-దేశంలోనే అతి పెద్ద ఇంక్యుబేటర్ ఏర్పాటు -వై ఫై నగరంగా రూపుదాల్చనున్న రాజధాని -తెలంగాణలోనూ పన్ను రాయితీలు -అది కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీయే -52 వారాలు.. 52 కార్యక్రమాలు -ఆకర్షణీయమైన నూతన పాలసీలు అమలు -ప్రభుత్వం నుంచి ప్రజల వరకు ఐటీ సేవలు -ఈ-గవర్నెన్స్ విధానాన్ని అమలు చేస్తాం -ఐటీ కంపెనీల ప్రతినిధులతో మంత్రి కేటీ రామారావు -భారీ సంఖ్యలో హాజరైన ఐటీ ప్రతినిధులు
హైదరాబాద్‌లో ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలను కల్పించేందుకు మాస్టర్ ప్లాన్‌ను రూపొందిస్తున్నామని రాష్ట్ర ఐటీ మంత్రి కేటీ రామారావు చెప్పారు. ఐటీఐఆర్ ప్రాజెక్టు అమలైతే నగర జనాభా మరో రెండు కోట్లు పెరుగుతుందని, అప్పటి పరిస్థితులకు అనుగుణంగా అన్నింటినీ ఏర్పాటు చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకునేటట్లుగా హెచ్‌ఎండీఏ, జీహెచ్‌ఎంసీ, పోలీసు, జలమండలి, రెవెన్యూ, ఐటీ, పరిశ్రమల శాఖలన్నీ కలిసి కార్యాచరణను రూపొందించాలని సీఎం కే చంద్రశేఖర్‌రావు ఇప్పటికే ఆదేశించారని ఆయన తెలిపారు.
శుక్రవారం రాత్రి హైదరాబాద్‌లోని ఓ హోటల్‌లో ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ, హైదరాబాద్ సాఫ్ట్‌వేర్ ఎంటర్‌ప్రైజెస్ అసోసియేషన్ సంయుక్తంగా నిర్వహించిన ఐటీ ఎంటర్‌ప్రెన్యూర్స్‌తో ముఖాముఖి కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. హైదరాబాద్ ప్రపంచంలోనే ఆకర్షణీయమైన, అందమైన, సమశీతోష్ణస్థితి కలిగిన నగరమని, బెంగళూరు, చెన్నై నగరాల కంటే అధికంగా స్థలాలు ఉన్నాయని అన్నారు. కానీ హైదరాబాద్‌లో 8 బిలియన్ డాలర్ల మేరకు ఐటీ ఎగుమతులు జరుగుతుంటే, బెంగళూరులో మాత్రం అత్యధికంగా 21 బిలియన్ డాలర్ల వరకు ఉండడం ఆశ్చర్యానికి గురి చేసిందని చెప్పారు. దీనిపై అధ్యయనం చేస్తే హైదరాబాద్‌లో రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ప్రోగ్రాంకు అవకాశం లేకపోవడమే కారణమని తేలిందని, అందుకే దేశంలోనే అతి పెద్ద ఇంక్యుబేటింగ్ సిస్టంను అమలు చేయాలని నిర్ణయించామని మంత్రి తెలిపారు. దీనిని ఆరు నెలల్లోనే అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు.
టాస్క్ పేరుతో సజనశీలురను తయారు చేసే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నట్లు ప్రకటించారు. ప్రతి ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ మూడో, ఎంబీఏ రెండో సంవత్సరం చదువుతున్న వారికి స్కిల్స్ డెవలప్‌మెంట్ ప్రోగ్రాంపై ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ఈ ప్రక్రియను అమలు చేయాలని యోచిస్తున్నట్లు చెప్పారు. ఐఐఐటీ, ఐఎస్‌బీ వంటి సంస్థలతో చర్చలు జరుపుతున్నట్లు చెప్పారు. గేమింగ్, యానిమేషన్, సాఫ్ట్‌వేర్, ఎలక్ట్రానిక్ రంగాల్లోనూ రాణించడానికి అనేక కార్యక్రమాలను అమలు చేయనున్నట్లు ప్రకటించారు. ఇప్పటికే గేమింగ్ పార్కు నిర్మాణానికి శంకుస్థాపన జరిగిందన్నారు. ఇక్కడ 6 లక్షల చదరపు అడుగుల నిర్మాణాన్ని చేపట్టి ఇంక్యుబేటర్ సెంటర్, స్టూడియోలు, హోటళ్లు నిర్మించనున్నట్లు తెలిపారు.
