ప్రభుత్వ భూములు అన్యాక్రాంతంకాకుండా అడ్డుకట్టవేసేందుకే క్రమబద్ధీకరణ ప్రక్రియను చేపడుతున్నామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు స్పష్టంచేశారు. ప్రతి భూమికి టైటిల్ కలిగి ఉండాలన్నదే లక్ష్యమని అన్నారు. నిరుపేదలు వివిధ జిల్లాల నుంచి హైదరాబాద్‌కు వచ్చి తల దాచుకోవడానికి ప్రభుత్వ భూముల్లో గుడిసెలు, షెడ్లు, ఇండ్లు నిర్మించుకున్నారని, వారికి పట్టాలు లేకపోవడంతో అవస్థలు పడుతున్నారని చెప్పారు. అలాంటి పేదలందరికీ ఉచితంగానే క్రమబద్ధీకరించాలని నిర్ణయించామన్నారు.

-భూముల అన్యాక్రాంతానికి అడ్డుకట్ట.. అందుకే క్రమబద్ధీకరణ ప్రక్రియ -ఖాళీ స్థలాల స్వాధీనం.. వేలం: సమీక్షా సమావేశంలో సీఎం కేసీఆర్ -125 గజాలలోపు ఉచితంగా క్రమబద్ధీకరణ -250 గజాలవరకు రిజిస్ట్రేషన్ ధరలో సగం చెల్లించాలి -500 గజాలవరకు రిజిస్ట్రేషన్ ధరలో 75 శాతం -500 గజాలకు పైగా 100 శాతం రిజిస్ట్రేషన్ ధర -2014 జూన్ రెండో తేదీ కటాఫ్‌గా నిర్ణయం -దరఖాస్తులకు 20 రోజులు గడువు -90 రోజుల్లో ప్రక్రియను పూర్తిచేయాలి -రెగ్యులరైజేషన్ ప్రక్రియ మార్గదర్శకాలు సిద్ధం క్రమబద్ధీకరణకు రూపొందించాల్సిన మార్గదర్శకాలపై మంగళవారం సచివాలయంలో అధికారులతో సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రభుత్వ భూములను ఆక్రమించుకొని జరిపిన నిర్మాణాలను క్రమబద్ధీకరించాలన్నారు. అసెంబ్లీలో చేసిన తీర్మానం, అఖిలపక్ష సమావేశంలో తీసుకున్న నిర్ణయాలకు అనుగుణంగా నిరుపేదలపట్ల అత్యంత సానుభూతితో వ్యవహరిస్తామని చెప్పారు. అదేవిధంగా క్రమబద్ధీకరణ నిబంధనలను రూపొందించాలని అధికారులకు చెప్పారు. ప్రభుత్వ ఉత్తర్వుల్లో పొందుపర్చాల్సిన మార్గదర్శకాలను ఆయన ఈ సందర్భంగా వివరించారు.
వేలం ఎందుకు? భూముల రెగ్యులరైజేషన్‌తో పాటు వివిధ జిల్లాల్లో ఉన్న ప్రభుత్వ భూముల వేలానికి సంబంధించి సీఎం కేసీఆర్ అధికారులకు సూచనలు చేశారు. చాలా జిల్లాల్లో చిన్నచిన్న ప్లాట్ల రూపంలో అనేకం ఉన్నాయి. ప్రభుత్వం వాటిని ఏ అవసరాలకూ వినియోగించుకోలేకపోతున్నది. ఫలితంగా అలాంటి ప్లాట్లు కబ్జాకు గురవుతున్నాయి. దీనిని నివారించేందుకు అలాంటి ప్లాట్లను వేలం వేయాలి అని అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్ ప్రతిపాదించిన అలాంటి వాటిని వేలం వేయడానికి అనుమతి ఇచ్చారు. హైదరాబాద్‌లో నాలాల నిర్వహణ సరిగ్గా లేదని, ఆక్రమణలకు గురయ్యాయని సీఎం ఆవేదన వ్యక్తంచేశారు. వర్షపు నీరు, మురుగునీరు రోడ్లపై ప్రవహించడానికి ఇదే కారణమని అభిప్రాయపడ్డారు.
