Bharat Rashtra Samithi

Bharat Rashtra Samithi

KCR
telangana talli img

రక్షణ భూములివ్వండి

-కంటోన్మెంట్‌లో పేదలకు ఇండ్లు కట్టిస్తాం
-కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి చొరవ చూపాలి
-రాజకీయాల్లో హుందాగా వ్యవహరిద్దాం
-పోటీ ఉండాలి.. పంచాయితీలు వద్దు
-అభివృద్ధికి అంతా కలిసి పనిచేయాలి
-డబుల్‌ బెడ్రూం ఇండ్లు అమ్ముకోవద్దు
-హైదరాబాద్‌లో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన మంత్రి కేటీఆర్‌

హైదరాబాద్‌లో పేదలకు డబుల్‌ బెడ్రూం ఇండ్లు కట్టించేందుకు కంటోన్మెంట్‌లోని రక్షణశాఖ భూములను ఇవ్వాలని రాష్ట్ర ఐటీ, మున్సిపల్‌శాఖ మంత్రి కే తారకరామారావు కోరారు. ఈ విషయంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జీ కిషన్‌రెడ్డి చొరవ చూపాలని విజ్ఞప్తిచేశారు. మహానగరాలలో పేదలకు ఇండ్లు కట్టిస్తున్న ప్రభుత్వం ఏదీ లేదని, తమ ప్రభుత్వం హైదరాబాద్‌లో పేదలకు రూ.9,714 కోట్లతో లక్ష డబుల్‌ బెడ్రూం ఇండ్లు నిర్మించి ఇస్తున్నదని చెప్పారు. రాష్ట్రమే కాకుండా దేశమే గర్వించదగిన స్థాయిలో పేదల కోసం తమ ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు కేంద్ర సహకారం కూడా ఉండాలని అన్నారు. కంటోన్మెంట్‌లోని డిఫెన్స్‌ భూముల్లో ఎంతోమంది పేదలు గుడిసెలు వేసుకున్నారని వారికి పట్టాలు ఇప్పించేందుకు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి కృషిచేయాలని కోరారు.

అలాగే రసూల్‌పుర ఫ్లైఓవర్‌ కోసం చొరవ తీసుకోవాలని కోరారు. అభివృద్ధి కార్యక్రమాల విషయంలో కేంద్ర, రాష్ర ప్రభుత్వాలు సమన్వయంతో పనిచేయాలని చెప్పారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో రూ.48.58 కోట్లతో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులకు మంత్రి కేటీఆర్‌ శనివారం శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. బాగ్‌లింగంపల్లి లంబాడితండాలో రూ.10.90కోట్ల వ్యయంతో నిర్మించిన 126 డబుల్‌ బెడ్‌ రూం ఇండ్లను, రూ.3.50కోట్ల వ్యయంతో ఆడిక్‌మెట్‌లో నిర్మించిన మల్టీపర్పస్‌ స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌ను మంత్రి ప్రారంభించారు. లంబాడితండాలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జీ కిషన్‌రెడ్డితో కలిసి డబుల్‌ బెడ్రూం లబ్ధిదారులకు ఇండ్ల పట్టాలు అందజేశారు. దోమల్‌గూడలో రూ.9.90 కోట్ల వ్యయంతో నిర్మించనున్న జోనల్‌, డిప్యూటీ కమిషనర్‌ కార్యాలయాలు, నారాయణగూడ క్రాస్‌రోడ్స్‌లో రూ.4 కోట్ల వ్యయంతో నిర్మించనున్న మోడల్‌ మార్కెట్‌ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఎల్బీనగర్‌ నియోజకవర్గంలో రూ. 10.78 కోట్లతో నిర్మించిన పైప్‌లైన్‌ నెట్‌వర్క్‌ను, రూ.9.42 కోట్లతో 5 ఎంఎల్‌ సామర్థ్యం గల రెండు తాగునీటి రిజర్వాయర్లను ప్రారంభించారు.

లంబాడితండ సభలో మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ.. ‘రాజకీయాల్లో పోటీతత్వం ఉండాలి.. కానీ అనవసరమైన పంచాయితీలు పెట్టుకోవద్దు. ప్రజలు కూడాదీనిని హర్షించరు. ఎన్నికలు ఉన్నప్పుడు కొట్లాడుదాం.. ప్రజల ఆశీర్వాదం కోసం పోటీ పడుదాం. ఎన్నికలైన తరువాత అభివృద్ధి కోసం అందరం కలిసి కట్టుగా పనిచేయాలి. అభివృద్ధి, సంక్షేమం విషయంలో కేంద్రం, రాష్ట్రం కలిసి నడిస్తేనే ప్రజలు వేసిన ఓటుకు విలువ ఉంటుంది. ప్రభుత్వం, ప్రతిపక్షం పరస్పరం సహకరించుకోవాలి. రాజకీయాల్లో హుందాగా ముందుకుపోవాలి’ అని మున్సిపల్‌, ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌ పేర్కొన్నారు.