నిర్ణయాత్మక శక్తి లేకపోవడం వల్లే గడిచిన ఐదేళ్లుగా హైదరాబాద్‌కు రావాల్సిన పెట్టుబడులు పోయాయని ప్రచారం జరుగుతోంది. ఇదంతా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో రాజకీయ అస్థిరత్వం, నిర్ణయాత్మక శక్తి కలిగిన వారు లేకపోవడం వల్లేనని కేటీఆర్ అభిప్రాయపడ్డారు. ఉద్యమం కారణంగా ఐటీ, పారిశ్రామిక వర్గాలు వెనుకకు పోయాయనడంలో అర్థం లేదన్నారు. అయినా రూ.284 కోట్ల ఐటీ ఎగుమతుల నుంచి రూ.50 వేల కోట్లకు చేరిందని ఐటీ శాఖ లెక్కలు స్పష్టం చేస్తున్నాయని గుర్తు చేశారు. ఐటీఐఆర్ ప్రాజెక్టు ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా 50 లక్షల మందికి ఉపాధి లభిస్తుందని, అందుకే నిర్మాణాత్మకంగా వ్యవహరించాలని అన్ని శాఖలకు సీఎం సూచించినట్లు కేటీఆర్ చెప్పారు.
ప్రపంచస్థాయి సదుపాయాలతో మాస్టర్ ప్లాన్‌ను తయారు చేసే పనిలో నిమగ్నమైనట్లు తెలిపారు. దీని ద్వారా వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలను అనువైన వాతావరణం ఏర్పడుతుందని అన్నారు. అలాగే హైదరాబాద్ ఏ గ్రీన్ సిటీగా రూపొందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని తెలిపారు. 52 వారాలు.. 52 కార్యక్రమాలతో సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు, కంపెనీలకు వినూత్నమైనవి అమలు చేసేందుకు కార్యాచరణను ప్రభుత్వం రూపొందిస్తున్నట్లు చెప్పారు. ఇందులో సోషల్, కల్చరల్, స్పోర్టింగ్ ఈవెంట్లు ఉంటాయని చెప్పారు. అందులో భాగంగానే ఆగస్టు 24న ఐటీ మారథాన్ నిర్వహిస్తున్నామన్నారు.
అందుబాటులోకి ఆధునిక టెక్నాలజీ తెలంగాణవ్యాప్తంగా ఆధునిక టెక్నాలజీని అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని మంత్రి చెప్పారు. త్వరలోనే 4 జీ సర్వీసులు అందుతాయన్నారు. దేశంలో మొదటి వై-ఫై నగరంగా హైదరాబాద్ రూపు సంతరించుకోనుందని తెలిపారు. తానొక సమావేశంలో ఉండగా సిరిసిల్ల నియోజకవర్గం నుంచి ఒక టీఆర్‌ఎస్ కార్యకర్త ఓ బ్రిడ్జి పనులు నాసిరకంగా జరుగుతున్నాయంటూ ఫోటోలు తీసి వాట్స్ అప్ ద్వారా తనకు పంపించారంటూ 4జీ, వై-ఫై సేవలకు ఈ ఉదంతం ప్రేరణగా నిలిచిందన్నారు. అందుకే గవర్నమెంట్ టు పీపుల్ కార్యక్రమాన్ని ఐటీ ద్వారా అమలు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు.
