-సవాల్‌గా స్వీకరించి విజయవంతం చేశాం -ముఖ్యమంత్రి కేసీఆర్ మార్గదర్శనం స్ఫూర్తినిచ్చింది -ఇది మంత్రులు, అధికారులు, ఉద్యోగుల సమిష్టి విజయం -నమస్తే తెలంగాణతో దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి సీఎం కేసీఆర్ ఇచ్చిన స్ఫూర్తి, స్పష్టమైన ఆదేశాల మేరకు గోదావరి పుష్కరాల నిర్వహణలో మంత్రులు, అధికారులు, ఉద్యోగులు సమిష్టిగా పనిచేశారు. పుష్కరాల నిర్వహణ రాష్ట్ర ప్రభుత్వ ఇమేజ్‌ను పెంచింది. ఈ విజయంలో అందరూ భాగస్వాములే.

– నమస్తే తెలంగాణతో దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి గోదావరి పుష్కరాలు రాష్ట్ర ప్రభుత్వ ఇమేజ్‌ను పెంచాయని దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. పుష్కరాల నిర్వహణను సవాల్‌గా స్వీకరించి.. అత్యంత వైభవంగా నిర్వహించగలిగామని, దీంతో ప్రజలకు ప్రభుత్వంపై భరోసా పెరిగిందని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు చేస్తున్న మార్గదర్శనం మంత్రులందరికీ స్ఫూర్తినిచ్చిందని, మంత్రులకు, అధికారులకు సీఎం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినందునే అందరం సమిష్టిగా పనిచేసి విజయవంతం చేశామని తెలిపారు. మంత్రులు, అధికారులు, ఉద్యోగులు అంతా రేయింబవళ్లు పనిచేశామని, ఈ విజయంలో అందరూ భాగస్వాములేనని మంత్రి స్పష్టం చేశారు.
గోదావరి పుష్కరాలను ఘనంగా నిర్వహించిన నేపథ్యంలో ముఖ్యమంత్రిని కలిసిన మంత్రి.. అనంతరం నమస్తే తెలంగాణకు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. నమస్తే తెలంగాణ: గోదావరి పుష్కరాలు ఏవిధంగా జరిగాయి. మీ అనుభవాలేమిటి? మంత్రి: పుష్కరాలను ముఖ్యమంత్రి కేసీఆర్ సవాల్‌గా తీసుకున్నారు. కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో తొలిసారి పుష్కరాలు రావడంతో రాష్ట్రం మొత్తం అప్రమత్తమైంది. ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, వరంగల్, ఖమ్మం జిల్లాలో ప్రతి ఇంట్లోనూ పండుగ వాతావరణం ఏర్పడింది. గోదావరి తీరమంతటా జనజాతర మాదిరిగా పుష్కరాలు జరిగాయి. శనివారం రాత్రి వరకు 6కోట్ల మంది భక్తులు పవిత్ర గోదావరి పుష్కరస్నానాలను ఆచరించారు.
రాష్ట్ర మంత్రులు, ప్రభుత్వ యంత్రాంగం ఏ విధంగా సహకరించింది? ముందుగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ముఖ్యమంత్రి తరపున, రాష్ట్రప్రజల పక్షాన కృతజ్ఞతలు చెప్పడం నా బాధ్యత. దేవాదాయశాఖ మంత్రిగా ఇది నాకర్తవ్యం. ప్రభుత్వ ఉద్యోగులందరికీ కృతజ్ఞతలు.. అభినందనలు. ఐదు జిల్లాల్లో ఉద్యోగులు అలసిపోయారని కూడా ప్రభుత్వం భావించింది. అందుకే పుష్కరాల్లో భాగస్వాములైన ఉద్యోగులందరికీ సోమ మంగళ వారాల్లో సెలవులు ఇచ్చాం. ఇక సహచర మంత్రులు ఇచ్చిన సహకారం మరువలేనిది. మంత్రులందరూ పుష్కరఘాట్‌ల వద్దనే మకాం వేశారు. క్యూలైన్లను నడిపించారు. ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. మంత్రులకు ప్రత్యేక కృతజ్ఞతలు.