నగరాభివృద్ధికి అన్ని విధాలా సహకారం: కిషన్‌రెడ్డి
పండుగ వాతావరణంలో డబుల్‌ బెడ్రూం ఇండ్లు ప్రారంభించుకోవడం శుభపరిణామమని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. సికింద్రాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గం పరిధిలో పేద, మధ్య తరగతి ప్రజలు ఎక్కువగా ఉన్నారని, అందరికీ ఇండ్లు ఇచ్చే కార్యక్రమం యుద్ధ ప్రాతిపదికన కొనసాగించాలని ప్రభుత్వాన్ని కోరారు. హైదరాబాద్‌ నగరాభివృద్ధికి కేంద్రం అన్ని విధాలా సహకరిస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమాలలో మంత్రులు మహమూద్‌ అలీ, తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, మల్లారెడ్డి, మేయర్‌ బొంతు రామ్మోహన్‌, ఎమ్మెల్యేలు ముఠా గోపాల్‌, కాలేరు వెంకటేశ్‌, సుధీర్‌రెడ్డి, డిప్యూటీ మేయర్‌ బాబా ఫసియుద్దీన్‌ పాల్గొన్నారు.

ప్రతిపక్ష పార్టీల అత్యుత్సాహం
మంత్రి కేటీఆర్‌ పర్యటనను రసాభాసగా మార్చేందుకు బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీల నేతలు విఫలయత్నం చేశారు. సిట్టింగ్‌ కార్పొరేటర్ల పదవీ కాలం ఫిబ్రవరి 10 వరకు ఉన్నప్పటికీ.. ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన కార్యక్రమాల శిలాఫలకాలపై తమ పేర్లు ఎందుకు పెట్టలేదని కొత్తగా ఎన్నికైన బీజేపీ కార్పొరేటర్లు నిరసన చేపట్టారు. లంబాడితండా, ఇండోర్‌ స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌ వద్ద వారు ఆందోళన చేపట్టారు. ఇక మోహన్‌నగర్‌లో జంట రిజర్వాయర్ల ప్రారంభం సందర్భంగా ఎంపీ రేవంత్‌రెడ్డి తన అనుచరులతో కలిసి హంగామా సృష్టించారు. టీఆర్‌ఎస్‌ జెండాలు, బ్యానర్లు చింపుతూ ప్రధాన రోడ్డుపై ర్యాలీ చేపట్టి మరోసారి ప్రభుత్వంపై అక్కసు వెళ్లగక్కారు. ఆందోళన చేస్తున్న నేతలను పోలీసులు ఆదుపులోకి తీసుకొని పరిస్థితిని చక్కదిద్ది ప్రశాంత వాతావరణం నెలకొల్పారు.

సకల సౌకర్యాలతో డబుల్‌ బెడ్రూంలు
దేశంలోని 28 రాష్ర్టాల్లో మరెక్కడా లేనివిధంగా రాష్ట్రంలో రూ. 18వేల కోట్ల వ్యయంతో 2.7లక్షల డబుల్‌ బెడ్రూం ఇండ్ల నిర్మాణాన్ని చేపట్టామని మంత్రి కేటీఆర్‌ చెప్పారు. గ్రేటర్‌ హైదరాబాద్‌లో రూ. 9,714 కోట్ల వ్యయంతో చేపట్టిన లక్ష డబుల్‌ బెడ్రూం ఇండ్లు దాదాపు పూర్తి కావొచ్చాయని వివరించారు. ఒక్క కొల్లూరులోనే 15,660 ఇండ్లు సిద్ధంగా ఉన్నాయని చెప్పారు. పేదలు అత్మగౌరవంతో బతికేలా సకల సౌకర్యాలతో ఇండ్లు నిర్మించి ఇస్తున్నామని తెలిపారు. సుమారు రూ.9 లక్షలతో నిర్మిస్తున్న ఒక్కో ఇంటి విలువ రూ.40 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు విలువ చేస్తుందని, వాటిని లబ్ధిదారులకు పూర్తిగా ఉచితంగా అందిస్తున్నామని తెలిపారు. ఇండ్లు పొందినవారు ఇంటితోపాటు పరిసరాలను, బస్తీలను కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలని చెప్పారు. భవిష్యత్తులో పిల్లలు ఎటువంటి వ్యాధుల బారినపడకుండా ఉండేందుకు పరిసరాలు బాగుండాలన్న సోయి ప్రతి ఒక్కరిలో ఉండాలని అన్నారు. ఈ ఇండ్లను అమ్ముకోవడం లేదా ఇతరులకు కిరాయికి ఇవ్వడం గానీ చేయవద్దని హెచ్చరించారు. ఈ ఇండ్లు వ్యాపారం కోసం కాదని, అలా జరిగితే పట్టా రద్దు చేసే అధికారం ప్రభుత్వానికి ఉంటుందని స్పష్టం చేశారు.

రాజకీయాల్లో పోటీతత్వం ఉండాలి.. కానీ అనవసరమైన పంచాయితీలు పెట్టుకోవద్దు. ప్రజలు కూడా దీనిని హర్షించరు. ఎన్నికలు ఉన్నప్పుడు కొట్లాడుదాం.. ప్రజల ఆశీర్వాదం కోసం పోటీ పడుదాం. ఎన్నికలైన తరువాత అభివృద్ధి కోసం కేంద్రం, రాష్ట్రం కలిసికట్టుగా పనిచేయాలి. ప్రభుత్వం, ప్రతిపక్షం పరస్పరం సహకరించుకోవాలి. రాజకీయాల్లో హుందాగా ముందుకుపోవాలి.
– మంత్రి కేటీఆర్‌

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the BRS Party.