ఈ-హెల్త్, ఈ-ఎడ్యుకేషన్, ఈ-పంచాయత్‌ల ద్వారా ఈ గవర్నెన్స్‌ను రూపొందించి ప్రజలకు సేవలందించాలని ప్రణాళికలు రూపొందించినట్లు తెలిపారు. ఈ పథకాల ద్వారా ఐటీ కంపెనీలకూ పని దొరుకుతుందన్నారు. ఇందుకోసం ప్రభుత్వం ఆకర్షణీయమైన పాలసీని రూపొందిస్తుందన్నారు. తెలంగాణలో రాయితీలు ఉండవంటూ చేసే దుష్ప్రచారాన్ని ఎవరూ నమ్మొద్దని మంత్రి విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టినప్పుడు అప్పటి ప్రధాని మన్మోహన్‌సింగ్ రెండు రాష్ర్టాలకూ పన్ను రాయితీలు వర్తిస్తాయని ప్రకటించారని గుర్తు చేశారు. మీడియా సరైన ప్రచారాన్ని కల్పించకపోవడం వల్ల అపోహలకు తావిచ్చినట్లయ్యిందన్నారు. రానున్న మూడేళ్లల్లో విద్యుత్ కొరత లేకుండా చేస్తామని భరోసా ఇచ్చారు. కొరతను తీర్చేందుకు యుద్ధప్రాతిపదికన విద్యుత్ కొనుగోలు చేస్తున్నట్లు చెప్పారు. దీని కోసం ట్రాన్స్‌మిషన్ లైన్లను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.
అన్ని సదుపాయాలు కల్పిస్తాం ఐటీ రంగానికి అన్ని సదుపాయాలు కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఐటీ శాఖ కార్యదర్శి హర్‌ప్రీత్‌సింగ్ తెలిపారు. జీహెచ్‌ఎంసీ, జలమండలి, పోలీసు, హెచ్‌ఎండీఏ, ఏపీఐఐసీ, పరిశ్రమల శాఖల ద్వారా మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేస్తామన్నారు. అలాగే ఐటీ రంగాన్ని ఎస్మా చట్టం పరిధిలోకి తీసుకొస్తామని ప్రకటించారు. సైబరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ మాట్లాడుతూ ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయని విధంగా పోలీసు శాఖను ఆధునీకరించేందుకు ఒకేసారి రూ.450 కోట్లు మంజూరు చేసిన ఘనత తెలంగాణ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. తన 23 ఏండ్ల సర్వీసులో ఎప్పుడూ వినలేదని కొనియాడారు. ఐటీ కారిడార్‌లో భద్రతకు అన్ని రకాల ఏర్పాట్లు చేశామని తెలిపారు. దీనికోసం సైబరాబాద్ సెక్యురిటీ కమిటీలను ఏర్పాటు చేసి, సూచనలు స్వీకరిస్తున్నామని చెప్పారు. ఈ క్రమంలోనే ఐటీ కంపెనీలను కూడా సందర్శిస్తున్నామన్నారు.
రాయితీలు ఇక్కడా ఉంటాయి ఆంధ్రప్రదేశ్ రాష్ర్టానికే కేంద్రం రాయితీలు ఇస్తుందంటూ చేస్తోన్న ప్రచారం వాస్తవం కాదని రాష్ట్ర పరిశ్రమల శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ కే ప్రదీప్‌చంద్ర చెప్పారు. పునర్విభజన చట్టం సెక్షన్ 94(1)లో తెలంగాణకూ రాయితీలు వర్తిస్తాయంటూ పేర్కొన్న అంశాన్ని వివరించారు. ఎంటర్‌ప్రెన్యూర్స్ ఎవరికీ రాయితీల విషయంలో అనుమానాలు అవసరం లేదని స్పష్టం చేశారు. కార్యక్రమంలో తెలంగాణ ప్రభుత్వం అమలు చేసే పాలసీలు, విధానాల గురించి పవర్‌పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. అలాగే ఎంటర్‌ప్రెన్యూర్స్ కూడా వివిధ రంగాల్లో నెలకొన్న సందేహాలను తీర్చుకున్నారు. వారు అడిగిన ప్రశ్నలకు ప్రభుత్వం తరపున పరిష్కారాలను వివరించారు.