ముఖ్యమంత్రిని కలిశారు కదా.. విశేషాలు ఏమిటి? ముఖ్యమంత్రి దిశానిర్దేశంతోనే 12 రోజులపాటు జగద్వైభవంగా పుష్కరాలను చేయగలిగాం. సీఎం కేసీఆర్‌ను కలిసి కృతజ్ఞతలు చెప్పాను. ఇదే విశేషం. వచ్చే ఫిబ్రవరిలో జరిగే సమ్మక్క-సారక్క జాతరకు మొత్తం యంత్రాంగాన్ని సిద్ధం చేయాలని సీఎం ఆదేశించారు.
ఆర్టీసీ సేవల గురించి? పన్నెండు రోజులలో ఆర్టీసీ 77వేల ట్రిప్పులలో భక్తులను గోదావరి తీరానికి చేర్చి, తిరిగి సురక్షితంగా వారి స్వస్థలాలకు చేర్చింది. దక్షిణమధ్య రైల్వే ద్వారా కూడా భక్తులు ఎక్కువ సంఖ్యలో గోదావరి పుష్కరాలకు వచ్చారు. స్వామీజీల గురించి ప్రత్యేకంగా చెప్పాలి. త్రిదండి శ్రీమన్నారాయణ చిన్నజీయర్‌స్వామీజీ, భద్రాచలం, మంచిర్యాలలో హోమాలు నిర్వహించి భక్తులకు మంగళాశాసనాలు చేశారు. కంచిపీఠం శ్రీ జయేంద్ర సరస్వతీ స్వామీజీ, విశాఖ శారదాపీఠం శ్రీ స్వరూపానందేంద్ర స్వామీజీ తదితర స్వామీజీలు ఈ పుష్కరాలకు వన్నె తెచ్చారు.
పుష్కరాలు ఒక మైలురాయి -ప్రభుత్వ పనితీరుకు నిదర్శనం: హోంమంత్రి నాయిని తెలంగాణలో జరిగిన గోదావరి పుష్కరాల సంరంభం రాష్ట్ర చరిత్రలో మైలురాయి అని హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి అభివర్ణించారు.
గతంలో ఎన్నడూ ఇంత గొప్పగా పుష్కరాలు జరిగింది లేదని, పొరుగు రాష్ర్టాల నుంచి సైతం భక్తులు వచ్చి పుష్కర స్నానాలు ఆచరించడం ప్రభుత్వ ఏర్పాట్లకు నిదర్శనమని అన్నారు. ఢిల్లీలో ఆదివారం ఆయన నమస్తే తెలంగాణతో మాట్లాడుతూ సమైక్య రాష్ట్రంలో పుష్కరాలకు తెలంగాణకు పెద్దగా ప్రాధాన్యం లభించలేదని, తెలంగాణ ఏర్పడిన తర్వాత తొలిసారి వచ్చిన పుష్కరాలను ఘనంగా నిర్వహించిందని అన్నారు. తొలిరోజు నుంచి ముగింపు వరకు భక్తులు నిర్భయంగా పుష్కర స్నానాలు ఆచరించడం ప్రభుత్వ దూరదృష్టికి, చేసిన ఏర్పాట్లకు నిదర్శనమని అన్నారు. ముఖ్యమంత్రి దూరదృష్టి, అధికారుల అంకితభావం, కిందిస్థాయి సిబ్బంది సేవాగుణం కలిపి ఈ పుష్కరాలు దిగ్విజయం కావడానికి దోహదపడిందని అన్నారు.
ఖమ్మం జిల్లాకు రూ.3 కోట్లు -పుష్కరాల బకాయి చెల్లింపునకు నిధులు విడుదల హైదరాబాద్, నమస్తే తెలంగాణ: ఖమ్మం జిల్లాలో పుష్కరాల నిర్వహణ బకాయి చెల్లింపుల కోసం ప్రభుత్వం రూ.3 కోట్లు విడుదల చేస్తూ జీవో జారీ చేసింది. ప్రణాళికేతర నిధుల నుంచి ఈ మొత్తం విడుదల చేసినట్లు రాష్ట్ర ఆర్థ్ధికశాఖ కార్యదర్శి ఎన్ శివశంకర్ ఆదివారం ఇచ్చిన ఉత్తర్వులో పేర్కొన్నారు. భద్రాచలం తదితర ప్రాంతాల్లో పుష్కరాల కోసం ఎక్కువగా ఖర్చు చేయాల్సి వచ్చిందని తెలిపారు.