పర్యావరణాన్ని పరిరక్షిస్తే సంస్థలకు ప్రొత్సాహకాలు -ఐదు సూత్రాలు పాటిస్తే.. ఐదు లక్షల నగదు: ఐటీ మంత్రి కేటీఆర్
హైదరాబాద్‌ను గ్రీన్‌సిటీగా మార్చుకుందామని ఐటీశాఖ మంత్రి కే తారకరామారావు పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా తెలంగాణవ్యాప్తంగా రెండువందల కోట్ల మొక్కలను నాటేందుకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. నగరంలోని ఐటీ సంస్థల్లో పర్యావరణాన్ని పెంపొందించడానికి రెట్రోఫిట్టింగ్ కార్యక్రమం చేపట్టామని, పర్యావరణ అనుకూల చర్యలు తీసుకోవడం, ఇండస్ట్రియల్ పార్కుల్లో ఈ-వేస్ట్ మేనేజ్‌మెంట్ చేపట్టడం, పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించేలా పనిప్రదేశాలకు సైకిల్‌పై వెళ్లడం, పచ్చదనాన్ని పెంచడం, నీటినిల్వ వ్యవస్థలను ఏర్పాటుచేయడం.. తదితర ఐదుసూత్రాల అమలు ఈ కార్యక్రమ లక్ష్యమని కేటీఆర్ వివరించారు.
ఈ ఐదు సూత్రాలను అమలుచేసే సంస్థలకు ప్రభుత్వం నుంచి రూ. ఐదు లక్షల ప్రొత్సహకాన్ని అందిస్తామని తెలిపారు. బుధవారం మదాపూర్ హైటెక్‌సిటీలోని టెక్ మహీంద్ర ఆడిటోరియంలో రాష్ట్ర ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (టీఎస్‌ఐఐసీ) ఆధ్వర్యంలో చేపట్టిన రెట్రోఫిట్టింగ్ ఐదుసూత్రాల కార్యక్రమాన్ని మంత్రి కేటీఆర్ అధికారికంగా ప్రారంభించి.. బ్రౌచర్‌ను విడుదల చేశారు. అనంతరం టెక్‌మహీంద్ర ఆడిటోరియం ఆవరణలో మంత్రి కేటీఆర్ మొక్కలు నాటారు. అనంతరం ఎమ్మెల్యే అరికేపూడి గాంధీ మాట్లాడుతూ రాష్ట్రంలో ఐటీ అభివృద్ధికి మంత్రి కేటీఆర్ ఎంతగానో కృషి చేస్తున్నారని తెలిపారు. రెట్రోఫిట్టింగ్ ఆలోచన గత ఏడాది ప్రపంచ పర్యావరణ దినోత్సవం సమయంలో వచ్చిందని టీఎస్‌ఐఐసీ ఎండీ జయేష్‌రంజన్ తెలిపారు.
సైకిలెక్కను.. కారెక్కుతాను! రెట్రోఫిటింగ్ కార్యక్రమం సందర్భంగా సైకిల్ టు వర్క్ ప్రమోషన్ కోసం మంత్రి కేటీఆర్ టెక్ మహింద్ర ఆవరణలో సైకిల్ స్టాండ్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా సైకిల్ తొక్కాలని మంత్రిని కంపెనీ ప్రతినిధులు కోరగా.. అక్కడున్న శేరిలింగంపల్లి ఎమ్మెల్యే గాంధీని ఉద్దేశించి నేను సైకిల్ ఎక్కేది లేదు. ఎక్కితే కారే ఎక్కుతాను అంటూ చమత్కరించారు. దీంతో అక్కడ నవ్వులు విరబూశాయి.