రైతుబంధుపై అపోహలు వద్దు.. నిరంతరం కొనసాగుతుంది అని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి స్పష్టం చేశారు. మహబూబ్‌నగర్ పట్టణ కేంద్రంలో వ్యవసాయ శాఖ, రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో రైతులకు రాయితీపై పచ్చి రొట్ట ఎరువుల విత్తనాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ.. త్వరలోనే సమగ్ర వ్యవసాయ విధానాన్ని సీఎం కేసీఆర్ ఆవిష్కరిస్తారని స్పష్టం చేశారు. ఏ పొలంలో ఏ పంట వేస్తే రైతులకు లాభం అనేదానిపై కసరత్తు జరుగుతుందని తెలిపారు. రైతుబంధు నిరంతరం కొనసాగుతుంది.. అపోహలు వద్దు అని స్పష్టం చేశారు. వచ్చే ఏడాది రాష్ట్రంలోని రైతులందరికీ పచ్చిరొట్ట ఎరువుల విత్తనాల పంపిణీకి కృషి చేస్తామన్నారు. పాలమూరు – రంగారెడ్డి పథకం త్వరగా పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టామని తెలిపారు. ప్రాజెక్టు పనుల వేగవంతానికి త్వరలో ఇంజినీరింగ్, వ్యవసాయ శాఖ అధికారులతో సమావేశం నిర్వహిస్తామని మంత్రి నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు.