ముఖాముఖీకి 150 మంది ఎంటర్‌ప్రెన్యూర్స్ మాత్రమే హాజరవుతారని నిర్వాహకులు అంచనా వేశారు. కానీ సుమారు 800 మంది హాజరు కావడంతో తెలంగాణ ఐటీ రంగంపై ఏ స్థాయిలో ఆసక్తి ఉందో స్పష్టమైంది. అలాగే బెంగుళూరు, చెన్నైలకు చెందిన వారు కూడా వచ్చారు. ఈ కార్యక్రమానికి కేవలం ఫేస్‌బుక్ ద్వారానే ప్రచారం చేసినట్లు నిర్వాహకులు చెప్పారు. కార్యక్రమంలో హెచ్‌ఎండీఏ కమిషనర్ నీరబ్‌కుమార్, జీహెచ్‌ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్, జలమండలి ఎండీ జగదీశ్వర్, టీపీఐఐసీ మేనేజింగ్ డైరెక్టర్ జయేశ్‌రంజన్, ఎలక్ట్రానిక్ గవర్నెన్స్ సీఈవో అమర్‌నాథ్‌రెడ్డి ఆత్మకూరి, హెచ్‌వైఎస్‌ఈఏ ఈడీ బ్రిగేడియర్ హరికుమార్, ఐఐఐటీ ప్రొఫెసర్ అజిత్‌రాజ్‌కుమార్, ఐబీఎం ప్రొఫెసర్ దేశాయ్, టీఐఈ అధ్యక్షుడు బుక్కపట్నం మురళి, హైదరాబాద్ సాఫ్ట్‌వేర్ ఎంటర్‌ప్రైజెస్ అధ్యక్షుడు లోగనాథన్ రమేశ్ తదితరులు పాల్గొన్నారు.
ఐటీ ఎంటర్‌ప్రెన్యూర్స్ భేటీ సక్సెస్ – సందేహాల నివృత్తిలో సఫలం తెలంగాణ ప్రభుత్వం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంపై అనుసరించనున్న విధి విధానాలను ఎంటర్‌ప్రెన్యూర్స్‌కు వివరించేందుకు ఏర్పాటు చేసిన ముఖాముకి కార్యక్రమం విజయవంతమైంది. ఐటీ మంత్రి కేటీ రామారావు తన సుదీర్ఘ ప్రసంగంలో దేశ విదేశాలు అనుసరిస్తున్న మార్గాలతో పాటు ఇక్కడి ప్రభుత్వం అమలు చేయనున్న ప్రపంచస్థాయి మాస్టర్ ప్లాన్‌ను వివరించారు. గుక్క తిప్పుకోకుండా అలవోకగా ఇచ్చిన పవర్‌పాయింట్ ప్రెజెంటేషన్‌లో ఐటీరంగం పాలసీల గురించి చెప్పారు. ప్రభుత్వం ఊహించని రీతిలో ఎంటర్‌ప్రెన్యూర్స్ హాజరు కావడంతో హైదరాబాద్‌లో ఐటీ రంగానికి ఉన్న అవకాశాలపై అంచనాలు రెట్టింపయ్యాయి. ఇప్పటికే రూపకల్పనలో ఉన్న ఐటీఐఆర్ ప్రాజెక్టు సునాయసంగా విజయవంతమవుతుందన్న అభిప్రాయం వ్యక్తమైంది.
ముఖాముఖీలో ఎంటర్‌ప్రెన్యూర్స్ అడిగిన అన్ని ప్రశ్నలకు కేటీఆర్‌తో పాటు పరిశ్రమలు, ఐటీ, హెచ్‌ఎండీఏ, జీహెచ్‌ఎంసీ అధికారులు సమాధానాలిచ్చారు. ఉద్యమకాలంలో నెలకొన్న సందిగ్ధతకు తెర పడింది. అప్పటి పరిస్థితులకు గల కారణాలను కూడా ముఖాముఖిలో చర్చించారు. ప్రధానంగా ఐటీ రంగానికి ప్రభుత్వం ఇచ్చే ప్రోత్సాహకాలు, రాయితీల గురించి ఎక్కువ మంది అడిగారు. అలాగే ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న పథకాల్లో ఐటీ పరిశ్రమలకు ఎలాంటి ప్రయోజనం కలుగుతుందన్న సందేహాలను తీర్చుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ ప్రసంగాన్ని ఎంటర్‌ప్రెన్యూర్స్ ప్రశంసించారు. ప్రతి ఒక్కరు అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానాలిచ్చి ఆకట్టుకున్న తీరును అందరూ చర్చించుకున్నారు. కార్యక్రమంలో ఐటీ సంస్థల ప్రతినిధులు సందీప్‌కుమార్ మక్తాల, మోహన్‌రాయుడు తదితరులు కేటీఆర్‌కు ఐటీ రంగాభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలను వివరిస్తూ మెమోరాండం సమర్పించారు.