయడం వల్ల అటు వాహనాలకు, ఇటు గ్రామస్తులకు ప్రాణాంతకంగా ఉందని అన్నారు. ప్రజ్ఞాపూర్, కుక్‌నూర్‌పల్లి, గౌరారం, వంటిమామిడి, తుర్కపల్లి, దుద్దెడ, ములుగు, కొడకండ్ల, రామునిపల్లి, ఇబ్రహీంనగర్ తదితర గ్రామాలను రహదారినుంచి తప్పించి బైపాస్ రోడ్లు నిర్మించాలని సమావేశంలో నిర్ణయించారు. షామీర్‌పేట, సిద్దిపేట, ఎల్కతుర్తి వద్ద ైఫ్లె ఓవర్లు నిర్మించాలని , 68 చోట్ల బస్‌బేలు, బస్ షెల్టర్లు నిర్మించాలని నిర్ణయించారు.

సిద్దిపేట, సుల్తానాబాద్- పెద్దపల్లి మధ్య రెండు చోట్ల రోడ్ సైడ్ ఎమినిటీస్ ఏర్పాటు చేయాలని సీఎం సూచించారు. ఈ రెండు చోట్ల దాదాపు 15 ఎకరాల విస్తీర్ణంలో కెఫెటేరియా, పార్క్ ఏరియా, పెట్రోల్ బంక్, టాయ్‌లెట్లు, కారు పార్కింగ్ వంటి సౌకర్యాలు కల్పించాలని నిర్ణయించారు. ఈ పనులకు సంబంధించి వెంటనే అంచనాలు తయారు చేసి టెండర్లు పిలవాలని ఆదేశించారు.

గోదావరిపై వంతెనలు.. గోదావరి నదిమీద ఎస్‌ఆర్‌ఎస్‌పీ ఎగువన ఒకటి, దిగువన ఇంకోటి వంతెనలు నిర్మించాలని సీఎం నిర్ణయించారు. ముథోల్-ఆర్మూర్ నియోజకవర్గాల మధ్య ఒకటి, కడెం-రాయికల్ మధ్య మరొకటి ఉండాలని సీఎం సూచించారు. దీనితో పాటు రాష్ట్రంలోని అన్ని నదులు, ఉప నదులపై ఎక్కడెక్కడ వంతెనలు అవసరమో సమీక్ష జరిపి ప్రతిపాదనలు రూపొందించాలని ఆదేశించారు.

వరంగల్ వరకు నాలుగులైన్ల రోడ్డు.. హైదరాబాద్- వరంగల్ రహదారి ప్రస్తుతం యాదగిరిగుట్ట వరకు మాత్రమే నాలుగులైన్ల రోడ్డుగా ఉందని, దానిని వరంగల్ వరకు విస్తరించే పనులు వెంటనే చేపట్టాలని పనులు వీలైనంత తొందరగా పూర్తి చేయాలని సీఎం నిర్దేశించారు. వరంగల్, జనగామ, ఆలేరులో బైపాస్ రోడ్ల నిర్మాణానికి అధికారులు రూపొందించిన ప్రతిపాదనలను సీఎం పరిశీలించారు.

వరంగల్ జిల్లా తాడ్వాయి మండలంలో ఇంతవరకూ అటవీశాఖ అనుమతి లేక ఆగిపోయిన జాతీయ రహదారి పనులకు ఇటీవలే అనుమతి వచ్చినందున తక్షణమే చేపట్టాలని చెప్పారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో రహదారులన్నింటినీ పూర్తిస్థాయిలో బాగుచేయాలని నిర్ణయించామని, త్వరలోనే క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశమై ఇతర జిల్లాలనుంచి మరికొన్ని సిఫార్సులు చేస్తుందని తెలిపారు. ఆ వెంటనే అధికారులు రంగంలోకి దిగి అంచనాలు రూపొందించాలని, టెండర్లు వెంటది వెంట పిలిచి వేగంగా పనులు చేయాలని సూచించారు.

నిధులకు కొరత లేకుండా చూస్తామని త్వరలో ప్రవేశపెట్టే బడ్జెట్‌లో కొంత , వచ్చే ఏడాది మార్చిలో ప్రవేశపెట్టే బడ్జెట్‌లో మరికొంత నిధులు కేటాయిస్తామని అన్నారు. రాష్ట్రంలోని మూడు స్టేట్ హైవేలు నేషనల్ హైవేలుగా అప్‌గ్రేడ్ అయినందున ఆ పనులు కూడా త్వరగా పూర్తయి ప్రజలకు అందుబాటులోకి రావాలని సీఎం ఆకాంక్షించారు. జగిత్యాల-కరీంనగర్-వరంగల్, కురవి-ఖమ్మం-కోదాడ, నిజాంపేట్-నారాయణ్‌ఖేడ్-బీదర్ రహదారులు ఇటీవలే జాతీయ రహదారులుగా అప్‌గ్రేడ్ అయిన విషయం తెలిసిందే.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the BRS Party.