నాలాలపై ఆక్రమణలు తొలగించేందుకు, వాటిని సక్రమంగా నిర్వహించేందుకు అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. సమీక్షా సమావేశంలో డిప్యూటీ సీఎం మహ్మద్ మహమూద్‌అలీ, పార్లమెంటరీ కార్యదర్శి వీ శ్రీనివాస్‌గౌడ్, రాజ్యసభ సభ్యుడు కే కేశవరావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ, సీఎంవో ముఖ్య కార్యదర్శి ఎస్ నర్సింగ్‌రావు, రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బీఆర్ మీనా, అడ్వకేట్ జనరల్ రామకృష్ణారెడ్డి, న్యాయశాఖ కార్యదర్శి సంతోష్‌రెడ్డి, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఎన్ శ్రీధర్, సీసీఎల్‌ఏ స్పెషల్ కమిషనర్ జీడీ అరుణ పాల్గొన్నారు.
సీఎం కేసీఆర్ సూచించిన మార్గదర్శకాలు -125 గజాలలోపు స్థలాలను పేదలకు ఉచితంగానే క్రమబద్ధీకరించాలి. -పట్టణ ప్రాంతాల్లో ఆదాయ పరిమితిని రూ.2 లక్షలకు పెంచినందున, ఆ లోపు ఆదాయం ఉన్న వారందరినీ పేదలుగానే గుర్తించాలి. -250 గజాలవరకు స్థలంలో నివాసమేర్పాటు చేసుకుంటే వారికి రిజిస్ట్రేషన్ ధరలో 50 శాతం తీసుకొని రెగ్యులరైజ్ చేయాలి. -500 గజాలవరకు స్థలంలో నివాసం ఏర్పాటు చేసుకున్న వారికి రిజిస్ట్రేషన్ ధరలో 75 శాతం తీసుకోవాలి. -500 గజాలకు పైగా ఉన్న స్థలాల్లో నివాసం ఏర్పాటు చేసుకుంటే 100 శాతం రిజిస్ట్రేషన్ ధర చెల్లించి రెగ్యులరైజ్ చేసుకోవచ్చు.
-వ్యాపార అవసరాలకు వినియోగించుకుంటే స్థల విస్తీర్ణంతో సంబంధం లేకుండా మొత్తం రిజిస్ట్రేషన్ ధర చెల్లించాల్సిందే. దవాఖానలు, విద్యాసంస్థలువంటి వాటిని కూడా వ్యాపార సంస్థలుగానే గుర్తించాలి. -2014 జూన్ రెండో తేదీలోపు నివాసం ఉన్న వారికి మాత్రమే క్రమబద్ధీకరణ అవకాశం కల్పించాలి. ఆ లోపు సంబంధిత ప్రాంతంలో తాము నివాసం ఉన్నట్లు ఆధారాలు చూపాలి. రేషన్‌కార్డులు, ఆధార్‌కార్డులు, ఓటర్ గుర్తింపు కార్డు వంటివి ఏవైనా దరఖాస్తుతో పాటు జత చేయాలి. -క్రమబద్ధీకరణకు దరఖాస్తు చేయడానికి 20 రోజులు గడువు ఇవ్వాలి. దరఖాస్తుదారుడు తమ దరఖాస్తుతోపాటు నిర్ణయించిన ధరలో 25 శాతం డబ్బులను డీడీ రూపంలో చెల్లించాలి. -జాయింట్ కలెక్టర్, ఆర్డీవో పర్యవేక్షణలో దరఖాస్తుల పరిశీలన, ఫిర్యాదులపై విచారణ చేపట్టాలి. 90 రోజుల్లో రెగ్యులరైజేషన్ ప్రక్రియను పూర్తి చేయాలి.
-ఎలాంటినిర్మాణాలు లేకుండా ఖాళీగా ఉన్న భూములను ప్రభుత్వమే స్వాధీనం చేసుకొని వేలం వేయాలి. -క్రమబద్ధీకరించిన తర్వాత మహిళల పేరిటే పట్టాలు ఇవ్వాలి. అధికారులు విచారణ జరిపే సందర్భంగా ఏ ప్రాంతంలో, ఎంత స్థలంలో, ఏ ఇంట్లో నివాసం ఉంటున్నారో గుర్తించి ఫోటోలు కూడా తీసుకోవాలి. -రెగ్యులరైజేషన్ ప్రక్రియలో సహకరించడానికి రిటైర్డ్ రెవెన్యూ అధికారుల సేవలను వినియోగించుకోవాలి.